కరోనావైరస్ - బీహార్: పెళ్లైన రెండో రోజే వరుడి మృతి.. వేడుకకు హాజరైన 111 మందికి కోవిడ్

కరోనా టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నీరజ్ ప్రియదర్శి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ

కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్నా వివాహాలు మాత్రం ఆగడం లేదు. లాక్‌డౌన్ మొదలైన తర్వాత జరిగిన కొన్ని వివాహాల గురించి మనం విన్నాం. కానీ, వాటిలో చాలావరకూ ఆన్‌లైన్లో జరిగాయి.

కానీ అన్‌లాక్-1 ప్రకటించిన తర్వాత జూన్ 8 నుంచి 50 మంది అతిథులతో వివాహ వేడుకలకు అనుమతి ఇచ్చారు. కానీ, చడీచప్పుడు లేకుండా చాలా ప్రాంతాల్లో వివాహ వేడుకలు ఆర్భాటంగా జరిగాయి.

అడిగితే మాత్రం, మేం పెళ్లికి 50 మంది కంటే తక్కువ మందినే ఆహ్వానించామని చాలామంది చెబుతున్నారు. పట్నాలోని పాలీగంజ్‌లో ఇటీవల జరిగిన అలాంటి ఒక వివాహం ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలిచింది.

పట్నాలోని స్థానిక పత్రికలు మంగళవారం ఒక వివాహ వేడుక గురించి ప్రధానంగా రాశాయి. వాటి వివరాల ప్రకారం ఈ వివాహానికి హాజరైన 111 మందికి కరోనా సోకింది. వరుడు కూడా పెళ్లైన రెండో రోజులకే చనిపోయాడు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఆ వివాహ వేడుకకు హాజరైన అదే కాలనీవాసులు, వధూవరుల బంధువులు చాలామంది ఉన్నారు.

పాలీగంజ్‌లో జరిగిన ఈ వివాహం కారణంగా కరోనా పాజిటివ్ వచ్చిన ఒకరు బిహటా ఈఎస్ఐసీ ఆస్పత్రిలో ఐసొలేషన్ సెంటర్లో ఉన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. “నాకు ఆ పెళ్లితో ఎలాంటి సంబంధం లేదు. నేను అసలు ఆ వేడుకకు కూడా వెళ్లలేదు. కానీ దానికి హాజరైనవారిని కలవడం వల్ల నాక్కూడా కరోనా వచ్చింది” అన్నారు.

ఆ వేడుకకు హాజరైనవారు చాలా మందిని కలవడంతో ఆ చెయిన్ చాలా దూరం వ్యాపించింది. చివరకు ఆ పెళ్లిలో వంటవాళ్లు, ఫొటోగ్రాఫర్, అదే కాలనీలో కిరాణా షాపు వ్యక్తికి, కూరగాయలు అమ్మేవారికి అందరికీ కరోనా వచ్చిందని ఆయన చెప్పారు.

దుకాణం

ఫొటో సోర్స్, Getty Images

వరుడి మృతితో భయాందోళనలు

జూన్ 15న ఈ వేడుక జరిగితే, వరుడు పెళ్లి తర్వాత రెండ్రోజులకు జూన్ 17న చనిపోయాడు. కడుపు నొప్పి అని చెప్పడంతో బంధువులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స అందకముందే చనిపోయాడని చెబుతున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వరుడి తండ్రి ప్రస్తుతం పట్నా సబ్ డివిజన్ ఆస్పత్రి ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

ఆయన బీబీసీతో “మేం ఎయిమ్స్ గేటు దగ్గరికి చేరుకోవడం, నా కొడుకు చనిపోవడం ఒకేసారి జరిగాయి. అప్పటికీ, మేం తనను ఆస్పత్రిలోకి తీసుకెళ్లాం. అక్కడి డాక్టర్లు టెస్ట్ చేసి చనిపోయాడని చెప్పారు. డెత్ సర్టిఫికెట్ తీసుకోడానికి మాకు ఒక రశీదు ఇచ్చారు. తర్వాత మేం శవాన్ని ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశాం” అన్నారు.

వరుడు పెళ్లైన రెండ్రోజులకే చనిపోవడంతో ఆ వివాహ వేడుక గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చ మొదలైంది.

“వరుడు గుర్‌గ్రామ్‌లో ఇంజనీర్. తన పెళ్లి కోసం మే 23న కారులో పట్నా వచ్చాడు. పెళ్లి బాగానే జరిగింది. కానీ తను చనిపోయాక, అతడు కరోనా వల్లే చనిపోయాడని రకరకాల వదంతులు మొదలయ్యాయి. అబ్బాయికి ఏదో అనారోగ్యం ఉందని కొందరు, అతడికి కరోనా ఉందనే విషయం దాస్తున్నారని మరికొందరు చెబుతున్నారు” అని స్థానిక జర్నలిస్ట్ ఆదిత్య కుమార్ చెప్పారు.

