ఎస్‌బీఐ: సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వరంగంలోని అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బుధవారం నాడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.
వివిధ కాలపరిమితులు కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేటు, నిధుల వ్యయ ఆధారిత వడ్డీ రేట్ల (ఎంసీఎల్‌ఆర్)ను ఎస్‌బీఐ తగ్గించింది.
సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపైనా వడ్డీ రేటును హేతుబద్ధీకరించింది. ఈ మేరకు వార్షిక వడ్డీ రేటును సమాన స్థాయిలో 3 శాతానికి తగ్గించింది.
దీని వల్ల సుమారు 44.51కోట్ల మంది ఖాతాదారుల వడ్డీ ఆదాయంపై ప్రభావం పడనుంది. అదే సమయంలో సేవింగ్స్ ఖాతాల్లో ఉంచాల్సిన కనీస నిల్వ నిబంధనను ఎత్తివేయడమేకాకుండా, ఎస్‌ఎంఎస్‌లపై త్రైమాసిక చార్జీలను తొలగించింది.
ఫలితంగా 44.51 కోట్ల మంది ఖాతాదారులకు ఉపశమనం కలగనుంది. 'కస్టమర్ ఫస్ట్' విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు బ్యాంకు తెలిపింది.
2017 ఏప్రిల్ నుంచి కనీస నిల్వ చార్జీలను వసూలు చెయ్యడం ప్రారంభించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బిఐ సుమారు 2400 కోట్ల రూపాయలకుపైగా కనీస నిల్వల పెనాల్టీ కింద వసూలు చేసింది.
ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం వల్ల గృహ, వాహన, ఆటో తదితర రుణాలు మరింత చవకగా లభించనున్నాయి.
కనీస నిల్వ అవసరాన్ని తొలగించడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి ఈ కథనంలో వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ ఉండదు :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున తలపెట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేయాల్సిందేనని ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ స్పష్టం చేసినట్టు ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.
వ్యక్తిగత లబ్ది పరిధిలోకి ఈ అంశం వస్తున్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొంది.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతి కోరుతూ ఎలాంటి లేఖ రాలేదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపింది.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించుకోవచ్చని దైనందిన కార్యక్రమాల కొనసాగింపు సర్కారు బాధ్యత అని ఆయన చెప్పినట్టు ఈనాడు ఈ కథనంలో వివరించింది.

విశాఖ, నెల్లూరు జిల్లాల్లో కరోనా కలకలం -కోవిడ్ కి ఆరోగ్య శ్రీ
విశాఖ జిల్లా అనకాపల్లి అలాగే నెల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం రెండు జిల్లాల్లోనూ కలకలం రేపిందని సాక్షి ఓ కథనాన్న ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అనకాపల్లికి చెందిన కృష్ణ భరద్వాజ్ అనే యువకుడు ఇటలీలో చదువుకుంటూ అనకాపల్లికి వచ్చాడు. అతనిలో కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయేమో అన్న అనుమానంతో ఆయన్ను విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించారు.
అలాగే ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లి నెల్లూరుకు వచ్చిన ఓ యువకుకి కూడా కోవిడ్ -19 సోకిందేమోనన్న అనుమానంతో అతణ్ణి, అతని తల్లిదండ్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరోవైపు కోవిడ్-19కి కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎవరైనా కోవిడ్-19 లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరితే వారికి ఆరోగ్య శ్రీ ప్రత్యేక వార్డుల్లో ఉచితంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనావైరస్ అనుమానిత కేసులకు చికిత్స అందించినందుకు అదనంగా పదివేలు అలాగే పాజిటివ్ కేసులకు 20 వేల రూపాయలు అదనంగా ఇస్తామని ఆరోగ్య శ్రీ సీఈఓ తెలిపారని సాక్షి ఈ కథనంలో చెప్పుకొచ్చింది.

ఫొటో సోర్స్, facebook.com/bandisanjaykumar
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సారథిగా ఎంపీ బండి సంజయ్‌ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందని సాక్షి పత్రిక తెలంగాణ ఎడిషన్‌లో పేర్కొంది.
హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో, టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడంలో ముందుండటంతో జాతీయ నాయకత్వం సంజయ్ వైపు మొగ్గు చూపిందని ఈ వార్తలో తెలిపింది.
ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న అనుబంధం, పార్టీ ఆదేశాలను కచ్చితంగా తప్పకుండా పని చేసే నేతగా, పక్కా హిందూత్వవాదిగా ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చిందని పేర్కొంది.
సంజయ్‌కి యువతలో మంచి గుర్తింపు ఉందని. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పింది.
రెండోసారి ఎలాగైనా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు లక్ష్మణ్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పుకొచ్చింది.
మరోవైపు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఈ పదవికి పోటీ పడ్డారు. అయినప్పటికీ సంజయ్ వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపిందని సాక్షి ఈ కథనంలో వివరించింది.
ఇవి కూడా చదవండి
- డబ్ల్యూహెచ్ఓ: కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారి.. ఏప్రిల్ 15 వరకు వీసాలు సస్పెండ్ చేసిన భారత్.. ఆ దేశాల నుంచి వచ్చేవారంతా 14 రోజులు నిర్బంధంలోనే
- జ్యోతిరాదిత్య సింధియా: నేను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో ఎందుకు చేరానంటే...
- ఏపీలో ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు: వేయడానికి ఎంత ఖర్చు? ఇప్పుడు మార్చటానికి అయ్యే వ్యయం ఎంత?
- టీడీపీ నేతల కార్లపై మాచర్లలో దాడి: ఇది వైసీపీ అరాచకం అంటున్న బుద్ధా వెంకన్న; వారే రెచ్చగొట్టారంటున్న వైసీపీ
- వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగింత
- అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో హార్వే వైన్‌స్టీన్‌కు 23 ఏళ్ల జైలు శిక్ష
- హ్యాండ్‌షేక్ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























