‘ఏపీ అసెంబ్లీ ఫర్నిచర్ కోడెల వద్దకు’.. విలువ కడితే చెల్లించేందుకు సిద్ధమని లేఖలు రాశానన్న మాజీ స్పీకర్: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Dr.kodela/facebook
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హైదరాబాద్ నుంచి అమరావతికి మారుతున్న సమయంలో స్పీకర్ చాంబర్, పేషీకి సంబంధించిన ఫర్నిచర్‌ను అప్పట్లో స్పీకర్‌గా ఉన్న టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తన ఇంటికి తరలించుకున్నట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్‌గా ఉన్న సమయంలో తన చాంబర్, పేషీ కోసం మలేసియా నుంచి ప్రత్యేకంగా ఫర్నిచర్ కొనుగోలు చేయించారు.
2017 మార్చిలో వీటిని అమరావతికి తరలించాల్సి ఉండగా, కోడెల మాత్రం తన ఇంటికి చేరవేశారు.
ఫర్నిచర్‌తోపాటు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సైతం తన నివాసానికి చేర్చడం గమనార్హం. లెక్కాపత్రం ఏదీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించి కొన్నింటిని స్క్రాప్ కింద విక్రయించేశారు.
ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అసెంబ్లీ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు విషయాలు బయటపడ్డాయి. దీనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
అసెంబ్లీ హాలులో స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్‌కు భద్రత లేనందున తన దగ్గర ఉంచుకున్న మాట నిజమేనని కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. వాటిని తీసుకెళ్లాలని లేదా విలువ కడితే నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే లేఖలు రాశానని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఫేస్‌బుక్‌కు ఆధార్ లింక్’
ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్, వాట్సాప్ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని తమిళనాడు ప్రభుత్వం.. అలా చేయడం తమ విధానాలకు విరుద్ధమని ఫేస్‌బుక్ కోర్టులో వాదిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త రాసింది.
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వదంతులు, విద్వేష ప్రచారం పెరిగి హింసాత్మక ఘటనలు, మూకదాడులు జరుగుతున్నందున, ఆయా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలంటూ తమిళనాడు హైకోర్టులో రెండు, మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒకటి, బొంబాయి హైకోర్టులో ఒకటి చొప్పున దేశవ్యాప్తంగా నాలుగు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్న ఫేస్‌బుక్.. దీనిపై సుప్రీంను ఆశ్రయించింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ కేసులు దాఖలై, వేర్వేరు తీర్పులు వస్తే ఇబ్బంది కాబట్టి అన్ని కేసులనూ అత్యున్నత న్యాయస్థానమే విచారించాలని కోరింది.
ఫేస్‌బుక్ అభ్యర్థనను సుప్రీంకోర్టు అనుమతించింది.
తమిళనాడు ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. సోషల్ మీడియా వినియోగదారుల ప్రొఫైల్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిందేనన్నారు.
ప్రజలకుండే ఆన్‌లైన్ గోప్యత హక్కుకు, వెబ్‌సైట్లను ఉపయోగించి నేరాలకు పాల్పడుతూ, ప్రజల్లో భయోత్పాతం కలిగించేవారిని గుర్తించేందుకు ప్రభుత్వానికి ఉండే హక్కు మధ్య సమతౌల్యం ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
ఈ అంశంపై రెండువారాల్లోగా వాదనలు వినిపించాలంటూ కేంద్ర ప్రభుత్వం, ట్విటర్, గూగుల్, యూట్యూబ్ తదితర సంస్థలకు మంగళవారం కోర్టు నోటీసులు జారీచేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 13కు వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘108 తలుపు తెరుచుకోక ప్రాణాలు పోయాయి’
అత్యవసర వైద్యం అందించే 108 అంబులెన్స్ సమయానికి వచ్చినా, దాని డోర్ తెరుచుకోక తీవ్ర ఆలస్యం జరిగి హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
హైదరాబాద్ మలక్‌పేట రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్న ఆనంద్ అనే వ్యక్తికి ఉన్నట్టుండి శ్వాస పీల్చుకోవడం కష్టమైంది. దీన్ని గమనించిన తోటి ప్రయాణికుడు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. వైద్యసాయం అందించేందుకు వచ్చిన 108 అత్యవసర వాహనం తలుపు తెరుచుకోకపోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
ప్రత్యక్ష సాక్షులు, చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఎంఎంటీఎస్‌లో బేగంపేట నుంచి మలక్‌పేటకు ప్రయాణిస్తున్నారు ఇంతలో శ్వాస తీసుకునేందుకు అవస్థపడసాగారు.
ఆయన పరిస్థితిని గమనించిన తోటి ప్రయాణికుడు మజర్ 108కు ఫోన్ చేసి, మలక్‌పేట రైల్వేస్టేషన్ వరకు ఆయనకు తోడుగా వచ్చారు.
ఆనంద్‌ను మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ నుంచి కిందకు దింపి అత్యవసర వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే, వాహనం తలుపు తీసే క్రమంలో హ్యాండిల్ విరిగిపోయింది. 20 నిమిషాలపాటు తలుపు తెరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆ తర్వాత వాహనం తలుపు తెరుచుకుని, ఆనంద్‌కు ఆక్సిజన్ ఎక్కించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Aarogyasri-Telangana/facebook
‘తెలంగాణలో తిరిగి ఆరోగ్యశ్రీ సేవలు’
తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయని, బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా నడుస్తాయని నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త రాసింది.
ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు మంగళవారం సచివాలయంలో నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.
సమస్యలు పరిష్కరిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వారికి హామీఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు అంగీకరించారు. ప్రతినెలా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
మంత్రి హామీపై సంతృప్తిచెందిన ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి.
సమస్యలను ఓపిగ్గా విని, పరిష్కరించేందుకు ముందుకొచ్చినందుకు ప్రభుత్వానికి తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?
- కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా
- పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే 'పీవోకే'పైనే: రాజ్‌నాథ్ సింగ్
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























