కందుల జెస్సీ: ప్రభుత్వ పాఠశాల నుంచి శాటిలైట్ తయారీ ప్రాజెక్ట్ వరకు

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రపంచంలోని 108 దేశాల బాలికలతో కలిసి చంద్రుడి మీదకు పంపే శాటిలైట్ రూపకల్పనలో పాల్గొనబోతోంది.

తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'మిషన్ శక్తిశాట్'కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని.

ఆమె ఆగస్టు 23 నుంచి 31 వరకు దిల్లీలో జరిగే ఎనిమిది రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొని, ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థినులతో కలిసి ఒక క్యూబ్‌శాట్ రూపకల్పనలో భాగం కానుంది.

అసలు మిషన్ శక్తిశాట్ అంటే ఏమిటి? జెస్సీ ఎంపిక వెనుక ఉన్న ప్రయాణం ఎలా సాగింది?

ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రపంచ అంతరిక్ష కార్యక్రమం వరకు ఆమె ఎలా చేరుకున్నారు?

'మిషన్ శక్తిశాట్' అంటే ఏమిటి?

చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేకంగా రూపొందించే చిన్న ఉపగ్రహం (క్యూబ్‌శాట్) తయారీలో ప్రపంచవ్యాప్తంగా బాలికలను భాగస్వాములను చేసే కార్యక్రమమే మిషన్ శక్తిశాట్.

ఇది పూర్తిగా బాలికల కోసం రూపొందించిన తొలి 'గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్' కార్యక్రమంగా నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఈ కార్యక్రమాన్ని స్పేస్ కిడ్స్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM), నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఎంపికైన విద్యార్థినులు అంతరిక్ష శాస్త్రం, శాటిలైట్ రూపకల్పన, పేలోడ్ వ్యవస్థలు, గ్రౌండ్ స్టేషన్లు, నాయకత్వం, అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో శిక్షణ పొందుతారు.

దవళేశ్వరం నుంచి..

జెస్సీ తండ్రి శ్రీను దవళేశ్వరంలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు.

సాధారణ కుటుంబానికి చెందిన జెస్సీ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతోంది.

ఏడో తరగతిలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో చేరిన తర్వాత సైన్స్ ప్రాజెక్టులపై ఆమె ఆసక్తి పెరిగిందని ఆమెకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయురాలు ఎ.మణిమాల బీబీసీతో చెప్పారు.

"మిషన్ శక్తిశాట్‌కి దరఖాస్తు చేసుకునేందుకు మా పాఠశాల నుంచి 8 మంది ముందుకు వచ్చారు. వారిలో జెస్సీ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా లోతుగా అర్థం చేసుకునేది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చిన కోర్సుని వేసవి సెలవుల్లోనే 80 శాతం పూర్తి చేసింది. స్కూల్ ప్రారంభమైన తర్వాత మిగతా భాగం పూర్తి చేసి జాతీయ ఫైనలిస్ట్‌గా ఎంపికైంది" అని మణిమాల చెప్పారు.

108 దేశాలు...ఏపీ నుంచి ఒక్కరు

ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి వేల మంది విద్యార్థినులు నమోదు చేసుకున్నారు.

వారిలో ప్రతి దేశం నుంచి ప్రతినిధులను ఎంపిక చేయగా, భారత్ నుంచి 20 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సీ ఒక్కరే ఉన్నారు.

"నేను 'మిషన్ శక్తిశాట్' వర్క్‌షాప్‌కు ఎంపికయ్యాను. అంతరిక్ష సాంకేతిక రంగంలో అమ్మాయిల భాగస్వామ్యాన్ని పెంచడం, వారికి స్ఫూర్తినివ్వడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఎంపిక ప్రక్రియలో భాగంగా నాకు 21 మాడ్యూల్స్‌తో కూడిన 550 పాఠాల ఆన్‌లైన్ కోర్సు ఇచ్చారు. ఇందులో బేసిక్ ఫిజిక్స్, గణితం, క్యూబ్‌శాట్ రూపకల్పన, పేలోడ్స్, గ్రౌండ్ స్టేషన్, శాటిలైట్ టెక్నాలజీ వంటి అంశాలపై 120కి పైగా ఆన్‌లైన్ శిక్షణ తరగతులు జరిగాయి. ఆ కోర్సును పూర్తి చేసిన తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. ఆ తర్వాతే మిషన్ శక్తిశాట్‌కు ఎంపికయ్యాను" అని జెస్సీ చెప్పారు.

"108 దేశాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో జెస్సీ ఉండటం మా పాఠశాలకు గర్వకారణం" అని అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జ్ మణిమాల అన్నారు.

'కౌంట్ డౌన్ ప్రారంభమైంది'

"శక్తిశాట్ జాతీయ ఫైనలిస్ట్‌గా 2026 ఆగస్టులో దిల్లీలో నిర్వహించే 8 రోజుల శక్తిశాట్ వర్క్‌షాప్‌లో మీరు పాల్గొనే అవకాశం పొందారు." అంటూ జెస్సీకి జూలై 1న ఒక మెయిల్ వచ్చింది. దాంతో జెస్సీ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

"ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని అత్యుత్తమ యువ మేధావులతో కలిసి అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, నవీనత, నాయకత్వం, ప్రపంచవ్యాప్త సహకారం వంటి అంశాలపై ప్రత్యేక అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ విజయం మిమ్మల్ని భవిష్యత్తులో అంతరిక్షం, సాంకేతిక రంగాలను తీర్చిదిద్దే యువ మార్పుకర్తల ప్రత్యేక బృందంలో నిలబెడుతోంది. కాబట్టి, సీట్‌బెల్ట్‌లు బిగించుకోండి,కౌంట్‌డౌన్ ప్రారంభమైంది" అని మిషన్ శక్తిశాట్ వింగ్ కమాండర్ జయ తారే నుంచి వచ్చిన మెయిల్‌లో పేర్కొన్నారు.

