You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫుట్‌బాల్ ప్రపంచకప్: క్యురసావ్ లాంటి బుల్లి దేశానికి సాధ్యమైన పని భారత్‌కు ఎందుకు కావడం లేదు?
- రచయిత, గౌతమ్ భట్టాచార్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
భారత్ ఎప్పటికైనా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడుతుందా?
కిందటివారం ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభం కావడంతో భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పటి నుంచో తమ గుండెల్లో మోస్తూ వస్తున్న ఈ ప్రశ్న మరోసారి బయటకు వచ్చింది.
బ్లూటైగర్స్‌గా పిలిచే భారత పురుషుల ఫుట్‌బాల్ ఆటతీరును గమనిస్తున్నవారికి ఈ ప్రశ్న కొత్తది కాదు. భారత జట్టు ఇప్పటివరకు ఆసియా జోన్ అర్హత పోటీల ప్రాథమిక దశను ఒక్కసారి కూడా దాటలేకపోయింది.
అయితే పశ్చిమ బెంగాల్, కేరళ, గోవాలాంటి రాష్ట్రాల్లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఘనంగా జరుపుకోవడం, పోటీల్లో భారత్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా ఫుట్‌బాల్ వార్తలు అందించేందుకు భారతీయ జర్నలిస్టులు మైదానంలో కనిపిస్తుండటం ఆసక్తికరమైన విషయమే.
‘భారత్ ఫుట్‌బాల్ ఆడుతుందా?’
''భారత్ ఫుట్‌బాల్ ఆడుతుందా అనే ప్రశ్నలు ప్రెస్ బాక్స్‌లో మాకు తరచుగా ఎదురవుతుంటాయి. చాలా మందికి మేం క్రికెట్ ఆడే దేశంగానే తెలుసు'' అని సీనియర్ భారత ఫుట్‌బాల్ జర్నలిస్ట్ ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన నాలుగు వరల్డ్ కప్ వార్తలు అందించారు.
ఇది ఒక్క భారత్ పరిస్థితి మాత్రమే కాదు. ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన చైనా కూడా మరోసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది. అయితే ఈ రెండు దేశాల మార్కెట్ల ప్రాధాన్యం ఫిఫాకు బాగా తెలుసు. అందుకే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల కోసం చివరి నిమిషంలో ప్రసారహక్కుల ఒప్పందం కుదర్చుకోడానికి ఉన్నతస్థాయి బృందాన్ని భారత్‌కు పంపింది.
మరి ప్రపంచకప్ బెర్త్ భారత్‌కు సుదూర స్వప్నమేనా?
అయితే ప్రపంచకప్‌లో చోటు సంపాదించడానికి దగ్గరి దారులు ఏవీ లేకపోయినప్పటికీ అదేమీ అసాధ్యమైన పనికాదంటున్నారు జైచుంగ్ భుటియా. ఈయన భారతీ జాతీయ జట్టు మాజీ కెప్టెన్. భారత్ పుట్‌బాల్‌లో బాగా వినిపించే పేర్లలో జైచుంగ్ పేరు ఒకటి.
''అవును. భారత్ కచ్చితంగా ప్రపంచకప్‌లో ఆడగలదు. 48 జట్లతో విస్తరించిన కొత్త ఫార్మాట్‌లో ఆసియా జట్ల కోటా 8కి పెరిగింది. ఈసారి కాన్ఫిడరేషన్ ప్లే ఆఫ్స్ ద్వారా ఇరాక్ కూడా 9వ జట్టుగా అర్హత సాధించింది. ఉజ్బెకిస్తాన్, జోర్డాన్ వంటి దేశాలు ఆడుతున్నాయి. అయితే అందుకోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది'' అన్నారు.
‘ఫుట్‌బాల్‌లోనూ మంచి కెరీర్’
భారత్ వంటి పెద్ద దేశంలో ప్రతిభకు కొరత లేదన్నది భుటియా పేర్కొన్నారు.
''సరైన వ్యవస్థ లేకపోవడమే లోపం. దీర్ఘకాలిక దృష్టితో కూడిన పటిష్టమైన మౌలిక కార్యాచరణ లేదు. ప్రపంచంలో ఫుట్‌బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆట. ఫలితాలు కనిపించాలంటే మనకు సమయం పడుతుంది'' అని భుటియా చెప్పారు.
1970 ఆసియా క్రీడల్లో భారత్ కాంస్యం గెలవడంలో ప్రతిభ కనబర్చిన 78ఏళ్ల శ్యామ్ థాపా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పునాది స్థాయి నుంచి ఫుట్‌బాల్ క్రీడను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని, ఎక్కువమంది పిల్లలను ఈ ఆట ఆడేలా చేయాలని సూచించారు. థాపా మాటల్లో కొంత అసహనం ధ్వనించింది.
