You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహిళలు, పిల్లలు సహా సముద్రంలో ప్రయాణిస్తున్న ఆ 530 మంది ఏమయ్యారు?
- రచయిత, జొనాథన్ హెడ్
- హోదా, సౌత్-ఈస్ట్ ఏషియా కరెస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
మియన్మార్‌లోని రఖాయిన్ రాష్ట్రం నుంచి జూన్ 29న రెండు పడవల్లో బయలుదేరిన సుమారు 530 మంది రోహింజ్యాలు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియలేదు.
వీరంతా గల్లంతైనట్లు భావిస్తున్నారు. ఈ రెండు పడవలు సముద్రంలో మునిగిపోయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆ ప్రాంతంలో రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
వారు ప్రయాణిస్తున్న పడవలు చేపల వేటకు ఉపయోగించే పాత పడవలు. అవి అన్నివేళలా సముద్రంలో ప్రయాణించే స్థితిలో ఉండవు. వాటి ఇంజిన్లు కూడా అంత దూరం ప్రయాణించేందుకు నమ్మకం పెట్టుకోదగినవి కావు.
ప్రయాణికుల్లో చాలామంది చనిపోయి ఉండొచ్చన్న ఆందోళనలున్నాయి. వీరిలో దాదాపు సగం మంది ప్రయాణికులు మహిళలు, పిల్లలే ఉన్నట్లు భావిస్తున్నారు. కానీ, నిజమేంటో ఎప్పటికీ తెలియకపోవచ్చు.
తిరుగుబాటుదారుల ప్రాంతాన్ని వదిలి వచ్చేస్తోన్న రోహింజ్యాలు
రఖాయిన్ రాష్ట్రం ఎన్నో ఏళ్లుగా సంఘర్షణలతో సతమతమవుతోంది. తిరుగుబాటుదారుల గ్రూప్ ‘అరాకన్ ఆర్మీ’.. మియన్మార్ సైన్యాన్ని ఆ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి బయటికి పంపించింది.
రఖాయిన్ రాష్ట్ర రాజధాని సితవేలోని చివరి ప్రధాన సైనిక స్థావరాన్ని అరాకన్ ఆర్మీ చుట్టుముట్టింది.
సితవేకు ఇప్పుడు కేవలం విమాన లేదా సముద్ర మార్గాలలో చేరుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. సైన్యం ఆ ప్రాంతంలోని దాదాపు అన్ని టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను నిలిపివేసింది.
రోహింజ్యా ప్రజల పరిస్థితిని మెరుగుపరచడానికి పని చేస్తున్న 'అరాకన్ ప్రాజెక్ట్' సంస్థను నడిపే క్రిస్ లెవా, ఈ రెండు పడవలకు ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ, వారి పరిస్థితి తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు సితవేలో కానీ సిన్ టెట్ మావ్ గ్రామాల్లో కానీ నేరుగా సమాచారాన్ని అందించే పరిచయస్తులు లేరు.
సిన్ టెట్ మావ్ అనే గ్రామం నుంచే ఈ పడవలు బయలుదేరాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం అరాకన్ ఆర్మీ చేతిలో ఉంది.
అయినప్పటికీ, ఇతర సోర్స్‌లు, వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి, రెండు పడవలు జూన్ 29న బయలుదేరాయని ఆయన భావిస్తున్నారు. అందులో ఒకటి ఉదయం బయలుదేరగా, మరొకటి ఆరోజు తర్వాత బయలుదేరింది.
మియన్మార్‌లోని దక్షిణ తీరం వైపు ఈ పడవలు వెళ్లి ఉండవచ్చని ఆయన చెబుతున్నారు. అక్కడ అందులోని ప్రయాణికులను దించాల్సి ఉందని అన్నారు.
ఆ తర్వాత వారిని అడవుల్లోని తాత్కాలిక రవాణా శిబిరాల నుంచి థాయిలాండ్ మీదుగా రోడ్డు మార్గంలో మలేసియా సరిహద్దుకు తరలించాల్సి ఉంది.
సాధారణంగా, ప్రయాణికుల కుటుంబాలకు వారం నుంచి పది రోజుల్లో వారి ఆచూకీ గురించి సమాచారం అందుతుంది. కానీ దాదాపు మూడు వారాలు గడిచినా, వారి గురించి ఎటువంటి సమాచారం అందలేదు.
