ఏపీలో కోవిడ్ కలవరం: 12 కేసులు.. నలుగురు మృతి.. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందా?

కోవిడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కోవిడ్‌ కలకలం మొదలైంది. ఐదేళ్ల కిందట దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఆ తర్వాత తగ్గుముఖం పడుతూ వచ్చింది.

అయితే జులై 1 నుంచి దేశవ్యాప్తంగా 339 కోవిడ్‌ కేసులు నమోదు కాగా, ఏపీలో 12 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కోవిడ్‌ సోకిన వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

కానీ, ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ తెలిపారు.

వైద్యులు, ఆసుపత్రులు, సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కరోనా, ఆంధ్రప్రదేశ్, కడప

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

20 రోజుల్లో 12 కేసులు.. తొలి కేసు కడపలో

ఏపీలో జూన్‌ 26 నుంచి జులై 16 వరకు 67 మందికి పరీక్షలు నిర్వహించగా, మొత్తం 12 మంది కరోనా బారిన పడ్డారని, వీరిలో నలుగురు మృతి చెందారని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

"ఈ ఏడాది తొలి కోవిడ్‌ కేసు జూన్‌ 26న కడప జిల్లాలో నమోదైంది. జులై 1 నుంచి 16 వరకు మరో 11 కేసులు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు అప్పటికే కోవిడ్‌ సోకినవారితో సన్నిహితంగా మెలిగారు. మొత్తం కేసుల్లో కడప జిల్లాలో అత్యధికంగా 8 నమోదయ్యాయి. గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వెలుగుచూశాయి. ఇవన్నీ వేర్వేరు మండలాలు, ప్రాంతాల్లో నమోదైనవే. అయితే, ఒకేచోట కేసులు గుంపులుగా బయటపడలేదు" అని విష్ణువర్ధన్ వివరించారు.

కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వారిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. మరణించిన వారందరికీ ముందునుంచే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని విష్ణువర్ధన్ చెప్పారు.

కరోనా, ఆంధ్రప్రదేశ్, కడప

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘భయపడక్కరలేదు’

వైరస్ రకాన్ని నిర్ధరించేందుకు అధికారులు ఐదు నమూనాలను సేకరించి, జులై 9న పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.

ప్రస్తుతం ముగ్గురు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారని, ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని విష్ణువర్ధన్ తెలిపారు.

కడప జిల్లాలో ఎనిమిది కోవిడ్‌ కేసులు నమోదు కావడం, అందులో ముగ్గురు మృత్యువాత పడటంతో జిల్లాలో కలకలం రేపింది.

అయితే, భయం అవసరం లేదని, అవన్నీ ఈ నెల ప్రారంభంలో వచ్చిన కేసులని, ఇప్పుడు కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కడప జిల్లా ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రవిబాబు బీబీసీకి తెలిపారు.

వైద్య, ఆరోగ్య శాఖాపరంగా తాము అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. అయితే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్‌ లక్షణం ఏ ఒక్కటి కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందాలని సూచించారు.

కరోనా, ఆంధ్రప్రదేశ్, కడప

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా జులై 1 నుంచి ఇప్పటివరకు 339 కోవిడ్‌ కేసులు రికార్డ్‌ అయ్యాయి. కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్‌లో 18, దిల్లీలో 18, రాజస్థాన్‌లో 12 కేసులు నమోదయ్యాయి.

ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. కాకినాడ జీజీహెచ్‌లో కోవిడ్‌ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు, మెడికల్‌ కిట్‌లు సిద్ధంగా ఉంచుకున్నామని కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెండ్‌ డాక్టర్‌ లావణ్య కుమారి బీబీసీకి తెలిపారు. అయితే ఇంతవరకు కేసులేమీ రాలేదన్నారు.

"కాకినాడ జిల్లాలో నమోదైన కేసు నిజానికి వందశాతం కోవిడ్‌ వల్ల అని చెప్పలేం. ఓ చిన్నారి తలసీమియా వల్ల చనిపోయింది. అయితే, ఇన్సిడెంటల్ ఫైండింగ్ (యాదృచ్ఛికంగా)గా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వాస్తవానికి మా జిల్లాకు చెందిన ఆ పాప చనిపోయింది కూడా తమిళనాడులోని రాయవెల్లూరులో. ఆ ఒక్క కేసు తప్పించి జిల్లాలో ఏ ఒక్క కేసూ నమోదు కాలేదు. అయినాసరే అన్ని విధాలా అప్రమత్తంగానే ఉన్నాం" అని కాకినాడ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిత బీబీసీతో అన్నారు.

'కేసులు తక్కువే'

"కోవిడ్ మళ్లీ విజృంభించింది అనలేం. ఎందుకంటే కోవిడ్ ఎప్పుడూ ఉండేదే. అయితే ఇప్పుడు ఒక్కసారిగా కేసులు బయటపడ్డాయి, అంతే తేడా" అని విష్ణువర్ధన్ చెప్పారు.

దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రాపిడ్ కిట్స్, సర్జికల్ మాస్కులు, ఎన్ 95 మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజెస్, శానిటైజర్లు, పారాసెటమాల్ మందులు... అన్నీ సిద్ధంగా ఉంచిందని ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు.

2025లో రాష్ట్రం మొత్తం మీద ఏడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి కానీ మరణాలు మాత్రం సంభవించలేదని విష్ణువర్ధన్ తెలిపారు. 2024లో కూడా కోవిడ్ కారణంగా ఎవరూ చనిపోయిన దాఖలాలు లేవన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)