కరోనావైరస్: హైదరాబాద్‌లో విజయవంతమైన కొత్త టెస్ట్... 30 నిమిషాల్లోనే కోవిడ్-19 నిర్ధరణ

ఫొటో సోర్స్, Getty Images
కరోనా నిర్ధారణ పరీక్షను అత్యంత వేగంగా కచ్చితత్వంతో అతి తక్కువ ఖర్చుతో చేసేందుకు ఆర్టీ- ల్యాంప్ అనే రోగనిర్ధారణ పరీక్ష విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం ఈఎస్‌ఐసీ ఎర్రగడ్డ దవాఖానలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించగా విజయవంతమైంది. కేవలం 30 నిమిషాల్లోనే కొవిడ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పద్ధతిని వాడుతున్నారు. ఇందుకు 12 నుంచి 24 గంటలు పడుతున్నది. రూ.4,500 వరకు ఖర్చు అవుతున్నది. దీనిని అత్యాధునిక ప్రయోగశాలల్లోనే చేయాల్సి ఉంటుంది.
కానీ, నిమ్స్, ఈఎస్‌ఐసీ, టీఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన లూప్ మీడియేటెడ్ ఐసొథర్మల్ అప్లికేషన్ మెథడ్ (ఆర్టీ- ల్యాంప్)తో కొవిడ్ నిర్ధారణ పరీక్షను 30 నిమిషాల్లో వంద శాతం కచ్చితత్వంతో చేయవచ్చు. ఇందుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుంది.
ఆర్టీ- ల్యాంప్ విధానంలో పరీక్ష నాళికల్లో ముందుగానే రియేజెంట్‌ను పోస్తారు. ఇది గులాబీ రంగులో ఉంటుంది. అనుమానిత వ్యక్తుల నుంచి స్వాబ్ (శ్లేష్మం) సేకరించి పరీక్షనాళికల్లో వేసి 60 డిగ్రీల వేడి నీటి చాంబర్‌లో 30 నిమిషాల పాటు ఉంచుతారు. వైరస్ ఉంటే పరీక్ష నాళికలోనే ద్రవం గులాబీ రంగు నుంచి పసుపు వర్ణంలోకి మారుతుంది. వైరస్ లేకపోతే ద్రవం గులాబీ వర్ణంలోనే ఉంటుంది.
ఈ పరీక్షను ల్యాబ్ ఉన్న అన్ని దవాఖానల్లో కొన్ని జాగ్రత్తలతో నిర్వహించవచ్చు. ఐసీఎమ్మార్ నుంచి అనుమతులు రాగానే టెస్టులు ప్రారంభిస్తామని నిమ్స్ ఆర్‌అండ్‌డీ హెడ్ డాక్టర్ కే మధుమోహన్‌రావు తెలిపారు.

నడి వయసు వారిపై కరోనా పంజా
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 1 నుంచి 9 ఉదయం వరకూ మొత్తం 1,140 మంది కరోనా బాధితులను నిర్ధారించగా వీరిలో 21-50 ఏళ్ల మధ్య వయస్కులు 712 (62.46 శాతం) మంది ఉన్నారని ‘ఈనాడు’ ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం... కరోనా మృతుల్లో 41-60 మధ్య వయసున్న వారి సంఖ్య 66.65 శాతంగా ఉంది. ఈ నెల తొలి 7 రోజుల్లో మరణాలు 45 కాగా ఇందులో 41-50 ఏళ్ల మధ్యవయస్కులు 17 మంది (37.77 శాతం).
వీరిలో అధికులు తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వైఫల్యంతో మృతిచెందినట్లుగా వైద్య నివేదికలు చెబుతున్నాయి. 50 ఏళ్లు పైబడినవారు 25 మంది (55.55 శాతం) మృతిచెందారు.
వీరిలో అధికులు రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బు, మూత్రపిండాల వైఫల్యం, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు.. తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు. ఈ అనారోగ్య సమస్యలకు కరోనా వైరస్ కూడా జత కలవడంతో కోలుకోవడం కష్టమైందని వైద్య వర్గాలు వివరిస్తున్నాయి. లక్షణాలు కనిపించిన తర్వాత ఆలస్యంగా ఆసుపత్రికి రావడం వల్ల కూడా వ్యాధి ముదిరి చికిత్సకు స్పందించలేదని పేర్కొంటున్నాయి.
ఈ నెలలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణాలను పరిశీలిస్తే.. వైద్యఆరోగ్యశాఖ పొందుపర్చిన సమాచారంలో ‘ఇతరత్రా’ కారణాలే అధికంగా ఉన్నాయి. ఈ నెలలో నమోదైన మొత్తం బాధితుల్లో ఇలా ఇతరత్రా కారణాలతో వైరస్ సోకినవారు 291 (25.53 శాతం) మంది ఉన్నారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిలోనూ 110 (9.65శాతం) మంది వైరస్ బారినపడ్డారు. మొత్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే.. మహిళల్లో కంటే పురుషుల్లో వైరస్ ఎక్కువ మందిలో వ్యాప్తి ఉంది.
ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవసరాల కోసం బయటకు రాకపోకలు సాగించడం వల్ల వైరస్ వ్యాప్తి కూడా సులభంగా, వేగంగా ఒకరి నుంచి మరొకరికి జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కరోనా సోకడానికి ప్రధానంగా వారి కుటుంబ సభ్యులే కారణంగా నిలుస్తారని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని.. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, వ్యక్తిగత దూరాన్ని పాటించడం, తరచూ చేతులు శుభ్రపర్చుకోవడం వంటివి పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు.. బయటకు వెళ్లొచ్చినవారు వారికి దూరంగా ఉండడమే మేలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టటం పరీక్షే
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టడం అంత వీజీ కాదని.. ఆ రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన ‘స్పందన’ ద్వారా ఈ పాస్ తీసుకోవడంతోనే అసలు పరీక్ష మొదలవుతుందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న చాలా మంది ఏపీ వాసులు.. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో స్వస్థలాలకు బయల్దేరుతున్నారు. కానీ తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్తున్న ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి.
పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నాలుగోవంతు మందికి కూడా పాస్‌లు ఇవ్వట్లేదు. ఏదో ఒక కారణం చెప్పి తిరస్కరిస్తున్నారు. ఒకవేళ పాస్ తీసుకున్నా.. సరిహద్దుల్లో వైద్య చెక్‌పోస్టు పెట్టి, రాష్ట్రంలోకి వచ్చేవారికి థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నాలుగు రోజులకు మించి ఉంటామంటే హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు.
ఇక, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు, విమానాల్లో వచ్చే ప్రయాణికులకు అధునాతన ఐమాస్క్ క్వారంటైన్ మొబైల్ బస్సుల ద్వారా 2 నిమిషాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ అత్యాధునిక శాంపిల్ కలెక్షన్ బస్సులను విజయవాడ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌తో పాటు.. గరికపాడు చెక్‌పోస్టు వద్ద కూడా అందుబాటులో ఉంచారు. ఈ చెక్‌పోస్టు ద్వారా రోడ్డు మార్గంలో వచ్చేవారి పత్రాలన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేస్తుండడంతో వాహనదారులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది.
అక్కడ.. పాసులు ఉన్నవారి అనుమతులు పరిశీలించి, థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. నాసికా స్రావాలను (స్వాబ్ టెస్ట్) సేకరిస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారనే దాని ఆధారంగా కొందరిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు, మరికొందరిని హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు.
ఉదాహరణకు.. ముంబై లాంటి నగరాల నుంచి, కట్టడి ప్రాంతాల నుంచి వచ్చేవారిని తప్పనిసరిగా ప్రభుత్వ క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఇతర జోన్ల నుంచి వచ్చేవారిని హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. తీసుకున్న నమూనాల్లో ఏదైనా పాజిటివ్ వస్తే.. సదరు వ్యక్తుల చిరునామా ప్రకారం వారిని గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు పంపుతున్నారు.
విమానాల్లో ఏపీలోకి వచ్చేవారందరికీ పరీక్షలు చేస్తుండడంతో ప్రయాణికులు 5-6 గంటల పాటు పడిగాపులు కాయాల్సి వస్తోంది. పరీక్షల పేరుతో అంతసేపు ఆపేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా ఎఫెక్ట్: ఐటీ ఉద్యోగులకు వరం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త ప్రాజెక్టులు లేక యాజమాన్యాలు ఉద్యోగులను తొలగిస్తున్న సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఐటీ ఉద్యోగులకు కొన్ని సానుకూలతలు ఉన్నాయని ‘సాక్షి’ ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. కరోనా వైరస్ వల్ల కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే ఉద్యోగులకు వరంగా మారాయి. ఐటీ కంపెనీలకు వేదికయిన బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఇంటి అద్దె ధరలు ఎక్కువగా ఉంటాయి.. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటి అద్దె టెన్షన్ తీరిందని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బెంగుళూరులో ఎక్కువ ఐటీ కంపెనీలు ఉండే మహాదేవపుర, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీ, బెల్లాండూర్, సర్జాపురలో ఇంటి అద్దెలు అధికంగా వసూలు చేస్తున్నారు. బెంగుళూరులో దాదాపు 85 శాతం ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ 2025 సంవత్సరం లోపు మూడో వంతు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తామని పేర్కొంది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- కరోనావైరస్: వ్యాక్సీన్ ప్రయోగాల్లో ఆఫ్రికా వాళ్ళు తప్పకుండా ఉండాలి... ఎందుకంటే?
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- కరోనావైరస్: ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనా స్థానాన్ని భారత్ సొంతం చేసుకోగలదా?
- కరోనావైరస్: ఫేస్‌మాస్కుల ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది...
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి.. వేటిని దూరం పెట్టాలి
- కరోనావైరస్: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























