కరోనావైరస్: ‘ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ నష్టం’

    • రచయిత, ఫైసల్ మహమ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

కరోనావైరస్ మహమ్మారిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం అనుసరించిన చర్యలను మూడు ప్రముఖ వైద్య, ఆరోగ్య సంస్థలు గట్టిగా విమర్శించాయి.

అనాలోచిత నిర్ణయాలతోనే దేశంలో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయని, వైరస్ వ్యాప్తి కూడా పెరిగిందని అభిప్రాయపడ్డాయి.

కఠినమైన లాక్‌డౌన్ విధించినప్పటికీ కరోనావైరస్ పాజిటివ్ కేసులు 606 నుంచి 1.38 లక్షలకు (మే 24 వరకు) పెరగడమే కాకుండా, వైరస్ ‘కమ్యునిటీ ట్రాన్సిమిషన్’ దశకు చేరుకుందని వ్యాఖ్యానించాయి.

ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రీవెంటివ్ అంట్ సోషల్ మెడిసిన్స్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడెమాలజిస్ట్స్ కలిసి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌తోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకూ దీన్ని పంపాయి.

భారత్‌లో కరోనావైరస్ కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరుకుందన్న వాదనను కేంద్ర ప్రభుత్వం మాత్రం తిరస్కరిస్తోంది.

ఆదివారం విడుదల చేసిన ఆ మూడు సంస్థల ప్రకటనపై సంతకం చేసినవారిలో ప్రభుత్వ కోవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ డీసీఎస్ రెడ్డి, అందులోని మరో సభ్యుడు డాక్టర్ శశికాంత్ ఉన్నారు.

ఎయిమ్స్, బీహెచ్‌యూ, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ప్రొఫెసర్లు, ఆరోగ్య రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా దీనిపై సంతకం చేశారు.

కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏప్రిల్ రెండో వారంలో ప్రభుత్వం ప్రకటించింది.

వలస కార్మికులపై, పేదలపై ప్రభావం

కేవలం నాలుగు గంటలు మాత్రమే ప్రజలకు సమయం ఇస్తూ, ఆగమేఘాల మీద తొలి లాక్‌డౌన్‌ను ప్రకటించడంపై విమర్శలు ఉన్నాయి.

వలస కార్మికులను ఎందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.

లాక్‌డౌన్ కనీసం 90 లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టిందని తాజా ప్రకటనలో ఆ మూడు సంస్థలు తప్పుపట్టాయి.

ఆహార భద్రత కోసం పనిచేసే రైట్ టు ఫుడ్ సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం లాక్‌డౌన్ వల్ల మే 22 వరకూ దేశవ్యాప్తంగా ఆకలి, దుర్ఘటనలు, ఇతర కారణాలతో 667 మరణాలు (కరోనావైరస్ మరణాలు కాకుండా) సంభవించాయి.

ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత ధోరణి కారణంగా ఇబ్బందులు పడ్డ పేదలకు సంఘీభావంగా జూన్ 1న ‘శోక దినం’గా పాటించాలని కూడా రైట్ టు ఫుడ్ పిలుపునిచ్చింది.

‘‘కోవిడ్-19పై సమాలోచనల కోసం ప్రధాని మార్చి 24న ఓ నిపుణుల బృందాన్ని పిలిచారు. కానీ, లాక్‌డౌన్ గురించి ఆయన ముందే నిర్ణయం తీసేసుకున్నట్లున్నారు’’ అని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సంఘ్‌మిత్ర ఘోష్ అన్నారు.

లాక్‌డౌన్ ఆఖరి మార్గం కావాల్సిందని, కానీ ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్ ‘నిర్దాక్షిణ్యం’

‘‘లాక్‌డౌన్ ‘నిర్దాక్షిణ్య’ చర్య. కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది చనిపోవచ్చని అంచనా వేసిన ఓ ప్రముఖ సంస్థ ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ, ఆ అంచనా నెమ్మదిగా తప్పని తేలింది. ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే మరింత మెరుగైన ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉండేది’’ అని ఆ ప్రకటనలో ఆ మూడు సంస్థలు వ్యాఖ్యానించాయి.

వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉన్నప్పుడే వలస కార్మికులను వెళ్లనిచ్చి ఉంటే మెరుగ్గా ఉండేదని, ఇప్పుడు కార్మికుల కదలికల వల్ల ఇదివరకు చేరని చోటుకు కూడా వ్యాధి చేరుతుందని అభిప్రాయపడ్డాయి.

ఈ మూడు సంస్థలు ప్రభుత్వానికి అనేక సూచనలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వైద్య రంగంలోని నిపుణులు, సోషియాలజిస్ట్‌లతో బృందాలను ఏర్పాటు చేయడం, కోవిడ్-19కు సంబంధించిన సమాచారం సలువుగా చేరేలా చేయడం, లాక్‌డౌన్ ఎత్తివేయడం, క్లస్టర్ మూసివేతను అమలు చేయడం, ఆసుపత్రులను సాధారణ ప్రజల కోసం తెరవడం వంటి సలహాలు వీటిలో ఉన్నాయి.

లాక్‌డౌన్ నాలుగో విడత నుంచి ప్రభుత్వం నెమ్మదిగా సడలింపులు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పుడు ఫ్యాక్టరీలు తెరిచేందుకు కొన్ని షరతులతో అనుమతిచ్చారు.

జూన్‌లో మరిన్ని రకమైన ఆర్థిక కార్యకలాపాలు మొదలుకాబోతున్నాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)