You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్‌తో యుద్ధం: అమెరికా దగ్గర ఆయుధాలు ఖాళీ అవుతున్నాయా?
- రచయిత, బెర్న్డ్ డెబూస్‌మన్ జూనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
అమెరికా రక్షణ రంగ సంస్థల సీఈఓల సమక్షంలో, ఈ నెల మొదట్లో జరిగిన 'పెన్సిల్వేనియా డిఫెన్స్ అండ్ ఇన్నోవేషన్ సమిట్' వేదికపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఒకే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు: ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలి, వాటిని మరింత వేగంగా తయారు చేయాలి.
"ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. కానీ, మనకు వాటి తయారీలో మరింత వేగం కావాలి" అని యుఎస్ ఆర్మీ వార్ కాలేజీలో సమావేశమైన ఆయుధ తయారీదారులతో ట్రంప్ అన్నారు. ఆ సమయంలో 'సెక్రటరీ ఆఫ్ వార్' పీట్ హెగ్‌సెత్ ఆయన పక్కనే ఉన్నారు.
అమెరికా పరిశ్రమలకు పునరుజ్జీవం పోయడంతోపాటు దేశ యుద్ధ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ద్విముఖ వ్యూహంలో భాగమే ఈ సదస్సు అని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.
అయితే, ఈ ఏడాది మొదట్లో ఇరాన్‌పై జరిగిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో దాదాపు 40 రోజుల పాటు సాగిన తీవ్రమైన పోరాటం, ఆ తర్వాత జరిగిన ప్రతీకార దాడుల వల్ల అత్యాధునిక, సంక్లిష్టమైన ఆయుధాలు భారీగా ఖర్చయ్యాయి. ఈ నిజాన్ని అమెరికా ప్రభుత్వం పైకి పెద్దగా ప్రస్తావించలేదు.
ఈ యుద్ధం కోసం ఇప్పటివరకు 37.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 3.57 లక్షల కోట్లు) ఖర్చయినట్లు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో సింహభాగం నిధులు కేవలం మందుగుండు సామగ్రి కోసమే వెచ్చించారు.
వైట్ హౌస్ నివేదికల ప్రకారం... ఏప్రిల్ 8న తాత్కాలిక కాల్పుల విరమణ అమలులోకి వచ్చే నాటికి, అమెరికా దళాలు ఇరాన్ అంతటా 13,000 కంటే ఎక్కువ లక్ష్యాలపై దాడులు చేశాయి. ఇదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన 1,700 కంటే ఎక్కువ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సాగేందుకు వీలుగా అమెరికా తన దాడులను నిలిపివేసింది.
అయితే, యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తే అమెరికా ఆయుధ నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని, అందుకే ఆ ప్రణాళికలను పక్కన పెట్టాలని ట్రంప్‌కు సలహా ఇచ్చినట్లు 'న్యూయార్క్ టైమ్స్' కథనం పేర్కొంది.
ఆయుధాల కొరత ఉందనే వార్తలను సోమవారం నాడు ట్రంప్ కొట్టిపారేశారు.
"ప్రపంచంలో ఎవరి దగ్గరా లేనంత మందుగుండు సామగ్రి మన దగ్గర ఉంది. మనకు అవసరమైన దానికంటే ఎక్కువే ఉంది" అని 'వాల్ స్ట్రీట్ జర్నల్'తో అన్నారు.
అమెరికా యంత్రాంగంలో ఈ విషయం కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. గత నెలలో ఈ నిల్వల కొరత గురించి గట్టిగా అడిగినప్పుడు, ఆయుధాల సరఫరా ఏమాత్రం తగ్గలేదని హెగ్‌సెత్ ఖండించారు.
అయితే, ఆ తర్వాత ఆయన వైఖరి మారినట్లు కనిపిస్తోంది. రక్షణ రంగానికి అవసరమైన పరికరాలతో పాటు "తీవ్రమైన ఆయుధాల కొరతను" భర్తీ చేయడానికి పెంటగాన్‌కు మరో 87 బిలియన్ డాలర్లు అవసరమని గత వారం ఆయన సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీకి తెలిపారు.
