You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూపీఐ చార్జీలు: ఏ లావాదేవీలు ఉచితం, వేటికి చార్జీలు చెల్లించాలి? కేంద్రం క్లారిటీ
యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే యూజర్లపై ఎలాంటి లావాదేవీ చార్జీలు విధించరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా జరిగే చాలా వరకు వ్యాపార లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది.
వ్యక్తిగత లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.
అయితే, భవిష్యత్తులో వ్యాపార రాయితీ రేటు(మర్చంట్ డిస్కౌంట్ రేట్ - ఎండీఆర్)ను అమలు చేస్తే, అది కేవలం ఎంపిక చేసిన కొన్ని వ్యాపార లావాదేవీలపై, ఒక నిర్దిష్ట పరిమితికి మించిన విలువపై, నామమాత్రపు రేటు మాత్రమే విధిస్తారు.
ఈ రేటు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) కంటే తక్కువే ఉంటుంది.
ఒకవేళ మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించినప్పటికీ ఈ రుసుము ఒక నిర్దిష్ట పరిమితికి మించిన లావాదేవీలపై మాత్రమే విధిస్తారు. ఎక్కువ లావాదేవీలు ఉచితంగానే ఉంటాయి.
పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో సెక్షన్ 10ఏ సవరణ కోసం టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026 ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత, ఎన్‌పీసీఐ నేతృత్వంలోని యూపీఐ, సర్వీస్ స్టీరింగ్ కమిటీ ఎండీఆర్‌ను అమలు చేయాలా వద్దా, అమలు చేస్తే దాని రేటు ఎంత ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది.
పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ సిస్టమ్ యాక్ట్‌కు ఇటీవల సవరణలు చేసిన తర్వాత కొంత గందరగోళం ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది.
కొంతమంది దీనిని యూజర్లపై చార్జీలు విధించే చర్యగా భావించారు. అయితే, అలాంటిదేమీ లేదని ప్రభుత్వం చెబుతోంది.
యూపీఐలో లావాదేవీల పరిమాణం క్రమంగా పెరుగుతోంది.
ఇందులో సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు నిరంతర పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం చెబుతోంది.
యూపీఐని విస్తరించేందుకు ఈ రంగంలోకి మరిన్ని కంపెనీలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ఇందుకు ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడకుండా యూపీఐని ఆర్థికంగా నిలకడగా ఉంచే దీర్ఘకాలిక నమూనా అవసరం.
వివాదం ఎందుకు?
ప్రభుత్వం పదేపదే స్పష్టత ఇచ్చినప్పటికీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలపై దేశంలో చర్చ జరుగుతోంది. యూపీఐ చెల్లింపుల మీద రుసుములు విధించడంపై ప్రతిపక్షాలతో పాటు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూపీఐ యూజర్లపై చార్జీలు ఉండవని, అవి వ్యాపారాలకు మాత్రమే ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.
దీనికి సంబంధించి పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివరణ జారీ చేసింది. దీనిని ప్రధాన మంత్రి కార్యాలయం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.
వినియోగదారులు, చిన్న వ్యాపారుల యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుము ఉండదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది.
యూపీఐ చెల్లింపులపై వినియోగదారుల నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయరని పేమెంట్స్ యాప్ ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
'యూపీఐ ఉచితం. భారత్‌లో యూజర్లందరికీ ఇది ఉచితంగానే ఉంటుంది' అని ఆయన అందులో రాశారు.
డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని, వినియోగదారులకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు.
యూపీఐని ఉపయోగించే ప్రజలు ఇకపై ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్న జైరామ్ రమేష్ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ స్పందించారు.
జీటీఆర్‌ఐ నివేదిక గురించి చర్చ ఎందుకు?
నిర్మలా సీతారామన్ ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, ఆర్థికవేత్త జయతీ ఘోష్ ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
"కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటనలోని ఆర్థిక అసంబద్ధతను పక్కన పెట్టినా, అంతిమ భారం వినియోగదారులపైనే పడుతుంది" అని అందులో రాశారు.
"యూపీఐ ఉపయోగించే 'వ్యాపారులలో' చాలా మంది చిన్న వ్యాపారవేత్తలేనని గమనించాలి. అమెరికన్ ఆర్థిక సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు సామాన్యులపై భారం మోపుతారు. ఇదంతా ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి చేసే మరో నిష్ఫలమైన ప్రయత్నంలో భాగంగా జరుగుతోంది."
"అమెరికా ఒత్తిడికి లొంగి యూపీఐ రూపే వంటి దేశీయ చెల్లింపు వ్యవస్థలపై భారత్ తన విధానాలను మార్చుకోకూడదు" అని వాణిజ్య వ్యవహారాల థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్ చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ రాసింది.
