చంద్రబాబు: అమరావతిని, నా ఇంటిని.. కావాలనే వరదల్లో ముంచేశారు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, @TDP
''వరదలు వచ్చాయని ముంబై, చెన్నై నగరాల నుంచి ఆ రాష్ట్రాల రాజధానులను తరలించేస్తారా?'' అని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముంపు సమస్య లేనేలేదని స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ముంపు'పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. 'ముంపు మాట'పై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.
కేవలం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదను నియంత్రించలేకపోవడంతో కృష్ణా నది వరదల్లో అనేక గ్రామాలు, వేలాదిగా ఇళ్లు మునిగిపోయాయని చంద్రబాబు ఆరోపించారు.
''ప్రకాశం బ్యారేజీ దిగువన లంకల్లో 53 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు రూ. 3-4 వేల కోట్ల నష్టం వాటిల్లింది. మూడు రోజుల ముందు నుంచీ వరద నీటిని కొద్దికొద్దిగా కిందకు వదిలి ఉంటే ఇలా జరిగేదికాదు. కానీ రాజధాని ప్రాంతం, నేను ఉన్న ఇల్లు మునిగిపోవాలన్న దురుద్దేశంతో కావాలనే ప్రకాశం బ్యారేజి వద్ద నీటిని బిగపట్టారు. ఇది ప్రభుత్వం సృష్టించిన ఉపద్రవం'' అని ఆరోపించారు.
పైన ఆలమట్టి నుంచి ప్రకాశం బ్యారేజికి వరద చేరుకోవడానికి నాలుగున్నర రోజులు పడుతుందని.. అంత సమయం ఉన్నప్పటికీ, ఎంత వరద వస్తోందో సమగ్ర సమాచారం తెలిసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ధ్వజమెత్తారు. ఈ వైఫల్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నేర పూరిత లేదా బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్లే వరద ముంపు చోటు చేసుకొందని, దీనిపై సమాధానం ఇవ్వాలన్నారు.
మునిగిపోయిన గ్రామాలు, పొలాలను వదిలిపెట్టి మంత్రులు తన ఇంటి చుట్టూ తిరిగారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజిలో గేట్లకు అడ్డుపడిన పడవను వెలికితీయడం కూడా చేతకాకపోవడంతో ఇప్పటికీ ఐదు వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోందని అన్నారు. కృష్ణ లంక వద్ద ఇప్పుడున్న వరద కరకట్టను మరో మూడు కి.మీ. పొడిగించాలని కోరారు.
ప్రభుత్వంలోని నేతల ఉద్దేశపూర్వక వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిపోయిందన్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో పెరిగిందని చెప్పారు. ''తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నగరం అవసరం లేదా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు.
అమరావతికి అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదన్నారు. ''అమరావతిని సవ్యంగా ఉపయోగించుకొంటే అక్కడి భూముల ధరలు పెరిగి దానికి అవసరమైన ఆదాయాన్ని అదే సమకూర్చుకొంటుంది'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, telangana.gov.in
తెలంగాణలో ఊళ్లకు ఊళ్లు మాయం.. 58 మండలాల్లో కనిపించని 460 పల్లెలు!
మనుషులు అదృశ్యం కావడం.. వస్తువులు కనిపించకుండా పోవడం గురించి విన్నాం కానీ.. తెలంగాణలో ఏకంగా ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయని.. రెవెన్యూ అధికారుల నిర్వాకంతో ఇది సాధ్యమైందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. 2021 జనగణనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న క్రమంలో 2011 సెన్సెస్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆ జాబితా ఆధారంగా గ్రామాల వారీగా జనాభా వివరాల సేకరణకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో కొన్ని గ్రామాలు కనిపించకుండా పోవడంతో కేంద్ర జనగణన శాఖ అవాక్కయ్యింది.
2011 జనాభా లెక్కల అనంతరం ఏర్పడిన 23 జిల్లాలు కలుపుకొని.. మొత్తం 14 జిల్లాల పరిధిలో 460 గ్రామాలు, 2 మున్సిపాలిటీల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర జనగణనశాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి.. సదరు గ్రామాలను డీనోటిఫై చేశారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
నిజానికి.. 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీఓ 221 నుంచి 250లను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే గల్లంతయ్యాయి. జిల్లా కేంద్రాలుగా ఏర్పడ్డ 2 మున్సిపాలిటీల పేర్లు కూడా కనిపించకుండా పోయాయి.
2021 జనాభా లెక్కల సేకరణకు సిద్ధమవుతూ.. ఆయా జిల్లాల్లోని గ్రామాల జాబితాను పరిశీలిస్తున్న క్రమంలో 58 మండలాల పరిధిలోని 460 గ్రామాలతోపాటు వనపర్తి, గద్వాల మున్సిపాలిటీల సమాచారం కూడా గల్లంతుకావడంతో జనగణన అధికారులు నివ్వెరపోయారు.