ఖర్చయిన మందుగుండు సామగ్రి, మిగిలి ఉన్న నిల్వల కచ్చితమైన వివరాలు ఇప్పటికీ అత్యంత రహస్యంగానే ఉంచారు. కానీ, వాషింగ్టన్ డీసీకి చెందిన 'సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' (సీఎస్ఐఎస్) సేకరించిన బహిరంగ సమాచారం ప్రకారం, ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. స్వల్పకాలంలో వీటిని భర్తీ చేయడం చాలా కష్టం.
"ఇది మనం తయారు చేసే ఆయుధ రకాన్ని బట్టి ఉంటుంది. కానీ, ఒక్క క్షిపణిని తయారు చేయడానికి ఒకటి నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది. ఈ వేగాన్ని పెంచడానికి మనం చేయగలిగింది ఏమీ లేదు" అని ఈ విషయంపై పరిశోధన చేస్తున్న రిటైర్డ్ మెరైన్ కోర్ కల్నల్, సీఎస్ఐఎస్ సీనియర్ అడ్వైజర్ మార్క్ కాన్సియన్ అన్నారు.
అయితే, తన సైనిక బాధ్యతలను, లక్ష్యాలను నెరవేర్చడంలో ఇబ్బందులు పడేంత వేగంగా అమెరికా మందుగుండు సామగ్రిని ఖర్చు చేస్తోందా?
తగ్గిపోతున్న అమెరికా ఆయుధ నిల్వలు
ఈ యుద్ధంలో ఎక్కువగా ఉపయోగించిన కీలకమైన మందుగుండు సామగ్రి రెండు రకాలు: ఒకటి సుదూర లక్ష్యాలను ఛేదించే గ్రౌండ్ అటాక్ సిస్టం, రెండు ఇరాన్ దాడులను అడ్డుకోవడానికి ఉపయోగించిన ఎయిర్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం.
గ్రౌండ్ అటాక్ వ్యవస్థల్లో అత్యధికంగా వాడింది 'టోమహాక్ ల్యాండ్ అటాక్ మిస్సైల్'. సాధారణంగా వీటిని యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగిస్తారు. ఇవి 1,600 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలవు. పైలట్లు ఉన్న యుద్ధ విమానాలను ప్రమాదంలో పడేయకుండానే, శత్రువుల కమాండ్ బంకర్లు, బలమైన సైనిక స్థావరాలపై కచ్చితమైన దాడులు చేయడానికి ఈ ఆయుధాలు అమెరికాకు సహాయపడతాయి.
ఈ యుద్ధంలో 1,000కు పైగా టోమహాక్ క్షిపణులను వాడినట్లు సీఎస్ఐఎస్ అంచనా వేసింది. ఈ ఆయుధ నిల్వలు మళ్లీ యుద్ధానికి ముందున్న స్థాయికి చేరుకోవడానికి 2031 వరకు సమయం పట్టవచ్చు. సీఎస్ఐఎస్ రిపోర్ట్ ప్రకారం, సరికొత్త మోడల్ టోమహాక్ క్షిపణి ధర ఒక్కొక్కటి సుమారు 26 లక్షల డాలర్లు.
యుద్ధంలో ఎక్కువగా ఉపయోగించిన వైమానిక రక్షణ వ్యవస్థల్లో 'పేట్రియాట్' ఒకటి. ఇది శత్రు విమానాలతో పాటు బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులను సైతం గాల్లోనే కూల్చేసే భూతల రక్షణ వ్యవస్థ. యుద్ధానికి ముందు అమెరికా దగ్గర దాదాపు 2,330 పేట్రియాట్ క్షిపణులు ఉండగా, ఈ ఘర్షణలో ఏకంగా 1,430 క్షిపణులను వాడినట్లు సీఎస్ఐఎస్ అంచనా వేసింది. ఒక్కో పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ ధర సుమారు 40 లక్షల డాలర్లు. ఇరాన్ ప్రయోగించే ఒక్కో డ్రోన్ ధర కేవలం 20,000 నుంచి 50,000 డాలర్లు మాత్రమే ఉన్నప్పటికీ, వాటిని కూల్చడానికి ఇంత ఖరీదైన, అత్యంత ప్రభావవంతమైన ఈ క్షిపణులనే అమెరికా పదే పదే వాడాల్సి వచ్చింది.
