విజయవాడ నగల దుకాణంలో 4 కోట్ల బంగారం చోరీ... ఒక దొంగ రియాలిటీ షో -ప్రెస్ రివ్యూ

ప్రచురణ

యజమానికి టోకరా వేయాలనుకున్న ఒక వ్యక్తి అతి తెలివిని పోలీసులు బయటపెట్టారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

కష్టకాలంలో ఉపాధి చూపిన యజమానికే టోకరా వేయాలనుకున్నాడు. ఏకంగా రూ.4 కోట్ల విలువైన నగలు, నగదును చోరీ చేశాడు. చేతులకు గాయాలు చేసుకుని, కాళ్లను కట్టేసుకుని నాటకం ఆడాడు.

అయితే, అతని దొంగ తెలివి... పోలీసుల ముందు నిలవలేకపోయింది. విజయవాడ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో, పట్టపగలు జరిగిన దొంగతనం కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితుడిని పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన విషయాలను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు శుక్రవారం వెల్లడించారు. నగరంలోని కాటూరువారి వీధిలో రాజుసింగ్‌చరణ్‌ రెండేళ్లుగా సాయిచరణ్‌ నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో వ్యాపారం జరగకపోవడంతో 19 కిలోల వెండి, రూ.20 లక్షల నగదును దుకాణంలోనే ఉంచాడు. తన స్నేహితుడైన మరో నగల వ్యాపారి మనోహర్‌సింగ్‌ రాథోర్‌కు సంబంధించిన 7 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదునూ తన దుకాణంలోనే దాచారు.

పెద్దమొత్తంలో డబ్బు, బంగారం ఉండటంతో గురువారం రాత్రంతా దుకాణం వద్దనే ఉన్న యజమాని శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటికి వెళ్లాడు. తన వద్ద పనిచేసే గురుచరణ్‌సింగ్‌ను దుకాణం వద్దకు పంపించగా, అతనితోపాటే పనిచేసే విక్రంకుమార్‌ లోహార్‌ రక్తపు మడుగులో దుకాణంలో పడి ఉన్నాడు. అతని కాళ్లూ, చేతులు కట్టేసి ఉన్నాయి.

పోలీసులు వచ్చి, క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలతోపాటు ఇతర ఆధారాలను సేకరించారు. గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

లాక్‌డౌన్‌ కారణంగా షాపులో పని చేసే సిబ్బంది స్వగ్రామానికి వెళ్లడంతో రాజుసింగ్‌.. 40 రోజుల క్రితం రాజస్థాన్‌కు చెందిన విక్రంకుమార్‌ లోహార్‌(23)ను పనికి కుదుర్చుకున్నారు.

పెద్దమొత్తంలో డబ్బు, బంగారం చూసేసరికి లోహార్‌ వాటిని కాజేయాలనుకున్నాడు. శుక్రవారం వెండి, బంగారం, నగదును దొంగిలించి దుకాణం కింద మరమ్మతులు జరుగుతున్న ఇంట్లో దాచిపెట్టాడు.

సీసీ కెమెరాలో రికార్డయ్యే డీవీఆర్‌ (డిజిటల్‌ వీడియో రికార్డర్‌)ను తీసి కాలువలో పడేశాడు. అనంతరం దుకాణంలోకి వచ్చి టీవీ, కంప్యూటర్లను ధ్వంసం చేశాడు.

చేతులను, కాళ్లను టేపుతో కట్టేసుకున్నాడు. బ్లేడ్‌తో గాయపర్చుకున్నాడు. ఎవరో వచ్చి దొంగతనం చేసినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశాడు.

పోలీసులు పరిశీలిస్తుండగా రహస్య ప్రాంతంలో ఉండాల్సిన డీవీఆర్‌ లేకపోవడాన్ని గమనించారు. దుకాణంలోకి కొత్త వ్యక్తుల రాకపోకలపై సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

లోహార్‌ ఒకసారి నీలంరంగు సంచితో బయటకు వెళ్లడాన్ని గుర్తించారు. దుకాణంలో లభించిన వేలిముద్రల్లో అతనివే ఎక్కువగా ఉండటంతో పోలీసులు విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు.

నిందితుణ్ని అరెస్టు చేసి, బంగారం, వెండి, నగదు మొత్తాన్నీ రికవరీ చేశారని ఈనాడు వివరించింది.

ఏపీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రమేశ్‌ కుమార్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం స్వయానా గవర్నర్‌ జోక్యం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను నిలిపి వేయడానికి సుప్రీం నిరాకరించింది.

తనను పునర్నియమించాలన్న తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టులో నిమ్మగడ్డ ధిక్కరణ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

దీనిపైనే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తీర్పు అమలు కోసం గవర్నర్‌ను కలిసి విన్నవించాలని ఆయనకు సూచించింది. ఈనెల 21న ఆయన గవర్నర్‌ను కూడా కలిశారు.

అయితే... కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ నిలిపి వేయాలంటూ అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.

దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి..రామసుబ్రమణిన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై తమకు పూర్తిగా అవగాహన ఉందని తెలిపింది.

తీర్పు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించింది. ‘‘హైకోర్టు తీర్పుపై గతంలో మేం నిర్దిష్టంగా ఎటువంటి స్టే ఇవ్వలేదు. మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు’’ అని గుర్తు చేసింది.

అందువల్ల, ప్రస్తుతం హైకోర్టులో నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరగకుండా స్టే ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

మొత్తం పరిణామాలపై అదనపు సమాచారాన్ని జోడిస్తూ వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ధర్మాసనం ఆదేశించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

కరోనా ఐసొలేషన్ కేంద్రాలుగా స్టార్ హోటళ్లు

కరోనా సమయంలో రోగులు క్వారంటైన్, ఐసొలేషన్ అయ్యేందుకు వేదికగా మారిన స్టార్ హోటళ్లు నష్టాలను పూడ్చుకుంటున్నాయని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురిచింది.

