పవన్ కల్యాణ్: 'ఏపీలో మూడు రాజధానులు కలే, అది వాస్తవంగా రూపుదాల్చదు' :ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న 3 రాజధానుల మాట ఒక కలేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారని ఈనాడు కథనం ప్రచురించింది.

3 రాజధానులనేది ఒక కల మాత్రమేనని, అది ఒక భావన(కాన్సెప్ట్) అది వాస్తవంలో రూపుదాల్చబోదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయడ్డారు అని చెప్పింది.

ఏవో సాంకేతిక అంశాలను పేర్కొంటూ ఈ బిల్లులను గవర్నర్‌ వద్దకు పంపారని వివరించారు.

సింగపూర్‌ తరహా రాజధాని అంటూ టీడీపీ ఎలా కాన్సెప్ట్‌ ను అమ్ముకుందో, వైసీపీ 3 రాజధానుల భావనతో కూడా అదే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలు చూడాలని సూచించారు. అమరావతి మరో నందిగ్రామ్‌ కాకూడదని అభిప్రాయపడ్డారు. వీడియో ద్వారా గురువారం ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారని ఈనాడు రాసింది.

'రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుంది. అభివృద్ధి అన్ని చోట్లా జరగాలి. రాజధాని రైతులు 200 రోజులకుపైగా న్యాయం కోసం ఆందోళన చేస్తుంటే పోలీసు లాఠీలతో కొట్టించారు.

'నిజంగా అవకతవకలుంటే సరి చేసి అమరావతిని ముందుకు తీసుకెళ్లాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 రాజధానులని వైసీపీ అంటే రైతులు భూములిచ్చేవారు కాదేమో' అన్నారని పత్రిక తెలిపింది.

కేంద్రం సాయంతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.10వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఇళ్లను అర్హులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నా, మీరు మా పార్టీ కాదంటూ ఇబ్బంది పెట్టడం సరికాదని పవన్ అన్నారు.

రాష్ట్రంలో సాక్షాత్తూ ఎస్సీ హోంమంత్రి ఉన్నా అదే వర్గీయులపై వరుస దాడులు జరగడం బాధాకరం. ఒకటో రెండో జరిగితే యాదృచ్ఛికమని అనుకోవాలి. వరుసగా జరుగుతున్నందున వారిపై సానుకూల దృక్పథం లేదనుకోవాలి.

మనశ్శాంతి కోసం కాకుండా ప్రజలంతా బాగుండాలని చాతుర్మాస దీక్షను నియమబద్ధంగా చేస్తున్నా. 2003 నుంచి ఈ దీక్ష చేసే అలవాటుంది' అని పవన్‌ వెల్లడించినట్లు ఈనాడు వివరించింది.

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదైనట్లు ఆంధ్రజ్యోతి సహా అన్ని ప్రధాన పత్రికలూ కథనం ప్రచురించాయి.

కరోనా దూకుడుకు అడ్డుకట్ట పడటం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్ని జిల్లాలు వైరస్‌ ఉధృతితో విలవిల్లాడుతున్నాయి.

నిత్యం వేలాదిగా కేసులతో పాటు పదుల సంఖ్యలో మరణాల నమోదుతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 7,998మంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది.

దీంతో రోజువారీ కేసుల నమోదులో జాతీయ స్థాయిలో ఏపీ రెండో స్థానానికి చేరింది.

మహారాష్ట్రలో రోజుకు 10వేల కేసులు బయటపడుతుంటే, రాష్ట్రంలో దాదాపు 8వేల వరకూ వెలుగులోకి వస్తున్నాయి.

తూర్పుగోదావరి(1,391), గుంటూరు(1,184), అనంతపురం(1,016) జిల్లాల్లో 24గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.

కర్నూలులో 904మంది వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 72,711కు చేరింది.

తాజాగా 5,428మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 37,555మంది డిశ్చార్జి అయ్యారు.

గురువారం మొత్తం 61మంది మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 884కు పెరిగాయి.

కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయినవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్లాస్మా దానం చేసి ఐసీయూలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

సీసీటీవీల ఏర్పాటులో హైదరాబాద్ దేశంలోనే నంబర్-1

సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్ దేశంలో కొత్త రికార్డు సృష్టించిందని సాక్షి ఒక కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌ మహానగరం మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతీ వెయ్యి మంది పౌరులకు 29.99 క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టీవీ (సీసీటీవీ) సర్వైలెన్స్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది.

ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రాజధాని టాప్‌ప్లేస్‌లో నిలవగా, ప్రపంచంలో 16వ స్థానం పొందింది.

ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా టాప్‌-50 నగరాల్లో చెన్నైకు 21, దేశ రాజధాని ఢిల్లీకి 33వ ర్యాంక్‌ లభించాయి.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన వీపీఎన్, యాంటీ వైరస్, యాప్స్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ 'కంపారిటెక్‌' ప్రపంచంలోని అధిక జనాభా ఉన్న 150 ప్రధాన నగరా ల్లోని సీసీటీవీల సంఖ్యను సేకరించింది.

ప్రభుత్వాల నివేదికలు, పోలీస్‌ వెబ్‌సైట్లు, పత్రికల్లో వచ్చిన కథనాలు, రిపోర్టులు, ఇతర రూపాల్లో డేటాను సేకరించి, సమాచారాన్ని క్రోడీకరించింది.

పోలీస్, ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఉపయోగి స్తున్న సీసీటీవీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పరిశీలన జరిపినట్టు వార్షిక నివేదికలో ఈ సంస్థ పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీ కెమెరాల సర్వైలెన్స్‌ చైనాలోనే ఉన్నట్టు ఈ సంస్థ విశ్లేషించింది.

ప్రధానంగా మొదటి 20 నగరాల్లో.. ప్రతీ వెయ్యిమందికి ఎన్ని సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్న విషయంలో లండన్‌ మూడో స్థానంలో, భారత్‌లోని తెలంగాణ రాష్ట్రం 16వ స్థానంలో నిలవగా మిగతా నగరాలన్నీ కూడా చైనాలోనివే కావడం దీనినే స్పష్టంచేస్తోంది.

2021కల్లా ప్రపంచంలోని సీసీటీవీలు వంద కోట్లకు చేరుకుంటుండగాఅందులో 54 కోట్లు చైనాలోనే ఉంటాయని ఐహెచ్‌ఎస్‌ అంచనా వేస్తోందని సాక్షి వివరించింది.

నాలుగైదు వారాలు అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణ

తెలంగాణలో రానున్న నాలుగైదు వారాల్లో కరోనా కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల హెచ్చరించినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది,,

అయితే కరోనా గురించి ఎలాంటి భయాందోళనలు అవసరంలేదని, కేవలం ఐదుశాతం మంది లోనే తీవ్రమైన లక్షణాలు ఉంటున్నాయని, మరణించిన వారిలో వీరే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

గురువారం హైదరాబాద్‌ కోఠిలోని కరోనా కంట్రోల్‌ సెంటర్‌లో వైద్య విద్యా డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

దవాఖాన ఏదైనా కరోనాకు అందించే వైద్యం మాత్రం ఒకటేనని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

లక్షలు చెల్లించి ప్రైవేటు దవాఖానల్లో పొందే వైద్యానికి, ప్రభుత్వ దవాఖానల్లో ఉచితం గా పొందే వైద్యాన్ని ఎలాంటి వ్యత్యాసం లేదని పేర్కొన్నారు.

ప్రపంచంలో, దేశంలో అందిస్తున్న చికిత్సనే రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు. తక్కువఖర్చుతో అయ్యే వైద్యానికి ప్రైవేటు దవాఖానలకు వెళ్లి లక్షలు వృథా చేసుకోవద్దని విజ్ఞప్తిచేశారని పత్రికలో రాశారు.

స్వల్ప లక్షణాలు ఉన్న వేలమంది హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొం దుతున్నారని వారు వివరించారు. లక్షణాలు ఉన్నవారు హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేదని, జిల్లాస్థాయిలో చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.

హైదరాబాద్‌ దవాఖానల్లో వినియోగించే ఔషధాలనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానలకు చేరవేసినట్టు వివరించారు.

రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నదని, మరణాల రేటు విషయంలో జాతీయసగటు 2.5 ఉంటే, రాష్ట్రంలో 0.88ఉన్నదని చెప్పారు.

రాష్ట్రంలో 99 శాతంపైగా కోలుకుంటున్నారని, నికరంగా చూస్తే రాష్ట్రంలో రికవరీరేటు 76 శాతంపైగా ఉన్నదని వివరించినట్లు నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)