You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పోలీసులకే ‘నేనో అండర్ కవర్ ఏజెంటును, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారిని’ అని చెప్పిన నకిలీ ఐఏఎస్ అరెస్ట్... అసలేం జరిగింది?
- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
బిహార్‌లోని ఖగరియా పోలీసులు ఆగస్టు 8న మనీష్ కుమార్ అలియాస్ మనీష్ కుమార్ గుప్తాను అరెస్ట్ చేశారు. కానీ, ఆయన్ని తమ పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించలేకపోయారు.
ఖరీదైన టెస్లా కారులోనే ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగలిగారు. ఆ టెస్లా కారు పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం కావడమే ఇందుకు కారణం.
ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక జర్నలిస్ట్ రణ్‌వీర్ కుమార్ అసలేం జరిగిందో బీబీసీకి వివరించారు.
'తాను డ్రైవర్ సీట్లో కూర్చోకపోతే కారు ముందుకు కదలదని పోలీసులకు మనీష్ చెప్పారు. తర్వాత ముందు డ్రైవర్ సీట్‌లో మనీశ్, దాని పక్క సీటులో ఆయన డ్రైవర్ కూర్చున్నారు. వెనుక సీట్లో ఎస్సై కూర్చున్నారు. ఇప్పుడు ఆ కారు పోలీస్ స్టేషన్‌లో ఉంది. ప్రజలు ఆ కారును చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు" అని రణ్‌వీర్ కుమార్ వివరించారు.
తాను ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ తిరుగుతున్నాడనే ఆరోపణలపై మనీష్ కుమార్ గుప్తాను ఆగస్టు 8న ఖగరియా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖగరియాలోని గోగ్రి పోలీస్ స్టేషన్‌కు కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే గత పదేళ్లుగా మనీష్ నివసిస్తున్నారు. తానొక ఐఏఎస్ అధికారినంటూ ఆ ఏరియాలో మనీష్ చెప్పుకుంటూ తిరిగేవారు.
తాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌కు అండర్‌కవర్ ఏజెంట్‌నని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారినని కూడా మనీష్ చెప్పుకునేవాడు.
మనీష్ గుప్తా చెబుతున్న ఈ విషయాలన్నీ ప్రాథమిక విచారణలోనే పూర్తిగా బూటకమని తేలాయని ఖగరియా ఎస్పీ భాను ప్రతాప్ సింగ్ తెలిపారు.
మనీష్ గుప్తా ఎవరు?
బిహార్‌లోని ఖగరియా జిల్లా గోగ్రి బజార్‌లో ఒక ఐదు అంతస్తుల విలాసవంతమైన భవనం ఉంది. గోగ్రి మెయిన్ బజార్‌లో ఎవరికీ ఇంత విలాసవంతమైన ఇల్లు లేదని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఇంట్లోనే 49 ఏళ్ల మనీష్ కుమార్ ఒంటరిగా ఉండేవారు.
మనీష్‌కుమార్ గురించి అందిన రహస్య సమాచారంతో ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటల సమయంలో గోగ్రి పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు.
"ఆ ఇంటి ముందు ఒక వ్యక్తి కళ్లద్దాలు, హాఫ్ ప్యాంటు వేసుకుని తిరుగుతున్నారు. ప్రశ్నించగా తన పేరు మనీష్ కుమార్ గుప్తా అని, తాను ఐఏఎస్ అధికారినని చెప్పారు'' అని గోగ్రి స్టేషన్ ఇన్‌చార్జ్ అరవింద్ కుమార్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
''ఆయన తన మొబైల్‌లో ఒక గుర్తింపు కార్డు చూపించారు. ఆ కార్డుపై 'సెంట్రల్ విజిలెన్స్ కమిషన్' అని ఉంది. ఐడీ కార్డు మీద 0577102 అనే నంబర్, హోదా 'చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్'అని రాసి ఉంది.
మరిన్ని వివరాలు అడగగా, తాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అండర్‌కవర్ ఏజెంట్‌నని చెప్పారు.
