వైఎస్ జగన్: ‘సీఎం అయినా కోర్టుకు హాజరు కావాల్సిందే.. మినహాయింపు కుదరదు’ - సీబీఐ ప్రత్యేక కోర్టు : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
''రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా సరే.. నిందితుడుగా ఉన్న కేసుల్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే'' అని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చేసిందని.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనకు బదులుగా న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టి వేసిందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు శుక్రవారం ఈ తీర్పు చెప్పారు. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని స్పష్టం చేశారు.
''కేవలం హోదా కారణంగా హాజరు నుంచి మినహాయింపు కోరడం సరికాదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. జగన్‌పై తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. హాజరునకు మినహాయింపు ఇవ్వడమంటే సాక్షులను భయబ్రాంతులకు గురిచేయడమే. ఆయన పిటిషన్‌ను కొట్టివేయండి'' అంటూ సీబీఐ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.
సీఎం ఒక్కసారి కోర్టుకు రావాలంటే రూ. 60 లక్షలు ఖర్చవుతుందని, రెండు రోజుల సమయం వృథా అవుతుందని జగన్ తరఫు న్యాయవాది చేసిన వాదనను సీబీఐ తరఫు న్యాయవాది ఖండించారు. ''ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపిస్తూ తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరడం వాస్తవాల నుంచి న్యాయస్థానం దృష్టిని మళ్లించడమే'' అని వాదించారు.
ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే గతంలో ఇదే తరహా పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. జగన్ దాఖలు చేయబోయే పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఫొటో సోర్స్, APSRTC/Facebook
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విలీనానికి పాలకమండలి సమ్మతం
ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటానికి ఆ సంస్థ పాలకమండలి సమ్మతం తెలిపిందని.. ఈ విషయంలో తమకు అభ్యంతరం లేదని తీర్మానించిందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకోవటానికీ ఆర్టీసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. శుక్రవారం విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో 27 అంశాలపై చర్చించి ఆమోదం ప్రకటించింది.
ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉండటంతో.. బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులకు విలీనం అంశాన్ని వివరించారు. ఆర్టీసీ సంస్థను, ఆస్తులను కాకుండా.. కార్మికులు, ఉద్యోగులను మాత్రమే విలీనం చేస్తుండటంతో దీనికి వారు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయలేదని.. ఇది మంచి నిర్ణయమేనని ఆ ప్రతినిధులు అభిప్రాయపడినట్లు తెలిసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES/BBC
జడ్జీలనే మోసం చేస్తారా?: తెలంగాణ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీపై హైకోర్టు నిప్పులు
'ఆర్టీసీ బకాయిల విషయంలో రవాణా మంత్రికి ఒకలా, కోర్టుకు మరోలా లెక్కలు చెబుతారా? ఇలా చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఐఏఎస్ అధికారులు తెలిసే, కావాలనే, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, మోసం చేస్తారని ఊహించనేలేదు'' అంటూ తెలంగాణ హైకోర్టు మండిపడినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ''టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ. 1,492 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మంత్రికి చెప్పామని సాక్షాత్తూ మాకు చెబుతున్నారు. బకాయిలు ఏమీ లేవని అఫిడవిట్‌లో పూర్తి భిన్నంగా చెబుతున్నారు. మంత్రిని మోసం చేస్తున్నారా? లేక జడ్జీలకే తప్పుడు సమాచారం ఇస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు?’’ అని ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ సునీల్ శర్మను హైకోర్టు ప్రశ్నించింది.
‘‘ఐఏఎస్‌లు నిజాయితీగా వాస్తవాలతో కౌంటర్ వేస్తారని ఆశించాం. మా నమ్మకాన్ని దెబ్బతీశారు. మోసపూరిత వైఖరి ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇది ఏమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదు. ఇక నటనకు తెరదించండి. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే పర్యావసానాలు, కోర్టు ధిక్కార పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు'' అంటూ హెచ్చరించింది.
ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కిక్కిరిసిన కోర్టు హాల్లో విచారణ జరిపింది.
ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలు చెల్లించాల్సినవి లేవనే అంశంపై లోతుగా విచారణ జరిపింది.
జీవో 229 ద్వారా రూ. 35 కోట్లను గతేడాది మే 3న ఇచ్చిన నగదు బస్సులను కొనుగోలు చేసేందుకైతే వాటిని బకాయిల చెల్లింపులుగా ఎలా చూపుతారని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే జూన్ 6న జారీ చేసిన జీవో 227 కింద ఇచ్చిన మొత్తం రుణం కోసమైతే దానినీ బకాయిల చెల్లింపులుగా చెప్పడాన్ని తప్పుపట్టింది.
ఈడీల కమిటీ నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ. 47 కోట్లు అవసరమని చెబితే ఆ మొత్తం ఇవ్వలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం.. ఆర్టీసీ బకాయిలన్నీ చెల్లించడమే కాకుండా రూ. 622 కోట్లను ఎక్కువగా ఇచ్చినట్లు వీక్ అఫిడవిట్ దాఖలు (ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు) చేసిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 112 (30) ప్రకారం తాము ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదంటున్న కార్పొరేషన్ అదే సెక్షన్ ప్రకారం 2015-16లో రూ. 108 కోట్లు, ఆ తర్వాత ఏడాది రూ. 228 కోట్లను ఆర్టీసీకి బకాయిలుగా ఎలా చెల్లించిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీకి దానం చేసిందా లేక దాతృత్వాన్ని ప్రదర్శించిందా అని ఎద్దేవా చేసింది.
ఈ అంశాలపై పూర్తి వివరాలు సమర్పించేందుకు 10 రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరగా హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, KTR/Facebook
టీఎస్ఐపాస్‌తో 12 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి: కేటీఆర్
రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 12 లక్షలమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. రాష్ట్రంలో పర్యావరణహితంగా పారిశ్రామీకరణ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. 435 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రెండువేల ఎకరాలకు విస్తరిస్తామని ప్రకటించారు.
శుక్రవారం యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌లో టీఎస్‌ఐఐసీ- టీఐఎఫ్- ఎమ్మెస్‌ఎంఈ- గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌గా సాగిందని, ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తూనే నూతన పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతున్నామని చెప్పారు.
దేశమే అబ్బురపడే విధంగా టీఎస్‌ఐపాస్‌ను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణ ఈరోజు అమలుచేసింది రేపు దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆచరిస్తున్నాయని అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల పరిశ్రమలశాఖల మంత్రుల సమావేశంలో తాను టీఎస్‌ఐపాస్ గురించి వివరించినప్పుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు తమ రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారని పేర్కొన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని కొందరు, తెలంగాణ నుంచి సహకారం అందించాలని మరికొందరు కోరారని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- చైనాలోని గాజు వంతెనలను ఎందుకు మూసేస్తున్నారు
- ఐఎస్ చీఫ్ బగ్దాదీ అండర్‌వేర్‌ను ఆ గూఢచారి ఎందుకు దొంగిలించారు?
- వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- వాట్సాప్ మెసేజ్‌ల మీద నిఘా పెట్టాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది?
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం.. ఏటీఎంల గురించి వారికి తెలియదు
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























