ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తారా? - ప్రెస్ రివ్యూ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, ysrcpofficial/facebook

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర సీఎం జగన్ ఆహ్వానించాలనుకుంటున్నట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ నెల 16న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమానికి మోదీని ఆహ్వానించడం కోసం సీఎం ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు.

మూడు రాజధానుల శంకుస్థాపనతో పాటు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని సీఎం భావిస్తున్నారు.

ఈ విషయమై ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటీవల లేఖ రాసినట్టు తెలిసింది. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్డీ సంజయ్‌ ఆర్‌.భవసర్‌కి కూడా పంపారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవలే పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇక మూడు రాజధానులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి. మూడు రాజధానులకు శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 16వ తేదీని మంచి ముహూర్తంగా నిర్ణయించాం. తర్వాత మళ్లీ 2నెలల పాటు ముహూర్తాలు లేవు. అందువల్ల వీలైనంత త్వరగా ప్రధానితో అపాయింట్‌మెంట్‌ ఖరారు చేస్తే, ముఖ్యమంత్రి ఆయనను స్వయంగా కలిసి రెండు ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించి, ఆహ్వానిస్తారు’’ అని శేషాద్రికి రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాష్‌ విజ్ఞప్తి చేశారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు పీఎంవోకు రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాష్‌ పేర్కొన్నారు.

సొంత వైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ చేసుకోవద్దని ప్రజలకు వైద్యాధికారులు సూచిస్తున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సొంత వైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ చేసుకోవద్దని ప్రజలకు వైద్యాధికారులు సూచిస్తున్నారు

‘నెలాఖరుకు హైదరాబాద్‌లో కరోనా అదుపులోకి’

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆగస్టు నెలాఖరుకు, రాష్ట్రంలోని మిగతాచోట్ల సెప్టెంబరు చివరికల్లా కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి రావొచ్చని ప్రజారోగ్య ప్రజారోగ్య సంచాలకుడు (డీపీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

ప్రభుత్వం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆగస్టు చివరి నాటికి, సెప్టెంబరు చివరినాటికి రాష్ట్రంలో మిగతా చోట్ల కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా సోకిన రెండు వారాలు చాలా కీలకమని, తొలివారంలో లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకోవాలని, సొంత వైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ చేసుకోవద్దని సూచించారు. రెండోవారంలో డెక్సామెథసోన్‌ ఇవ్వడం వల్ల చాలా మంది కోలుకున్నారని, అద్భుతంగా పనిచేస్తోందని తెలిపారు.

ప్రతి జిల్లాలో పీహెచ్‌సీ స్థాయిలో, జీహెచ్‌ఎంసీలో పరీక్షా కేంద్రాల వద్ద హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు.

88,600 హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉండగా, ఒక్క జీహెచ్‌ఎంసీ ప్రాంతానికే 33 వేల కిట్లను కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే 5 లక్షల యాంటీజెన్‌ కిట్లకు తెప్పించామని, మరో 10 లక్షల కిట్లకు ఇండెంట్‌ పెట్టామన్నారు. అన్ని ప్రభుత్వ కరోనా ఆస్పత్రుల్లో 25 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

వైద్యవిద్య డైరెక్టరేటు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆధ్వర్యంలోని అన్ని ఆస్పత్రుల్లోని పడకలను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం 8-9 వేల బెడ్స్‌కు ఆక్సిజన్‌ సరఫరా ఉందని, మిగిలిన 10 వేల పడకలకూ ఆ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా ఆక్సిజన్‌ వసతి కలిగిన మొత్తం 18వేల బెడ్స్‌ అందుబాటులోకి వస్తాయన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కామారెడ్డిలో 2,200 ఏళ్ల నాటి శిలాశాసనం!

కామారెడ్డి జిల్లాలో 2,200 ఏళ్ల నాటిదని భావిస్తున్న శిలాశాసనం బయటపడిందంటూ ‘నమస్తే తెలంగాణ’ ఓ వార్త రాసింది.

చరిత్ర అన్వేషకులు ఎంఏ శ్రీనివాసన్‌, వై భానుమూర్తి, బీ శేఖర్‌రెడ్డి, ఎం శంకర్‌రెడ్డి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామంలో శిలాశాసనాన్ని కనుగొన్నారు.

దీనిపై అశోకన్‌ బ్రహ్మి లిపిలో ‘మాధవచందా’ అనే అర్థం వచ్చేలా ఐదు అక్షరాలు చెక్కి ఉన్నట్టు పరిశోధక బృందం సభ్యుడు, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్‌ శ్రీనివాసన్‌ తెలిపారు.

తెలంగాణలో లభ్యమైన అత్యంత పురాతన శాసనం ఇదేనని చెప్పారు.

మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో ఒక కొండ పై ఉన్న బండపై ఈ అక్షరాలు చెక్కి ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ అక్షరాలు క్రీస్తుపూర్వం 2,200 ఏళ్ల నాటివని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎపీగ్రఫీ విభాగం డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి ధ్రువీకరించారన్నారు.

తాజా ఆవిష్కరణతో 2,200 ఏళ్ల కిందటి తెలంగాణ చరిత్రకు ఆధారాలు లభించినట్టయ్యింది. మంజీర లోయలో మరిన్ని తవ్వకాలు జరిపితే తెలంగాణ చరిత్ర మరింత వెలుగులోకి వస్తుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మాల్తుమ్మె దలో శిలాశాసనంతోపాటు వందల ఏళ్ల కిందటి రాతిచిత్రాలు, గుహలు కనుగొన్నట్టు వెల్లడించారు.

శానిటైజర్లు

ఫొటో సోర్స్, Getty Images

శానిటైజర్లు తాగుతున్నవారిని అదుపులోకి తీసుకుంటున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు శానిటైజర్లు తాగుతున్న 144 మందిని స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు అదుపులోకీ తిసుకున్నట్లు ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

రాష్ట్ర వ్యాప్తంగా శానిటైజర్లు తాగి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్న వారిని గుర్తించే పనిలో ఎస్‌ఈబీ అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు డీ–అడిక్షన్‌ కేంద్రాలకు పంపుతున్నారు.

మద్యానికి బానిసైన వారు మాత్రమే శానిటైజర్లు తాగుతున్నారని అధికారులు అంటున్నారు. వారి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి మద్యం వ్యసనపరుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్‌ కేంద్రాలతో పాటు ప్రైవేటు కేంద్రాల్లోనూ కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు.

శానిటైజర్లలో మిథైల్‌ ఆల్కహాల్‌ బదులుగా మిథైల్‌ క్లోరైడ్‌ కలుపుతున్నట్లు ల్యాబ్‌ పరీక్షల్లో ఫలితాలు వస్తున్నాయి.

కురిచేడు ఘటనపై గత ఐదు రోజుల నుంచి ఎక్సైజ్, ఎస్‌ఈబీ, పోలీసు బృందాలు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్‌ తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి.

రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాల్ని గుర్తించి వాటిపై నిఘా ఉంచామని, ఎవరైనా పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)