You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్: లాక్‌డౌన్ సడలించిన తర్వాత రోజుకు వంద కేసులు.. ఇప్పుడు షట్‌డౌనా? లాక్‌డౌనా? - ప్రభుత్వం మల్లగుల్లాలు - ప్రెస్ రివ్యూ
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతున్నదని.. ప్రతి రోజూ హైదరాబాద్‌లో సగటున వందకు పైగా కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నదని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఆర్థికంగా కీలకమైన రాజధానిలో కరోనా కట్టడి పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే షట్‌డౌన్ విధించాలా? మళ్లీ లాక్‌డౌన్ పెట్టాలా? అని సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది.
లాక్‌డౌన్ సడలింపు తర్వాత భౌతిక దూరం అనేది అటకెక్కింది. ముఖ్యంగా మార్కెట్లలో గుంపుగుంపులు ఉండొద్దని ప్రభుత్వం ఎంత మొత్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్న పరిస్థితి ఉంది. రామ్‌నగర్ చాపల మార్కెట్‌లో, నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లలో కనీసం నడువలేని స్థితిలో ప్రజలు పోగుకావడం లాంటి పరిస్థితులు కరోనా సామూహిక వ్యాప్తికి కారణమవుతున్నాయి.
అదే సమయంలో అవసరం ఉన్నా, లేకున్నా జనాలు రోడ్లపైకి రావడం, కనీసం జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 3,650 రాగా..137 మరణాలు చోటుచేసుకున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మనోజ్ కూడా కరోనాతో చనిపోయాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. కరోనా కట్టడిపై సోమవారం సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి సమీక్ష చేయనున్నారు.
ఈ క్రమంలోనే... హైదరాబాద్‌ను 'షట్ డౌన్' చేస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆరా తీస్తున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌ను షట్‌డౌన్ చేస్తే ఎలా ఉంటుంది? లాక్‌డౌన్ విధిస్తే ఎలాగుంటుంది? కరోనా కట్టడికి ఇంకా ఏం చర్యలు తీసుకోవాలి? అని మంత్రులు, వైద్యాధికారులు, సీసీఎంబీ శాస్త్రవేత్తలను కూడా సీఎం సంప్రదించ నున్నట్టు తెలిసింది.
లక్షణాలు లేని రోగులకు ఇళ్లలోనే చికిత్స చేస్తున్నాం: మంత్రి ఈటల వెల్లడి
లక్షణాలు లేకున్నా చాలా మందిలో కరోనా పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి 3 రోజులుగా ఇండ్లలోనే చికిత్స అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈటెల చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లో ఉండేందుకు అపార్ట్‌మెంట్లు, కాలనీల ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు. కరోనా సోకిన వారిని బహిష్కరించడం సరికాదన్నారు. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పారు. ప్రజలు అపోహలను వీడాలని విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, మరణాలు, వైద్య సేవల నిర్వహణపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. హోం క్వారంటైన్లో ఉండేందుకు అనుమతిచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని దవాఖాన నుంచి బయటికి రానివ్వడంలేదన్నారు.
కరోనా సోకిన వ్యక్తి ఇంటి పక్కన ఉంటే తమకు కూడా వైరస్ సోకుతుందేమోనన్న భయంతో చాలామంది హోంక్వారంటైన్‌లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. జియాగూడలో ఓ కాలనీలో ఇంటి పక్కనున్నవారు ఇబ్బంది పెట్టడంతో ఓ వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో దవాఖానకు రావాల్సి వచ్చిందని చెప్పారు. దీనివల్ల దవాఖానలపై అధిక భారం పడుతున్నదని, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నదని మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు.
జ్వరం లక్షణాలుంటే పీహెచ్‌సీల్లో చికిత్స
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయిలోనే చికిత్స అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. దవాఖానల్లో మందులు, కిట్ల అందుబాటుపై ఆరా తీశారు. కరోనా చికిత్స కోసం ఇండ్లలో ప్రత్యేక గదులు లేనివారు జిల్లా కేంద్రంలోనే ఐసొలేషన్‌లో ఉండేలాగా ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు.
ప్రజలు జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకే లాక్‌డౌన్‌లో సడలింపులు తప్ప, పని లేకున్నా కూడా బయట తిరగడానికి కాదని మంత్రి అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవసరం లేకున్నా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
చైనాను దాటేసిన మహారాష్ట్ర
మహారాష్ట్రలో గత 24 గంటల్లో ఏకంగా 3,007 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 85,975కు చేరుకుంది. ఇప్పటి వరకు 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో మహారాష్ట్ర.. పొరుగుదేశం చైనాను దాటేసింది.
చైనాలో ఇప్పటి వరకు 83,036 కేసులు నమోదు కాగా, అత్యధిక కేసులు కలిగిన దేశాల జాబితాలో చైనా 18వ స్థానంలో ఉంది. భారత్ ఆరో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2.5 లక్షలు దాటేసింది.
తమిళనాడులో కొత్తగా 1,515 కేసులు నమోదు కాగా, 18 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 31,667 కేసులు నమోదయ్యాయి. 269 మంది మరణించారు.
ఢిల్లీలో ఇప్పటి వరకు 27,654 కేసులు నమోదు కాగా, 761 మంది మరణించారు. గుజరాత్‌లో 19,592 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు 1219 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఉత్తరప్రదేశ్ కొత్తగా 433 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,536కు పెరిగింది.
కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి చెందాడంటూ పాక్ మీడియా కథనం
మోస్ట్ వాటెండ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్‌తో మృతి చెందాడన్న వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయని పాకిస్తాన్‌కు చెందిన న్యూస్ ఎక్స్ మీడియా సంస్థ శనివారం ఓ కథనం ప్రచురించినట్లు ‘సాక్షి’ చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. 1994 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో ఐఎస్‌ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్, అతడి భార్య మెహజబీన్ కరోనా బారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి ఆయన మృతి చెందాడని పాకిస్తాన్‌కు చెందిన న్యూస్ ఎక్స్ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్ మృతి చెందాడని పేర్కొంది. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అయితే దావూద్ మృతిపై సరైన సమాచారం లేకపోయినా.. వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. భారత్‌తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా వైరస్ చేసిందని వ్యంగ్యంగా పోస్ట్ చేస్తున్నారు.
వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి:
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)