తెలంగాణ లాక్‌డౌన్‌లో బ్లాక్ మార్కెట్... దడ పుట్టిస్తున్న ధరలు :ప్రెస్ రివ్యూ

ప్రచురణ

లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయని నవ తెలంగాణ పత్రిక ప్రధాన వార్తను ప్రచురించింది. రాష్ట్రంలో హోల్ సేల్ వ్యాపారులు సిండికేట్‌గా మారి సరుకుల్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఈ కథనంలో వివరించారు.

ఈ కథనం ప్రకారం, తెలంగాణలో నిత్యావసరాల ధరలు సామాన్యుణ్ణి బెంబెలెత్తిస్తున్నాయి. జనవరి నెలతో పోల్చితే ఏప్రిల్ రెండో వారం నాటికి ప్రజలు నిత్యం ఉపయోగించే పప్పులు, వంట దినుసుల ధరలు 30-50 శాతం వరకు పెరిగాయి.

పెద్ద పెద్ద వ్యాపారులు సిండికేట్‌గా మారి లాక్ డౌన్ కారణంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తెరలేపి ప్రతి వస్తువును సాధారణ ధర కన్నా సుమారు 30శాతానికి పైగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు.

దీంతో హైదరాబాద్ నగరంలో హోల్ సేల్ నుంచి రిటైల్ కిరాణా దుకాణాల వరకు అన్ని చోట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ఇప్పటికే దినసరి కూలీలకు, కార్మికులకు ఎలాంటి ఆదాయమూ లేకపోవడంతో పూట గడవటం వారికి చాలా కష్టమవుతోంది. కొద్దో గొప్పో కొనుక్కోగలిగే స్తోమత ఉన్న మధ్య తరగతి ప్రజలు కూడా వెనక్కి తగ్గుతున్నారు. పప్పు దినుసుల రేట్లు అమాంతం పెరిగిపోయాయని, కార్న్ ఫ్లోర్ కిలో 70 రూపాయలైతే బ్లాక్ మార్కెట్లో 120 రూపాయలకు అమ్ముతున్నారని, కిలో చింతపండు ధర 250 రూపాయలకు పెరిగిందని ఈ కథనంలో వివరించారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రధాన హోల్ సేల్ మార్కెట్లయిన బేగంబజార్, మలక్ పేట్ మార్కెట్ వ్యాపారులు సరుకుల కొరత సృష్టిస్తున్నట్టు తెలుస్తోందని నవ తెలంగాణ ఈ వార్తలో వివరించింది.

వర్ష బీభత్సం

అసలే కరోనాతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయంటూ ఈనాడు ఓ వార్తను ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 మందిని బలిగొన్నాయి. పిడుగుపాటు కారణంగా నెల్లూరు జిల్లాలో ఏడుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు.

ఈదురుగాలులకు పడవలు ముక్కలై కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

అనేక జిల్లాల్లో కోతకు వచ్చిన పంట నీటి పాలయ్యింది. వరి, మామిడి, మొక్కజొన్న, మిర్చి ఇతర ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే కోతలు సాగక, ఉన్న పంటలు అమ్ముడుపోక అన్నదాతలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కురిసిన అకాల వర్షాలు రైతుల్ని నిలువునా ముంచేశాయి.

గడప దాటొద్దు

తెలంగాణలో కొవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలను తీసుకుంటోందంటూ నమస్తే తెలంగాణ ఒక వార్తా కథనం ప్రచురించింది. ఆ వివరాలు ఇవి.

ఇకపై కొత్త కేసులు నమోదు కాకుండా చూడాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో 101 ప్రభావిత ప్రాంతాలను (హాట్‌స్పాట్లు) గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు.

ప్రధానంగా హైదరాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, గద్వాల, సూర్యాపేట, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో నియంత్రిత ప్రాంతాలున్నాయి.

గతంలో కరోనా కేసులు ఎక్కువగా బయటపడిన వాటితోపాటు.. విస్తరించే అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి.. అక్కడ అన్ని రకాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నియంత్రిత ప్రాంతాలను ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. వైద్య, ఆరోగ్యం, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌, రెవెన్యూ, రోడ్లు భవనాలశాఖల సమన్వయంతో అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నారు.

వీడియో నిఘాతో ఈ ప్రాంతాలను రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. నియంత్రిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు వంటి వాటిని ప్రభుత్వమే నిర్ణీతధరలకు అందజేస్తుంది.

మెడికల్‌ ఎమర్జెన్సీ వంటి అత్యవసరమైన పరిస్థితుల్లో సహాయంకోసం ఈ ప్రాంతాల ప్రజలకు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఇస్తారు.

ఆ నంబర్‌కు ఫోన్‌చేసినట్లయితే ప్రభుత్వమే వారికి తక్షణ సహాయాన్ని అందిస్తుంది. నియంత్రిత ప్రాంతాల్లో రోజూ రసాయనాలను పిచికారీ చేయడంతోపాటు, వైద్యబృందాలు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తాయి.

క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించినట్టు నమస్తే తెలంగాణ ఈవార్తలో తెలిపింది.

ఐపీఎల్ నష్టం రూ.3,800కోట్లు

ఐపీఎల్‌ రద్దయితే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీగానే మూల్యం చెల్లించుకోనుందంటూ సాక్షి దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

ఐపీఎల్‌–2020 సీజన్‌ జరగకపోతే బోర్డుకు భారీ నష్టం రానుంది . కోవిడ్‌–19 నుంచి రక్షణ పొందే కవరేజి లేకపోవడంతో సాధారణ బీమా వర్తించదు.

దీంతో ఈ ఏడాది లీగ్‌ రద్దయితే సుమారు రూ. 3800 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఓ నివేదిక తెలిపింది. ఇందులో సింహభాగం నష్టం బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌కే వస్తుంది.

ఏకంగా రూ. 3200 కోట్ల రూపాయలు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌కు వాటిల్లుతుంది. అయితే లీగ్‌ జరగలేదు కాబట్టి ప్రసారహక్కుల కోసం తాము చెల్లించాల్సిన భారీ మొత్తంనుంచి భారీ మినహాయింపు ఇవ్వాలని స్టార్‌ కచ్చితంగా బోర్డును కోరుతుంది. ఇరు పక్షాల ఒప్పందంలో ఇలాంటి నిబంధన ఉంటుందని క్రికెట్‌ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఇక మిగతా రూ. 600 కోట్లు స్టేక్‌హోల్డర్లకు వస్తుందని నివేదిక వెల్లడించింది. అంటే బోర్డుతో పాటు, ఫ్రాంచైజీలు, ఆతిథ్య వేదికల రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు, లాజిస్టిక్స్, హోటల్స్, స్థానిక సంస్థలు, అలాగే పన్ను రూపేణా ఆయా ప్రభుత్వాలకు ఈ నష్టం ఎదురవుతుంది.

ఇప్పటి వరకైతే ఈ సీజన్‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసిన బీసీసీఐ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)