సముద్రంలో కొట్టుకుని వచ్చిన ఒక మహిళ మృతదేహాన్ని బంగ్లాదేశ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది రోజుల తర్వాత ఇరావదీ డెల్టా, మోన్ రాష్ట్రంలోని తీరం మధ్య చేపలు పడుతున్న జాలర్లు మరికొన్ని మృతదేహాలను చూశారు.
ఇవన్నీ ఈ రెండు పడవలు మునిగిపోయినట్లు సూచిస్తున్నాయని క్రిస్ లెవా చెప్పారు. సిన్ టెట్ మావ్‌ను వదిలి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఒకటి మునిగిపోయి ఉంటుందని, కాగా మరొకటి ఆగ్నేయ దిశగా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత మునిగిపోయి ఉండవచ్చని క్రిస్ లెవా భావిస్తున్నారు.
దక్షిణ బంగ్లాదేశ్‌లోని శరణార్థుల శిబిరాల్లో 10 లక్షల మందికి పైగా రోహింజ్యాలు నివసిస్తున్నారు. వారికి అందే సాయం తగ్గుతోంది. ఉపాధి అవకాశాలు దొరకడం లేదు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగులు అక్కడ చురుగ్గా ఉన్నాయి. ఈ శిబిరాలను విడిచి వెళ్లేందుకు రోహింజ్యా శరణార్థులకు అనుమతి ఇవ్వడం లేదు.
దారుణంగా హింసించి డబ్బులు లాగుతున్నారు
రఖాయిన్ రాష్ట్రంలోనే సుమారు 6 లక్షల మంది రోహింజ్యాలు నివసిస్తున్నారు. వారిలో పావు వంతు తీవ్రమైన పేదరికంలో ఉన్న నిరాశ్రయుల (ఐడీపీ) శిబిరాలలో నివసించాల్సి వస్తోంది.
మిగిలిన వారు సంఘర్షణలో రెండు పక్షాల మధ్య చిక్కుకున్న నివాస ప్రాంతాలలో నివసిస్తున్నారు. మియన్మార్ సైనిక ప్రభుత్వం రోహింజ్యాలను బలవంతంగా సైన్యంలోకి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
మరోవైపు, రఖాయిన్ కమ్యూనిటీ మద్దతు ఉన్న అరాకన్ ఆర్మీని రోహింజ్యాలు విశ్వసించడం లేదు. అరాకన్ ఆర్మీ తమపై తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇతర దేశాలకు వెళ్లడమే తమకున్న ఏకైక ఆశ అని రోహింజ్యా శరణార్థులు భావిస్తున్నారు.
మలేసియా సుమారు 2 లక్షల మంది రోహింజ్యాలకు ఆశ్రయమిచ్చింది. వారికి అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా ఉంది.
మానవ అక్రమ రవాణాదారులకు ఇదొక పెద్ద ఆదాయ వనరుగా మారింది. వీరి నెట్‌వర్క్‌లు ప్రస్తుతం బంగ్లాదేశ్, మియన్మార్, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియాకు విస్తరించాయి.
వీరి ఈ కార్యకలాపాలను కూడా చాలా సులభంగా నిర్వహిస్తున్నారు. ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని పడవల్లోకి ఎక్కించి, అధికారుల కళ్లుగప్పి వారిని మలేసియాకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రయాణికుల కుటుంబాలు మూడు వేల డాలర్ల (సుమారు రూ. 2.89 లక్షలు) నిర్ణీత మొత్తాన్ని చెల్లించేలా కూడా వారే నిర్ణయిస్తున్నారు.
ఈ మొత్తాన్ని చెల్లించలేని కుటుంబాల వారిని బందీలుగా పట్టుకుని కొడతారు, ఒక్కోసారి ఇంకా దారుణంగా హింసిస్తారు.
కొన్నిసార్లు, వారు పడుతున్న కష్టాలను, బాధలను వీడియో తీసి, అడిగిన డబ్బు చెల్లించేలా వారిని ఒప్పించడానికి వారి కుటుంబాలకు పంపుతారు.
సంవత్సరాలు గడిచేకొద్దీ అక్రమ రవాణా మార్గాలు మారినప్పటికీ, ఈ వ్యాపారంలోని క్రూరత్వంలో మాత్రం ఎటువంటి మార్పులేదు.
మానవ అక్రమ రవాణాను నివారించలేకపోయిన విషయంలో చెడ్డపేరును ఎదుర్కొంటోన్న థాయ్ ప్రభుత్వం 2015లో ట్రాఫికర్లు వాడే మార్గాలను మూసేయడం ప్రారంభించింది.
