హెల్త్ ఇన్సూరెన్స్‌: ‘కరోనావైరస్ నేపథ్యంలో క్యాష్‌లెస్‌ సేవల్ని నిలిపివేశాం.. డబ్బులు కట్టి రీయింబర్స్‌కి దరఖాస్తు చేసుకోండి’ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

అత్యసవర పరిస్థితుల్లో వైద్య చికిత్స కోసం క్యాష్‌లెస్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకున్న అనేకమందికి ఇప్పుడు క్యాష్‌లెస్ చికిత్స అందటం లేదని.. ‘‘ముందు డబ్బు కట్టి వైద్యం చేయించుకొని, రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోండి'' అని సదరు ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తున్నాయని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. హైదరబాద్‌లో నివసించే వెంకట్‌ భార్యకు గుండెపోటు వచ్చింది. హడావిడిగా ఎల్‌బీ నగర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి సిబ్బంది ముందు రూ. లక్ష కడితేనే అడ్మిట్‌ చేసుకుంటామని చెప్పారు. తనవద్ద క్యాష్‌లెస్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కార్డు ఉన్నదనీ, ఆ కంపెనీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితాలో ఈ ఆస్పత్రి కూడా ఉన్నదని చెప్పాడు. అయినా సరే.. ముందు లక్ష కట్టాల్సిందేనని సిబ్బంది తేల్చిచెప్పారు.

విషయం అర్థంకాక ఇన్సూరెన్స్‌ కంపెనీ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేశాడు. అరగంట తర్వాత లైన్‌ కలిసింది. విషయం అంతా విన్న కాల్‌ సెంటర్‌ ఉద్యోగి.. ''సార్‌, కరోనా వల్ల క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ సేవల్ని నిలిపివేశాం. మీరు ముందు డబ్బు కట్టి వైద్యం చేయించుకొని, రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోండి'' అని చెప్పాడు. వెంకట్‌కు ఏం చేయాలో తోచలేదు.

ఇలాంటి అత్యవసరం ఏదన్నా వస్తుందేమో అనే ఏటా రూ. 30 వేలకు పైగా ప్రీమియం చెల్లించి, తనతో పాటు భార్య, ఇద్దరు పిల్లలకు క్యాష్‌లెస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నాడు. నాలుగేండ్లుగా ప్రీమియం కడుతున్నాడు. ఇప్పుడు అత్యవసరం పడే సరికి ఆ కంపెనీ 'చెయ్యిచ్చింది'. ఇప్పటికిప్పుడు చేతిలో అంతడబ్బు లేదు. చివరకు స్నేహితులకు ఫోన్‌చేసి, డబ్బు తెప్పించుకొని, భార్యకు వైద్యం చేయించుకున్నాడు. ఇది ఒక్క వెంకట్‌ పరిస్థితే కాదు. క్యాష్‌లెస్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకున్న అనేకమందికి ఎదురైన సమస్య.

ఇతర మెడికల్ ఇన్సూరెన్స్‌లకంటే క్యాష్‌లెస్‌ పాలసీలకు ప్రీమియం కూడా ఎక్కువ. ఏ ఏటికి ఆ ఏడు వేలకు వేలు కట్టి రెన్యూవల్‌ చేయించుకోవాలి. ఓసారి ప్రీమియం కట్టాక, ఆ ఏడాది దాని అవసరం పడకపోతే.. ప్రీమియం డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. మళ్లీ తర్వాతి సంవత్సర ప్రీమియం కట్టుకోవాల్సిందే. అయినా పాలసీదారులు 'అత్యవసరం'లో ఆదుకుంటుందని ముందు జాగ్రత్తగా ఈ పాలసీలను తీసుకుంటారు.

'కరోనావైరస్‌' నేపథ్యంలో కొన్ని ప్రయివేటు సంస్థలు, కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించాయి. మరికొందరి ఉద్యోగాలు పోయాయి. ఇదే సాకును చూపి కొన్ని కార్పొరేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు తమ పాలసీదారుల నమ్మకంపై దెబ్బకొట్టాయి. క్యాష్‌లెస్‌ వైద్య సేవల్ని నిలిపివేశాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులతోపాటు ఎక్కడా ఈ సేవలు అందుబాటులో లేవు. డబ్బు కడితేనే వైద్యం. లేదంటే సర్కారీ దవాఖానానే దిక్కు. గడచిన మూడు నెలలుగా పలు ప్రయివేటు, కార్పొరేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి.

‘‘ఇది చాలా అన్యాయం. అత్యవసరానికి ఉపయోగపడుతుందని క్యాష్‌లెస్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే.. దాన్ని నిలిపివేసి, రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోమంటున్నారు. అంతడబ్బే ఉంటే, క్యాష్‌లెస్‌ ఇన్సూరెన్స్‌ ఎందుకు తీసుకుంటాం? కార్పొరేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల దోపిడీకి పరాకాష్ట. క్లెయిమ్స్‌ను తిరస్కరించడానికిదో దుశ్చర్య. కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ) జోక్యం చేసుకోవాలి’’ అని చిక్కడపల్లికి చెందిన అభితేజ్‌ కోరారు.

