బ్రహ్మోస్: ఈ మిసైల్‌ను కొనడానికి వియత్నాం, ఇండోనేషియా ఎందుకు ఆసక్తి చూపుతున్నాయి?

    • రచయిత, షకీల్ అక్తర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వియత్నాంకు అమ్మేందుకు భారత్ ఒక ఒప్పందంపై సంతకం చేసింది.

గత శనివారం సింగపూర్‌లో జరిగిన షాంగ్రి-లా డైలాగ్ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ దీని గురించి మాట్లాడారు.

ఈ విషయంలో వియత్నాంతో ఒక ఒప్పందం కుదిరిందని, అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదని ఆయన అన్నారు.

బ్రహ్మోస్ క్షిపణి విక్రయానికి సంబంధించి ఇండోనేషియాతో చర్చలు తుది దశలో ఉన్నాయని కూడా రాజేశ్ కుమార్ సింగ్ చెప్పారు.

ఈ ఒప్పందం గురించి 2012 నుంచి భారత్, వియత్నాంల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

14 ఏళ్లుగా చర్చలు

వియత్నాంతో ఒప్పందాన్ని ఖరారు చేయడంలో భారత్ కొంతకాలం జాగ్రత్తగా వ్యవహరించింది.

చైనా, వియత్నాంల మధ్య సముద్ర సరిహద్దుల విషయంలో వివాదం ఉంది. వియత్నాంకు క్షిపణులను విక్రయిస్తే, దానిపై చైనా అసంతృప్తి వ్యక్తం చేయవచ్చని భారత్‌కు ఆందోళన ఉండేది.

ఈ కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

అయితే రెండుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని భారత రక్షణ శాఖ కార్యదర్శి ఇప్పుడు ధృవీకరించారు. కానీ ఈ ఒప్పందం విలువ ఎంత, ఎన్ని క్షిపణులను విక్రయిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

2022వ సంవత్సరంలో భారత్ ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 35 వేల కోట్లు ) ఒప్పందంపై కూడా సంతకం చేసింది.

"ఈ ఒప్పందం ప్రకారం మూడు బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల సెట్లను ఫిలిప్పీన్స్‌కు ఇవ్వాల్సి ఉంది. వీటిలో రెండింటిని ఇప్పటికే అప్పగించారు. ఫిలిప్పీన్స్ ఈ క్షిపణులను తన తీరప్రాంతాల్లో మోహరించింది" అని డిఫెన్స్ ఎనలిస్ట్ రాహుల్ బేదీ అన్నారు.

బ్రహ్మోస్ దాడి పరిధి (రేంజ్)

రెండు దశాబ్దాలకు పైగా రష్యా, భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి, భారత్‌లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్క్వా నది పేర్లను కలిపి పెట్టారు.

ఈ క్షిపణిని హైదరాబాద్‌లో తయారు చేశారు. ఈ క్షిపణికి సంబంధించి భారత్, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం వివరాలను బహిరంగంగా వెల్లడించలేదని విశ్లేషకులు అంటున్నారు.

ఈ క్షిపణిలో మార్పులు చేయడానికి, మెరుగుపరచడానికి, ఇతర దేశాలకు విక్రయించడానికి భారత్‌కు హక్కు ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

"ఈ క్షిపణి బరువు సుమారు 3000 కిలోలు. దీని పొడవు దాదాపు 10 మీటర్లు" అని డిఫెన్స్ ఎనలిస్ట్ రాహుల్ బేదీ వివరించారు.

దీన్ని తయారు చేసిన మొదట్లో దాడి పరిధి 300 కిలోమీటర్లు. తర్వాత భారత్ తన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిధిని సుమారు 500 కిలోమీటర్లకు పెంచింది.

"ఇది చాలా ప్రభావవంతమైన, విజయవంతమైన క్షిపణి. దాడి సమయంలో దీని వేగం గంటకు సుమారు 4000 కిలోమీటర్లు ఉంటుంది" అని రాహుల్ అన్నారు.

