కరోనా లాక్‌డౌన్: రెండున్నర గంటల్లో 4 లక్షల రైలు టికెట్ల విక్రయం... నేటి నుంచి ఎంపిక చేసిన స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
జూన్ 1 నుంచి పట్టాలెక్కనున్న రైళ్లలో టికెట్లు రెండున్నర గంటల్లో 4 లక్షల టికెట్లు బుక్ అయ్యాయని ఈనాడు కథనం ప్రచురించింది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించిన రైల్వేశాఖ మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమవుతోంది.
జూన్ 1న బయల్దేరే రైళ్లకు గురువారం ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ ప్రారంభం కాగానే ప్రయాణికుల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఉదయం 10 గంటలకు ప్రయాణికులు ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో టికెట్ల కోసం ప్రయత్నించారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్, గోదావరి, హుస్సేన్‌సాగర్, ఫలక్‌నుమా, గోల్కొండ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆరోజు ప్రయాణాలకు టికెట్లు అరగంట వ్యవధిలోనే అయిపోయాయి.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఫలక్‌నుమా, గోదావరి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నప్పటికీ ఒక్క దాంట్లోనూ ఖాళీ లేదు. రిజర్వేషన్ ప్రక్రియ మొదలైన మొదటి రెండున్నర గంటల్లోనే దేశంలో నాలుగు లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దిల్లీలో తెలిపారని ఈనాడు చెప్పింది.
శుక్రవారం నుంచి ఎంపిక చేసిన స్టేషన్లలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు తెరవనున్నారు.
దేశంలో 1.7 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు, టికెట్ ఏజెంట్ల ద్వారానూ రిజర్వేషన్‌కు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారని కథనంలో రాశారు.
ప్రత్యేక రైళ్లలో టికెట్ల రిజర్వేషన్లకు తెలంగాణలో 18 రైల్వేస్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 44 రైల్వేస్టేషన్లతో పాటు జోన్ పరిధిలోకి వచ్చే మరో 11 చోట్ల శుక్రవారం నుంచి రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను తెరవనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించిందని ఈనాడు వివరించింది.
ప్రత్యేక రైళ్లలో ఈ-టికెట్లను వివిధ వ్యక్తిగత ఐడీల ద్వారా నకిలీ పేర్లతో బుకింగ్ చేసిన వారిని గుర్తించిన రైల్వే భద్రత దళం(ఆర్‌పీఎఫ్) 14 మందితో పాటు 8 మంది ఐఆర్‌సీటీసీ ఏజెంట్లను అరెస్టు చేశారని, వారి నుంచి రూ.6.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, AP CMO
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు పూర్తి వేతనాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని సాక్షి కథనం ప్రచురించింది.
ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్‌నెలల్లో కొంత శాతం జీతాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
అయితే మే నెలకు సంబంధించిన జీతాలపై అధికారులతో సీఎం వైఎస్‌జగన్‌సమీక్షించి పూర్తి వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.
లాక్‌డౌన్‌కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల నుంచి పూర్తి జీతభత్యాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగుల పక్షాన ఏపీఎన్‌జీవో నేతలు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారని కథనంలో చెప్పారు.
మార్చి, ఏప్రిల్‌నెలల్లో 50 శాతం జీతాలు చెల్లించడంతో ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన మానవతా దృక్పథంతో స్పందించి మే నెల నుంచి పూర్తి జీతభత్యాలు ఇవ్వడానికి అంగీకరించారని వారు చెప్పారు.
మార్చి, ఏప్రిల్‌నెలల్లో మిగిలిన 50 శాతం జీతాన్ని త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని సీఎంను వారు కోరారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ ఐటీ రంగం జోరు
తెలంగాణ ఐటీ రంగంలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులను సాధించిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో ఐటీ రంగం కొత్తగా 40వేల మందికి ఉపాధిని చూపింది. భారత జాతీయ సగటే కాదు.. దేశంలోని ఏ ఇతర రాష్ర్టాలు నమోదు చేయని వృద్ధిని సాధించిందని పత్రిక తెలిపింది.