‘‘కరోనావైరస్ నేపథ్యంలో క్యాష్‌లెస్‌ సేవల్ని నిలిపివేశాం. పాలసీదారులు ముందు డబ్బు చెల్లించి వైద్యం చేయించుకొని, తర్వాత రీయింబర్స్‌ మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలించి, క్లెయిమ్‌ మంజూరు చేస్తాం. సాధారణ రోజులు రాగానే మళ్లీ క్యాష్‌లెస్‌ పునరుద్ధరిస్తాం’’ అని స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కాల్‌ సెంటర్‌ (1800 425 2255) ఉద్యోగి చెప్పినట్లు నవతెలంగాణ వివరించింది.

‘‘నా ప్రాణాలకు ముప్పుంది.. రక్షణ కల్పించండి’’: లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన ప్రాణాలకు ముప్పుందని.. కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. చంపేస్తామని తనను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తలు, నేతల నుంచే భద్రత కల్పించాలని కోరుతూ రాసిన ఈ లేఖపై స్పందించిన స్పీకర్‌.. దానిని కేంద్ర హోంశాఖకు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

తనపై బెదిరింపులకు పాల్పడడం వల్లే మూడు రోజుల క్రితం సభాపతికి లేఖ రాశానని రఘురామకృష్ణంరాజు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. నిబంధన మేరకు దానిని బయటపెట్టలేనని పేర్కొన్నారు.

టీటీడీ ఆస్తులను అమ్మాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానన్నారు. ఇప్పటికైనా జగన్‌ పిలిపిస్తే వెళ్లి కలుస్తానని, కానీ ఆయన పిలుస్తారని తాను అనుకోవట్లేదన్నారు.

రాష్ట్రంలో ఇసుక ధరను 600 శాతం పెంచడంతో నిర్మాణ కార్యక్రమాలు స్తంభించడంపై మీడియా ద్వారా జగన్‌ దృష్టికి తీసుకచ్చానని.. అప్పటినుంచే తనపై దాడులు మొదలయ్యాయని, చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.

‘‘వర్మా.. నిన్ను చూస్తే జాలేస్తోంది’’: అమృత

రామ్‌గోపాల్ వర్మని చూస్తే జాలేస్తోందని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత అన్నట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్ హత్య’ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘మర్డర్’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేశారు. దీనిపై తాజాగా అమృత స్పందించారు.

‘‘ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి కూడా దూరమయ్యాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా?’’ అని ఆమె ప్రశ్నించారు.

‘‘పరువురు పోతుందన్న తప్పుడు ఆలోచనల్లో పడి ప్రణయ్‌ను నా తండ్రి హత్య చేయించాడు. కిరాయి గూండాలకు డబ్బులిచ్చి ఈ పాపానికి ఒడిగట్టాడు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను. ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మ రూపంలో మరో కొత్త సమస్య ఎదురవుతోంది. దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. నీలాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది’’ అని ఆమృత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏడుగురు పిల్లలున్నా అనాథగా... 90 ఏళ్ల వయసులో తల్లి ఆత్మహత్య

కడుపున పుట్టిన ఏడుగురు సంతానం ఆ తల్లిని భారంగా భావించి.. అనాథాశ్రమంలో చేర్పించటంతో 90 ఏళ్ల ముదిమి వయసులో నిరాదరణ, ఒంటరితనాన్ని భరించలేని ఆ అమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని ‘సాక్షి’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. చిత్తూరు‌ జిల్లా గుడిపాలకు చెందిన పాపమ్మ (90)కు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరినీ ఆమె ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేసింది. వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు ఆర్థికంగా బాగానే నిలదొక్కుకున్నారు. తల్లికి వయసు పెరగడంతో భారంగా భావించారు. దగ్గరుండి మరీ చిత్తూరు నగరంలోని తపోవనం అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పుడ ప్పుడూ కనీసం పలకరించకుండా మొహం చాటేశారు. కాటికి కాళ్లు చాపే ఈ వయసులో తన బిడ్డలెవరూ దగ్గరలేరనే ఆవేదన చెందింది.

ఈ నెల 18న బాగా నీరశించడంతో ఆశ్రమ నిర్వాహకులు ఆమెకు గ్లూకోజ్‌ ద్రావణం ఇచ్చారు. జీవితంపై విరక్తి చెందిన ఆమె మరుగుదొడ్డిలో ఉన్న యాసిడ్‌ను గ్లూకోజ్‌లో కలుపుకుని తాగేసింది. గమనించిన నిర్వాహకులు ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది.

సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏడుగురు సంతానం ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదని స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)