ఇది ఒక క్రూయిజ్ క్షిపణి. అంటే ఇది భూమికి చాలా దగ్గరగా ప్రయాణిస్తుంది. అందువల్ల రాడార్‌లకు దీన్ని గుర్తించడం కష్టమవుతుంది. అలాగే లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

బ్రహ్మోస్ అణ్వాయుధాలను తీసుకెళ్లలేని క్షిపణి అని, అందుకే భారత్ ఇతర దేశాలకు విక్రయించగలుగుతోందని రాహుల్ బేదీ చెప్పారు.

ఒకవేళ దానికి అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండి ఉంటే, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం దాని విక్రయంపై పరిమితులు ఉండేవని ఆయన వివరించారు.

"భారత్ ఈ క్షిపణిలో 85శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. కానీ దాని ఇంజిన్, కొన్ని లోహ భాగాల వంటి మిగిలిన 15 శాతం సాంకేతిక పరిజ్ఞానం రష్యా నుంచి వస్తాయి. ఈ భాగాలు భారత్‌లో తయారవ్వవు. ప్రస్తుతం వాటిని తయారు చేసే సామర్థ్యం కూడా భారత్‌కు లేదు" అని ఆయన అన్నారు.

ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు ఆధునిక క్షిపణులను కొనుగోలు చేయడానికి శక్తివంతమైన దేశాలకు బదులుగా భారత్‌వైపు మొగ్గు చూపుతున్నాయని డిఫెన్స్ ఎనలిస్ట్ రాహుల్ బేది అంటున్నారు.

"ఈ దేశాలు బ్రహ్మోస్ వంటి క్షిపణులను ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఇది ఇప్పటికే పరీక్షించిన, విజయవంతమైన క్షిపణి కావడం. ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం" అని ఆయన అన్నారు.

"ఈ క్షిపణులతో పాటు అవసరమైన శిక్షణ (ట్రైనింగ్), మోహరింపు (డిప్లాయ్‌మెంట్), స్పేర్ పార్ట్స్‌ను కూడా భారత్ తక్కువ ధరకు లేదా కొన్నిసార్లు ఉచితంగానే అందిస్తోంది. అందువల్ల మధ్య ఆసియా, దక్షిణ - తూర్పు ఆసియాలోని అనేక దేశాలు దీనిపై ఆసక్తి చూపుతున్నాయి" అని రాహుల్ బేదీ చెప్పారు.

ఈ క్షిపణిని భూభాగం నుంచి ప్రయోగించవచ్చు. నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి, అలాగే విమానాల నుంచి కూడా దాడులకు ఉపయోగించవచ్చు.

పాకిస్తాన్‌తో ఘర్షణ సందర్భంగా భారత్ వీటిని వాడినట్లు రక్షణ రంగ సర్కిళ్లలో రిపోర్ట్ అయ్యింది. కానీ, దీనిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు.

మారుతున్న భారత రక్షణ రంగం

సుమారు 25 ఏళ్ల కిందటి వరకు భారత రక్షణ రంగం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. అయితే 2001 తర్వాత రక్షణ పరిశ్రమలో పనిచేయడానికి ప్రైవేట్ కంపెనీలను కూడా అనుమతించారు.

కొన్నేళ్లుగా ప్రైవేట్ కంపెనీలు పెద్ద స్థాయిలో రక్షణ రంగ ఉత్పుత్తుల తయారీలో పాలుపంచుకుంటున్నాయి. ఇందులో యుద్ధ నౌకలు, ఓడలు కూడా ఉన్నాయి.

బ్రహ్మోస్ క్షిపణిలోని అనేక భాగాలను ప్రైవేట్ కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి. భవిష్యత్తులో రక్షణరంగంలో స్వావలంబన సాధించడమే తమ లక్ష్యమని భారత రక్షణ శాఖ చెబుతోంది.

స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, భారత్ మొదటి నుంచీ తన రక్షణ పరికరాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా ప్రయత్నించింది.

