మోదీని కలిసిన జగన్... మూడు రాజధానులు, ప్రత్యేక హోదా అంశాలపై చర్చ :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, ysrcpofficial/facebook
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమివ్వండంటూ ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారన్న వార్తను సాక్షి ప్రధాన వార్తగా ప్రచురించింది.
సుమారు గంట నలబై నిమిషాల పాటు జరిగిన సమావేశంలో మూడు రాజధానుల ఆవశ్యకత, సవరించిన పోలవరం అంచనాలను ఆమోదించడం, ఇళ్ల పట్టాల పంపిణీకి ఆహ్వానం, హైకోర్టు కర్నూలుకు తరలించేందుకు తగిన ఆదేశాలివ్వడం, రామాయం పట్నం పోర్టుకు నిధులు విడుదల చేయడం, కృష్ణా-గోదావరి నదీ జలాల అనుసంధానానికి సహకరించడం, ప్రత్యేక హోదా తదితర అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించారని ఆ వార్తలో పేర్కొంది.


మార్చి 25 ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి రావాలని మోదీని ఆహ్వానించినట్టు కూడా తెలిపింది. అలాగే దిశ చట్టం 2019ని ఆమోదించడంతో పాటు రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించడం తదితర అంశాలను విన్నవిస్తూ ఓ లేఖను కూడా అందజేశారన్నది ఈ వార్త సారాంశం.

ఫొటో సోర్స్, TS HIGH COURT
సచివాలయ భవనాలను కూల్చవద్దు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తాము తిరిగి ఉత్తర్వులిచ్చేంత వరకు తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చొద్దంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిదంటూ నవతెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.సచివాలయ భవనాలను కూల్చి కొత్తగా కట్టేందుకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరయ్య, ఇతరులు వేసిన పిల్స్‌ను బెంచ్ విచారించినట్లు తెలిపింది.
అయితే, ఇవన్నీ రాజకీయంగా వేసినవంటూ ప్రభుత్వం తరపు అడిషినల్ ఏజీ రామచంద్రరావు వాదించగా.. క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం వల్లే పిటిషనర్లు తమను ఆశ్రయించారని బెంచ్ గుర్తు చేసినట్టు పేర్కొంది.
అయితే డిజైన్ల వ్యవహారాంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ బెంచ్‌కు చెప్పారని, అయినా తాము ఆదేశిలిచ్చేంత వరకు భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చొద్దని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పినట్టు ఈ వార్తలో చెప్పుకొచ్చింది.

ఎక్కడనుంచైనా ఓటు...
దేశంలో ఎక్కడ ఉన్నా స్వస్థలంలో ఓటు వేసేందుకు ఓటరుకు వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోడా తెలిపారని ఈనాడు ఒక వార్తను ప్రచురించింది.
ఐఐటీ మద్రాస్ సహకారంతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆ వార్తలో తెలిపింది. ఈ విధానం అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి దిల్లీలో ఉంటున్నా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు.
అలాగని ఇంట్లో కూర్చొని వేయడం కాదు, కచ్చితంగా పోలింగ్ బూత్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా చట్టంలో కూడా మార్పులు అవసరమని ఈసీ తెలిపారన్నది ఈ వార్త సారాంశం.

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన గ్యాస్ మంట
వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని, సిలెండర్‌పై 148 రూపాయల్ని పెంచినట్టు ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది. అయితే అదే సమయంలో రాయతీని 118 రూపాయలకు పెంచడంతో వినియోగదారులపై ప్రస్తుతం అదనంగా 30 రూపాయల భారం పడనుందని ఆ వార్తలో తెలిపింది.
హైదరాబాద్‌లో అన్ని పన్నులతో కలిపి సబ్సిడీయేతర సిలెండర్ ధర 769 నుంచి 917.50 రూపాయలు చేరిందని పేర్కొంది. గడిచిన కొద్ది నెలల్లో కేంద్రం గ్యాస్ ధరలను పెంచడం ఇది ఆరోసారి.
నిజానికి ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ కంపెనీలు ధరలను సమీక్షిస్తూ అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సిలెండర్ ధరను నిర్ణయిస్తాయి. అయితే తాజా పెంపును ప్రతిపక్షాలు విమస్తున్నాయి.
అదే సమయంలో ఏడాదికి 12 లోపు సబ్సిడీ సిలెండర్లు వాడే వారికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, మోదీ పిలుపు మేరకు సబ్సిడీ వదులుకున్న వారికి మాత్రం పెరుగుతున్న ధరలు బెంబెలేత్తిస్తున్నాయని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి.
- అకాడమీ అవార్డుకు 'ఆస్కార్ అవార్డు' పేరు ఎలా వచ్చింది?
- అండర్-19 వరల్డ్ చాంపియన్ బంగ్లాదేశ్... పైనల్లో భారత్‌పై విజయం
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- పోర్న్ సైట్లో తనను రేప్ చేసిన వీడియో తొలగించాలని బాధితురాలి పోరాటం
- కరోనావైరస్.. సార్స్ వైరస్‌ని మించిపోతోందా
- కశ్మీర్ జర్నలిస్టులు రోజు కూలీకి వెళ్తున్నారు... ఎందుకో తెలుసా?
- ‘స్మోకింగ్ మానేస్తే, ఊపిరితిత్తులు వాటికవే బాగవుతాయి..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