తెలివైన స్ట్రైకర్‌గా, బైసికిల్-కిక్ గోల్స్‌తో గుర్తింపు పొందిన థాపా భారత్‌లో ఫుట్‌బాల్ పరిస్థితిపై ఓ విశ్లేషణ చేశారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఫుట్‌బాల్‌కు దూరంగా ఉంచి క్రికెట్ వైపు మళ్లిస్తున్నారని చెప్పారు.
''నేను చాలా ఏళ్లుగా యూత్ అకాడమీ నడుపుతున్నా. ఎంత ఎక్కువమంది చిన్నారులు ఫుట్‌బాల్ ఆడితే అంత ఎక్కువమంది ప్రతిభావంతులను గుర్తించే వీలుంటుంది. కానీ అలాంటి వ్యవస్థ ఏర్పాటు కోసం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఏం చేసింది’’ అని ఆయన ప్రశ్నించారు.
''చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను క్రికెట్ కోచింగ్ క్యాంపులకు తీసుకెళ్తారు. క్రికెట్‌లో రాణిస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లాభదాయకమైన ఒప్పందం వస్తుందనే ఆశతో ఉన్నారు’’ అని థాపా అన్నారు.
''ఫుట్‌బాల్‌లో కూడా కెరీర్ నిర్మించుకుంటే ఆదాయం సంపాదించే అవకాశాలు ఉంటాయని వారు అర్థం చేసుకోవాలి’’ అంటారు థాపా.
‘ముందుకు కాదు....మరింత వెనక్కి’
ఈ సారి ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన తొమ్మిది ఆసియా జట్లను గమనిస్తే భారత్ ముందున్న సవాల్ ఎంత పెద్దదో అర్ధమవుతుంది.
ఆస్ట్రేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, దక్షిణ కొరియా, ఉజ్జెకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలకు ప్రాతినిధ్యం లభించింది. తొలిసారి ప్రపంచకప్ ఆడేందుకు జోర్డాన్, ఉజ్జెకిస్తాన్ సుదీర్ఘకాలం ఎదురుచూశాయి.
తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న రెండు దేశాల ర్యాంకింగులు యాదృచ్ఛికంగా భారత్ కంటే ముందున్నాయి.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఉజ్బెకిస్తాన్ 52వస్థానంలో ఉంది. జోర్డాన్ 63వ స్థానంలో ఉంది. గత 18నెలల్లో భారత్ స్థానం వేగంగా పడిపోయింది. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 136వస్థానంలో ఉంది.
భారత ఫుట్‌బాల్ ముందున్న సవాళ్ల తీవ్రతకు ఈ ర్యాంకింగ్స్ అద్దం పడుతున్నాయి. భారత మాజీ ఆటగాడు కల్యాణ్ చౌబే 2022లో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షులయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి మాజీ ఆటగాడు ఆయన. ''భారత్ ఎనిమిదేళ్లలో వరల్డ్ కప్ ఆడుతుంది వంటి కలల గురించి నేను మాట్లాడను. దానికి బదులు నేను చెప్పేదేంటంటే భారత ఫుట్‌బాల్‌ను ఇప్పుడున్న స్థితి నుంచి ముందుకు తీసుకెళ్తాం' అని కల్యాణ్ చౌబే అన్నారు.
ఆయన ఈ మాటలు చెప్పి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. మరి యంత్రాంగం ఈ దిశగా విజయవంతమైందా అన్నదే ప్రశ్న.
గడచిన మూడేళ్లకాలంలో భారత ఫుట్‌బాల్ క్రీడను వేగంగా అభివృద్ధి చేయడానికి బదులు ఏఐఎఫ్ఎఫ్ పరిహాసానికి గురయ్యే సంస్థగా మారిందని చాలామంది భావిస్తున్నారు.
ఇండియన్ సూపర్ లీగ్ పరిస్థితేంటి?
2014లో ఫెడరేషన్ భారీ ప్రచారంతో దేశీయ క్లబ్ టోర్నమెంట్ ప్రారంభించింది. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)పేరుతో దీన్ని ప్రారంభించింది. వ్యాపార, బాలీవుడ్, క్రికెట్ వర్గాల నుంచి పెద్ద పెద్ద పేర్లు ఈ ఆటలో వినిపించాయి. అది ప్రొఫెషనల్‌గా నడిచింది. మంచి విదేశీ ప్లేయర్లను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు దాని భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది.
