You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సినీ నటుడు కృష్ణ కన్నుమూత
సినీ నటుడు కృష్ణ కన్ను మూశారు. అభిమానులు సూపర్‌స్టార్‌గా పిలుచుకునే ఆయన వయసు 80 ఏళ్లు.
అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన ఆసుపత్రికి వచ్చారని, వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.
మంగళవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
ఆయన మరణంపై కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్లు ఇవాళ ఉదయం వివరాలు తెలిపారు.
‘‘నిన్న సాయంత్రం నుంచే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆయన రావడమే కార్డియాక్ అరెస్ట్‌తో వచ్చారు.
సాయంత్రానికి మరింత క్షీణించడంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించాం. డయాలసిస్ కూడా చేశాం.
ప్రతి నిమిషం ఆయన కుటుంబ సభ్యులతో ఆయన ఆరోగ్యపరిస్థితిని వివరించాం. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సాయంత్రం 7 నుంచి ఆయన శరీరం ఆయన చికిత్సకు సహకరించలేదు.
ఏ చికిత్స చేసినా ఆయన శరీరం సహకరించదని తెలిసిన తర్వాత ఆయన శరీరాన్ని మరీ ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా కన్నుమూసేందుకు సహకరించాం.
ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామును 4.09 నిమిషాలకు ఆయన మరణించారు’’ అని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
కృష్ణ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరు ముఖ్యమంత్రుల కార్యాలయాల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి.
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి 5 దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను తెలంగాణ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు.
విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడు గా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు.
నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు.
హీరో కృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
టాలీవుడ్‌లో సుదీర్ఘకాలం నటించి ఆంధ్ర జేమ్స్‌బాండ్‌గా పేరు తెచ్చుకున్న ‘సూపర్ స్టార్’ ఘట్టమనేని కృష్ణ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారంటూ ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి చిరస్థాయిగా నిలిచారని, ఎన్నో హిట్ సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నారని కీర్తించారు.
కృష్ణ కుమారుడు, హీరో మహేశ్ బాబు, ఇతర కుటుంబసభ్యులకు ఆయన తన సానుభూతి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- సమంత: 'నేను చనిపోతానని కూడా రాసేశారు' అని కంటతడి పెట్టిన నటి
- కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు?
- భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?
- ‘రోబోలు విస్తరించాయి.. కానీ ‘మనుషులు ఇంకా అవసరమే’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)