‘లివింగ్ పాట్రిస్ లుముంబా’?: DR కాంగో మ్యాచ్ ఉంటే చాలు ఆయన స్టేడియంలో విగ్రహంగా మారిపోతారు...

    • రచయిత, అలెగ్జాండ్రా మార్టిన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

(ఈ కథనంలో కొన్ని కలచివేసే అంశాలుంటాయి)

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో ఆనందోత్సాహాలతో అభిమానునుల కేకలు, సంబరాల మధ్య ఒక అభిమాని మాత్రం మ్యాచ్ చివరి వరకు కదలకుండా నిల్చుని నిశబ్ద నివాళి అర్పిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తారు.

జూన్ 23న గ్వాడలజారాలో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో-కొలంబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో డీఆర్‌సీ జట్టు 0-1 తేడాతో ఓడిపోయింది. అయితే, ఆ మ్యాచ్ జరిగే సమయంలో డీఆర్ కాంగో జట్టుకి ఒక ముఖ్యమైన అభిమాని స్టేడియంలో ఉన్నారు. ఆయనకు ఫేమ్ ఏ స్థాయిలో ఉందంటే, జట్టు అధికారిక బృందంలో ఆయనకు కూడా చోటు కల్పించాలని ఆటగాళ్లు స్వయంగా అభ్యర్థించారు.

మైకేల్ కుకా మోలాడింగా అనే ఈ అభిమానిని లుముంబా వేయా (జీవించి ఉన్న లుముంబా) అని కూడా అంటుంటారు. డీఆర్‌సీ జాతీయ జట్టు 'ది లెపర్డ్స్‌' ప్రపంచ కప్‌లో ఆడుతున్నప్పుడు ఆయన స్టేడియంలో నిల్చునే తీరు వల్ల ‘లివింగ్ స్టాచ్యూ’గా ఆయన ప్రసిద్ధి చెందారు.

డీఆర్‌సీ మ్యాచ్ జరిగేటప్పుడు మోలాడింగా తమ దేశ జాతీయపతాకంలోని రంగులలో ఉండే జాకెట్, టై ధరించి స్టేడియం స్టాండ్స్‌లో ఒక చిన్న పీఠంపై నిల్చుని చేతిని పైకెత్తి కదలకుండా ఉంటారు.

దేశ ఆత్మకు ప్రతినిధి

మోలాడింగా 2013 నుంచి సజీవ విగ్రహంలా తమ జట్టుకు మద్దతు ఇస్తున్నప్పటికీ 2015లో జరిగిన 'ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్' టోర్నీలో ఆయన వీడియో వైరల్ అయింది. దీంతో ఆయనకు అంతర్జాతీయంగా ఖ్యాతి లభించిందని స్టీవెన్స్ చెప్పారు.

ఎబోలా కారణంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి వచ్చే సందర్శకులకు క్వారంటైన్ విధించడంతో మోలాడింగా తన దేశం ఆడుతున్న ప్రపంచ కప్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌కు హాజరు కాలేకపోయారు.

తొలి మ్యాచ్‌లో డీఆర్‌సీ జట్టు పోర్చుగల్ టీమ్‌తో పోటీ పడింది. ఈ మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రా అయింది.

స్టేడియంలోని స్టాండ్స్‌లో తాను ఉండటం తన జట్టుకు శక్తిని ఇస్తుందని మోలాడింగా గతంలో చెప్పారు.

"మ్యాచ్‌ల సమయంలో లెపర్డ్స్‌కు మద్దతుగా స్టాండ్స్‌లో ఆయన నిల్చోవడం ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఒక ఆఫ్రికన్ ప్రముఖ నేత జ్ఞాపకార్థం గౌరవంగా ఉంటుంది" అని స్టీవెన్స్ అన్నారు.

మోలాడింగా ప్రపంచ కప్‌ మ్యాచ్‌లకు హాజరు కావడం కేవలం డీఆర్‌సీ ఆటగాళ్లకే కాకుండా యావత్ ఆఫ్రికా ఖండానికి చాలా ముఖ్యం.

"వీసాల ఖర్చు, ప్రయాణానికి టికెట్ల ధరలు, దేశంలోని తూర్పు ప్రాంతంలో ఎబోలా వైరస్ విస్తరణ వల్ల కాంగో నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించడంతో ప్రపంచకప్ పోటీలు చూసేందుకు ఇక్కడ నుంచి చాలా తక్కువమంది అభిమానులు వచ్చారు" అని స్టీవెన్స్ పేర్కొన్నారు.

52 ఏళ్లలో తొలిసారి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రపంచ కప్‌లో మళ్లీ ఆడుతోంది. కాంగో ప్రజల్లో అనేకమంది ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడలేకపోయారు. దీంతో మోలాడింగా దేశ అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.

మోలాడింగా నిల్చునే భంగిమ బెల్జియం నుంచి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో స్వాతంత్య్రం పొందిన తర్వాత కాంగో మొదటి పాలకుడు పాట్రిస్ లుముంబా గౌరవార్థం కిన్షాసాలో నిర్మించిన స్మారక చిహ్నాన్ని పోలి ఉంటుంది.

34 ఏళ్ల వయసులో ప్రధాని బాధ్యతలు చేపట్టిన లుముంబాను బెల్జియం అధికారుల మద్దతున్న ఫైరింగ్ స్క్వాడ్ కాల్చి చంపింది. ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి యాసిడ్‌లో కరిగించింది.

