నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకమే చెల్లదు: ఏపీ ఏజీ -ప్రెస్ రివ్యూ

ప్రచురణ

హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేశ్ నియామకం, ఆయన స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు, ఆదేశాలు చెల్లవని అడ్వకేట్ జనరల్ శ్రీరాం మీడియా సమావేశంలో చెప్పారని సాక్షి కథనం ప్రచురించింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ ఇన్‌చార్జి కార్యదర్శి జీవీ సాయిప్రసాద్ శుక్రవారం జిల్లా కలెక్టర్లకు జారీచేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నట్లు శనివారం ఆయన మరో సర్క్యులర్‌ను విడుదల చేశారు.

ప్రభుత్వం నుంచి తదుపరి సమాచారం వచ్చేవరకు శుక్రవారం నాటి సర్క్యులర్‌ ఉపసంహరణలో ఉంటుందని తాజా సర్క్యులర్‌లో సాయిప్రసాద్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఎవరిని నియమించాలని సిఫారసు చేసే అధికారం రాష్ట్ర మంత్రి మండలికి లేదని రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అసలు ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నియామకమే చెల్లదని రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ తెలిపారని సాక్షి రాసింది.

నిమ్మగడ్డ రమేష్‌ తనను తాను ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించుకుంటూ జారీచేసుకున్న ఉత్తర్వులు కూడా చెల్లవని ఆయన స్పష్టంచేశారు.

నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు చట్ట పరిధిని అతిక్రమించి చేసుకున్న.. అమలుచేయడానికి వీల్లేని ఉత్తర్వులుగా పరిగణించాలని ఆయన తేల్చిచెప్పారు.

ఎన్నికల కమిషనర్‌గా తనను తాను పునరుద్ధరించుకున్న తరువాత నిమ్మగడ్డ జారీచేసిన ఆదేశాలు ఏవీ కూడా చెల్లుబాటు కావన్నారని సాక్షి వివరించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలుపుదల కోసం హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసి ఉన్నామని.. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించినట్లు కథనంలో చెప్పారు.

తెలంగాణలో కరోనా ఉన్నా, లక్షణాలు లేనివారికి హోం క్వారంటైన్

కరోనా నిర్ధారణ అయి ఎలాంటి లక్షణాలు లేకుండా గాంధీలో చికిత్స పొందుతున్న బాధితులను హోం క్వారంటైన్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించారని ఈనాడు కథనం తెలిపింది.

ముఖ్యంగా 50 ఏళ్ల వయసులోపు ఉన్న దాదాపు 315 మందిని ఇప్పటికే ఎంపిక చేశారు.

ఈ సమాచారం ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులకు(డీఎంహెచ్‌వో) అందించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

గాంధీలో ప్రస్తుతం 500 మంది వరకు కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గాంధీలో గరిష్ఠంగా 1500 మందికి మించి చికిత్స అందించే మౌలిక వసతులు లేవు.

కరోనా బాధితుల్లోని కొందరిలో కనీసం జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కన్పించడం లేదు. ఇలాంటి వారిలో వైరస్‌ లోడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని హోం క్వారంటైన్‌లో పెట్టి మందులు అందించినా ఇబ్బంది ఉండదని అధికారులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం అందినట్లు పత్రిక వివరించింది.

లక్షణాలు లేనంత మాత్రాన అందర్నీ హోం క్వారంటైన్‌కు పంపరు. 50 ఏళ్లులోపు వయసుండాలి. ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉండకూడదు.

తక్కువ వయసున్నాసరే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తారు.

శిశువులు, గర్భిణులు, వృద్ధులు, కేన్సర్‌, కిడ్నీ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు ఇబ్బందులున్న వారిని ఆసుపత్రిలోనే ఉంచాలి. పూర్తిగా నయం అయ్యాకే డిశ్ఛార్జి చేస్తారు.

ఇప్పటికే ఆయా కుటుంబాల్లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు, వృద్ధులు, గర్భిణులు, శిశువులుంటే మాత్రం హోం క్వారంటైన్‌కు కాకుండా అధికారులు సూచించిన ప్రదేశాల్లో ఉండేందుకు అవకాశమిస్తారు.

హోం క్వారంటైన్‌కు తరలించడం నుంచి ఔషధాల సరఫరా, ఇతర జాగ్రత్తల బాధ్యతలు డీఎంహెచ్‌వోలు తీసుకోవాలి.

ఇంటికి తరలించే ముందు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు ముద్ర వేయాలి. ఈ సమయంలో ఇంట్లో వారిని సైతం కలవకుండా ప్రత్యేక గదిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వారిని నిత్యం పర్యవేక్షిస్తుండాలి.

సొంత ఇల్లు లేనివారు.. ఒకే గది ఉన్న వారి బాధ్యతలను అధికారులే తీసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ వసతి గృహాలు, లేదంటే ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించి వీరిని క్వారంటైన్‌ చేసి ఆహారం, ఔషధాలు అందించాలి.

