ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు ఆగస్ట్‌లోనే... విశాఖలో స్వాతంత్ర్య దినోత్సవం -ప్రెస్ రివ్యూ

సీఎం వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/ysjagan

ప్రచురణ

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో రాజధాని తరలింపుపై ఏపీ ప్రభుత్వం వేగంగా కార్యాచరణ మొదలు పెట్టినట్లు ఆంధ్రజ్యోతి రాసింది. ఆగస్టులోనే రాజధానిని విశాఖకు తరలిస్తారని, ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాలను విశాఖలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది.

తొలివిడతగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తారని, సీఎం క్యాంప్‌ కార్యాలయాన్ని ఒకచోట ఏర్పాటు చేసి, అదే సమయంలో కొత్త కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

కరోనా పరిస్థితులు చక్కబడ్డాక హెచ్‌ఓడీ ఆఫీసులను క్రమక్రమంగా తరలిస్తారని తెలిపింది. త్వరలోనే పాలనా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినట్లు కూడా ఈ కథనం పేర్కొంది.

దిల్లీ నుంచి వెళ్తున్న వందే భారత్ రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో ప్రస్తుతం అత్యంత వేగంగా ప్రయాణించే రైలు 'వందే భారత్'

ముంబై టు హైదరాబాద్‌ బుల్లెట్ ట్రైన్‌

కొత్తగా ఏడు మార్గాల్లో బుల్లెట్‌ రైళ్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో ముంబయి-హైదరాబాద్‌ కారిడార్‌ కూడా ఒకటని తమకు సమాచారం ఉందని ఆంధ్రప్రభ దినపత్రిక వెల్లడించింది.

గ్రీన్‌ఫీల్డ్‌ల వెంట ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని, ఇప్పటికే ముంబై-హైదరాబాద్‌ రైల్వే కారిడార్‌కు సంబంధించిన వివరాలను నేషనల్ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ఇండియన్‌ రైల్వే శాఖ అందించిందని ఈ కథనంలో పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం ఓ నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని కూడా రైల్వేశాఖ ఎన్‌హెచ్‌ఏఐని కోరినట్లు ఈ కథనంలో తెలిపారు.

ముంబయి-హైదరాబాద్‌తోపాటు మిగిలిన ఆరు మార్గాలలో బుల్లెట్‌ రైల్‌ ప్రాజెక్టులకు సంబంధించి బ్లూప్రింట్‌లను తయారు చేసే పనిలో రైల్వే శాఖ నిమగ్నమైందని ఆంధ్రప్రభ వెల్లడించింది. భూసేకరణకు కేంద్రం కూడా సిద్ధమైందని, ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూసేందుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నేతృత్వంలో నలుగురు మంత్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని కూడా వెల్లడించింది.

టీవీ కోసం తాళి తాకట్టు

ఫొటో సోర్స్, ANI

టీవీ కోసం తాళి తాకట్టు

పిల్లలు ఆన్‌లైన్‌ పాఠాలు దూరం కాకుండా చూసేందుకు కర్ణాటకలోని గదగ జిల్లాలో ఓ తల్లి తన తాళిని తాకట్టు పెట్టి టీవీ కొనుక్కొచ్చినట్లు ఈనాడు ఒక కథనం ఇచ్చింది.

పెద్ద కూతురు పెళ్లి చేసి అప్పుల్లో ఉన్న ఆ కుటుంబం చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, ఎవరిని అడిగినా డబ్బు పుట్టకపోవడంతో పిల్లలకు చదువులు పాడు కాకూడదన్న లక్ష్యంతో ఆ మహిళ తాళిని తాకట్టు పెట్టగా వచ్చిన రూ.20వేలతో టీవీ కొన్నారని పేర్కొంది.

కస్తూరీ అనే ఆ మహిళకు నలుగురు పిల్లలుకాగా, ఈ మధ్యే పెద్ద కూతురు పెళ్లి చేశారు. కరోనా కారణంగా స్కూళ్లు తెరవకపోవడంతో మిగిలిన పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఈలోగా టీవీలో ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయని తెలిసి వారి భవిష్యత్తు కోసం ఆమె తన తాళిని తాకట్టు పెట్టి టీవీ కొన్నారు. ఈ సంఘటన గురించి తెలియగానే జిల్లా మంత్రి సి.సి. పాటిల్‌ తనకు పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు గ్రామస్తులు ఆ కుటుంబానికి తోచినంత ఆర్ధిక సాయం చేశారు.

రక్తం

ఫొటో సోర్స్, PA

ప్లాస్మాదాతలకు రూ.5,000

కరోనా చికిత్స కోసం ప్లాస్మాను దానం చేసేవారికి ప్రోత్సాహకంగా రూ.5000 ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు ఈనాడు పత్రిక రాసింది.

ఈ ప్రోత్సాహకం ప్లాస్మాదాతలకు మెరుగైన ఆహారం తీసుకునేందుకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది. ప్లాస్మా చికిత్సలో సానుకూల ఫలితాలు వస్తుంటే దాన్ని ప్రోత్సహించాలని, దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని సీఎం సూచించినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని కోవిడ్‌-19 ఆసుపత్రుల్లో ప్లాస్మా సేకరణ చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఈ కథనం పేర్కొంది.

డిశ్చార్జి అయ్యేవారి నుంచి ప్లాస్మా సేకరించడం వల్ల దాతల సంఖ్య పెరుగుతుందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇప్పటికే కర్నూలు,తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్లాస్మా చికిత్స చేస్తుండగా, విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ప్లాస్మా చికిత్సకు అనుమతుల కోసం ఐసీఎంఆర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)