అక్టోబర్ 1 నుంచి ఏపీలో ప్రభుత్వ లిక్కర్ షాపులు - ప్రెస్ రివ్యూ

అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం..
అక్టోబరు 1వతేదీ నుంచి ఎక్కడా బెల్టు షాపులు ఉండవని, అసలు ఆ పేరే వినిపించదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండబోవని చెప్పారు.
బెల్ట్ షాపులు లేకుండా చేయడంతోపాటు మద్యం అమ్మకాలను తగ్గించి దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు లక్ష్యంతో ప్రభుత్వమే రిటైల్‌గా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
శాంతిభద్రతలపై మంగళవారం జరిగిన కలెక్టర్లు - ఎస్పీల ఉమ్మడి సమావేశంలో సీఎం ఈమేరకు ప్రకటించారు.
'ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే బెల్ట్ షాపులకు తెర పడదు. ప్రభుత్వం నిఘా పెంచినా ఒక వారం రోజులు మూసివేసి మళ్లీ ఏదో ఒకవిధంగా బెల్ట్ షాపులు తెరుస్తారు. లాభార్జనే ధ్యేయంగా మద్యం అమ్మకాలు పెంచుకోవడానికే ప్రయత్నిస్తారు. అదే ప్రభుత్వమైతే బెల్ట్ షాపులు నిర్వహించదు. మద్యం విక్రయాలు పెంచాలనే స్వార్థం ఉండదు. ఈ లక్ష్యంతోనే అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే మద్యం షాపులు నిర్వహించాలని ఆదేశాలిచ్చాం' అని సీఎం జగన్ వివరించారు.
మద్యం దుకాణాల లైసెన్స్ మరో 3నెలలు పొడిగింపు
ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సు గడువును మరో మూడు నెలల పాటు పెంచుతూ రెవెన్యూ (ఎక్సైజ్, వాణిజ్య, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు మంగళవారం మెమో జారీ చేశారు.
రాష్ట్రంలోని 4,377 మద్యం దుకాణాలు, 15 హైబ్రీడ్ హైపర్ మార్కెట్ల లైసెన్సు వ్యవధి ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది. వీటి గడువును సెప్టెంబర్ 30వతేదీ వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం మెమోలో పేర్కొందని సాక్షి తెలిపింది.

ప్రజావేదికను కూల్చేశారు
'ప్రజా వేదిక' కథ పరిసమాప్తమైందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం..
ప్రజల నుంచి వినతుల స్వీకరణ, కలెక్టర్ల సదస్సులు, ఇతర సమీక్షలకు వేదికైన 'ప్రజా వేదిక' కథ పరిసమాప్తమైంది. 'ఇందులో ఇదే ఆఖరి సమావేశం. కలెక్టర్ల సదస్సు ముగియగానే దీనిని కూల్చివేయాలి' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం రాత్రి నుంచే 'ప్రజా వేదిక' కూల్చివేత ప్రారంభమైంది.
మధ్యాహ్నం ఇదే మందిరంలో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష ముగియగానే... సీఆర్డీయే అధికారులు కూల్చివేత ఏర్పాట్లు మొదలుపెట్టారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి ఆనుకునే ప్రజా వేదికను నిర్మించిన సంగతి తెలిసిందే.
దీని కూల్చివేతపై టీడీపీ శ్రేణుల నుంచి నిరసనవ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో, ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 70 మంది సివిల్, మరో 70 మంది ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరకట్టను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీఆర్డీయే అధికారులు తొలుత ప్రజా వేదిక వెలుపల, లోపల ఏర్పాటు చేసిన పూల కుండీలను సచివాలయం వద్ద ఉన్న నర్సరీకి తరలించారు. విద్యుత్తు సామగ్రిని, ఫర్నీచర్‌ను సచివాలయానికి చేర్చారు.
రాత్రి 8 గంటల సమయానికి పెద్ద సంఖ్యలో కూలీలు సమ్మెటలతో రంగంలోకి దిగా రు. 3 జేసీబీలు, 6 టిప్పర్లను తీసుకొచ్చారు. తొలుత ప్రజా వేదిక ముందు ఏర్పాటు చేసిన టెంట్‌లను కూల్చివేశారు.
ఆ తర్వాత 'ప్యాంట్రీ' (టీ, కాఫీ తయారీ ప్రాంతం)ని నేలమట్టం చేశారు. ప్రహరీని కూల్చివేత కూడా మొదలుపెట్టారు. రాత్రి 11.15 గంటల సమయంలో 'ప్రజా వేదిక' ప్రధాన భవనం కూల్చివేత పనులు మొదలయ్యాయి.
అర్ధరాత్రి తర్వాత కూడా పనులు కొనసాగాయి. నిజానికి కూల్చివేత పనులు బుధవారం ప్రారంభిస్తామని సంకేతాలు పంపించారు. కానీ, అనూహ్యంగా మంగళవారం రాత్రే పని మొదలుపెట్టారు అని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో 15వేలు, ఏపీలో 4వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో 15వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం..
కొత్త జిల్లాల ప్రాతిపదికన మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసింది. 2015లో పదివేల ఉద్యోగాలు భర్తీ చేయగా, 2018 మే నెలలో 18 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దానికి సంబంధించి కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు తుది పరీక్ష పూర్తయింది.
అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ముగిసింది. కటాఫ్ మార్కుల్ని ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉండగా, వారం రోజుల్లో అది కూడా పూర్తవుతుందని భావిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు జులై నుంచి శిక్షణ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు.
దాంతో సంబంధిత ఉద్యోగ ప్రకటనకు సంబంధించి రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి చేపట్టిన భర్తీ ప్రక్రియ పూర్తయినట్లవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలో 4వేలు
గతేడాది డిసెంబరు ఆఖరుకు పోలీసు శాఖలో 13,059 ఖాళీలు ఉన్నాయని.. వీటిని భర్తీ చేసి వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
కేంద్రం అదనంగా మంజూరు చేసిన నాలుగు బెటాలియన్ల ఏర్పాటులో భాగంగా 4వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
''మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తాం.. యువతను దురలవాట్లకు ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని ఆమె హెచ్చరించారు. మంగళవారం ప్రజావేదికలో శాంతి భద్రతలపై సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడారు.
పోలీసులపై ఒత్తిడి తగ్గించడానికి వీక్లీ ఆఫ్, సిబ్బంది సంక్షేమానికి కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. 'రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర పోస్టులు, ఫోన్‌కాల్స్‌పై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని మంత్రి స్పష్టం చేసినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook/SAVE Erramanzil heritage building
తెలంగాణ అసెంబ్లీ భవన నిర్మాణం
తెలంగాణ అసెంబ్లీని ఎర్రమంజిల్‌లోని జలసౌధ భవనం ప్రాంతంలో నిర్మిస్తున్నారని నవతెలంగాణ పత్రిక ఓ కథనం ప్రచురించింది. అందులో..
తెలంగాణ అసెంబ్లీ నిర్మాణానికి జలసౌధ భవనం అడ్డువస్తుందన్న భావనతో, ఆ భవనాన్ని కూల్చడానికి యోచిస్తున్నట్లు సమాచారం. అప్పుడే, తాము అనుకున్న పద్ధతులు, రీతుల్లో అసెంబ్లీ భవనం అత్యంత ఎత్తులో హంగు ఆర్భాటాలతో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.
అందువల్ల జలసౌధను కూల్చేయబోరనే గ్యారెంటీ ఏమీ లేదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరోవైపు నూతన సచివాలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, అందుకు సంబంధించిన పనులు, స్థలాన్ని పరిశీలించేందుకు పలువురు వాస్తు నిపుణులు సోమవారమే సెక్రటేరియట్‌ను సందర్శించారు.
సుద్దాల సుధాకర్ తేజ ఈ బృందానికి నేతృత్వం వహించారు. వారి సూచనల ప్రకారం గతంలో కడియం శ్రీహరి ఛాంబర్ (డీ-బ్లాక్‌కు ఎడమవైపున ఉన్న లాన్‌లో)కు ఎదురుగా ఉన్న స్థలాన్ని శంకుస్థాపనకు అనువైన స్థలంగా గుర్తించి, భూమి పూజకు వీలుగా మంగళవారం ఒక గొయ్యిని తీశారు. మరోవైపు నూతన అసెంబ్లీని నిర్మించబోయే ఎర్రమంజిల్‌లో కూడా ఇదే విధంగా సిబ్బంది గొయ్యి తీశారు.
ప్రజలపై 1,500 కోట్ల భారం
సచివాలయ భవనాలు, జలసౌధ భవనం కూల్చివేత, నూతన భవనాల నిర్మాణంతో రాష్ట్ర ప్రజలపై రూ.1500 కోట్ల అదనపు భారం పడుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు.
సచివాలయంలో ఉన్న మొత్తం 9 బ్లాకుల విలువ వెయ్యికోట్లకుపైగా ఉంటుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం నూతన నిర్మాణాలకు రూ.400 కోట్లు ఖర్చవుతుంది. కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం మరో రూ.100 కోట్లు వెచ్చిస్తున్నారు.
ఈ మొత్తం విలువ రూ.1500కోట్లు దాటి పోతుందని, ఈ వ్యయమంతా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారమేనని ఆర్ధిక రంగ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
సచివాలయం, జలసౌధ కూల్చివేతలపై పర్యావరణ వేత్తలు, విద్యావంతులు, అడ్వకేట్లు ఇలా చాలామంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఒక న్యాయవాది హైకోర్టులో పిల్ వేయగా నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాలు కూల్చివేయవద్దంటూ పీహెచ్‌డీ విద్యార్థి శంకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
సుమారు 150 ఏండ్ల నాటి ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేయాలని సామాజిక కార్యకర్త సార్వత్ కూడా మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేశారని నవతెలంగాణ కథనం పేర్కొంది.
నోట్: 'సేవ్ ఎర్రమంజిల్ హెరిటేజ్ బిల్డింగ్' పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక పేజ్‌ను సృష్టించారు. ఆ పేజ్‌లోని ఒక ఫొటోను మీరు పైన చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
- సామాన్యుడి విజయాన్ని సహజంగా చూపించిన 'మల్లేశం'
- కబీర్ సింగ్ సినిమాకు ఈలలు, చప్పట్లు దేనికి...
- గుజరాత్లో ఆర్టీఐ హత్యలు: సమాచారం అడిగినందుకు 13 మందిని చంపేశారు
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- ‘ఆమె నా టైప్ కాదు. అబద్ధాలు చెబుతున్నారు’
- కార్లోస్ బ్రాత్‌వైట్... ఈ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























