అయోధ్య, తిరుమల, శబరిమల వివాదాలు: భక్తుల కానుకలు సురక్షితమేనా?

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఆలయాల్లో ఎలాంటి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేస్తే హుండీలో కానుకలు, విరాళాల దొంగతనాలను అడ్డుకోవచ్చు? ఇలా అడిగితే ఇదో వింత ప్రశ్నలా అనిపిస్తుండొచ్చు.

కానీ, అయోధ్య రామ మందిరంలో లక్షల రూపాయల కానుకలు చోరీకి గురయ్యాయనే ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాక.. మతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది.

దీనితో పాటు ఆలయాల నిర్వహణ.. ట్రస్టులు, వ్యక్తులు లేదా ప్రభుత్వాల చేతుల్లో ఉండడం మంచిదా? లేక కార్పొరేట్ సంస్థల తరహాలో సీఈవో పర్యవేక్షణలో ఉండటం సరైనదా? అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.

ధార్మిక స్థలాల్లో కానుకలు దొంగిలించేవారు చూపుతున్న తెలివితేటలు భక్తుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇలాంటి ప్రశ్నలన్నీ పుట్టుకొస్తున్నాయి.

కానుకల దొంగతనం తరహా వివాదాలు కొత్తవేమీ కావు. రామ మందిరం కంటే ముందే.. దేశంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి గుడితో పాటు శబరిమల ఆలయం కూడా ఇలాంటి వివాదాలకు మినహాయింపేమీ కాదు.

ముంబయిలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో కూడా కానుకల గోల్‌మాల్ ఆరోపణల వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.

అయోధ్య రామ మందిరం, తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం రెండూ కూడా సివిల్ సర్వీసెస్ అధికారులు, శాఖాపరమైన ఉద్యోగులు ఉండే చట్టబద్ధమైన బోర్డుల నిర్వహణలోనే నడుస్తున్నాయి.

ఈ దేవాలయాల నిర్వహణ వ్యవస్థ ఎలాంటి లోపాలు లేని (వాటర్-టైట్) నిబంధనలతో పటిష్టంగా పనిచేస్తోందని అందరూ భావిస్తారు.

తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం

ముందుగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే వేంకటేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వాహక వ్యవస్థను పరిశీలిద్దాం.

టీటీడీ అనేది ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు - దేవాదాయ చట్టం, 1987 (ఏపీ చారిటబుల్ అండ్ రెలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ) ప్రకారం ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ.

అప్పటి మద్రాస్ (టీటీడీ) చట్టం కింద, ఇది మొదటిసారిగా 1933లో ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది.

రోజువారీ పాలన, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ చేతిలోనే ఉంటుంది. సాధారణంగా ఐఏఎస్ అధికారి దీనికి అధిపతిగా ఉంటారు.

టీటీడీలో దాదాపు 14,890 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి తోడు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అంతేకాకుండా, వేల మంది శ్రీవారి సేవకులు కూడా ఇక్కడ సేవలు అందిస్తారు.

ఈ బోర్డులో రాజకీయ ప్రతినిధులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉంటారు. అయితే, ఇది ఒక విధాన రూపకల్పన మండలి (పాలసీ బాడీ) మాత్రమే, వార్షిక బడ్జెట్‌ను కూడా ఆమోదిస్తుంది.

దీని ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేస్తుంది. దీంతో ఇది రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణ పరిధిలోకి వస్తుంది.

"అవసరమైనప్పుడు, ఏడాదిలో ఎన్నిసార్లయినా బోర్డు సమావేశం జరుగుతుంది. 2026-27 వార్షిక బడ్జెట్ కోసం జరిగిన సమావేశం కూడా ఇందులో భాగమే. 2025-26 సంవత్సరంలో, ఎనిమిది సార్లు బోర్డు సమావేశాలు జరిగాయి" అని బీబీసీతో టీటీడీ అధికారి ఒకరు చెప్పారు.

విరాళాలు (డొనేషన్లు)

టీటీడీ వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్లే రూ. 20,000 కోట్లు ఉన్నాయని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''దాదాపు 1.97 లక్షల మంది దాతలు ఉన్నారు. ఈ దాతలు ఏడాదికి లక్ష రూపాయల నుంచి కోట్ల రూపాయిల వరకు విరాళంగా ఇస్తుంటారు. కోటి రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు దానం చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. విరాళాలు స్వీకరించే ట్రస్టులు దాదాపు డజను ఉన్నాయి. ఇందులో ఎప్పటిలాగే అతిపెద్ద మొత్తం అన్నప్రసాదానికే వెళ్తుంది. అది రూ. 2500 కోట్లకు పైమాటే.

హుండీల ద్వారా వచ్చే మొత్తం సగటున రోజుకు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4.5 కోట్ల వరకు ఉంటుంది. కాబట్టి, ఒక్క హుండీల ద్వారానే రోజుకు ఐదు కోట్ల రూపాయల వరకు సమకూరుతుందని చెప్పవచ్చు'' అని ఆయన వివరించారు.

