You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం పడి మంటలు, పలువురు కార్మికులు మృతి
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు అధికారుల నుంచి తనకు సమాచారం అందిందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ‘బీబీసీ’తో చెప్పారు. మృతుల సంఖ్య పెరగొచ్చన్నారు.
ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలాయి. దీంతో ఉక్కు ద్రవం పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం.
భారీగా మంటలు చేలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంలో కొందరు కార్మికులు మరణించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలానికి హోం మంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ వెళ్లారు.
ప్రమాదానికి కారణాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.
సహాయక చర్యలు, భద్రతా చర్యలు, బాధిత ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు.
గాయపడిన ఉద్యోగులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలుసుకోవడానికి, ఇతర సమాచారం పొందడానికి అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
08912590100, 08912590102 నంబర్లను కంట్రోల్ రూంలో అందుబాటులోకి తెచ్చారు.
ఈ నంబర్లకు ఫోన్ చేసి బాధితులకు సంబంధించిన వారు సమాచారం తెలుసుకోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)