పోలవరం డ్యాం, విద్యుత్ కేంద్రం పనులకు ఒక్క మేఘా సంస్థ మాత్రమే టెండరు దాఖలు- ప్రెస్ రివ్యూ

పోలవరం
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రదాన డ్యాం, జలవిద్యుత్ కేంద్రం పనులకు కలిపి జలవనరులశాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు ఒకే ఒక్క గుత్తేదారు ఏజెన్సీ స్పందించిందని ఈనాడు తెలిపింది.

ప్రీబిడ్ సమావేశానికి దాదాపు ఎనిమిది సంస్థలు హాజరై సందేహాలు నివృత్తి చేసుకున్నా, గడువు ముగిసే నాటికి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఒక్కటే బిడ్ వేసింది. దీంతో సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైనట్లయింది.

పోలవరం ప్రధాన జలాశయం వద్ద మిగిలి ఉన్న పనులకు రూ.1,771.44 కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులకు రూ.3,216.11 కోట్ల అంచనా విలువతో జలవనరులశాఖ టెండర్లు ఆహ్వానించింది.

గతంలో ఈ రెండు పనులను నవయుగ సంస్థ వేర్వేరుగా చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ నివేదిక మేరకు- నవయుగతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. రివర్స్ టెండర్ల ప్రక్రియలో భాగంగా ఈ రెండు పనులకూ కలిపి ఇటీవల బిడ్లు ఆహ్వానించింది.

టెండరు దాఖలుకు సంబంధించిన అసలు డాక్యుమెంట్లు, బ్యాంకు గ్యారంటీ పత్రాలను గుత్తేదారు సంస్థలు పోలవరం ప్రాజెక్టు అధికారులకు సమర్పించేందుకు ఈ నెల 21 శనివారం సాయంత్రం ఐదు గంటలతో గడువు ముగిసింది. గడువులోపు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ మాత్రమే వీటిని సమర్పించింది. ఈ విషయాన్ని జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ధ్రువీకరించారు.

ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఈ నెల 23 సోమవారం ఆర్థిక బిడ్ తెరవాలి. రివర్స్ టెండర్లు నిర్వహించాలి.

ల్యాండర్ విక్రమ్

ఫొటో సోర్స్, ISRO

ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించలేకపోయాం: ఇస్రో

చంద్రయాన్‌-2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని, చంద్రయాన్‌-2లో అమర్చిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు మాత్రం పునరుద్ధరించలేకపోయామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో )చైర్మన్‌ శివన్‌ చెప్పారని సాక్షి తెలిపింది.

ల్యాండర్‌కు ఏం జరిగిందో తెలుసుకునేందుకు విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీ విశ్లేషణ చేస్తోందని శివన్ తెలిపారు. ఇప్పటివరకు ల్యాండర్‌ నుంచి తమకు ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదని, ఒకవేళ ఏదైనా సమాచారం అందితే దానికి తగినట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌ మాత్రం చాలా బాగా పని చేస్తోందని వివరించారు.

ప్రస్తుతం తమ దృష్టి అంతా 2020లో చంద్రుడిపైకి చేపట్టనున్న మరో మిషన్‌ మీదే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇంకా ఏదీ ఖరారు కాలేదన్నారు.

చంద్రయాన్‌-2 ఫలితం ప్రభావం గగన్‌యాన్‌ ప్రయోగంపై ఉండబోదని శివన్‌ స్పష్టం చేశారు. గగన్‌యాన్‌ ప్రయోగం దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాల సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ప్రస్తుతానికి గగన్‌యాన్‌ ప్రయోగంపై దృష్టి సారించామని తెలిపారు.

శనివారం భువనేశ్వర్‌లో మీడియా సమావేశంలో, ఐఐటీ భువనేశ్వర్‌ స్నాతకోత్సవంలో శివన్ మాట్లాడారు.

సినిమా టికెట్లను విక్రయించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే విక్రయించాలని ఆలోచిస్తున్నట్టు సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారని నమస్తే తెలంగాణ తెలిపింది.

థియేటర్ ప్రమేయం లేకుండా చలనచిత్ర అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) ద్వారా ఈ వ్యవస్థను తేవాలని సమాలోచనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ విధానంతో నిర్మాతకు, పంపిణీదారుకు లాభమన్నారు.

శనివారం హైదరాబాద్‌లో అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ- ప్రభుత్వమే నేరుగా సినిమా టికెట్లను విక్రయిస్తే అందరికీ లాభముంటుందని అభిప్రాయపడ్డారు. సినిమా చూసేవాళ్లకు బ్లాక్ మార్కెట్ దందా నుంచి విముక్తి లభిస్తుందని చెప్పారు.

టిక్ టాక్

ఫొటో సోర్స్, Getty Images

ప్రాణాల మీదకు తెచ్చిన టిక్ టాక్ మోజు

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో టిక్‌టాక్‌ మోజు ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిందని సాక్షి రాసింది.

భీమ్‌గల్‌ మండలం గోన్‌గొప్పుల్‌ గ్రామ శివారులో కప్పలవాగు పొంగిపొర్లుతోంది. చెక్‌డ్యాం నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు గ్రామానికి చెందిన ఇంద్రపురం దినేశ్‌ (22) ఇద్దరు స్నేహితులు గంగాజలం, మనోజ్‌గౌడ్‌తో కలసి శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ముగ్గురు వరద నీటిలోకి దిగి టిక్‌టాక్‌ వీడియోలు తీసుకున్నారు. అనంతరం చేపలు పట్టారు. తర్వాత ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో స్నేహితులు నీటిలో కొట్టుకుపోసాగారు.

ఒడ్డున ఉన్నవారు గమనించి చీరలను విసరడంతో మనోజ్, గంగాజలంను తీసుకొని బయటకు వచ్చాడు. వరదకు ఎదురీదుతూ వాగు మధ్యలోకి వెళ్లిన దినేశ్‌ గల్లంతయ్యాడు. అతడి కోసం అధికార యంత్రాంగం 24 గంటల నుంచి గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు.

మూడు చింపాంజీలను, నాలుగు చిన్న కోతులను అటాచ్ చేసిన ఈడీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రూ.81 లక్షల విలువైన జంతువులను అటాచ్ చేశారని, టిలో మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్లు (కుచ్చుతోక కలిగిన చిన్న కోతులు) ఉన్నాయని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఒక్కో చింపాంజీ విలువ రూ.25 లక్షలు కాగా, ఒక్కో మార్మోసెట్ విలువ రూ.1.5 లక్షలని ఈడీ అధికారులు తెలిపారు.

ఈడీ అధికారుల కథనం ప్రకారం- కోల్‌కతాకు చెందిన సుప్రదీప్ గుహ అటవీ అధికారుల ఫోర్జరీ డాక్యుమెంట్లతో జంతువుల అక్రమ రవాణా దందా నిర్వహిస్తున్నాడు.

అధికారులు మనీలాండరింగ్ కేసు కింద సుప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న జంతువులను కోల్‌కతాలోని అలీపోర్ జూకు తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)