1987 చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం... ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లను లిస్టెడ్ బ్యాంకుల్లో ఆరేళ్లకు మించి పెట్టుబడి పెట్టకూడదు. ఒకవేళ టీటీడీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటే, ఆ మొత్తం రూ. 15 లక్షలు దాటకూడదని స్పష్టంగా చెబుతోంది.

భక్తులు ప్రతిరోజూ ఆరు నుంచి పన్నెండు హుండీల్లో నగదు, నాణేలు, బంగారు, వెండి ఆభరణాలు, బంగారం కడ్డీలు, చివరికి ఆస్తుల యాజమాన్య పత్రాలు (ప్రాపర్టీ టైటిల్ డీడ్స్), డీమాట్ షేర్లను కూడా వేస్తారు.

ఆన్‌లైన్ విరాళాలు, ఈ-హుండీ, డిజిటల్ విరాళాల కియోస్క్‌లకు ఇవి అదనం.

"బంగారు, వెండి ఆభరణాలను భద్రంగా సేకరించి, ప్రతి నెల వాటి విలువను లెక్కించి, తిరుపతిలోని టీటీడీ ఖజానాకు తరలిస్తారు. ఆస్తుల హక్కుల పత్రాలను టీటీడీ పేరిట మార్చేందుకు వీలుగా రెవెన్యూ విభాగం వాటి బాధ్యతలను చూసుకుంటుంది" అని టీటీడీ అధికారి ఒకరు చెప్పారు.

ఆ అధికారి తెలిపిన వివరాల ప్రకారం... ఈ లెక్కలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆడిట్ విభాగం ఇంటర్నల్ ఆడిట్, స్టాచ్యూటరీ ఆడిట్ చేస్తుంది. "ఇప్పుడు వీటిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ పరిధిలోకి కూడా తీసుకొస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

పరకామణిలో దొంగతనం

2023 ఏప్రిల్ చివరి వారంలో, పరకామణిలో విధుల్లో ఉన్న అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై.సతీష్ కుమార్ తిరుమల టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో సీవీ రవి కుమార్‌ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.

రవికుమార్ పని ఏంటంటే, తనకు కేటాయించిన డబ్బు సంచి నుంచి అమెరికన్ డాలర్లను వేరుచేయడం.

రవికుమార్ తన చేతులను రహస్యంగా తన లోదుస్తులలో పెట్టుకోవడం తాను గమనించానని సతీష్ కుమార్ ఆరోపించారు.

"ఉద్యోగులు, సేవకులు కేవలం పంచె (ధోతి) మాత్రమే కట్టుకుని కానుకల లెక్కింపు గదుల్లోకి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. లోదుస్తులతో (అండర్‌వేర్) వెళ్లడానికి వీల్లేదు'' అని బోర్డు మాజీ సలహాదారు ఒకరు బీబీసీకి చెప్పారు.

రవికుమార్ 100 డాలర్ల విలువైన తొమ్మిది నోట్లను దొంగిలించారని సతీష్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం... ఈ చార్జ్‌షీట్‌లో సీవీ రవికుమార్‌ను ఐపీసీ సెక్షన్ 379, 381 కింద నిందితుడిగా చేర్చారు. ఈ చార్జ్‌షీట్ 2023 మే 5న తిరుపతిలోని రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైంది.

ఆశ్చర్యకరమైన విషయమేంటంటే... అసలు ఫిర్యాదుదారుడే స్వచ్ఛందంగా రాజీ చేసుకోవడంతో ఐపీసీ సెక్షన్ 320(8) ప్రకారం నిందితుడు కేసులేమీ లేకుండా బయటపడ్డారు.

2025 సెప్టెంబర్ 19నాటి తన ఉత్తర్వుల్లో జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్.. లోక్ అదాలత్ ఉత్తర్వులను నిలిపివేస్తూ, ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని, టీటీడీ నుంచి పూర్తి రికార్డులను వెంటనే జప్తు చేయాలని ఐజీ, సీబీ-సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు.

2025 నవంబర్ 14న, తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఫిర్యాదుదారైన టీటీడీ ఉద్యోగి సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ఈ కేసు మళ్లీ హైకోర్టుకు చేరడంతో, 2025 డిసెంబర్ 2 నాటికి పూర్తి వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

కొద్దిరోజుల తర్వాత రవికుమార్ వీడియో ఒకటి వైరలైంది. ఆ వీడియోలో తాను పాపం చేశానని, దానికి ప్రాయశ్చిత్తంగా తన 90 శాతం ఆస్తులను ఆలయానికి దానం చేసినట్లు, వాటి విలువ రూ. 14 కోట్లు ఉన్నట్లు చెప్పారు.