వాణిజ్య భాగస్వామ్యం కోసం బిడ్డర్లను ఆకర్షించడంలో ఎఐఎఫ్ఎఫ్ విఫలమవడంతో తాజా ఐఎస్ఎల్ సీజన్ బాగా ఆలస్యమయింది. దీనివల్ల వందలమంది ఫుట్‌బాల్ క్రీడాకారుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆటపై ప్రతికూల ప్రచారం పెరిగింది.
ఎలాంటి వాణిజ్య భాగస్వాములు లేకుండా చివరకు టోర్నమెంట్‌ను కుదించి నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు తర్వాతి సీజన్ కోసం ఫెడరేషన్ ప్రణాళికలు రచిస్తోంది.
మరోపక్క 2047 నాటికి 3కోట్ల50లక్షల మంది పిల్లలను ఫుట్‌బాల్‌లోకి తీసుకురావాలని చౌబే దీర్ఘకాలిక లక్ష్యం ఏర్పరుచుకున్నారు. కానీ ఇప్పుడది మర్చిపోయిన ఎన్నికల హామీలా కనిపిస్తోంది. భారీ లక్ష్యాలకు, క్షేత్రస్థాయి ఫలితాలకు మధ్య పొంతన ఉండడం లేదు.
ఇన్విటేషనల్ టోర్నమెంట్, దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ చాంపియన్‌షిప్ గెలుచుకుని భారత పురుషుల జట్టు ఫిఫా టాప్ 100 జాబితాలో తిరిగి చోటు సంపాదించడం ఆశలు రేకెత్తించింది. కానీ ఆ తర్వాత ఇలాంటి పురోగతి కనిపించలేదు.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ జట్లలో మూడో రౌండ్‌కు చేరుతుందనే ఆశలు రేకెత్తించిన భారత జట్టు చివరకు ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అనంతరం వచ్చే ఏడాది జరిగే ఏఎఫ్‌సీ ఆసియా కప్‌కు అర్హత సాధించడంలోనూ విఫలమైంది.
భారత్ తక్షణ లక్ష్యం ఆసియా కప్‌కు అర్హత సాధించడం. ఈ ఖండంలోని 24 అగ్రశ్రేణి జట్లు ఇందులో పాల్గొంటాయి.
భారత్ ఎందుకు ఆడలేకపోతోంది?
వాస్తవికమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి మీడియా చిట్‌చాట్‌లో అన్నారు . రిటైర్మెంట్ తర్వాత 2025లో తిరిగి ఆయన జట్టులోకి చేరాడు.
''ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యాలు పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఆసియా కప్పుకు క్వాలిఫై అవ్వడం మన లక్ష్యంగా ఉండాలి. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. మనం ఓ సారి ఆసియా దేశాల్లో 15నుంచి 20 అత్యుత్తమ జట్ల జాబితాలోకి చేరినప్పుడు మాత్రమే వరల్డ్ కప్ గురించి ఆలోచించాలి'' అని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అయితే విదేశాల్లో పౌరసత్వం పొందిన భారత సంతతి ఆటగాళ్లను (ఓసీఐ కార్డ్ హోల్లర్డు) భారత్ తరఫున ఆడే అవకాశం కల్పించాలంటూ ఏఐఎఫ్ఎఫ్ నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.
ప్రస్తుతం విదేశీ పాస్‌పోర్టులు కలిగిన భారత సంతతి ఆటగాళ్లు భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే ఆ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో పుట్టిన ర్యాన్ విలియమ్స్ అదే చేశాడు. భారత జట్టులోకి వచ్చాక బాగా రాణించి విలువైన ఆటగాడుగా తనను తాను నిరూపించుకున్నాడు.ఇలాంటి విధానపరమైన మార్పు వస్తే భారత ఫుట్‌బాల్‌కు చాలా ప్రయోజనం కలుగుతుంది.
ఇప్పటివరకైతే ఇవ్వన్నీ అవకాశాల స్థాయిలోనే ఉన్నాయి.
అప్పటిదాకా భారత్ అభిమానులు దూరం నుంచే మెస్సీ, రొనాల్డో, నేమార్స్ వంటి స్టార్లకు మద్దతు ఇస్తూ ప్రపంచ కప్ చూడాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా క్యురసావ్ వంటి చిన్న దేశం తొలిసారి వరల్డ్ కప్ ఆడడాన్ని ఆశ్చర్యంతో గమనిస్తుండాలి.
అయితే ఒక ప్రశ్నమాత్రం వెంటాడుతూనే ఉంటుంది.
క్యురసావ్ లాంటి బుల్లి దేశానికి సాధ్యమైన పని భారత్‌లాంటి పెద్ద దేశానికి ఎందుకు సాధ్యం కావడంలేదు?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)