ఈ విషయాన్ని గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. ఈ గ్రామాలున్నాయా? రద్దు చేశారా? కొత్తగా 38 గ్రామాలను ఏర్పాటు చేశారు కదా.. వాటికి సంబంధించి ఉత్తర్వు కాపీలను పంపించాలని సూచించింది.
కేంద్రం లేఖతో తేరుకున్న రెవెన్యూ శాఖ.. గ్రామాల గల్లంతుపై దృష్టి సారించింది. గత జూన్‌లో సీఎస్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చించారు. కేంద్రం పంపిన జాబితాలో గల్లంతైనట్లు గుర్తించిన గ్రామాలపై మండలాలవారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 589 తహసీల్దార్లలో కేవలం 167 మంది, 142 మున్సిపాలిటీల్లో 30 మంది మాత్రమే స్పందించారు.

ఫొటో సోర్స్, irrigationap.cgg.gov.in
సమగ్ర నీటి యాజమాన్య సూచికలో ఏపీకి 2వ స్థానం
నీతిఆయోగ్ విడుదల చేసిన సమగ్ర నీటి యాజమాన్య సూచికలో ఆంధ్రప్రదేశ్ 74 మార్కులతో దేశంలో రెండో స్థానంలో నిలిచిందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. జలవనరుల సంరక్షణ, సాగు, తాగునీటి సరఫరా విషయంలో తీసుకుంటున్న చర్యల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసి నీతిఆయోగ్ మూడేళ్లుగా నివేదికలు ఇస్తోంది. తాజాగా 2018-19 నివేదికను శుక్రవారం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ విడుదల చేశారు.
ఈ జాబితాలో 75 పాయింట్లతో గుజరాత్ మొదటి స్థానంలో, 71 పాయింట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి.
రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భూగర్భజలాల రీఛార్జి ప్రాంతాల మ్యాపింగ్‌ను 100 శాతం పూర్తిచేయడంతో పాటు, రాష్ట్రంలోని 15 లక్షల బోరుబావుల్ని పూర్తిగా జియోట్యాగ్ చేసి అందులోని భూగర్భజలాల స్థాయిని ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.
సాగునీటి సామర్థ్య కల్పన, వినియోగంలో ఆంధ్రప్రదేశ్ 100 శాతం స్కోర్ సాధించింది. భారీ, మధ్యతరహా సాగునీటి సరఫరాలోనూ ఆంధ్రప్రదేశ్ 80 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
నీరు- చెట్టు కార్యక్రమం కింద 7 వేల పంటకుంటలు, 22 వేల చెక్‌డ్యాంలు మరమ్మతు చేయడంతోపాటు, కొత్తగా 102 ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చి 2.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారు.
అనంతపురం జిల్లాలో 51,825 వాననీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టడంతో 15,783 హెక్టార్లకు అదనంగా సాగునీటి సౌకర్యం లభించింది. 40 వేల మంది రైతులకు శిక్షణ ఇవ్వడం వల్ల ఈ జిల్లాలో 39,801 హెక్టార్లలో సూక్ష్మసేద్యం పెరిగింది.
కడప జిల్లాలోని పాపాగ్ని నదిపై తక్కువ ఖర్చుతో ఆరుచోట్ల సబ్ సర్ఫేస్ డ్యామ్‌లు నిర్మించింది. ఈ ప్రాజెక్టుకు 2018 నేషనల్ వాటర్ అవార్డు దక్కింది.
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాలకూ పైపుల ద్వారా నీరందుతోంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
తెలంగాణ పోలీస్ డయల్-100కు స్మార్ట్ పోలీసింగ్ అవార్డు
తెలంగాణ పోలీసులు అమలుచేస్తున్న డయల్-100ని ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డ్ వరించిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ క్యాటగిరీ కింద వచ్చిన స్మార్ట్ పోలీసింగ్ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ తరఫున అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (టెక్నికల్ సర్వీస్) రవిగుప్తా శుక్రవారం ఢిల్లీలో కేంద్ర సహాయమంత్రి జితేంద్రసింగ్ చేతులమీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డయల్-100 అధికారులను, సాంకేతిక బృందానికి, పెట్రోలింగ్ కార్ప్స్, బ్లూకోల్ట్స్ అధికారులను అభినందించారు.
అత్యవసర సమయంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. దేశ ప్రజల రక్షణ, భద్రత విషయంలో పలు రాష్ట్రాలు అమలుచేస్తున్న స్మార్ట్ పోలీసింగ్ విధానాలను ప్రోత్సహించేందుకు ఫిక్కీ ఈ అవార్డులను నెలకొల్పింది.
ఇవి కూడా చదవండి:
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- చిదంబరం అరెస్టుకు సీబీఐ తొందరపడిందా...
- చిదంబరం అరెస్టుకు.. తొమ్మిదేళ్ల కిందట అమిత్‌షా అరెస్టుకు సంబంధమేమిటి
- 'గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గిస్తాం' ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























