You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జగన్‌కు గుడి: పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రికి ఆలయం.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యక్తిపూజ శ్రుతి మించుతోందా
- రచయిత, శంకర్.వి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
అయోధ్యలో రామాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేసిన ఆగస్ట్ 5నే ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆలయానికి శంకుస్థాపన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టేందుకు ఆయన అభిమానులు కొందరు సిద్ధమయ్యారు. పాలక పార్టీ ఎమ్మెల్యే దీనికి శంకుస్థాపన చేశారు.
గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో పనులు ప్రారంభించారు. ఆగస్ట్ 15లోగా గుడి పూర్తవుతుందని కూడా ప్రకటించారు.
అయితే ముఖ్యమంత్రి పేరుతో గుడి కడుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పాలక వైసీపీ అది తమ పార్టీ వైఖరి కాదని చెబుతోంది.
అప్పుడే గుడి ప్రారంభిస్తాం..
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని రాజంపాలెంలో ఆగస్ట్ 5న సీఎం జగన్‌కు కడుతున్న గుడికి శంకుస్థాపన చేశారు స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు.
వైసీపీ నాయకుడు కరుకూరి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఆలయ నిర్మాణం బాధ్యతలు తీసుకున్న కరుకూరి నాగేశ్వరరావును ఈ విషయంపై బీబీసీ సంప్రదించింది. ఆయన దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సుమారు రూ.10 లక్షల వ్యయంతో గుడి నిర్మిస్తామని ప్రకటించారు. 10 సెంట్లు స్థలంలో గుడి కడుతున్నామని తెలిపారు.
‘‘కనిపించని దేవుళ్ల కన్నా ప్రత్యక్ష దైవం జగన్. పేదల గుండె చప్పుడు జగన్. ఆయనకు నిర్మిస్తున్న ఆలయానికి అందరూ మద్ధతు తెలుపుతున్నార’’ని చెప్పారు.
‘గుడి కట్టడంలో తప్పేముంది’
ప్రజల హృదయాలు గెలిచిన నాయకుడిగా జగన్‌కు గుడి కట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే తలారి వెంకటరావు అంటున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి జగన్. అలాంటి మహానాయకుడికి అభిమానులు గుడి కట్టే ప్రయత్నం చేయడం ఆనందదాయకం. జగన్ పార్టీ ప్రకటించగానే తొలుత గోపాలపురంలో పార్టీ పెట్టాం. ఇప్పుడు మొదటి సారిగా గుడి కట్టాలని నిర్ణయించారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల బాధలు తెలుసుకున్న నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే గుడి కట్టి తమ అభిమానం చాటుకుంటున్నారు. దానిని తప్పుబట్టడానికి ఏమీ లేదు’’అన్నారు.
అధికారికంగా స్పందించని వైసీపీ
ముఖ్యమంత్రి పేరుతో గుడి నిర్మించే ప్రయత్నంపై వైసీపీ అధికారికంగా స్పందించడం లేదు. ఈ విషయంపై అదే జిల్లాకు చెందిన మంత్రి తానేటి వనిత సహా కొందరు నేతలను బీబీసీ సంప్రదించింది. కానీ అది స్థానికంగా కొందరు నేతల చర్యగానే చూడాలంటూ అంతకుమించి పార్టీగా చెప్పడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పార్టీ వైఖరి కాకపోయినా కొందరు అభిమానం చాటుకుంటున్నట్టుగా భావించాలని అన్నారు.
కరోనా కేసులు పెరిగినందుకు గిఫ్ట్‌గా గుడి కడుతున్నారా
రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న సమయంలో ఇలాంటి ఆలయం కట్టాలనే ఆలోచన రావడం విచాకరం అంటున్నారు టీడీపీ నేతలు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు. ‘‘కరోనా కేసుల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానానికి వచ్చేసింది. రోజూ 10వేల కేసులు వస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి బదులుగా ఇలాంటి ప్రయత్నాలేంటి.
ఎస్సీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. అనేక చోట్ల నిత్యం దాడులు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఎస్సీ రిజర్వుడు స్థానంలో ఎమ్మెల్యే ప్రజల సంక్షేమం మరచి తమ నాయకుడి మెప్పు కోసం ఇలాంటివి చేస్తున్నట్టు కనిపిస్తోంది.
గత ఏడాదిన్నరలో నియోజకవర్గంలో ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. ఇప్పుడు గుడి కట్టి అదే తాము చేసిన ఘనతగా చెప్పుకుంటారా?’’ అని ప్రశ్నించారు.
తమిళనాట చూశాం.. ఇక్కడికీ విస్తరించడం విచారకరం
తమిళనాడులో చాలాకాలంగా ఉన్న ఇలాంటి వ్యక్తి పూజ సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించడం శోచనీయం అంటున్నారు సీనియర్ జర్నలిస్టు రామచంద్ర శర్మ.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తి పూజ శ్రేయస్కరం కాదు. ప్రమాదకరం కూడా. అది శ్రుతిమించడం సమాజానికి చేటు తెస్తుంది. ఏపీ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటివి మంచిది కాదు. ఏకంగా గుడి కట్టే స్థాయిలో వ్యక్తి పూజ ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. ఇలాంటి పరిస్థితి విచారకరం’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)