అయోధ్య: భూమిపూజకు సర్వం సిద్ధం

    • రచయిత, సర్వప్రియ సాంగ్వాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

ప్రస్తుతం అయోధ్యలో ఎటూచూసినా లౌడ్‌స్పీకర్లలో శ్రీరాముడి భజనలు మార్మోగుతున్నాయి.

అయోధ్యలో రామమందిర భూమి పూజ జరిగే చోటుకు వెళ్లే మార్గంలోని దుకాణాలన్నీ పసుపు రంగులో కనిపిస్తున్నాయి.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టుతోపాటు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా రోజులుగా భూమి పూజ కోసం ఏర్పాట్లలో నిమగ్నమైంది.

మంగళవారం ఉదయం హనుమాన్ గఢీలో పూజతో ఈ కార్యక్రమం మొదలైంది.

అయోధ్య నగరిలోని చాలా మందిరాల్లో రామాయణం వినిపిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో దీపోత్సవం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్థానిక మందిరాల్లో సరయూ నది మట్టితో చేసిన దివ్వెల్లో దీపాలు వెలిగిస్తున్నారు.

ప్రజలు మాత్రం ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం, కార్యక్రమ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

అయోధ్య నగరిలోని మందిరాలు రంగురంగుల కాంతులతో కనిపించాయి. మీడియా వాహనాలు రాత్రీపగలూ తేడా లేకుండా తిరుగుతూ ఉన్నాయి.

అతిథులుగా ముస్లింలూ...

భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ట్రస్టు అధ్యక్షుడు నృత్స్ గోపాల్ దాస్ వేదికపై కూర్చుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతి మోహన్ భగవత్ కూడా ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి 175 మందిని మాత్రమే ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు.

నేపాల్ సాధువులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని, నేపాల్‌కు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లతో సంబంధాలున్నాయని ట్రస్టు సభ్యుడు చంపత్ రాయ్ పత్రికా సమావేశంలో అన్నారు.

అయోధ్య భూ వివాదంలో కక్షిదారుల్లో ఒకరైన హషీమ్ అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీకి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. హషీమ్ 2016లో చనిపోయారు.

ప్రధానికి బహుమతిగా అందించేందుకు రామచరితమానస్ తీసుకువెళ్తున్నానని, అయోధ్యలో హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి వివాదాలూ లేవని ఇక్బాల్ అన్నారు.

ఫైజాబాద్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఆయన అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు జరిపిస్తుంటారు.

ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జఫర్ అహ్మద్ ఫారూకీకి కూడా ఆహ్వానం అందింది. ఆయన కార్యక్రమానికి వెళ్తున్నారా, లేదా అన్న విషయం తెలియరాలేదు.

కరోనా నేపథ్యంలో...

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఆయన సమీక్ష కూడా నిర్వహించారు.

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలన్నీ పాటిస్తూ, కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు.

భౌతిక దూరం పాటించేందుకు కార్యక్రమంలో వేసే కుర్చీల మధ్య ఎనిమిది అడుగుల దూరం ఉండేలా చూస్తున్నట్లు అయోధ్య డీఎం అనూజ్ కుమార్ ఝా చెప్పారు.

ఏర్పాట్లు, భద్రత చర్యల్లో పాలుపంచుకుంటున్న పోలీసులు కరోనావైరస్ విషయంలో అప్రమత్తంగా కనిపించడం లేదు.

మంగళవారం ఉదయం హనుమాన్‌గఢీ మందిరం వద్ద పూజకు ముందు చాలా మంది పోలీసులు ఒక్క చోట చేరి కనిపించారు. చాలా మంది పూజార్లు మాస్క్‌లు ధరించలేదు.

కొన్ని రోజుల క్రితమే అక్కడ 16 మంది పోలీసులకు కరోనావైరస్ సోకినట్లు తేలింది. ఇద్దరు పూజారులకు కూడా కరోనా వచ్చింది. రోడ్లపైనా జనాల బారులు కనిపిస్తున్నాయి.

కార్యక్రమం జరిగే స్థలం బయట సోమవారం పోలీసులు శానిటైజేషన్ చేశారు.

ఆ సీనియర్ నేతలు ఎక్కడ?

రామ మందిర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చాలా మంది బీపేపీ నేతలు ఈ కార్యక్రమానికి రావడం లేదు.

ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు ఆహ్వానాలు పంపారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాను కార్యక్రమానికి రావడం లేదని ఉమా భారతి ట్విటర్‌లో తెలిపారు.

తాను కూడా కార్యక్రమానికి వెళ్లడం లేదని వినయ్ కటియార్ చెప్పారు. ఆరోగ్యకారణాల రీత్యా కల్యాణ్ సింగ్ కూడా కార్యక్రమానికి వెళ్లడం లేదని తనతో తెలిపినట్లు ఆయన వివరించారు.

కార్యక్రమంపై అభ్యంతరాలు

ఈ భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్, న్యాయవాది జఫ్రయాబ్ జిలానీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

వ్యక్తిగత హోదాలో మోదీ ఎక్కడికైనా వెళ్లవచ్చని, ప్రధాని హోదాలో మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని జిలానీ అభిప్రాయపడ్డారు.

మసీదు నిర్మాణం సమయంలో ప్రధానిని మసీదు ట్రస్టు ఆహ్వానిస్తుందా అన్న ప్రశ్నకు... ‘‘మందిరమైనా, మసీదైనా... లౌకికవాద దేశంలో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్లో భాగం కాకూడదు’’ అని జిలానీ బదులు ఇచ్చారు.

ఈ కార్యక్రమం విషయంలో కొన్ని మతపరమైన అభ్యంతరాలు కూడా వస్తున్నాయి.

ఈ సమయంలో శుభ ముహూర్తాలు లేవని శంకరాచార్య స్వరూపానంద సరస్వతీ అన్నారు. ప్రభుత్వం తొందరపాటుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటంపై సందేహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)