కుటుంబాలు తగినంత డబ్బు చెల్లించే వరకు అక్రమ రవాణాదారులు ప్రజలను బందీలుగా ఉంచే మడ అడవులు, రబ్బరు తోటలలోని తాత్కాలిక శిబిరాలను కూడా థాయ్ ప్రభుత్వం మూసివేసింది.
ఈ శిబిరాలలో సామూహిక సమాధులు బయటపడటంతో, చర్యలు తీసుకోవాలని థాయ్ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది.
అదే ఏడాది మియన్మార్-బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి దక్షిణానికి వెళ్లే చాలా పడవలు వాటి మార్గాన్ని మార్చి, ఇండోనేసియాలోని అచే ప్రావిన్స్ మీదుగా వెళ్లడం ప్రారంభించాయి.
మత్స్యకారుల కమ్యూనిటీలు తొలుత ఈ హింసకు గురైన ముస్లిం శరణార్థులను స్వాగతించాయి. కానీ, ఆ తర్వాత వారిని స్వాగతించడం తగ్గించాయి. ఇండోనేసియాలో రోహింజ్యా శరణార్థులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రచారాలు కూడా మొదలుపెట్టారు.
సముద్రమే దిక్కు
మలేసియాకు వెళ్లేందుకు నేరుగా సముద్ర మార్గం ప్రస్తుతం రోహింజ్యాలకు కష్టతరంగా మారింది. మలేసియా నేవీ వారిని అడ్డుకుని, తిరిగి సముద్రంలోకి పంపగలదని భావిస్తుంది. స్థానిక మత్స్యకార కమ్యూనిటీ కూడా సాయపడటం లేదు.
అందుకే మానవ అక్రమ రవాణదారులు మరోసారి థాయిలాండ్‌ను తమ ప్రధాన మార్గంగా వాడటం మొదలుపెట్టారని క్రిస్ లెవా చెప్పారు.
పెద్ద పడవలు, ఓడలు రఖాయిన్ తీరం కానీ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ ప్రాంతానికి సమీపంలో కానీ రోహింజ్యా ప్రజలను ఎక్కించుకుంటాయి.
రెండు దేశాల అధికారుల దృష్టిని తప్పించుకోవడానికి ఈ ఓడలు అక్కడ ఎక్కువసేపు ఉండటం లేదు.
ఇప్పుడు, స్మగ్లర్లు శాటిలైట్ ఫోన్‌లను ఉపయోగించి థాయిలాండ్, ఇండోనేసియాలోని తమ నెట్‌వర్క్‌లను సంప్రదిస్తున్నాయి.
రోహింజ్యా ప్రజలను దక్షిణ థాయిలాండ్, ఇండోనేసియాలోని తూర్పు సుమత్రా తీరాలకు చేర్చడానికి స్థానిక మత్స్యకారులకు డబ్బు చెల్లిస్తున్నారు.
దీని తర్వాత, పూర్తి సొమ్ము చెల్లించిన తర్వాత, వారిని రహస్యంగా మలేసియాకు తరలిస్తారు.
కొంతమంది రోహింజ్యాలను మియన్మార్ దక్షిణ తీరంలో దించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సరిహద్దు దాటించి థాయిలాండ్‌లోకి తీసుకువెళ్లి, ఆ తర్వాత రోడ్డు మార్గంలో మలేసియా సరిహద్దుకు తరలిస్తారు.
కానీ, రఖాయిన్‌ను మియన్మార్‌లోని మిగిలిన ప్రాంతాలతో కలిపే రోడ్డు మార్గాలన్నీ మూసివేయడంతో, వారి తరలింపు తరచూ ప్రమాదకరమైన సముద్ర ప్రయాణంతోనే మొదలవుతుంది.
గత ఏడాది సెప్టెంబర్ నుంచి కనీసం పదివేల మంది రోహింజ్యాలు పడవలలో మియన్మార్, బంగ్లాదేశ్‌లను విడిచి వెళ్లారని క్రిస్ లెవా అంచనా వేస్తున్నారు.
రఖాయిన్, బంగ్లాదేశ్‌లోని రోహింజ్యాలో దారుణమైన నివాస పరిస్థితులు ఉండటంతో.. ఇక్కడ నుంచి తరలివెళ్లిన వారి సంఖ్య మునపటి ఏళ్లతో పోలిస్తే చాలా ఎక్కువ.
రోహింజ్యాలకు సురక్షితమైన మార్గాన్ని కల్పించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. కానీ, ఏ దేశం కూడా వారిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు.
వారిని ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోలేదు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)