బాధితులు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. తినే కంచం నుంచి అన్ని వస్తువులు ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి అని అధికారులు సూచించినట్లు ఈనాడు రాసింది.

ఏపీ సచివాలయ ఉద్యోగులకు కరోనా

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఉద్యోగులను తీసుకొచ్చేందుకు ఇక్కడినుంచి 10 ఆర్టీసీ బస్సులు వెళ్లాయి.

వాటిలో వచ్చిన ఉద్యోగుల్లో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. అందులో ఒకరు సచివాలయంలో పని చేస్తుండగా, మరో ఇద్దరు శాఖాధిపతుల కార్యాలయాలకు చెందినవారు.

హైదరాబాద్‌ నుంచి వచ్చినవారిని నేరుగా మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు తరలించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

ఆ తర్వాత అందరికీ అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ సమయంలో ఎలాంటి భౌతిక దూరం పాటించలేదని ఉద్యోగులు చెబుతున్నారని పత్రిక తెలిపింది.

తర్వాత రెండురోజుల పాటు వీరు కార్యాలయాలకు వెళ్లారు. శుక్రవారం బాగా పొద్దుపోయాక వీరికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెలువడ్డాయని వివరించింది.

సచివాలయంలో పనిచేస్తున్న వ్యక్తి నవులూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వసతిలో ఉంటున్నాడు. ఆయన రూమ్‌లో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు సహా మొత్తం ఆ అపార్ట్‌మెంటులో 40మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారని తెలిపారు.

గురు, శుక్రవారాల్లో సచివాలయానికి వచ్చిన ఆ వ్యక్తి, అతని రూమ్‌మేట్స్‌ సచివాలయంలోని అన్ని బ్లాకులు కలియదిరిగారని చెబుతున్నారు.

చాలారోజుల తర్వాత కలుసుకున్న సందర్భంగా నవులూరు అపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు చిన్నపాటి పార్టీ చేసుకున్నారని, ఈ వ్యక్తి కూడా అందులో పాల్గొన్నాడని చెబుతున్నారు.

పైగా శుక్రవారం సచివాలయంలో ఒక ఉద్యోగి రిటైర్మెంట్‌ సందర్భంగా చేసుకున్న వేడుకలోనూ ఇతను పాల్గొని అందరు ఉద్యోగులతో కలివిడిగా తిరిగాడని, అందరితో కలిసి డైనింగ్‌ హల్‌లో భోజనం చేశాడని చెబుతున్నారు. దీంతో ఆ ఉద్యోగి కాంటాక్ట్స్‌ లెక్కతేలడం కష్టంగా మారిందని పత్రిక వివరించింది.

మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆన్ లైన్ బోధన

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో విద్యార్థులే టీచర్లుగా మారి ఆన్‌లైన్లో పాఠాలు బోధిస్తున్నారని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

మేడ్చల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌ అధ్యయనంలో దూసుకుపోతున్నారు.

కాగ్నిజెంట్‌ సంస్థ సహకారంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు చేపట్టిన ఆన్‌లైన్‌ బోధన అద్భుత ఫలితాలు ఇస్తున్నది.

లాక్‌డౌన్‌ కారణంగా పదోతరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోవటం.. పాఠశాలలు మూతపడటంతో పదోతరగతి విద్యార్థులు నష్టపోకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు వినూత్న ప్రయోగం చేశారు.

కాగ్నిజెంట్‌ కంపెనీ సౌజన్యంతో జిల్లాలోని ప్రభుత్వ టీచర్లకు జూమ్‌యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ బోధనలో శిక్షణ ఇచ్చారు.

విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు అందజేసి, శిక్షణ పొందిన టీచర్ల ద్వారా 40 రోజులపాటు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించారు. ఈ విధానానికి అలవాటు పడిన తర్వాత విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠాలను బోధిస్తూ వీడియోలు తీసి పంపాలని సూచించారు.

అందుకోసం 80 నుంచి 100 మంది విద్యార్థులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటుచేశారు. దాంతో విద్యార్థుల టీచర్ల మార్గదర్శనంలో వివిధ పాఠ్యాంశాలను ఎలాంటి బెరుకు లేకుండా బోధిస్తూ దానినంతటినీ వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నారు.

ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే వాట్సాప్‌ ద్వారా టీచర్లను అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. అలా దాదాపు 300 పాఠ్యాంశాలను విద్యార్థులు అద్భుతంగా బోధించారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

సబ్జెక్టును వినటం కంటే బోధిస్తే ఎక్కువకాలం గుర్తుంటుంది. లోతుగా అర్థంచేసుకోవటానికి వీలవుతుంది. ఇదే సూత్రం ఆధారంగా త్వరలో జరుగబోయే పదోతరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధంచేస్తున్నారు.

ఈ ప్రయోగాత్మక బోధనపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌ సంతోషం వ్యక్తంచేశారు. జిల్లా విద్యాధికారులు, ఉపాధ్యాయులను ప్రశంసించారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)