You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేల నెమలి: ఆర్నెళ్లు తెలంగాణలో, ఆర్నెళ్లు గుజరాత్‌లో.. వర్షాకాలంలో రంగు, రూపు మారే ఈ పక్షులు అంతరించిపోతున్నాయా
- రచయిత, గోపాల్ కటేషియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా, వేళావదర్ గ్రామం సమీపంలో ఉన్న బ్లాక్‌బక్ జాతీయ ఉద్యానవనం (కృష్ణ జింకల పార్కు) రుతుపవన వర్షాల కారణంగా ప్రస్తుతం పచ్చటి గడ్డితో నిండిపోయింది
ఇందులో కృష్ణ జింకలు, నీల్గాయ్ తదితర జంతువులు కనిపిస్తాయి.
అయితే 34 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఉద్యానంలో అధికారులతో పాటు పరిశోధకుల దృష్టి మాత్రం ప్రస్తుతంనేల నెమలి (లెస్సర్ ఫ్లోరికన్) పక్షులపైనే ఉంది.
మగ నేల నెమలి పాటలు పాడుతూ, నేలపై గెంతులు వేస్తున్నట్లు ఎగురుతూ, ఉద్యానవన వాతావరణాన్ని నాట్యగానాలతో సంగీతమయం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఈ ఉద్యానంలో నేల నెమలి కోసం ప్రభుత్వం ఒక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ పక్షి జనాభాను పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఏటా ప్రభుత్వం ఈ పక్షులను లెక్కిస్తుంది.
ఈ ఏడాది ఆగస్టు 19న లెక్కింపును చేపట్టారు. లెక్కింపు సందర్భంగా జాతీయ ఉద్యానంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో 28 నేల నెమళ్లను గుర్తించినట్లు బ్లాక్‌బక్ నేషనల్ పార్క్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ నీలేష్ జోషి బీబీసీకి తెలిపారు.
వీటిలో 22 పక్షులు పార్క్ సరిహద్దు లోపల ఉండగా ఆరింటిని పార్కు సమీప ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు.
ఈ 28 పక్షుల్లో 22 మగవి కాగా మిగతావి ఆడవని సదరు అధికారి వెల్లడించారు.
ఆడ నేల నెమళ్లకు చాలా సిగ్గుపడే స్వభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవి కదలకుండా ఉన్నప్పుడు వాటి రంగు, రూపురేఖల కారణంగా గడ్డి మైదానంలో మనుషుల కంటికి అంత సులభంగా కనిపించవు.
కానీ, వర్షాకాలంలో మగ నేల నెమలి రంగు, రూపురేఖలు మారుతాయి కాబట్టి అవి మనుషుల కంటికి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ ఏడాది వేళావదర్‌తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 42 నేల నెమలి పక్షులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
వర్షాకాలంలోనే ఎందుకు వస్తున్నాయి?
వర్షాకాలంలో నేల నెమళ్లు వేళావదర్‌తో పాటు కచ్‌లోని కచ్ బస్టర్డ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, దాని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.
వర్షాకాలం తర్వాత ఈ పక్షులు ఎక్కడికి వెళతాయి, ఎక్కడెక్కడ ఆగుతాయి తదితర అంశాలను అధ్యయనం చేయడానికి గుజరాత్ అటవీ శాఖ అధికారులు, ద కార్బెట్ ఫౌండేషన్ సంస్థ, భావ్‌నగర్‌లోని మహారాజా కృష్ణకుమార్‌సిన్హ్‌జీ భావ్‌నగర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 2020 నుంచి 2025 వరకు ఒక అధ్యయనం చేపట్టారు.
ఈ అధ్యయనంలో భాగంగా సాసన్ వన్యప్రాణి విభాగం అప్పటి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ మోహన్ రామ్, ద కార్బెట్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవేష్ గధ్వితో పాటు పలువురు నిపుణులు 2020లో వేళావదర్‌లోని ఒక మగ, ఒక ఆడ నేల నెమలి పక్షులకు శాటిలైట్ ట్యాగ్‌లు అమర్చారు.
ఈ ట్యాగ్‌లు శాటిలైట్ లేదా మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ టవర్‌లకు సిగ్నల్స్ పంపుతూ, ట్యాగ్ చేసిన పక్షులు ఎగిరి ఎక్కడికి వెళుతున్నాయి, పగలు ఎక్కువ ఎగురుతాయా లేక రాత్రా, ఎంత ఎత్తులో ఎగురుతాయి, ఏ ప్రదేశంలో ఎంత సమయం గడుపుతాయి తదితర సమాచారాన్ని పంపుతూ వచ్చాయి.
శాటిలైట్, మొబైల్ నెట్‌వర్క్‌ల సహాయంతో 2025 జనవరి వరకు ఈ పక్షులపై అధ్యయనం చేశారు. ఆ ఫలితాలను 2026 ఆగస్టు 19న ప్రచురించిన ఒక పరిశోధన పత్రంలో పొందుపరిచారు.
ట్యాగ్ చేసిన ఒక ఆడ నేల నెమలి పక్షి 2020 నవంబర్‌లో వేళావదర్ నుంచి ఎగిరి 776 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెలంగాణకు చేరుకుందని పరిశోధనలో తేలింది.
అక్కడ ఆరు నెలలు గడిపి తిరిగి గుజరాత్ వైపు వస్తుండగా మహారాష్ట్రలో ఒక హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలి ఆ పక్షి మరణించింది.
