తెలంగాణలో ప్రభుత్వ అధికారులంతా ఇంటి నుంచే పని... జూలై 13 నుంచి ఈ-ఆఫీస్ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కరోనా కారణంగా తెలంగాణలో మండలాఫీసును నుంచి సెక్రటేరియట్‌ వరకు ఇక అన్నీ వ్యవస్థలూ ఆన్‌లైన్‌లోనే నడవబోతున్నాయంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

అధికారులు, ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే విధంగా ఈ-ఆఫీస్‌ విధానానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఈ కథనంలో పేర్కొంది. ఇందులో భాగంగా అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నడుస్తున్నాయి.

కాగితంతో పని లేకుండా ఆన్‌లైన్‌లో ఫైళ్ల పరిశీలన, సందేహాలుంటే ఇంటర్‌కమ్‌ ద్వారా మాట్లాడుకోవడం ద్వారా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. సమస్యాత్మక ఫైళ్లు వచ్చినప్పుడు 'డిస్కస్‌' అని పేర్కొనడం ద్వారా అధికారులు సమావేశమై దానిపై చర్చించాల్సి ఉంటుంది. ఈ-ఆఫీస్‌లోకి మారేందుకు ప్రతి అధికారికి ప్రత్యేకమైన ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. నెట్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటి నుంచి పని చేయవచ్చు.

ఎప్పటికప్పుడు ఫైళ్ల స్థితిగతులను తనిఖీ చేసుకోవచ్చు. జిల్లాల నుంచి రాజధాని వరకు అందరు ఉద్యోగులు ఈ-ఆఫీస్‌ ద్వారా ఇంటి నుంచి పని చేయవచ్చని, ఈ నెల 13 నుంచి ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతాయని నమస్తే తెలంగాణ తన కథనంలో పేర్కొంది.

ఏపీ సీఎంఓలో ఆయనే సూపర్ బాస్‌

ఆంధ్రప్రదేశ్‌ సీఎం కార్యాలయంలో కీలకమైన అధికారుల బాధ్యతల్లో పెను మార్పులు చేర్పులు జరిగినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఇప్పటి వరకు సీఎం కార్యాలయంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు అధికారులు అజేయ కల్లం, పీవీ రమేశ్‌లను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పక్కనబెట్టారని, వారిని కేవలం సలహాదారుల పాత్రకు పరిమితం చేశారని ఈ కథనంలో పేర్కొంది.

సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలన్నీ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు అప్పజెప్పారని వెల్లడించింది. గత కొద్దికాలంగా అజేయకల్లం, పీవీ రమేశ్‌ల పట్ల సీఎం జగన్‌ అసంతృప్తితో ఉంటున్నారని ఈ కథనంలో రాసింది. రిటైర్ట్ అధికారులు ఫైళ్లపై సంతకాలు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయన్న సాకు చూపి ప్రభుత్వం వారిని పక్కనబెట్టినట్లు ఇందులో పేర్కొంది. ఈ మార్పుపై అటు అఖిలభారత సర్వీసు ఉద్యోగుల్లో, ఇటు సచివాలయంలో తీవ్రమైన చర్చ జరుగుతున్నట్లు వెల్లడించింది.

సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచి పౌరసత్వం, నోట్ల రద్దు పాఠాల తొలగింపు

కరోనా కారణంగా కుదించిన సీబీఎస్‌ఈ సిలబస్‌లో పౌరసత్వం, జాతీయవాదం, పెద్దనోట్ల రద్దు, ప్రజాస్వామ్య హక్కులు అనే పాఠ్యాంశాలు కూడా ఉన్నాయని ఈనాడు ఒక కథనం ఇచ్చింది.

విద్యా సంవత్సరం ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 9-12 తరగతుల సీబీఎస్‌ఈ పుస్తకాలలో 30శాతం సిలబస్‌ను తగ్గిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే సంక్షోభ పరిస్థితుల ముసుగులో ప్రభుత్వం దేశమౌలిక స్వరూపాన్ని, భిన్నత్వాన్ని హరించే ప్రయత్నం చేస్తోందటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఈ కథనంలో వెల్లడించింది.

ఈ వ్యవహారంలో కేంద్రం విద్యావేత్తల సలహాలకంటే రాజకీయ నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. తొలగించిన పాఠాలను సిలబస్‌లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాలని మమతా బెనర్జీతో పాటు, శివసేన పార్టీ నేతలు కూడా డిమాండ్‌ చేశారు.

అయితే సిలబస్‌ తొలగింపు ఈ విద్యా సంవత్సరానికే పరిమితమని, వచ్చే సంవత్సరం అన్ని పాఠాలు ఉంటాయని సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించినట్లు ఈనాడు పత్రిక వెల్లడించింది.

నిమ్మగడ్డ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంలో లభించని ఊరట

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నియామకం వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆంధ్రప్రభతోపాటు పలుపత్రికలు కథనాలు రాశాయి. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినట్లు ఈ కథనాలు వెల్లడించాయి.

హైకోర్టు తీర్పు కారణంగా అధికారులు విధులు నిర్వర్తించలేక పోతున్నారని, దీనిపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదించింది. మధ్యంతరంగా స్టేట్ ఎలక్షన్‌ కమిషనర్‌ను నియమించేలా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. అయితే ప్రస్తుతం అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మూడు వారాల తర్వాత ఈ కేసులో మళ్లీ వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)