ఎర్లింగ్ హాలాండ్ కొత్త హెయిర్‌స్టైల్

    • రచయిత, జూడ్ వింటర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

జ్లాటన్ ఇబ్రహీమోవిచ్, గారెత్ బేల్, ఎర్లింగ్ హాలాండ్... ఫుట్‌బాల్‌లో పొడవాటి జుట్టుతో కనిపించిన ఆటగాళ్లలో వీరి 'మ్యాన్ బన్' (జుట్టు ముడి) హెయిర్‌స్టైల్స్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

అయితే, కొత్త ప్రీమియర్ లీగ్ సీజన్‌ను హాలాండ్(26) మాత్రం పూర్తిగా భిన్నమైన లుక్‌తో ప్రారంభించబోతున్నాడు.

ఈ మాంచెస్టర్ సిటీ స్ట్రైకర్ తన జుట్టును కత్తిరించుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు. ''కొత్త సీజన్.. కొత్త హెయిర్‌స్టైల్'' అంటూ క్యాప్షన్ పెట్టాడు.

ఆదివారం ఎంజో మారెస్కా నేతృత్వంలోని మాంచెస్టర్​ సిటీ జట్టు బోర్న్‌మౌత్‌ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో హాలాండ్ కొత్త లుక్​లో కనిపించాడు.

జుట్టు కత్తిరించుకునే ముందు, హాలాండ్ తన కెరీర్‌లోని పాత హెయిర్‌స్టైల్స్ చిత్రాలను చూపిస్తూ సరదాగా జోకులు వేశాడు.

కొత్త హెయిర్‌స్టైల్ ఎలా ఉండాలనే దానిపై కొన్ని వింత ఆలోచనలను కూడా పంచుకున్నాడు.

'17 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నావు'

జుట్టును హెయిర్‌డ్రెస్సర్ కత్తిరిస్తుండగా హాలాండ్ కాస్త కంగారుగా కనిపించినప్పటికీ, కొత్త లుక్ చూసిన కొద్దిసేపటికే నవ్వడం మొదలుపెట్టాడు.

మాంచెస్టర్​ సిటీ జట్టు సహచరుడు జాక్ గ్రీలిష్, ఒయాసిస్ బ్యాండ్ సభ్యుడు నోయెల్ గల్లాఘర్, సిటీ మాజీ మేనేజర్ పెప్ గ్వార్డియోలాకు హాలాండ్ వీడియో కాల్స్ చేసినప్పుడు మిశ్రమ స్పందనలు వచ్చాయి.

"నువ్వు 17 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నావు. ఇది బాగుంది. మార్పు మంచిదే" అని గల్లాఘర్ అన్నాడు.

గ్రీలిష్, గ్వార్డియోలా ఇద్దరూ ఈ మార్పు తమకు "చాలా నచ్చింది" అని చెప్పారు.

"నువ్వు 10 ఏళ్ల పిల్లాడిలా ఉన్నావు. ఇది చాలా నవ్వు తెప్పిస్తోంది. నీ ముందు జుట్టు వైపు చూడకుండా ఉండలేకపోతున్నాను. నాకిది బాగా నచ్చింది" అని గ్రీలిష్ అన్నాడు.

"నమ్మలేకపోతున్నాను. నీకు జుట్టు ఉన్నందుకు నువ్వు అదృష్టవంతుడివి. నాకు కూడా అలాంటి జుట్టు ఉంటే బాగుండేది. ఇది నాకు చాలా నచ్చింది" అని గ్వార్డియోలా అన్నాడు.

ఇబ్రాహిమోవిచ్‌కు కాల్ చేయడానికి ముందు హాలాండ్ ఓ సరదా విషయం చెప్పాడు. తన పొడవాటి జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోవద్దని ఆ మాజీ స్వీడన్ ఆటగాడు తనకు సూచించాడని అన్నాడు.

"నీ జుట్టును ఎప్పుడూ కత్తిరించవద్దు, ఎందుకంటే నీ బలం నీ జుట్టులోనే ఉందని జ్లాటన్ నాతో అన్నాడు. నాకు కాస్త కంగారుగా ఉంది. నాకు మిలిటరీ వాళ్ల లాగా బజ్ కట్ కావాలి" అని హాలాండ్ చెప్పాడు.

అయితే, హాలాండ్ తన మాట వినకపోవడంపై ఇబ్రాహిమోవిచ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

''నువ్వేం చేశావు? ఏదైనా పందెంలో ఓడిపోయావా? నన్ను బ్లాక్ చేయి.. నా నంబర్ కూడా డిలీట్ చేయి'' అని ఇబ్రాహిమోవిచ్ అన్నాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)