వీటిని తిరిగి భర్తీ చేయడం చాలా కష్టం.
"ఒక్క క్షిపణిని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. రక్షణ రంగానికి ఈ రోజు నిధులు కేటాయించినా, ఆ క్షిపణి చేతికి రావడానికి మూడు, నాలుగు లేదా ఐదేళ్లు పడుతుంది. ప్రస్తుతం అమెరికాకు అందుతున్న క్షిపణులన్నీ 2023లో నిధులు మంజూరైనవి" అని మార్క్ కాన్సియన్ తెలిపారు.
వీటితో పాటు 'థాడ్' (టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) అనే సరికొత్త, అత్యంత అత్యాధునిక రక్షణ వ్యవస్థను కూడా ఉపయోగించారు. పాత పేట్రియాట్ వ్యవస్థ కంటే ఇది ఎక్కువ దూరం ప్రయాణించగలదు, మరింత ఎత్తులో శత్రు క్షిపణులను అడ్డుకోగలదు. దీని నిల్వలు ఇప్పటికే చాలా పరిమితంగా ఉన్నాయి. యుద్ధానికి ముందు అమెరికా దగ్గర 360 థాడ్ క్షిపణులు ఉండగా, అందులో 190 నుంచి 290 వరకు వాడినట్లు సీఎస్ఐఎస్ అంచనా వేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం తొమ్మిది థాడ్ బ్యాటరీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏడు అమెరికావే. ఈ ఆయుధాలు ఇలాగే నిరంతరాయంగా ఖర్చయిపోతే... రష్యా, చైనా లేదా ఉత్తర కొరియా వంటి దేశాల బాలిస్టిక్ క్షిపణి ముప్పుల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన కీలక రక్షణ వ్యవస్థను అమెరికా దళాలు కోల్పోయే ముప్పు ఉంది.
తైవాన్, పసిఫిక్ ప్రాంతాలపైనే అందరి కళ్లు
ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తరుణంలోనే, అమెరికా సైనిక వ్యూహకర్తలు అంచనా వేసిన 'డేవిడ్‌సన్ విండో' సమయం దగ్గరపడుతోంది. ఈ కాలంలో తైవాన్‌పై చైనా దాడి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని వారు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ ప్రాంతంలో అమెరికా రక్షణ వ్యూహాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ వివాదాస్పద అంచనా 2021 నాటి ఒక కాంగ్రెస్ విచారణ నుంచి వచ్చింది.
అప్పట్లో ఆ ప్రాంతంలోని అమెరికా దళాల అధిపతిగా ఉన్న అడ్మిరల్ ఫిలిప్ డేవిడ్‌సన్... "రాబోయే ఆరేళ్లలో" తైవాన్‌పై చైనా దాడి జరుగుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత 2023లో, అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ స్పందిస్తూ 2027 నాటికి తైవాన్ ఆక్రమణకు చైనా సర్వసన్నద్ధం అవుతుందని అంచనా వేశారు. తైవాన్‌ను తన నుంచి విడిపోయిన ప్రాంతంగా భావించే చైనా, దానిని తమ దేశంలో "కలుపుకుంటామని" చాలా కాలంగా చెబుతోంది, ఇందుకోసం అవసరమైతే సైనిక బలాన్ని ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది.
చైనాతో యుద్ధం వస్తే అమెరికా నిజంగానే తైవాన్‌ను రక్షిస్తుందా లేదా అనేది తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఈ సందిగ్ధత ఎలా ఉన్నప్పటికీ, అమెరికా ఆ ద్వీపదేశానికి రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తోంది. పసిఫిక్ ప్రాంతంలో గనక ఘర్షణ తలెత్తితే, అమెరికాకు కావాల్సిన అత్యాధునిక ఆయుధాల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉండవని, ఈ ఆయుధాల కొరత అమెరికాకు ఒక "బలహీన కాలం" అని మార్క్ కాన్సియన్ పేర్కొన్నారు.