"భారత్‌లో జీరో ఎండీఆర్ విధానం, రూపే ప్రోత్సాహం, క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానించడంలో రూపేకు ఉన్న ప్రాథమిక ప్రయోజనం, డేటా స్థానికీకరణ నిబంధనలు, యూపీఐ యాప్‌లకు ఎన్‌పీసీఐ ప్రతిపాదించిన 30 శాతం మార్కెట్ వాటా పరిమితిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది" అని జీటీఆర్ఐ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ ఒక వ్యాసంలో రాశారు.
ఈ విధానాలు తమ సంస్థలకు ఇబ్బందికరమని అమెరికా భావిస్తోంది. వీసా, మాస్టర్‌కార్డ్ ఫీజు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. భారత ప్రభుత్వం తమకు సాయం చేయాలని కోరుకుంటున్నాయి.
భారతదేశపు యూపీఐ, రూపే చెల్లింపు వ్యవస్థలను వాస్తవానికి అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 2026 నివేదిక విమర్శించింది. ఈ నివేదిక బ్రెజిల్‌కు చెందిన పిక్స్ చెల్లింపు వ్యవస్థను కూడా ప్రస్తావించింది.
ది పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ సవరణ బిల్లు ఆగస్టు 6న లోక్‌సభలో ఆమోదం పొందింది. దీనిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' వసూలు చేయడానికి బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలకు అనుమతి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి లభిస్తుంది.
ఈ చట్టం అమల్లోకో వస్తే భవిష్యత్తులో ఎండీఆర్ అమలవుతుందనే భయాలు ఉన్నాయి.
ఉచిత యూపీఐని విమర్శిస్తున్న యూఎస్ నివేదిక
2026 మార్చిలో విడుదలైన యూఎస్ ఫారిన్ ట్రేడ్ బారియర్స్ రిపోర్ట్ భారత్‌లో యూపీఐ, రూపేలకు వర్తించే జీరో ఎండీఆర్ విధానాన్ని వ్యతిరేకించిందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది.
ఈ విధానం విదేశీ చెల్లింపు సేవా సంస్థల కన్నా దేశీయ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది.
ఇది వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అమెరికా చెల్లింపు కంపెనీలకు అసమాన పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుందని అమెరికా భావిస్తోంది.
యూపీఐ, రూపే డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై ఎండీఆర్‌ను ప్రభుత్వం 2020లో రద్దు చేసింది.
నగదు రహిత లావాదేవీల లక్ష్యంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై సాధారణంగా ఒకటిన్నర శాతం ఎండీఆర్ విధిస్తున్నారు. డెబిట్ కార్డులపై 0.9 శాతం వసూలు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం మర్చంట్స్ ఎలాంటి ఎండీఆర్ వసూలు చేయడం లేదు.
వ్యాపారులపై అదనపు ఖర్చులు విధిస్తే ఆ భారం అంతిమంగా వస్తువులు, సేవల ధరల ద్వారా వినియోగదారులపై పడుతుందని ప్రతిపక్షం అంటోంది.
యూపీఐని కార్యాచరణలో ఉంచడానికి నిరంతర పెట్టుబడి అవసరమని ప్రభుత్వం, పరిశ్రమ వాదిస్తున్నప్పటికీ భవిష్యత్తులో పెద్ద వ్యాపారులపై విధించే రుసుములు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపవు.
యూపీఐ విధానంపై థింక్ ట్యాంక్ ఆరోపణ ఏంటి?
"చెల్లింపుల రంగంలో భారత్ తన స్వయంప్రతిపత్తి, పోటీతత్వం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. అమెరికా ఆందోళనలను పరిష్కరించడానికో లేదా వీసా, మాస్టర్‌కార్డ్ వంటి విదేశీ కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చడానికో మాత్రమే ఎండీఆర్ అమలు చేయకూడదు" అని జీటీఆర్ఐ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
పేమెంట్ డేటా స్థానికీకరణ నిబంధనలను కొనసాగించాలని, ఇది మోసాల దర్యాప్తు, సైబర్ సెక్యూరిటీ, జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని ఆయన వాదిస్తున్నారు.
యూపీఐపై విధించే రుసుములకు, భారత్ - అమెరికా వాణిజ్య చర్చలతో సంబంధం లేదని చెల్లింపుల పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తెలిపింది. 95 శాతానికి పైగా యూపీఐ చెల్లింపులపై అటువంటి రుసుములు ఉండవని కూడా వెల్లడించింది.
"యూపీఐ విజయంలో జీరో ఎండీఆర్ విధానం కీలకపాత్ర పోషించింది. దీనివల్ల వినియోగదారులు, చిన్న వ్యాపారులు ఎలాంటి రుసుములు లేకుండా డిజిటల్ చెల్లింపులు చేయడం సాధ్యపడింది" అని జీటీఆర్ఐ పేర్కొంది.
అయితే యూపీఐ వ్యవస్థ నిర్వహణ, భద్రత, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక సదుపాయాలు, వివాద పరిష్కారాల ఖర్చులు ఎక్కువని.. అందువల్ల నిలకడైన ఆర్థిక నమూనా అవసరం కావచ్చని థింక్ ట్యాంక్ అంగీకరించింది.