కరోనా కష్టకాలంలో ఆతిథ్యం రూపుమారింది. కరోనా పాజిటివ్‌ వచ్చినవారు, అనుమానితులు తమ కుటుంబసభ్యుల మేలెంచి.. వారికి దూరంగా, తాము క్షేమంగా ఉండేలా ప్రయత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు.

గతానికి భిన్నంగా నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో యజమానులు సైతం కొన్ని జాగ్రత్తలతో ఆతిథ్యానికి అంగీకరిస్తున్నారు.

కరోనాకు సంబంధించి ఐసొలేషన్‌, క్వారంటైన్‌ అంటే వైరస్ రహితంగా పరిశుభ్రంగా ఉండే ఒక గది. వాటిలో అన్నిరకాల వసతులు ఉండాలి.

అందుకే విదేశాలతోపాటు మన దేశంలోని పలు రాష్ర్టాల్లో ఐసొలేషన్‌, క్వారంటైన్‌కు స్టార్‌ హోటళ్లు వేదికగా మారాయి.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లో స్వయానా రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా పలు హోటళ్లను స్వాధీనం చేసుకొని వాటిలో వైద్యులు, సిబ్బందికి వసతి కల్పించారు. హైదరాబాద్‌లోనూ కొంతమేర ఈ ప్రయత్నాలు జరిగాయి.

ఆతిథ్యరంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో హోటల్‌ యజమానులు సైతం ఈ దిశగా ముందుకొస్తున్నారు. 15 రోజుల కోసం లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి.

నగరంలోని ఒక కార్పొరేట్‌ దవాఖాన కరోనా ఐసొలేషన్‌, క్వారంటైన్‌ కోసం ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది.

హోటల్‌ పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ వ్యయంతో కూడుకున్న ఈ సౌకర్యం హైప్రొఫైల్‌ ఉన్నవారికే కేటాయిస్తున్నారు.

సాధారణంగా హైదరాబాద్‌ వేదికగా హోస్టింగ్‌ ఫెసిలిటీస్‌ బిజినెస్‌ భారీఎత్తున జరుగుతుంటుంది. ఇక్కడకు వచ్చే విదేశీయులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారి అభిరుచులకు అనుగుణంగా హోస్టింగ్‌ ఏర్పాటుకు పలు ఏజెన్సీలు ఉన్నాయి.

కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాలనుంచి ఇలా వచ్చేవారు లేరు. దీంతో యజమానులు, ఏజెన్సీలు ఐసొలేషన్‌, క్వారంటైన్‌లపై దృష్టిసారించాయి.

సాధారణ గదులైతే 15 రోజులకు రూ.10-20 వేలు, శివారు ప్రాంతాల్లో వ్యక్తిగత గృహాలు, విల్లాలు వంటివైతే అన్నిరకాల వసతులు కలిపి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నారు.

లక్షణాలులేని పాజిటివ్‌ కేసులు, పాజిటివ్‌తో క్లోజ్‌ కాంటాక్టులో ఉన్నామనే అనుమానం ఉన్నవారు ఎక్కువగా ఈ తరహా వసతుల్లో ఉంటున్నారు.

ముందుగానే వైద్యుల సలహా తీసుకొని సరిపడా మందుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. 15 రోజులకు అవసరమయ్యే సరుకుల్ని ముందే తెప్పించుకుంటున్నారు.

ఎక్కువ డబ్బు వెచ్చించే స్థోమత ఉన్నవారు సమయానికి భోజనం సిద్ధంచేసేవారినీ ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజూ ఆన్‌లైన్‌లో వైద్యుల సలహాలు తీసుకొని, ఆహ్లాదకర వాతావరణంలో ఉంటున్నారు.

పొరుగు రాష్ర్టాలకు చెందినవారు కూడా ఇక్కడ వసతి పొందుతున్నట్టు తెలిసిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఆన్ లైన్లోనో రవాణా శాఖ పౌర సేవలు

రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వివిధ రకాల పౌరసేవలను పొందే సదుపాయం దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో అందుబాటులోకి వచ్చిందని సాక్షి కథనం ప్రచురించింది.

లెర్నింగ్‌ లైసెన్సు, డ్రైవింగ్‌ లైసెన్సు, బ్యాడ్జ్, సాధారణ పత్రాల స్థానంలో స్మార్ట్‌కార్డులు వంటి ఐదు రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.

దీనికి సంబంధించిన పోర్టల్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

భవిష్యత్తులో మరో 12 రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లోనే పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖ అందజేసే పౌరసేవలను మరింత సులభతరం చేసేవిధంగా ఆన్‌లైన్‌ సర్వీసులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఆర్టీఏ అందజేసే వివిధ రకాల సేవల కోసం వినియోగదారులు మొదట ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ స్లాట్‌లో కేటాయించిన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. కానీ తాజాగా ప్రవేశపెట్టిన ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల డూప్లికేట్‌ లెర్నింగ్‌ లైసెన్స్, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, రవాణా వాహనాలు నడిపే డ్రైవర్‌లకు ఇచ్చే బ్యాడ్జ్, డ్రైవింగ్‌ లైసెన్సుల డాక్యుమెంట్‌ల స్థానంలో స్మార్ట్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు.

రియల్‌ టైమ్‌ డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ (ఆర్‌టీడీఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రవాణాశాఖ ఈ సర్వీసులను అందజేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చని సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)