పసిఫిక్ యుద్ధంలో చైనా ప్రయోగించే భారీ క్షిపణులు, యుద్ధ విమానాల అమ్ములపొదిని ఎదుర్కోవడానికి అమెరికా దళాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేని పరిస్థితిని ఈ నిల్వల కొరత తెచ్చిపెడుతుందని ఆయన భావిస్తున్నారు.
ఇరాన్ యుద్ధంలో అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థల పనితీరును చైనా అధికారులు నిశితంగా గమనిస్తున్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో చైనా క్షిపణి సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ ఉపయోగించిన క్షిపణులు, చౌక రకం డ్రోన్ల కంటే ఎంతో అత్యాధునికమైన 'హైపర్సోనిక్ గ్లైడ్ క్షిపణులను' కూడా చైనా అభివృద్ధి చేసింది. దీనితో పాటు, ఒకేసారి వందలాది డ్రోన్లతో దాడి చేసే భారీ "డ్రోన్-స్వామ్" వ్యూహాలకు పదును పెట్టడంపై కూడా బీజింగ్ భారీగా ఖర్చు చేస్తోంది.
అయితే, అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోవడాన్ని అందరూ కేవలం ఒక బలహీనతగానే చూడటం లేదు. సీఐఏ మాజీ అధికారి, రక్షణ కార్యాలయ మాజీ మిడిల్ ఈస్ట్ పాలసీ అడ్వైజర్ జాకబ్ ఒలిడోర్ ఒక భిన్నమైన కోణాన్ని ప్రస్తావించారు. ఈ ఆయుధాలను నేరుగా యుద్ధంలో ఉపయోగించడం ద్వారా శత్రువులకు ఒక బలమైన సందేశం వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఆయుధాలు కేవలం ఒక దేశం దగ్గర ఉన్నంత మాత్రాన శత్రువులను భయపెట్టలేవు, ఆ ఆయుధాలను ప్రయోగించడానికి ఆ దేశం ఎంత సిద్ధంగా ఉందో చేతల్లో చూపించినప్పుడే అసలైన భయం మొదలవుతుంది" అని 'అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్' అమెరికన్ సెక్యూరిటీ పాలసీకి డైరెక్టర్‌గా ఉన్న ఒలిడోర్ అన్నారు.
ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా అత్యంత కచ్చితత్వంతో, రికార్డు సమయంలో నిర్వీర్యం చేసిన తీరు... చైనాతో పాటు ఇతర శత్రు దేశాల దురాక్రమణ ఆకాంక్షలకు ఒక బలమైన హెచ్చరికగా మారుతుందని ఆయన తెలిపారు.
యూరప్ పరిస్థితి ఏంటి?
మిత్రదేశాలకు ఆయుధాలు సరఫరా చేయడం, అదే సమయంలో అమెరికా సొంత నిల్వలను కాపాడుకోవడం మధ్య ఉన్న స్పష్టమైన సందిగ్ధత ఇప్పటికే యుక్రెయిన్ విషయంలో రుజువైంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందు, అంటే 2025 అక్టోబర్‌లో... అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోకూడదనే కారణాన్ని చూపుతూ యుక్రెయిన్‌కు టోమహాక్ క్షిపణులను ఇవ్వడానికి ట్రంప్ నిరాకరించారు.
ఇరాన్ యుద్ధం తర్వాత అమెరికా ఆయుధశాల విస్తృతిపై జరుగుతున్న చర్చలకు, అప్పట్లో జరిగిన ఆ పరిణామమే ఒక ముందస్తు సూచనగా నిలిచింది. రష్యా జరుపుతున్న వరుస డ్రోన్, క్షిపణి దాడులను అడ్డుకోవడానికి తమకు పేట్రియాట్ వంటి ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలు అత్యవసరంగా కావాలని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.
"ఇరాన్ యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడంతో పాటు అమెరికా ఆయుధ నిల్వలు కరిగిపోతున్నాయి, వైమానిక రక్షణ క్షిపణుల తయారీ సంస్థల నిల్వలు ఖాళీ అవుతున్నాయి. దీనివల్ల యుక్రెయిన్‌కు కూడా వనరుల కొరత ఏర్పడుతోంది" అని మార్చి నెలలో జెలియెన్ స్కీ బీబీసీకి తెలిపారు.
