ఎస్ఎస్ రాజమౌళి: #ఆర్ఆర్ఆర్ షూటింగ్ రీషెడ్యూల్ చేస్తున్నాం: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FACEBOOK.COM/SSRAJAMOULI
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రౌద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కి సంబంధించి పని మొత్తాన్ని రీషెడ్యూల్ చేసుకుంటున్నట్టు తెలిపారని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం దర్శకుడు రాజమౌళి ఎలా సిద్ధమవుతున్నారు? ఈ ప్రశ్నకు ఆయనే జవాబిచ్చారు.
‘కరోనా వేళలో చలనచిత్రాల రూపకల్పన’ అనే అంశంపై కామ్ స్కోర్, వెబ్ పోర్టల్ ఫిల్మ్ కంపానియన్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
‘‘ఆర్‌ఆర్‌ఆర్’లో మిగిలిన భాగం షూటింగ్ కోసం రకరకాల కసరత్తులు చేస్తున్నాం. పని మొత్తాన్నీ రీషెడ్యూల్ చేసుకుంటున్నాం. మిగిలిన సన్నివేశాల్లో వేటికి ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరం అవుతారు? వేటికి భారీ సెట్లు అవసరమవుతాయి? వీలైనంత తక్కువ మందితో ఎలా చిత్రీకరించవచ్చు?... ఇలాంటివన్నీ బేరీజు వేసుకుంటూ, రీషెడ్యూల్ చేస్తున్నాం.
ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్లు, సినీనటులు కొందరు విదేశాల నుంచి రావాల్సి ఉంది. సెట్లు వేయడానికి వివిధ రాష్ట్రాలవారు హైదరాబాద్‌కు రావాలి. అయితే, రాష్ట్రాల మధ్య రవాణా వసతులు లేకపోవడం వల్ల ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు.
కాబట్టి, వీలైనంత మంది స్థానిక ప్రతిభావంతులతో ఆ పనులు చేయించడానికి ఎలా వీలవుతుందో చూస్తున్నాం. ఎక్కడెక్కడో ఉండిపోయిన మా వాళ్ళందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం.
షూటింగ్ మొదలుకాగానే విదేశీ నటులతో కూడిన చిత్రీకరణను వాయిదా వేసి, మొదట స్థానికులతో, స్థానికంగా చేయగలిగిన చిత్రీకరణ చేస్తాం’’ అని రాజమౌళి వివరించారని ఆంధ్రజ్యోతి ఈ వార్తలో తెలిపింది.

ఫొటో సోర్స్, hc.ap.nic.in
బీటెక్ ఫీజుల జీవో నిలిపివేత
ప్రైవేట్ అన్-ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ కోర్సులకు 2019-20 విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులను నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 15ను సోమవారం వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ చైర్మన్‌లను ఆదేశించింది.
తదుపరి విచారణను వచ్చే సోమవారాని (11వ తేదీ)కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
2019-20 విద్యా సంవత్సరం బీటెక్ కోర్సులకు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) 281 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వాటిని ఆమోదిస్తూ ఉన్నత విద్యా శాఖ జీవో 15ను విడుదల చేసిందని ఈనాడు ఈ కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
భయం భయంగానే...
లాక్‌డౌన్ ఆంక్షలు కొన్ని తొలగిపోయాయి. మళ్లీ యథావిధిగా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. రోడ్లపైకి వచ్చే ప్రజల సంఖ్య కూడా గత రెండు రోజుల్లో పెరిగిందంటూ తెలంగాణలోని తాజా పరిస్థితిని సాక్షి దినపత్రిక వివరించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్ డౌన్ నిబంధనల సడలింపు కొంత ఊరట కలిగించింది కానీ.. కరోనా భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈనెల 29 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని రాష్ట్రం ప్రకటించడంతో అప్పటివరకు జాగ్రత్తలు కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఇప్పటికీ మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటిస్తూనే ఉన్నారు. భయం భయంగానే బయటకు వెళ్లి వస్తున్నారు.
రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలు బాగానే అమలవుతున్నాయి. ముఖ్యంగా దుకాణాలు సరి, బేసి పద్ధతిలో తెరుస్తున్నారు. పురపాలిక అధికారులు మర్చంట్ అసోసియేషన్లు, భవన నిర్మాణ కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలు వివరిస్తున్నారు.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో 45 రోజుల తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు ఎప్పటి నుంచో పనిలో ఉన్నా మిగిలిన కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.
గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా నెమ్మదిగా ఊపందుకుంటోంది. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్దగా రద్దీ కనిపించకపోయినా పరిమిత సంఖ్యలో ప్రజలు వస్తున్నారని సాక్షి ఈ కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
20 కోట్ల మంది ఎదురు చూపులు
లాక్ డౌన్ కారణంగా నిరు పేదలను, వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదంటూ నవ తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న వారికి సాధారణంగా ఇచ్చే నిత్యావసరాలతో పాటు ఐదు కిలోల ధాన్యం (బియ్యం లేదా గోధుమలు) 20 కోట్లమందికి అందలేదు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 80 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఏప్రిల్ నెలలో 20 కోట్ల మందికి ఇంకా అందలేదని స్వయంగా ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం 80.3 కోట్ల మంది లబ్దిదారులకుగాను 60.3 కోట్ల మందికి మాత్రమే అదనపు సాయం అందించారు. ఈ పథకం సరిగ్గా అమలై ఉంటే 40.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంపిణీ కావాల్సి ఉంది. కానీ ఏప్రిల్ నెలలో కేవలం 30.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పంపిణీ చేశారు. అంటే ఇంకా 25 శాతం మందికి ప్రభుత్వ సాయం అందలేదన్నమాట.
ఈ విషయంలో దిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ రెండు రాష్ట్రాలు వారి జనాభాలో కేవలం 1శాతం మందికి మాత్రమే పంపిణీ చేశాయని నవ తెలంగాణ పత్రిక ఈ కథనంలో తెలిపింది.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: భయం, అభద్రతల మధ్య ఓ ఆశావర్కర్ జీవితం
- కరోనావైరస్ లాక్డౌన్తో భారత్లో ఒక్కనెలలోనే నిరుద్యోగులుగా మారిన 12.2 కోట్ల మంది
- కరోనావైరస్: తెలంగాణలో వలస కూలీల బతుకు బండి ఆగినా... రైలు బండి కదిలింది
- కరోనావైరస్: హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు, ‘హర హర మహాదేవ' నినాదాలు’
- ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు
- కరోనావైరస్ కేసుల డబ్లింగ్ రేటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంత... కోవిడ్ వ్యాప్తి పెరుగుతోందా, తగ్గుతోందా?
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి.. వేటిని దూరం పెట్టాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