కరోనా కష్టకాలంలో ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగించింది.
ఈ ఏడాది జనవరి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసిందని కథనంలో చెప్పారు.
పూర్తి ఆర్థిక సంవత్సరంలో జాతీయస్థాయిలో నమోదైన వృద్ధిరేటు కంటే ఇది రెట్టింపుకన్నా అధికం కావడం విశేషం.
జాతీయ సగటు 8.09 శాతం, ఇతర రాష్ర్టాల సగటు 6.92 శాతం ఉండగా, తెలంగాణ రికార్డు స్థాయిలో 17.93 శాతం వృద్ధిని నమోదు చేసిందని నమస్తే తెలంగాణ రాసింది.
మొత్తంగా దేశీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతానికి చేరుకొని ఐటీలోనే మేటిగా నిలిచింది.
సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఎగుమతుల్లో అద్భుత ప్రగతి సాధించారంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఐటీశాఖను అభినందించారని పత్రిక చెప్పింది.

ఫొటో సోర్స్, Youtube Grab
బావిలో తేలిన వలస కార్మికుడి కుటుంబం శవాలు
పశ్చిమబెంగాల్ నుంచి తెలంగాణ వచ్చిన ఒక కుటుంబ సభ్యులు బావిలో శవాలుగా తేలిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
వరంగల్‌రూరల్‌జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట పారిశ్రామిక వాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
కోల్‌కతాకు చెందిన మక్సూద్(50) పాతికేళ్లుగా వరంగల్‌అర్బన్‌జిల్లా కేంద్రంలోని కరీమాబాద్‌లో బార్‌దాన్‌కూలీగా పనిచేస్తున్నాడు.
అతడికి భార్య నిషా(45), ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకున్న అతడి కుమార్తె కూడా.. తన కొడుకుతో తండ్రి మక్సూద్‌వద్దే ఉంటోంది.
మక్సూద్‌కుటుంబం లాక్‌డౌన్‌తో ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సాయిదత్తా బార్‌దాన్ ట్రేడర్స్‌లోని భవనంలోనే నెల రోజులుగా ఉండిపోయింది. ఆ భవనంపైనే బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉంటున్నారు.
గురువారం సాయిదత్తా ట్రేడర్స్‌యజమాని వచ్చేసరికి వీరెవరూ కనిపించకపోవడంతో గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనంతరం ప్రాంగణంలో వెతుకుతుండగా బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. వాటిని వెలికితీసిన పోలీసులు, మక్సూద్, నిషా, కుమార్తె (22), మనవడి(3)కి చెందినవిగా గుర్తించారు.
మక్సూద్ కుటుంబం, బిహార్ యువకులు మొత్తం 8 మంది భవనంలో ఉంటుండగా.. పోలీసులు నలుగురి మృతదేహాలను వెలికితీశారని జ్యోతి చెప్పింది.
బిహార్ యువకులు, మక్సూద్ కుమారుల ఆచూకీ లభ్యం కాలేదు. బావి దగ్గర దుస్తుల మూటలు కూడా లభ్యమయ్యాయి.
నలుగురు వ్యక్తులు కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని కథనంలో వివరించారు.
ప్రస్తుతానికి ఇద్దరి పేర్లు మాత్రమే తెలియడంతో.. పూర్తి వివరాలను కనుక్కొనేందుకు యత్నిస్తున్నారు.
మక్సూద్‌కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులూ లేవని.. వారి కుటుంబమంతా కలిసి రోజుకు రూ. 4 వేలు సంపాదిస్తోందని యజమాని తెలిపారని ఆంధ్రజ్యోతి రాసింది.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మనీషా కోయిరాలా ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ భర్త ఎలా సమాధానం ఇచ్చారు?
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