కాకపోతే, ఆ నమూనా సాధారణ వర్తక చార్జీలు విధించే విధంగా ఉండకూడదని శ్రీవాస్తవ అంటున్నారు.
పేమెంట్స్ కౌన్సిల్ ఏమంది?
యూపీఐ చెల్లింపులపై చార్జీల విషయంలో ఆందోళనలు పెరగడంతో పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 'ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్' (తరచూ అడిగిన ప్రశ్నలు) పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఈ చార్జీని సాధారణ వినియోగదారులు చిన్న వ్యాపారులపై విధించబోమని స్పష్టం చేసింది.
భవిష్యత్తులో పెద్ద వ్యాపారులపై ఏదైనా రుసుము విధించినా యూపీఐ యూజర్లు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదని అందులో పేర్కొంది.
పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం, యూపీఐ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. దీనిని సురక్షితంగా సజావుగా నడపడానికి నిరంతర పెట్టుబడి అవసరం.
ప్రస్తుతం, ఈ వ్యవస్థ ఖర్చును బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ సంస్థలు భరిస్తున్నాయి.
ప్రతిపక్షాల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి స్పందన
టాక్సేషన్ అండ్ అదర్ లాస్ సవరణ బిల్లు 2026, యూపీఐ లావాదేవీలపై ఫీజు రహిత విధానాన్ని తొలగించడానికి మార్గం సుగమం చేస్తుందని.. భవిష్యత్తులో యూపీఐతో సహా డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ విధించే అవకాశాన్ని పెంచుతుందని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఆరోపించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆరోపణలపై స్పందించారు.
"ఎండీఆర్ కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ వినియోగదారులకు కాదు. దీనివల్ల బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, భద్రతపై మరింత పెట్టుబడి పెట్టగలుగుతాయి. దీని వల్ల యూపీఐ యూజర్లందరికీ ప్రయోజనం లభిస్తుంది" అని ఆమె అన్నారు.
యూపీఐ లావాదేవీల్లో ఎండీఆర్ అమలు చేసే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
ఈ విషయంపై నిర్ణయాన్ని ఎన్‌పీసీఐకి చెందిన యుపీఐ, సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ తీసుకుంటుందని ఆమె అన్నారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా వ్యంగ్యాత్మక విమర్శలు చేశారు.
"మరో మాటలో చెప్పాలంటే, నిర్మలాజీ చెబుతున్న దానికి అర్థం ఏమిటంటే, ఆమె యూపీఐ వ్యవస్థను కూల్చివేయరు. దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. అయినా కూడా ఎలాంటి తేడా ఉండదని చెబుతున్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కల నిలవదు. గౌరవనీయ ఆర్థిక మంత్రి గారూ ఈ వివరణకు ధన్యవాదాలు. 'ఆర్థిక శాస్త్రం'లో మీకున్న డిగ్రీ దేశానికి ఒక ఆస్తిగా నిలుస్తూనే ఉంది" అని ఆయన ఎక్స్‌లో మెసేజ్ పెట్టారు.
బీజేపీ వాదన ఏంటి?
యూపీఐ చెల్లింపులపై చార్జీల విషయంలో చర్చ ఊపందుకున్న తర్వాత, బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జ్ అమిత్ మాలవీయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రతిపక్షాల ఆందోళనలు, ఆరోపణలు నిరాధారమైనవని అందులో పేర్కొన్నారు.
"ఊహాజనిత విదేశీ ఒత్తిడి కారణంగా భారత దేశం తన చెల్లింపుల చట్టాలను మార్చుకుందని జైరామ్ రమేష్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వాదన వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. యూపీఐపై విదేశీ చెల్లింపుల కంపెనీల అభ్యంతరాలు కొత్తవేమీ కాదు. భారత్ ఎల్లప్పుడూ తన పౌరుల, ఆర్థిక రంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంది" అని ఆయన అందులో రాశారు.
"యూఎస్‌టీఆర్ 2026లో యూపీఐని అకస్మాత్తుగా కనుగొనలేదు. యూపీఐ యాప్‌లకు 30 శాతం మార్కెట్ వాటా పరిమితి విధించాలనే ప్రతిపాదనతో సహా ఎన్‌పీసీఐ యూపీఐ నిబంధనలను దాని 2023, 2025 నివేదికలు అప్పటికే వ్యతిరేకించాయి. ఆ ఒత్తిడికి లోనై భారత్ ఏమైనా చర్య తీసుకుందా? లేదు" అని ఆయన అన్నారు.
"2018లో, ప్రధాన మంత్రి మోదీ రూపీని ప్రోత్సహించడం వల్ల అమెరికా చెల్లింపుల కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని మాస్టర్‌కార్డ్ అమెరికా ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. భారత్ మెత్తబడిందా? లేదు" అని ఆయన తన ఇన్‌స్టా పోస్టులో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)