జెలియన్ స్కీ ఈ ఆందోళనకు సంబంధించిన కొన్ని గణాంకాలను కూడా ప్రస్తావించారు: అమెరికా నెలకు దాదాపు 60 నుంచి 65 క్షిపణులను, అంటే ఏడాదికి 700 నుంచి 800 వరకు తయారు చేస్తుంది. కానీ, కేవలం 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' మొదటి రోజే ఏకంగా 803 క్షిపణులను ఉపయోగించారు.
అయితే, ఇటీవల ట్రంప్ ఒక అనూహ్య నిర్ణయంతో చాలామంది యూరప్ అధికారులను ఆశ్చర్యపరిచారు. యుక్రెయిన్ దేశీయంగానే పేట్రియాట్ క్షిపణులను తయారు చేసుకునే హక్కును కల్పిస్తామని ఆయన ఆఫర్ చేశారు. ఇలాంటి ఏర్పాట్లు ఇప్పటికే జర్మనీ, జపాన్ దేశాలలో ఉన్నాయి.
రక్షణ శాఖలో 13 ఏళ్ల అనుభవం ఉండి, ప్రస్తుతం 'అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్'లో నిపుణురాలిగా పనిచేస్తున్న ఎలైన్ మెక్‌కస్కర్ కీలక విషయాలు పంచుకున్నారు. రష్యాతో యుక్రెయిన్ చేస్తున్న యుద్ధం, ఇరాన్‌తో అమెరికాకు ఎదురైన అనుభవాలు... ప్రస్తుతం ఉన్న ఖరీదైన ఆయుధాలకు ప్రత్యామ్నాయంగా, తక్కువ ఖర్చుతో కూడిన, భారీగా ఉత్పత్తి చేయగల రక్షణ వ్యవస్థల ఆవిష్కరణకు సహాయపడతాయని ఆమె అన్నారు.
"కేవలం 1,000 డాలర్ల విలువ చేసే డ్రోన్లను కూల్చడానికి, మనం 60 లక్షల డాలర్ల ఖరీదైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ప్రయోగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని మనకు చాలా కాలంగా తెలుసు. ఇప్పుడు అటువంటి పరిష్కారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, అంత ఎక్కువ ఖర్చు లేని, సులభంగా భర్తీ చేయగల ఆయుధాల తయారీపైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారని భావిస్తున్నాను" అన్నారామె.
యుద్ధం తర్వాతి పరిణామాలు
ఇవన్నీ పక్కన పెడితే, త్వరలోనే మందుగుండు సామగ్రి పూర్తిగా అయిపోతుందనే ఆందోళన అయితే ప్రస్తుతానికి పెద్దగా కనిపించడం లేదు. దానికి కారణం అమెరికా ఆయుధ నిల్వలు అపరిమితంగా ఉండటం కాదు, ఇరాన్ ఆయుధ నిల్వల పరిస్థితి మరీ ఘోరంగా తయారవడమే.
వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ బీబీసీకి పంపిన ప్రకటనలో... "అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాత్మక లక్ష్యాలతో పాటు ఇతర అవసరాలన్నింటినీ నెరవేర్చడానికి అమెరికా సైన్యం దగ్గర తగినంత మందుగుండు సామగ్రి, ఆయుధ నిల్వలు ఉన్నాయి. అమెరికాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' స్పష్టంగా చూపించింది" అని తెలిపారు.
"ఈ పరిస్థితుల్లోనూ అమెరికాలోనే తయారయ్యే ఆయుధాల ఉత్పత్తిని నిరంతరం పెంచాలని రక్షణ రంగ కాంట్రాక్టర్లను అధ్యక్షుడు కోరారు" అని కెల్లీ తెలిపారు.