“భయపడిపోయిన చాలామంది ఫోన్ చేసి వైద్య బృందాలను పిలిపించారు. మొదటి దశలో 9 మంది, జూన్ 22న మరో 15 మంది పాజిటివ్‌గా తేలారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించింది. అందరికీ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 111కు చేరింది. ఇంకా చాలామందికి పరీక్షలు చేయాల్సి ఉంది.

కంటెయిన్మెంట్

ఫొటో సోర్స్, Aditya kumar

పెళ్లి కొడుకు రిపోర్టులు ఎక్కడ?

అసలు వరుడికి కరోనా పరీక్ష చేశారా, లేదా అనే విషయంలో ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి.

వరుడి తండ్రి మాత్రం “నా కొడుకు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. గుర్‌గ్రాంలో టెస్ట్ చేయించుకునే వచ్చాడు. కారులో తన సోదరుడు, సోదరితో కలిసి మొత్తం ఆరుగురు వచ్చారు. అందరూ మా ఇంటి పై అంతస్తులో 14 రోజులు క్వారంటీన్‌లో ఉన్నారు. జూన్ 6 నుంచి మాతో ఉన్నారు” అని చెప్పారు.

కొడుకు చనిపోయాడనే బాధకంటే, తన కొడుకు కరోనా వల్లే చనిపోయాడని అందరూ అంటుండడం అయన్ను ఇప్పుడు ఎక్కువ బాధిస్తోంది.

“జనం మాపైన ఏవేవో నిందలు వేస్తున్నారు. నేను ఆస్పత్రి వారితో మా అబ్బాయి మెడికల్ రిపోర్ట్ కోసం రెండుసార్లు మాట్లాడాను, కానీ, అప్పటికి అది సిద్ధం కాలేదు. తర్వాత నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. జూన్ 23 నుంచి ఐసొలేషన్ సెంటర్లో ఉండడంతో ఆ రిపోర్ట్ కోసం వెళ్లలేకపోయాను” అన్నారు.

వరుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినపుడు అతడికి కరోనా పరీక్షలు చేశారా? అని మేం ఎయిమ్స్ డైరెక్టర్ ప్రభాత్ కుమార్‌ను అడిగాం. కానీ, ఆయన తనకు అలాంటి కేసు వచ్చినట్లే తెలీదన్నారు.

“మా రికార్డుల్లో అలాంటి కేసు ఏదైనా వచ్చుంటే, నాకు తెలుస్తుంది. నాకు తెలిసినంతవరకూ కరోనాకు సంబంధించిన ఏ కేసూ మా దగ్గరకు రాలేదు” అన్నారు.

అన్‌లాక్ నిబంధనల ఉల్లంఘన

అయినా, అన్‌లాక్ నిబంధనల ప్రకారం వివాహ వేడుకలకు 50 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. కానీ పాలీగంజ్‌లో ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటివరకూ దాదాపు 400 మంది నుంచి శాంపిళ్లు తీసుకున్నారు.

పరీక్షల కోసం తీసుకున్న ఈ నమూనాలను బట్టి చూస్తే, పెళ్లికి హాజరైనవారి సంఖ్య 50కి పైనే ఉన్నట్టు తెలుస్తోంది. అంటే, అది అన్‌లాక్ నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది.

“వారు 50 మంది అతిథుల కోసం పర్మిషన్ అడిగారు. కానీ మా దర్యాప్తులో ఇంకా ఎక్కువ మంది వచ్చినట్లు తెలుస్తోంది. వేడుకకు హాజరైన అందరినీ గుర్తించి, వారికి మొదట స్క్రీనింగ్ చేస్తున్నాం. అందరికీ క్వారంటీన్ ముగిసిన తర్వాత దీనిపై విచారణ చేపడతాం” అని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమార్ చెప్పారు.

మరోవైపు బీడీవో చిరంజీవ్ పాండేయ్ “సబ్ డివిజన్ ఆస్పత్రి బృందాలు పాజిటివ్ కేసులకు కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నాయి. ఆరోగ్య విభాగం ప్రత్యేక బృందాలు అందరికీ పరీక్షలు చేస్తాయి. కాలనీలో శానిటైజేషన్ పనులు జరుగుతున్నాయి. కేసుల సంఖ్య ఇక పెరగదనే అనుకుంటున్నాం” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)