కరెంటు బిల్లు మొత్తం చెల్లించాల్సిందే, డీబీటీ రూపంలో సబ్సిడీ.. విద్యుత్ చట్ట సవరణకు కేంద్రం ప్రతిపాదన : ప్రెస్ రివ్యూ

ప్రచురణ

దేశంలో గృహ విద్యుత్‌ వినియోగదారులకు గడ్డురోజులు రానున్నాయా.. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం -2020 ముసాయిదా బిల్లును పరిశీలిస్తే.. ఈ అనుమానం నిజమేననిపిస్తోందంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

కేంద్ర ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టం-2020 ప్రకారం గృహ వినియోగదారులు తాము వినియోగించే ప్రతి యూనిట్‌కు పూర్తిస్థాయి బిల్లును చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం దయతలిస్తే తప్ప వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుపై సబ్సిడీ లభించే అవకాశం లేదు.

తెలంగాణలో ప్రస్తుతమున్న 97.6 లక్షలమంది గృహ వినియోగదారులు తాము వినియోగించే యూనిట్ల ప్రకారం నిర్దేశించిన శ్లాబ్‌ ఆధారంగా లభించే సబ్సిడీని పొందుతూ బిల్లులు చెల్లిస్తున్నారు.

రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తున్న వారందరూ సబ్సిడీని పొందుతున్నారు. కానీ కేంద్రం రూపొందించిన బిల్లు అమలులోకి వస్తే ఆ సబ్సిడీలు రద్దయిపోతాయి.

విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు, సరఫరా నష్టాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులన్నీ కలుపుకొని అయ్యే మొత్తం వ్యయం ఆధారంగా యూనిట్‌ ధరను నిర్ణయిస్తారు. దీంతో ఇప్పటివరకూ సబ్సిడీని పొందుతున్న వారందరూ భారీ మొత్తంలో బిల్లుల భారాన్ని మోయాల్సి వస్తుంది.

కేంద్రం ప్రతిపాదించిన బిల్లులోని నిబంధనల ప్రకారం.. ప్రతి వినియోగదారుడు ముందుగా తాను వినియోగించిన విద్యుత్‌ మొత్తానికి బిల్లు చెల్లించాలి. ఆ తరువాత అతడు ప్రభుత్వంఇచ్చే సబ్సిడీకి అర్హుడైతే.. ఆ మొత్తాన్ని డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) రూపంలో అతని బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తారు.

ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి వ్యయానికి, గృహ వినియోగదారులు చెల్లిస్తున్న యూనిట్‌ ధరకు మధ్య చాలా తేడా ఉంది. ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొంత, క్రాస్‌ సబ్సిడీతో మరికొంత భర్తీ చేస్తున్నారు. తాజా బిల్లు ప్రకారం క్రాస్‌ సబ్సిడీ మొత్తాన్ని రద్దుచేయనున్నారు.

కొత్త విధానంలో ప్రభుత్వం ఏమేరకు సబ్సిడీ వస్తుందో తెలియని పరిస్థితి. మొత్తంగా కేంద్ర ప్రాతిపాదిత బిల్లు గృహ వినియోగదారులకు పిడుగుపాటుగా పరిణమించనుంది. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం పడనుందని నమస్తే తెలంగాణ ఈ కథనంలో పేర్కొంది.

కరోనా నియంత్రణలో ఏపీ బాగుందన్న కేంద్ర బృందం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని, టెస్టుల్లో అత్యుత్తమ మార్గాలను అనుసరిస్తున్నారని కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్టు సాక్షి దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరిశీలన కోసం కేంద్ర బృందం శుక్రవారం విజయవాడ వచ్చింది.

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ హైజీన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌(ఏఐఐహెచ్‌&పీహెచ్‌), కోల్‌కతాకు చెందిన డా.మధుమితా దూబే, డా.సంజయ్‌ సాధూఖాన్‌ బృందం కర్నూలులో పర్యటించనుండగా డా.బాబీపాల్, డా.నందినీ భట్టాచార్య బృందం గుంటూరును పరిశీలించనుంది.

వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.జవహర్‌రెడ్డితో కేంద్ర బృందం సుమారు 45 నిముషాల పాటు సమావేశమైంది. అనంతరం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కరనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

రకరకాల యాప్‌లతో రాష్ట్రంలో చేపట్టిన చర్యలు చాలా బాగున్నాయని, ఇన్ని రకాల యాప్‌లు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా చూడలేదని కేంద్ర బృందం పేర్కొంది. అత్యధిక సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు చేస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, ఐటీ సేవలు కూడా రాష్ట్రంలో చాలా బాగున్నాయని కేంద్ర బృందం అభిప్రాయపడింది.

సాధారణంగా లక్షణాలున్న వారికే టెస్టులు చేయలేని పరిస్థితుల్లో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ ఉందని గుర్తించడం గొప్ప విషయమని కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నట్టు సాక్షి పత్రిక ఈ కథనంలో తెలిపింది.

పరీక్షపై ప్రశ్నలెన్నో

రాష్ట్రంలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను పెద్ద సంఖ్యలో ఎందుకు చేయడం లేదు? అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించినట్టు ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

“కరోనా లక్షణాలున్న వారికి మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పత్రికల్లో చూశాం. అదే నిజమైతే.. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి కచ్చితమైన గణాంకాలు వెలుగుచూసే అవకాశం ఉండదు. ఇది.. ప్రభుత్వం లెక్కలతో గారడీ చేసి ప్రజల్ని వెర్రివాళ్లను చేయడమే అవుతుంది’’ అని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

‘‘మీరు ప్రాథమిక అనుమానితులకు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, క్వారంటైన్‌ చేయాల్సిందే’’ అని స్పష్టం చేసింది. వాస్తవ లెక్కలు చూపకుండా.. వాస్తవాలు గ్రహించకుండా మనల్ని మనం మోసం చేసుకుంటే ఫలితాలు వేరుగా ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది.

కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశరరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

కరోనా లక్షణాలతో చనిపోయిన వ్యక్తుల రక్త నమూనాలు సేకరించి.. కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయడం లేదని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసిన ధర్మాసనం.. అప్పటికి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఏజీని ఆదేశించింది.

కండక్టర్లు లేకుండానే రైట్ రైట్

కరోనావైరస్ ప్రభావం నేపథ్యంలో ఇకపై కొంత కాలంపాటు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు కనిపించరంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసి బస్సుల్లో ప్రయాణీకులు ఆన్ లైన్లో కానీ, కరెంట్ రిజర్వేషన్ ద్వారా గానీ, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొనుక్కొని బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ కార్యాచరణ సిద్ధం చేసింది.

ఈ నెల 17తో లాక్ డౌన్ ముగిసిన తర్వాత ప్రజా రవాణాకు అవకాశమిస్తామని ఇటీవల కేంద్రం సూచన ప్రాయంగా పేర్కొనడంతో ఆర్టీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.

ప్రయాణీకుల మధ్య తిరుగుతూ టిక్కెట్లు ఇవ్వడం వల్ల కరోనావ్యాప్తికి అవకాశం ఉంటుందని, దీని ప్రభావం పూర్తిగా తగ్గే వరకు నగదు రహిత లావాదేవీలే చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని డిపోలకు మార్గదర్శకాలను జారీ చేశారు.

సిటీ బస్సుల్లో కూడా కండక్టర్లు లేకుండా కొన్ని స్టాపుల్లో టిక్కెట్లు కొని ప్రయాణీకులు బస్సు ఎక్కాల్సి ఉంటుంది. అయితే రద్దీ ఎక్కువగా ఉండే సిటీ బస్సుల్లో 2 ద్వారాలకు బదులు ఒకే ద్వారం గుండా ప్రయాణీకులు ఎక్కి దిగడం కష్టమనే అభిప్రాయం ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉందని చెబుతున్నట్టు ఈనాడు ఈ కథనంలో వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)