‘మిస్టర్ మిడిల్‌క్లాస్’ మూవీ రివ్యూ: అంతా మంచి నటులే, మరి.. ప్రేక్షకుల సహనానికి ఎందుకింత పరీక్ష?

ఫొటో సోర్స్, Shreyasmedia/FB
- రచయిత, జీ.ఆర్.మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
శ్రీకాంత్, లయ , రాజేంద్రప్రసాద్ కాంబినేషన్‌లో మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా వచ్చింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.
కథ ఏమంటే వెంకటరమణ (శ్రీకాంత్) ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి.
భార్య పద్మావతి (లయ) తండ్రి ఏడుకొండలు, చెల్లి, బావ, పిల్లలతో ఒక అద్దె ఇంట్లో ఉంటాడు. ఒకప్పుడు టిఫిన్ సెంటర్‌లో బాగా సంపాదిస్తున్న హీరో అత్యాశకి వెళ్లి వడ్డీలకి డబ్బు తెచ్చి పెద్ద రెస్టారెంట్ పెడతాడు.
దాంట్లో నష్టాలొచ్చి, చివరికి రెస్టారెంట్ అమ్మేసి , దాంట్లోనే కుటుంబ సమేతంగా పని చేస్తుంటాడు.
ఆదాయం చాలదు. విపరీతమైన కష్టాలు. హీరోకి వెంకటేశ్వరస్వామి అంటే భక్తి. కష్టాలు తీర్చమని ప్రతిరోజూ పూజలు చేస్తూ వుంటాడు. అయితే దేవుడు ఆలకించడు. కష్టాలు ఇంకా పెరుగుతాయి. నెలలు నిండిన చెల్లికి ఆస్పత్రి ఖర్చులు కూడా లేని స్థితి.
ఈ పరిస్థితిలో హీరోకి కోపం వచ్చి దేవుడి ఫొటోని అటక మీద పడేస్తాడు. సరిగ్గా అదే సమయానికి వెంకటేశ్వరస్వామి ఆలయం సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం వస్తుంది.
ఈ కష్టాలు భరించలేం, తనని చంపేయమని దేవుడిని వేడుకుంటాడు.
అప్పుడు స్వామి ప్రత్యక్షమైన , భక్తుడిని ఎలా ఆదుకున్నాడు? ఆయన ఇచ్చిన మహిమల పుస్తకంలో హీరో ఏం రాసుకున్నాడు? ఆ పుస్తకంలోని నిబంధనలు ఏంటి? హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? కొత్తగా వచ్చిన కష్టాలేంటి? ఇది మిగతా కథ.

దేవుడు, మనిషికి మధ్య సంఘర్షణ చాలా పాత పాయింట్, సరిగా తీస్తే ఎపుడూ కొత్తగానే వుంటుంది. కష్టాల్లో ఉన్నపుడు దేవుడి సాయం కోరడం మనిషి స్వభావం. నిజంగా దేవుడు దిగి వస్తే ఏం జరుగుతుందనేది మంచి కాన్సెఫ్ట్.
హాలీవుడ్‌లో 1946లో వచ్చిన ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లైఫ్ (డైరెక్టర్ ఫ్రాంక్ కాఫ్రా) దగ్గర నుంచి అనేక సినిమాలు వచ్చాయి. తెలుగు పౌరాణికాల్లో దేవుడు ఎలాగూ వుంటాడు. అయితే సోషల్ సినిమాల్లో 1969లో వచ్చిన బుద్ధిమంతుడు చెప్పుకోదగింది. హీరో అక్కినేని శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ వుంటాడు. ఆ రోజుల్లో ఇది చాలా కొత్త కథాంశం.
తర్వాత మధ్యతరగతి కష్టాల్ని తీర్చడానికి , హీరోలతో ఛాలెంజ్ చేయడానికి దేవుళ్లు చాలాసార్లు దిగి వచ్చారు.
1975లో దేవుడే దిగి వస్తే గీత ఆర్ట్స్ తీసారు. అల్లు అరవింద్ నిర్మాత. దాసరి దర్శకుడు.
ఆశ్చర్యంగా 1979లో అరవింద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఇలాంటి కథాంశంతో కొంచెం కామెడీగా మా వూళ్లో మహాశివుడు తీసారు. ఎస్ఐగా అరవింద్ చిన్నపాత్ర కూడా వేశారు.
ఇంత చరిత్ర ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మిస్టర్ మిడిల్ క్లాస్ మంచి స్టోరీ లైన్. శ్రీకాంత్, లయ, రాజేంద్రప్రసాద్ ముగ్గురూ కూడా కథలో విషయం వుంటే ఎమోషనల్‌గా మోయగల సమర్థులు. వీళ్లకి అదనంగా సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ, పృధ్వీ, ప్రభాస్ శీను ఉన్నారు. అయితే చీప్ కామెడీని , తలాతోకా లేని స్క్రీన్ ప్లేని నమ్ముకుని దర్శకుడు నాగేశ్వరరెడ్డి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు.
లీడ్ రోల్స్‌లో ఉన్నది 20 ఏళ్ల క్రితం హీరోహీరోయిన్లు కాబట్టి, సినిమా కూడా అప్పటి కాలంలో తీసినట్టే వుంది. డిజిటల్ యుగంలో ఎదిగిపోయిన ప్రేక్షకున్ని గమనంలోకి తీసుకోకుండా ఇలాగే తీస్తామంటే ఒప్పుకుంటారా?

