ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ 22న - ప్రెస్ రివ్యూ

జగన్

ఫొటో సోర్స్, facebook/YSRcongressparty

ఫొటో క్యాప్షన్, జగన్
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోందని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే.

ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం.

కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు.

కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేస్తారని భావిస్తున్నారు’’ అని ఆ కథనంలో వివరించారు.

ప్రయివేట్ హాస్పిటళ్లలో పడకల రిజర్వేషన్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేకమంది భయాందోళనకు గురవుతున్నారని.. ముందస్తుగా ఆసుపత్రుల్లో పడకలు రిజర్వ్ చేయించుకుంటున్నారని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘డబ్బున్నవారు ముందుజాగ్రత్తగా ప్రైవేటు దవాఖానల్లో గదులను, పడకలను రిజర్వు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా పలు కార్పొరేట్‌ దవాఖానలు ప్రజల భయాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కృత్రిమ కొరతను సృష్టిస్తూ పడకలు లేవంటూ రోగులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. కొన్ని దవాఖానలు గేటు వద్ద ఏకంగా ‘హౌస్‌ఫుల్‌' బోర్డు పెడుతున్నాయి.

హైదరాబాద్‌లో భారీగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రైవేటు దవాఖానలు తమ వద్ద పడకలు దొరకడం లేవనే ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని దవాఖానల యాజామాన్యలు తమ వద్ద పడకలు లేవని, ఖాళీ అయిన వెంటనే చేర్చుకుంటామంటూ ముందుగానే అడ్వాన్స్‌ తీసుకుంటున్నాయి. సకల సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానలపై సామాజిక మాధ్యమాల్లో సాగిన దుష్ప్రచారం కూడా కొందరు ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతున్నది.

కొంతమంది సంపన్నులు తమకు వైరస్‌ సోకకపోయినా.. ముందుజాగ్రత్తగా గదులు, పడకలను అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నట్లు తెలిసింది.కరోనా రోగుల చికిత్సకు తాము ఖరారు చేసిన చార్జీలనే వసూలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో కొన్ని దవాఖానలు బ్లాక్‌ మార్కెట్‌కు తెరతీశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకంటే రెండు రెట్లు అధికంగా చెల్లించి వైద్యం పొందుతున్నట్టు పలువురు రోగులు ఆరోపించారు.

ఉదాహరణకు కొవిడ్‌ రోగి చికిత్సకు సంబంధించి వ్యక్తిగత గది రూ.5వేలు ఉంటే బ్లాక్‌లో రూ.10వేల నుంచి రూ.15వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. తమ వారిని బతికించుకొనేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా బ్లాక్‌లో పడకలు లేదా గదులను బుక్‌చేసుకుంటున్నట్లు చెప్తున్నార’’ని అందులో తెలిపారు.

మహేశ్ బాబు

ఫొటో సోర్స్, facebook/maheshbabu

ఫొటో క్యాప్షన్, మహేశ్ బాబు

మహేశ్ అరుదైన రికార్డు

మహేశ్‌బాబుకు ట్విటర్‌లో కోటి మంది ఫాలోవర్లుతెలుగు సినీ హీరో మహేశ్ బాబు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

‘‘ట్విటర్‌లో మహేశ్‌ను అనుసరిస్తున్నవారి సంఖ్య కోటి దాటింది.దీంతో అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న దక్షిణాది నటుడిగా నిలిచారు మహేశ్.

ఏప్రిల్ 2010లో ట్విటర్ ఖాతా తెరిచిన మహేశ్ నిత్యం ట్విటర్లో చురుగ్గా ఉంటారు.

మహేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 50 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నార’’ని ఆ కథనం తెలిపింది.

బోధన
ఫొటో క్యాప్షన్, బోధన

ఈ ఏడాది బడికి బైబై

2020-21 ‘జీరో’ విద్యాసంవత్సరంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘సిలబస్‌ను 50 శాతం తగ్గించి... తరగతులను, పనిదినాలను కుదించి విద్యాసంస్థలను నిర్వహించాలని యూజీసీ ప్రతిపాదిస్తోంది. అయితే... ఆచరణలో దీని సాధ్యాసాధ్యాలపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.

ఎందుకంటే... విద్యాసంస్థలు తెరిచినప్పటికీ పిల్లలను పంపించేందుకు చాలామంది తల్లిదండ్రులు సుముఖంగా లేరు. మరీముఖ్యంగా... 1నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లల విషయం లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

వర్షాకాలంలో కరోనా మరింత విజృంభించవచ్చన్న సంకేతాలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.ఆగస్టు 3నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఏపీలో ప్రభుత్వ వర్గాలు కొన్నాళ్ల క్రితం తెలిపాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తేదీన విద్యాసంస్థలు తెరిచే అవకాశమైతే కనిపించడంలేదు. బుధవారం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలోనూ అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

‘‘విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం’’ అని తెలిపారు. కొవిడ్‌ ఉద్ధృతితో విద్యాసంస్థలు ప్రారంభించే విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు.

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన విధానాన్ని ప్రకటించలేదు.

గతేడాదికి సంబంధించి సీబీఎ్‌సఈ 10-12తరగతుల పరీక్షలు రద్దయ్యాయి. పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోనూ టెన్త్‌ పరీక్షలు రద్దుచేశారు.దేశంలో ఎక్కడా విద్యా సంవత్సరం ప్రారంభంకాలేదు.

పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు తెరుచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు 2020-21 విద్యా సంవత్సరపు అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించలేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే కర్ణాటక ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరాన్ని రద్దుచేసింది.

ఇతర రాష్ట్రాలూ ఇదే నిర్ణయం తీసుకునే అవకాశముందనే అభిప్రాయం వినిపిస్తోంద’’ని ఆ కథనం వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)