మనీష్ కుమార్ ఇంటి ముందు నలుపు రంగు టెస్లా కారు, తెలుపు రంగు సఫారీ కారు ఉన్నాయి. వాటిపై 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' అనే బోర్డులు ఉన్నాయి'' అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
పోలీసులు ఆ రెండు కార్ల గురించి అడగ్గా, అవి రెండూ తనవేనని మనీష్ ఒప్పుకున్నారు. మనీష్ చెప్పిన విషయాలు, ఆయన తీరు సందేహాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఇంట్లో 29 బ్రాండ్ల విదేశీ మద్యం, దుప్పి కొమ్ములు...
మనీష్ కుమార్ గుప్తా వ్యక్తిగత వివరాలను గోగ్రి ఎస్డీపీఓ చందన్ కుమార్ వెల్లడించారు.
"మనీష్ గుప్తా తల్లిదండ్రులు చనిపోయారు. వారు మొత్తం నలుగురు సోదరులు. మనీష్ మినహా మిగిలిన సోదరులంతా వేరేచోట ఉంటున్నారు.
వారి సోదరుల్లో ఒకరు విదేశాల్లో ఉన్నారు. బహుశా ఇంగ్లండ్‌లో ఉంటుండొచ్చు. మరో ఇద్దరు సోదరుల్లో ఒకరు దిల్లీలో పనిచేస్తున్నారు. ఈ ఇంట్లో మనీష్ గుప్తా ఒక కేర్‌టేకర్‌తో కలిసి ఉండేవారు'' అని ఆయన తెలిపారు.
మనీష్ ఇంట్లో సోదాలు చేయడానికి పోలీసులకు చాలా సమయం పట్టింది.
కిచెన్, వరండాలోని అల్మారాలో దాచిన 31 లీటర్ల విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఖగరియా పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో మనీష్ ఇంట్లో లభించిన మొత్తం 29 బ్రాండ్ల మద్యం పేర్లను పేర్కొన్నారు. విదేశీ మద్యంతో పాటు 10 లీటర్ల బీర్, 30 లీటర్ల సోడా బాటిళ్లు కూడా దొరికాయని పేర్కొన్నారు.
మనీష్ వద్ద 20 క్రెడిట్ కార్డులు, 8 డెబిట్ కార్డులు, 4 చెక్‌బుక్‌లు లభించినట్లు పోలీసులు చెప్పారు. వీటితో పాటు రెండు ఆపిల్ ల్యాప్‌టాప్‌లు, 5 ఆపిల్ మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
''అక్కడ దొరికిన క్రెడిట్, డెబిట్ కార్డులు, చెక్‌బుక్‌లలో ఎక్కువభాగం మనీష్ పేరు మీదే ఉన్నాయి. కొన్నింటిపై మాత్రం ఆర్‌ఎన్ కుమార్, ముఖేష్ కుమార్ గుప్తా, అజిత్ కుమార్ వంటి ఇతర వ్యక్తుల పేర్లపై ఉన్నాయి.ఇవే కాకుండా మనీష్ ఇంట్లో రెండు దుప్పి కొమ్ములు కూడా దొరికాయి'' అని పోలీసులు వెల్లడించారు.
అనర్గళంగా ఇంగ్లిష్ ,అధికార దర్పం చూపే శరీరభాష
మనీష్ కుమార్ ఇంత సులభంగా అందరినీ ఎలా మోసం చేయగలిగారు?
ఈ ప్రశ్నకు స్థానిక జర్నలిస్ట్ రణ్‌వీర్ కుమార్ సమాధానమిచ్చారు.
మనీష్ తండ్రి పరమేశ్వర్ ప్రసాద్ గుప్తా స్థానిక కేడీఎస్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారని రణ్‌వీర్ చెప్పారు. ఆయనకు గతంలోనే కొన్ని ఆస్తులు ఉన్నాయని తెలిపారు.
''ఇప్పుడు మనీష్ ఇంటి ముందున్న పెద్ద తోట ఒకప్పుడు వ్యవసాయ భూమి. సుమారు ఆరేళ్ల క్రితం మనీష్ ఆ భూమిని తోటగా మార్చి, విలాసవంతమైన భవనాన్ని నిర్మించడం ప్రారంభించారు.