దాదాపు 20 ఏళ్ల కిందట భారత ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), ఈక్వెడార్‌కు ఏడు హెలికాప్టర్లను విక్రయించింది. అయితే ఎగుమతి జరిగిన కొద్ది నెలలకే ఈ హెలికాప్టర్లలో నాలుగు కూలిపోయాయి. తర్వాత భారత్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఈక్వెడార్.

ప్రస్తుతం భారత ఆధునిక యుద్ధ విమానం తేజస్‌ను తయారు చేస్తున్న హెచ్‌ఏఎల్ (హెచ్ఓఎల్) కంపెనీకి ఈ సంఘటన పెద్ద దెబ్బ.

భారత్ ఈ విమానాన్ని కూడా ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే గతేడాది దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా ఒక తేజస్ విమానం కూలిపోవడంతో ఈ ప్రయత్నాలకు మరో దెబ్బ తగిలించింది.

"ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ అంతర్జాతీయ కంపెనీలతో పోటీ పడటానికి భారత్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది" అని రాహుల్ బేదీ అన్నారు.

పెరిగిన రక్షణ ఎగుమతులు

బ్రహ్మోస్ క్షిపణిని తన ప్రధాన రక్షణ ఆయుధాల్లో ఒకటిగా భారత్ ప్రదర్శిస్తోంది.

ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా మాత్రమే కాకుండా మరికొన్ని దేశాలు కూడా ఈ క్రూయిజ్ క్షిపణిపై ఆసక్తి చూపాయని, రష్యా సాయం లేకుండా భారత్ బ్రహ్మోస్‌ను తయారు చేయలేకపోయినప్పటికీ, మరో దేశం సహకారంతో తయారు చేసిన ఈ క్షిపణి ద్వారా ప్రపంచ రక్షణ మార్కెట్‌లో పెద్ద దేశాలతో పోటీ పడటం భారత్‌కు చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

గడచిన ఐదారేళ్లలో భారత రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని రాహుల్ బేదీ అంటున్నారు.

"2023-24లో భారత మొత్తం రక్షణ ఎగుమతులు సుమారు రూ. 21,000 కోట్లుగా ఉన్నాయి. 2024-25లో ఇది రూ. 28,000 కోట్లకు పెరిగింది. ఇక 2025-26లో ఇది సుమారు రూ. 38,000 కోట్లకు చేరుకుంది" అని ఆయన అన్నారు.

"2029-30 నాటికి రక్షణ పరికరాల ఎగుమతిని రూ. 50 వేల కోట్లకు పెంచడమే లక్ష్యమని రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో బ్రహ్మోస్ విక్రయాలు కూడా భాగమే" అని ఆయన అన్నారు.

భారత రక్షణ ఎగుమతులలో మందుగుండు సామగ్రి, డ్రోన్‌లు, బ్రహ్మోస్, ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్, మల్టీ-బ్యారెల్ గైడెడ్ పినాకా క్షిపణులు ఉన్నాయి.

భారత్ ఇప్పుడు ఇజ్రాయెల్ సహకారంతో సాయుధ డ్రోన్‌లను కూడా అభివృద్ధి చేస్తోంది. వాటిని ఇజ్రాయెల్‌కు ఎగుమతి చేస్తున్నారు.

రెండేళ్లక్రితం భారత్ అర్మేనియాకు ఆకాశ్, పినాకా క్షిపణులను విక్రయించింది. పినాకా అనేది ఒక మల్టీ-బ్యారెల్ క్షిపణి వ్యవస్థ, దీనిపై ఒకానొక సమయంలో ఫ్రాన్స్ కూడా ఆసక్తి చూపింది.

భారత రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీల పాత్ర వేగంగా పెరిగిందని రాహుల్ బేదీ అంటున్నారు.

ప్రస్తుతం భారత్ తన రక్షణ ఆయుధాలు, పరికరాలలో అధిక భాగాన్ని ప్రైవేట్, విదేశీ కంపెనీల సహకారంతో తయారు చేస్తోందని ఆయన అంటున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)