ఒక మగ పక్షి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మధ్య వలస ప్రయాణం చేసిందని ట్యాగ్‌ల సహాయంతో పరిశోధకులు తెలుసుకోగలిగారు.
మరో మగ పక్షి గుజరాత్ నుంచి ఎగిరి మహారాష్ట్ర మీదుగా కర్ణాటకకు వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ మహారాష్ట్ర మీదుగా గుజరాత్‌కు తిరిగి వచ్చింది. ఆ తర్వాత గుజరాత్ నుంచి రాజస్థాన్ వెళ్లి, అక్కడి నుంచి గుజరాత్‌కు తిరిగి వచ్చి, మళ్లీ మహారాష్ట్ర-కర్ణాటక ప్రయాణానికి బయలుదేరింది.
"సంతానోత్పత్తి సమయంలో ఆడ పక్షులను ఆకర్షించడానికి మగ పక్షులు ప్రణయ నృత్యం చేస్తాయి. ఆడ పక్షులకు కనిపించేలా ఇవి నాట్యం చేయడానికి వీలుగా చిన్న గడ్డి అవసరం అవుతుంది. మరోవైపు ఆడ పక్షులకు కూడా గూడు కట్టుకోవడానికి చిన్న గడ్డి అవసరం" అని డాక్టర్ మోహన్ రామ్ బీబీసీతో చెప్పారు.
"సంతానోత్పత్తి కోసం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నేల నెమళ్లు, ముఖ్యంగా బ్లాక్‌బక్ జాతీయ ఉద్యానవనం, కచ్ బస్టర్డ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో భారీ సంఖ్యలో గుమిగూడతాయి" అన్నారాయన.
"సంతానోత్పత్తి కాలం ముగిసిన తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో, ముఖ్యంగా మగ పక్షులు సాధారణంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలకు వెళ్లిపోతాయి. కొన్ని ఆడ పక్షులు కూడా ఈ విధంగానే వలస ప్రయాణాలు చేస్తాయి" అని డాక్టర్ రామ్ తెలిపారు.
నేల నెమళ్లు ఎందుకు ప్రత్యేకం?
నేలనెమలి అనేది బస్టర్డ్ కుటుంబానికి చెందిన పక్షి జాతి. ఈ కుటుంబానికి చెందిన నాలుగు రకాల పక్షులు భారతదేశంలో కనిపిస్తాయి. అవి - గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, నేల నెమలి (లెస్సర్ ఫ్లోరికన్), ఏషియన్ హౌబారా (లేదా మాక్‌క్వీన్స్ బస్టర్డ్), బెంగాల్ ఫ్లోరికన్.
ప్రపంచంలోని బస్టర్డ్ కుటుంబ పక్షుల్లో పరిమాణంలో అతి చిన్నది నేలనెమలి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, నేల నెమలి, ఏషియన్ హౌబారా పక్షులు మూడూ ఒకేచోట కనిపించే ఏకైక ప్రదేశం కచ్ బస్టర్డ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.
నేల నెమలి గడ్డి మైదానాల్లో నేలపైన నివసించే పక్షి. మిడతలు, కీటకాలు తదితరాలు వీటికి ఆహారం. మరో మాటలో చెప్పాలంటే, ఈ జీవుల జనాభాను అదుపులో ఉంచుతూ వ్యవసాయ పంటలను నేల నెమలి కాపాడుతుంది.
నేల నెమళ్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది?
దేశంలో నేల నెమళ్ల సంఖ్యను అంచనా వేయడానికి వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ సుతీర్థ దత్తా, ఇతర శాస్త్రవేత్తలు ఒక సర్వే నిర్వహించారు. 2018లో ఈ ఫలితాలను ప్రకటిస్తూ, దేశంలో కేవలం 480 నేల నెమళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.
1999లో ఈ సంఖ్య సుమారు 3,530 గా ఉండేదని వారు గుర్తించారు. అలా రెండు దశాబ్దాల వ్యవధిలో ఈ పక్షి జనాభా 80 శాతం మేర పడిపోయింది. చాలా తక్కువ పక్షులు మిగిలి ఉండటంతో, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే అంతర్జాతీయ సంస్థ నేల నెమలిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతుల జాబితాలో చేర్చింది.
నేల నెమలి పక్షులకు వేళావదర్ ఎంతో కీలకమని సుతీర్థతో పాటు ఇతర శాస్త్రవేత్తలు తమ సర్వేలో గుర్తించారు. ఎందుకంటే, ఈ గడ్డి మైదానం సుమారు 95 నుంచి 115 మగ నేల నెమలి పక్షులకు ఆవాసంగా ఉంటుందని అంచనా వేశారు.
"గడ్డి మైదానాల సమీపంలోని భూముల్లో ఒకప్పుడు ఏడాదికి ఒక పంట మాత్రమే పండించేవారు. ఇప్పుడు మూడు పంటలు పండిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణ పెరుగుతోంది, కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా విస్తరిస్తోంది. ఈ కారణం వల్ల నేల నెమలి ఆవాసాలు తగ్గిపోయాయి. అందుకే నేల నెమళ్ల సంఖ్య తగ్గింది" అని మోహన్ రామ్ చెప్పారు.
"కొన్ని సహజ కారణాలు కూడా దీనికి బాధ్యత వహిస్తున్నాయి. నేల నెమలి సంతానోత్పత్తి వర్షాకాలంలో కురిసే వర్షాలతో నేరుగా ముడిపడి ఉంటుంది. వర్షాలు సమయానికి రాకపోయినా, తక్కువగా కురిసినా వాటి సంతానోత్పత్తి జరగదు" అని వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)