ఇంటి బయట ఎప్పుడూ ఇద్దరు కాపలాదారులు ఉండేవారు. ఎవరినీ ఇంట్లోకి వెళ్లనిచ్చేవారు కాదు. మనీష్ ఒంటరిగా ఉండేవారు. ఎవరితోనూ కలిసేవారు కాదు. పదో తరగతిలో అతను ఖగరియా జిల్లా టాపర్ అని స్థానికులు చెబుతారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. మనీష్‌కు ఇంకా పెళ్లి కాలేదు'' అని ఆయన వివరించారు.
"మనీష్ కొన్నేళ్లపాటు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేవారు. దాంతో అతను ఐఏఎస్ కాదని ఎవరికీ అనుమానం రాలేదు" అని ఎస్డీపీవో చందన్ కుమార్ అన్నారు.
"మనీష్ గత 8-10 ఏళ్లుగా ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటున్నాడు. అయినా ఇన్నాళ్లూ చట్టం నుంచి తప్పించుకు తిరిగాడు. ఒక అధికారి ఎలా ఉంటాడో తన బాడీ లాంగ్వేజ్‌ను అలా మార్చుకున్నాడు" అని ఎస్పీ భాను ప్రతాప్ సింగ్ తెలిపారు.
పోలీస్ కస్టడీ కోసం ఎదురుచూపులు
ఆగస్టు 9న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహితలోని 204, 205, 212, 213, 318(2), 319(2), 336(3), 340(2) సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి.
వీటితో పాటు జమ్మూకశ్మీర్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978లోని సెక్షన్ 51ని కూడా చేర్చారు.
ఇంట్లో మద్యం దొరికిన వ్యవహారంలో ప్రత్యేకంగా మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ప్రభుత్వ అధికారిగా నమ్మించడం, మోసపూరిత ఉద్దేశంతో ప్రభుత్వ చిహ్నాలను వాడటం, ఫోర్జరీకి పాల్పడటం వంటి అంశాలపై ప్రధానంగా బీఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేశారు.
ప్రస్తుతం మనీష్ కుమార్, ఖగరియా డివిజనల్ జైలులో ఉన్నారు.
ఈ కేసును ఆర్థిక నేరాల విభాగం (ఈఓయూ) బృందం ఇప్పటికే ఒకసారి పరిశీలించిందని బీబీసీతో గోగ్రి ఎస్డీపీఓ చందన్ కుమార్ చెప్పారు.
'మాకు ఇంకా మనీష్ గుప్తా రిమాండ్ దక్కలేదు. సోమవారానికి రిమాండ్ వస్తుందని భావిస్తున్నాం" అని చందన్ కుమార్ అన్నారు.
ఎస్పీ భాను ప్రతాప్ సింగ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. మేం చేసిన వాట్సాప్ మెసేజ్‌లకు కూడా ఆయన స్పందించలేదు.
విదేశాల్లోనూ ఆస్తులు ఉండే అవకాశం
పోలీసుల సమాచారం ప్రకారం.. మనీష్ కుమార్, బిహార్‌లోని వేర్వేరు జిల్లాల్లో మోసాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం పోలీసులు ఆయన ఆస్తుల విలువను లెక్కిస్తున్నారు.
మనీష్ కుమార్‌కు దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని పలు మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. అయితే వీటిని అధికారులెవరూ ధ్రువీకరించలేదు.
మనీష్ కుమార్ అరెస్టు తర్వాత ఖగరియా ఎస్పీ భాను ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, ''సాధారణంగా టెస్లా లాంటి కార్లు ఇక్కడ కనిపించవు. ఈ కేసులో మేం ఆర్థిక నేరాల విభాగం (ఈఓయూ) లాంటి పలు దర్యాప్తు సంస్థల సాయం తీసుకుంటున్నాం.
మనీష్ గుప్తా ఆస్తుల విలువను లెక్కిస్తున్నాం. ఈ ఆస్తులను ఎలా సంపాదించాడనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.
ఈ కేసులో ఆర్థిక మోసాలతో పాటు ప్రజలపై దౌర్జన్యాలు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటివి ఉన్నాయి.
మనీష్‌కు బీహార్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందింది. దీనిపై విచారణ జరుపుతున్నాం. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఈ కేసుపై పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతోంది" అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)