హైకోర్టు ఆదేశాల మేరకు.. రవి కుమార్, ఇతర టీటీడీ అధికారులకు సంబంధించిన ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), సీఐడీలు తమ నివేదికను కోర్టుకు సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించాయి.

ఈ కేసు ఇంకా కోర్టు విచారణకు రావాల్సి ఉంది.

జనవరిలో, సతీష్ కుమార్ మృతిపై విచారణను వేగవంతం చేయాలని సీఐడీకి సూచించారు. అనంతపురం జిల్లాలో ఆయన రైలు నుంచి కిందపడిపోయారా? లేదా అది హత్యా? అనే కోణంలో నిజానిజాలను తేల్చడమే ఈ విచారణ ముఖ్య ఉద్దేశం.

వ్యవస్థ ఎంత బలంగా ఉన్నప్పటికీ పరకామణి దొంగతనం వ్యవహారం దాని పారదర్శకతపై అనుమానాలు రేకెత్తిస్తోంది.

శబరిమలలో బంగారం మాయం

అయ్యప్ప స్వామి ఆలయమైన శబరిమలలో వెలుగుచూసిన స్కామ్ ఇంకా పెద్ద స్థాయిలో ఉంది.

తిరుపతిలో డాలర్లు దొంగిలించారనే ఆరోపణలు వస్తే, శబరిమలలో బంగారం మాయమైంది.

మాయమైన బంగారం నాలుగున్నర కిలోల వరకు ఉంటుందని అంచనా. ఈ బంగారానికి బదులుగా తలుపులు, ద్వారపాలకుల (రక్షక దేవతల) విగ్రహాలపై రాగి రేకులను అమర్చినట్లు నివేదికలు వచ్చాయి.

1988లో బంగారు రేకులకు పూత పనులు జరిగాయి. అయితే, 2019 నుంచి 2025 మధ్య కాలంలో ఆ బంగారాన్ని తీసేసి దాని స్థానంలో రాగి రేకులు అమర్చినట్లు తేలింది.

ఈ విషయాన్ని ఇటీవల నేషనల్ మెటలర్జికల్ లేబొరేటరీ (సీఎస్ఐఆర్-ఎన్ఎమ్‌ఎల్) నివేదిక కూడా ధ్రువీకరించింది.

నిజానికి ఆలయం నుంచి 30.29 కిలోల బంగారాన్ని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత తలుపులు, స్తంభాలు, స్వామి అయ్యప్ప కథలను తెలిపే ప్యానెళ్లను తిరిగి తీసుకువచ్చినప్పుడు.. అందులో దాదాపు 4.54 కిలోల బంగారం మాయమైనట్లు తేల్చారు.

కేరళ హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఎస్‌ఐటీ నేరుగా కోర్టుకే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

"శబరిమల కేసు పూర్తిగా హైకోర్టు పర్యవేక్షణలో ఉంది. ఎస్‌ఐటీ తన నివేదికను సమర్పించి, హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఇందులో జోక్యం చేసుకోలేం" అని బీబీసీతో దేవస్వం బోర్డు మంత్రి కె.మురళీధరన్ చెప్పారు.

అయితే, ఈ దొంగతనం ఆరోపణల కేసులో అరెస్టయిన వ్యక్తులను చూసి జనం విస్తుపోయారు.

ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరూ, ఆయన సహాయకుడు ఉన్నికృష్ణన్ పొట్టి నేరపూరిత నమ్మకద్రోహం, ఫోర్జరీ, కుట్ర ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఇందులో ఉన్నికృష్ణన్ పొట్టిని ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు.

వీరితో పాటు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్(టీడీబీ) మాజీ అధ్యక్షులు ఎ. పద్మకుమార్, ఎన్. వాసు, బోర్డు పరిపాలనాధికారులైన కమిషనర్లు కె.ఎస్. బైజు, ఆర్.జి. రాధాకృష్ణన్, టీడీబీ మాజీ సభ్యులు ఎన్.విజయకుమార్, కె.పి. శంకరదాస్, చెన్నైకి చెందిన 'స్మార్ట్ క్రియేషన్స్' యజమాని పంకజ్ భండారీలతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.

"టీడీబీ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. కనీసం ఏడాది వరకు మేం ఎలాంటి చర్యలు తీసుకోలేం. అయితే, ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధి కోసం ఉద్దేశించిన విరాళాల వినియోగంపై విచారణ జరపాలని విజిలెన్స్ విభాగాన్ని కోరాం" అని బీబీసీకి మురళీధరన్ చెప్పారు.

"ఒకవేళ టీడీబీ సరిగ్గా పనిచేసి, స్వామి అయ్యప్ప పట్ల పూజారులు నిజాయితీగా ఉంటే ఇలాంటి మోసాలు జరగవు" అని దేవస్వం బోర్డు మాజీ మంత్రి జి.సుధాకరన్ అన్నారు.

అంటే, ఎస్‌ఐటీ సమర్పించే నివేదికను హైకోర్టు పరిశీలించిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశముంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)