ఇరాన్, అమెరికాలు కలిసి దిగ్బంధించిన కీలకమైన నౌకాయాన మార్గం 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'లో ఓడలను బెదిరించేలా తెహ్రాన్‌కు ఉన్న సైనిక శక్తిని అణచివేయడంపైనే, ఇటీవల 'యుఎస్ సెంట్రల్ కమాండ్' ప్రకటించిన దాడులు ప్రధానంగా కేంద్రీకృతమయ్యాయి.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వరుస దాడుల వల్ల అమెరికాతో పోలిస్తే ఇరాన్ సైనిక నష్టం చాలా ఎక్కువగా ఉంది. పైగా ఆ దేశం తన ఆయుధ కొరతను అంత త్వరగా భర్తీ చేసుకోగలిగే సామర్థ్యం కూడా చాలా పరిమితంగా ఉంది.
"చాలామంది విశ్లేషకులు ఇరాన్ దగ్గర దాదాపు అపరిమితమైన ఆయుధాలు ఉన్నట్లు చిత్రీకరిస్తుంటారు. కానీ, అక్కడ కూడా పరిమితులు ఉన్నాయనే నిజాన్ని మనం గ్రహించాలి. ఇరాన్ రక్షణ పారిశ్రామిక రంగాన్ని అమెరికా చాలా వరకు నిర్వీర్యం చేసింది" అని 'యునైటెడ్ ఎగైనెస్ట్ న్యూక్లియర్ ఇరాన్' పాలసీ డైరెక్టర్ జేసన్ బ్రాడ్‌స్కీ అన్నారు.
తనకు కావలసిన క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధ వ్యవస్థలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే ఇరాన్ సామర్థ్యం ఇప్పుడు చాలా వరకు నాశనమైందని ఆయన చెప్పారు.
జేసన్ బ్రాడ్‌స్కీ ప్రకారం, ఇరాన్ మిగిలి ఉన్న ఆయుధ నిల్వలన్నింటినీ తెహ్రాన్ తన చివరి ఆయుధంగా భావిస్తున్న 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను బెదిరించే వ్యూహం వైపు మళ్లిస్తోంది. ఆయన దృష్టిలో, ఇరాన్‌కు ఉన్న ఆ సామర్థ్యం ఇప్పుడు క్రమంగా క్షీణిస్తోంది.
"ఇరాన్ ప్రభుత్వానికి ఇక్కడ సమయం ముగిసిపోతోంది" అని బ్రాడ్‌స్కీ అభిప్రాయపడ్డారు.
ఆయుధ నిల్వల విస్తృత చిత్రాన్ని నిర్లక్ష్యం చేయడం బాధ్యతారాహిత్యం అవుతుందని అధికారులు అంగీకరిస్తున్నప్పటికీ... వాషింగ్టన్ ప్రస్తుతానికి ఇరాన్‌తో నడుస్తున్న, అదుపులో ఉన్న ఈ ఘర్షణకే తక్షణ ప్రాధాన్యత ఇస్తోంది. దీనినే బ్రాడ్‌స్కీ అమెరికా సైన్యానికి సంబంధించిన "ప్రధాన కేంద్ర బిందువు" అని పేర్కొన్నారు.
"ఇండో-పసిఫిక్ ప్రాంతం నుండి ముప్పు ప్రస్తుతానికి కొంత దూరంలో ఉంది. విధానకర్తలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తేల్చుకోవాలి, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ వ్యవహారాలపైనే అమెరికా అధ్యక్షుడు ఎక్కువగా దృష్టి పెట్టారు" అన్నారాయన.
ప్రస్తుతానికైతే, ఇరాన్ లక్ష్యాలపై ప్రయోగించే ప్రతి క్షిపణి, యుక్రెయిన్ సరిహద్దులకు పంపే ప్రతి ఆయుధం లేదా తైవాన్ కోసం దాచి ఉంచే ప్రతి నిల్వ... అన్నీ కూడా క్రమంగా తగ్గిపోతున్న ఒకే ఒక ఉమ్మడి ఆయుధశాల నుంచే వస్తున్నాయి.
అయినప్పటికీ, ఆయుధాల ఉత్పత్తి పుంజుకునే లోపే ఈ ఘర్షణల నుంచి సురక్షితంగా బయటపడగలమనే నమ్మకంతోనే వాషింగ్టన్ ముందడుగు వేస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)