"పాట్రిస్ లుముంబాను డీఆర్‌సీలో హీరోగా భావిస్తారు. ఆఫ్రికన్ వలస వ్యతిరేక ఉద్యమంలో ఆయన ఆఫ్రికన్ ప్రజల గొంతుకగా నిలిచారు" అని బీబీసీ స్పోర్ట్ ఆఫ్రికా జర్నలిస్ట్ రాబ్ స్టీవెన్స్ అన్నారు. కాంగో చరిత్రను గౌరవించడం, ఆ ఉద్యమానికి నైతిక మద్దతు అందించడానికి తాను లుముంబా విగ్రహం మాదిరిగా నిల్చుంటున్నానని మోలాడింగా చెప్పారు.

పాట్రిస్ లుముంబా ఎవరు?

మోలాడింగా నిల్చునే భంగిమ బెల్జియం నుంచి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో స్వాతంత్య్రం పొందిన తర్వాత కాంగో మొదటి పాలకుడు పాట్రిస్ లుముంబా గౌరవార్థం కిన్షాసాలో నిర్మించిన స్మారక చిహ్నాన్ని పోలి ఉంటుంది.

34 ఏళ్ల వయసులో ప్రధాని బాధ్యతలు చేపట్టిన లుముంబాను బెల్జియం అధికారుల మద్దతున్న ఫైరింగ్ స్క్వాడ్ 1961లో కాల్చి చంపింది. ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి యాసిడ్‌లో కరిగించింది. పాట్రిస్ లుముంబాను హత్య చేసినప్పుడు ఆయన నోట్లో బంగారు కిరీటం రూపంలో ఉన్న పన్ను ఉండేది.

ఆయన శరీరాన్ని లోతు లేని గోతిలో పాతిపెట్టి, మళ్ళీ తవ్వి తీసింది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని 200 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి... మళ్లీ అక్కడ పాతి పెట్టారు. తర్వాత పాతి పెట్టిన శవాన్ని బయటకు తీసి ముక్కలు చేసి సల్ప్యూరిక్ ఆమ్లంలో వేయడంతో మృతదేహం కరిగిపోయింది.

పాట్రిస్ లుముంబాను హత్య చేయాలన్న బెల్జియం, అమెరికా ప్రయత్నాలకు బ్రిటన్ కూడా మద్దతిచ్చినట్లు 20 ఏళ్ల కిందట బయటకు వచ్చిన రహస్య పత్రాల ద్వారా తెలిసింది.

"అమెరికా, బెల్జియం కలిసి ఆఫ్రికన్ జాతీయవాద నాయకుడిని చంపడానికి కుట్ర పన్నే సమయంలో, పశ్చిమ దేశాల ప్రయోజనాలకు లుముంబా ముప్పుగా మారినట్లు బ్రిటిష్ ప్రభుత్వం విశ్వసించింది. అందుకే ఆయన్ని వదిలించుకోవాలని భావించింది" అని చరిత్రకారుడు 'ది అసాసినేషన్ ఆఫ్ లుముంబా' పుస్తక రచయిత లూడో డి విట్టే రాశారు.

లుముంబా అవశేషాల్ని యాసిడ్‌లో కరిగించడాన్ని పర్యవేక్షించిన బెల్జియన్ పోలీస్ కమిషనర్ గెరార్డ్ సోయెట్... లుమూంబా నోటిలోని బంగారపు పన్నును స్వాధీనం చేసుకున్నట్లు అంగీకరించారు.

2022లో బ్రస్సెల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పంటిని లుముంబా కుటుంబానికి తిరిగి అప్పగించారు.

"పాట్రిస్ లుముంబాను డీఆర్‌సీలో హీరోగా భావిస్తారు. ఆఫ్రికన్ వలస వ్యతిరేక ఉద్యమంలో ఆయన ఆఫ్రికన్ ప్రజల గొంతుకగా నిలిచారు" అని బీబీసీ స్పోర్ట్ ఆఫ్రికా జర్నలిస్ట్ రాబ్ స్టీవెన్స్ అన్నారు. కాంగో చరిత్రను గౌరవించడం, ఆ ఉద్యమానికి నైతిక మద్దతు అందించడానికి తాను లుముంబా విగ్రహం మాదిరిగా నిల్చుంటున్నానని మోలాడింగా చెప్పారు.

ఈ ప్రపంచ కప్‌లో డీఆర్‌సీ ఆశలు

కొలంబియాతో డీఆర్‌సీ మ్యాచ్ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు మోలాడింగా నిరాకరించారు.

కొలంబియాతో పాటు డీఆర్ కాంగో అభిమానులు ఆయనతో ఫోటోలు దిగారు. ప్రపంచ కప్‌కు హాజరైనందుకు సంతోషంగా ఉన్నారా అని అడిగితే ఆయన నవ్వారు.

ది లెపర్డ్స్ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ శనివారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అట్లాంటాలో జరగనుంది.

ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. లెపర్డ్స్ టీమ్‌కు మద్దతిస్తు స్టేడియంలో తమ అత్యుత్తమ మద్దతుదారులలో ఒకరు మాత్రం సుప్రసిద్ధ నాయకుడి భంగిమలో నిల్చుని ఉంటారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)