వందల గంటల శిక్షణ..

ఈ కార్యక్రమానికి ఎంపిక కావడం చాలా కష్టమని జెస్సీ చెప్పారు.

విద్యార్థినులు 21 మాడ్యూల్స్‌లో 550 పాఠాలను పూర్తి చేయాలి.

బేసిక్ ఫిజిక్స్, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్, క్యూబ్‌శాట్ సిస్టమ్స్, పేలోడ్స్, గ్రౌండ్ స్టేషన్లు, శాటిలైట్ టెక్నాలజీ అంశాలపై ఆన్‌లైన్ శిక్షణ తీసుకోవాలి.

అనంతరం ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోవాలి.

ఇదంతా కూడా ఇస్రోతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల శాస్త్రవేత్తల పర్యవేక్షణలో జరుగుతుందని జెస్సీ బీబీసీతో చెప్పారు.

"ఇది చాలా క్లిష్టమైన కోర్సు. ఒక్కో వీడియోను రెండు మూడు సార్లు చూసేదాన్ని. ముఖ్యమైన అంశాలు నోట్ చేసుకునేదాన్ని. డౌట్లు వస్తే టీచర్లను అడిగేదాన్ని. పదో తరగతి చదువు, పరీక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ కోర్సును పూర్తి చేశాను." అని జెస్సీ వివరించారు.

"ఈ కార్యక్రమానికి ఎంపికయ్యానని తెలిసినప్పుడు సంతోషంగా అనిపించినా.. 550 లెసన్స్ చూశాక భయపడ్డాను. కానీ ఆసక్తి ఉండటంతో పూర్తి చేశాను. భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవాలని అనుకుంటున్నాను" అని ఆమె చెప్పారు.

తన తల్లిదండ్రులు కూడా తనకు ఇష్టమైన రంగాన్నే ఎంచుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించారని చెప్పారు.

దిల్లీలో ఏం జరగనుందంటే..

ఆగస్టు 23 నుంచి 31 వరకు దిల్లీలో జరిగే ఎనిమిది రోజుల శక్తిశాట్ వర్క్‌షాప్‌లో రెండు శాటిలైట్ల తయారు చేసే ప్రాజెక్టులో జెస్సీ పాల్గొంటారు.

ఈ శిక్షణలో ప్రపంచంలోని 108 దేశాలకు చెందిన విద్యార్థినులు కలిసి శాటిలైట్ రూపకల్పనపై పనిచేయనున్నారు.

దిల్లీలో శాటిలైట్ డిజైనింగ్, పేలోడ్ తయారీ, మిషన్ ఆపరేషన్లలో ప్రత్యక్ష శిక్షణ పొందనుంది.

ఈ విద్యార్థినులు సంయుక్తంగా తయారుచేసే 'లూనార్ క్యూబ్‌శాట్' ఉపగ్రహాన్ని అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి రోదసిలోకి ప్రయోగించనున్నారు.

"108 దేశాల బాలికలు కలిసి ఒక శాటిలైట్‌ను చంద్రుడి కోసం రూపొందించడం ప్రపంచానికి ఒక గుర్తింపు అవుతుంది." అని జెస్సీ బీబీసీతో చెప్పారు.

తన పాఠశాలలో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ తన ఆలోచనలకు కొత్త రెక్కలు తొడిగిందన్నారు.

భవిష్యత్తులో 'ఇస్రో'లో శాస్త్రవేత్తగా చేరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రంగంలో పని చేస్తానని బీబీసీతో జెస్సీ చెప్పారు.

విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే..

జెస్సీ విజయంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రపంచ అంతరిక్ష కార్యక్రమానికి ఎంపిక కావడం స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, "ఆంధ్రప్రదేశ్‌కు నువ్వు గర్వకారణం. చంద్రుడి వైపు నీ ప్రయాణం విజయవంతం కావాలి" అని ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

కందుల జెస్సీ సాధించిన విజయం వెనుక ఆమె కుటుంబం ప్రోత్సాహం కూడా ఉంది. దవళేశ్వరంలో కార్పెంటర్‌గా పనిచేసే ఆమె తండ్రి శ్రీను తాము పెద్దగా చదువుకోలేదని చెబుతారు.

కానీ, కూతురు ఎంచుకున్న మార్గంలోనే మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు.

"ఆంధ్రప్రదేశ్ నుంచి మా పాప ఒక్కరే ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఆమె భవిష్యత్తుకు కొత్త దారిని చూపుతుందని నమ్ముతున్నాం. మేము పెద్దగా చదువుకోలేదు. ఇప్పుడు ఆమె ఎంచుకున్న అంతరిక్ష రంగంలోనే ఉన్నత చదువులు కొనసాగించి మరింత ఎదగాలని కోరుకుంటున్నాం" అని కందుల శ్రీను బీబీసీతో చెప్పారు.

జెస్సీ తల్లి అరుణకు మాత్రం ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ అత్యంత ఉత్కంఠభరితమైన క్షణమని బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

దిల్లీ నుంచి ఫోన్ చేసిన వాళ్లు హిందీ, ఇంగ్లీషులో ప్రశ్నలు అడిగితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె ఎలా సమాధానం చెబుతుందోనన్న ఆందోళన తనను వెంటాడిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

"ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఆమె సమాధానాలు చూసి ఆశ్చర్యపోయాను. ప్రపంచస్థాయి కార్యక్రమానికి ఎంపిక అవుతుందని మేము అస్సలు ఊహించలేదు. భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివి అంతరిక్ష రంగంలో పనిచేస్తే అంతకంటే ఆనందం మాకు ఉండదు" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)