ఫొటో సోర్స్, blu.j creations
తెరమీద ఒకవైపు వెంకటేశ్వరస్వామిని చూపిస్తూ, మరోవైపు డబుల్ మీనింగ్‌లు, బూతు కామెడీ నడుస్తుంటుంది. లేడి కానిస్టేబుళ్లను , పనిమనుషుల్ని అవమానిస్తూ కామెడీ చేయడం ఎప్పటి కాలానిది?
నాగేశ్వరరెడ్డి పాతికేళ్లు వెనక్కి వుండి, అప్పటి రైటింగ్, టేకింగ్‌ని ప్రేక్షకుల పైకి వదిలాడు. ఎమోషనల్‌గా, కామెడీగా వర్కౌట్ అయ్యే లైన్‌ని గందరగోళంగా తీసి పడేశాడు. ఏ పాత్ర ఎందుకు వస్తుందో, ఏం మాట్లాడుతుందో అర్థంకాక టీవీ సీరియల్‌ని గుర్తుకు తెస్తుంది.
ఈ మధ్య వీరభద్రుడు సినిమా వచ్చింది. సూర్య హీరో. దేవుడే వచ్చి లాయర్‌గా వాదించినా , ఇప్పుడున్న న్యాయ వ్యవస్థని సరి చేయడం సాధ్యం కాదు. ఈ పాయింట్ మీదే సినిమా నడుస్తుంది.
అదే విధంగా దేవుడే స్వయంగా వచ్చి ఒంటిమీద నగలన్నీ ఇచ్చినా, ఒక మధ్య తరగతి వాడు, ఈ వ్యవస్థలో అమ్ముకోలేడు. ఈ పాయింట్ మీదే సినిమా నడిచినా ఆసక్తికరంగా వుండేది. ఇక్కడి నుంచి యమలీల గుర్తుకొచ్చే విధంగా మహిమల పుస్తకంలోకి కథ వెళ్లి , అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్టు వెళ్లి, మొత్తం మీద శుభంకార్డు పడుతుంది.
శ్రీకాంత్, లయ, రాజేంద్రప్రసాద్‌లు పరిధి మేరకు న్యాయం చేశారు. ఉన్నంతలో వెన్నెల కిషోర్ నవ్విస్తాడు. సునీల్‌కి గ్యాంగ్‌స్టర్ పాత్రలు ఈ మధ్య రొటీన్ అయిపోయాయి.
ప్లస్ పాయింట్స్ః
ఏమీ లేవు
మైనస్ పాయింట్స్ః
బోలెడు
ఫైనల్‌గా
ఓ మై గాడ్!
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































