You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జీడీ నాయుడు మూవీ రివ్యూ: ‘ఇండియన్ ఎడిసన్’ అనిపించుకున్న ‘తెలుగు’ నాయుడు హిట్లర్‌ను ఎందుకు కలిశాడు?
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అలియాస్ జీడీ నాయుడు గురించి తమిళనాడులో తెలియని వారు లేరు.
తెలుగు మూలాలు ఉన్న నాయుడి బయోపిక్ థియేటర్‌లోకి వచ్చింది.
వందేళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో వాణిజ్య, సాంకేత విప్లవానికి ఆయన ఆద్యుడు. ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచిన వ్యక్తి.
ప్రముఖ నటుడు మాధవన్ ఈ సినిమాలో నాయుడు పాత్రలో నటించారు.
ఈ చిత్రం తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలైంది.
కథ ఏమంటే ఒక యూనివర్సిటీలో కొందరు మేధావుల మధ్య నాయుడు జీవితం గురించి చర్చ మొదలవుతుంది.
ప్లాష్‌బ్యాక్‌లో ఆయన గురించిన ఎత్తుపల్లాలు , గెలుపోటములు, సంఘర్షణ గురించి సన్నివేశాలు వస్తూ వుంటాయి.
కోయంబత్తూరులోని రైతు కుటుంబంలో పుట్టిన నాయుడు పెద్దగా చదువుకోలేదు. డిగ్రీలకంటే అనుభవం , జ్ఞానం ముఖ్యమని ఆయన నమ్మకం.
ఒక బ్రిటీషర్ దగ్గర రూ.250లతో మోటర్ సైకిల్ కొనాలని అనుకుంటాడు.
కానీ ఆ డబ్బుని రైతు కూలీలకి ఇచ్చేస్తాడు. తనతో పాటు నలుగురూ బావుండాలనే తపన.
తర్వాత ఒక హోటల్‌లో పని చేసి డబ్బు సంపాదించి మోటర్ సైకిల్ కొని, అది ఎలా పని చేస్తుందో తెలుసుకుంటాడు.
కొత్త వస్తువులు కనిపెట్టడం దగ్రి నుంచి ఒక బస్సుల కంపెనీ యజమాని వరకూ ఎదుగుతాడు.
జర్మనీ వెళ్లి హిట్లర్‌తో ప్రశంసలు పొందుతాడు.
ఈ క్రమంలో బ్రిటీష్ వాళ్లు ఒక ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి సాయంతో నాయుడు మీద కుట్రలు చేస్తారు.
దేశద్రోహిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయన్ని వేధించి, ఆస్తుల జప్తు వరకు తీసుకొస్తారు. ఇవన్నీ జీడీఎన్ ఎలా ఎదుర్కొన్నాడు... మిగతా కథ.
బయోపిక్‌లో ఉన్న ఇబ్బంది ఏమంటే ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్య సంఘటనలు వివరించే ప్రయత్నంలో డాక్యుమెంటరీ లక్షణాలు రాకుండా జాగ్రత్త పడాలి.
ఈ సినిమాలో ఉన్న పెద్ద లోపం ఇదే.
చివరి 15 నిమిషాలు మినహాయిస్తే మిగిలిన సినిమా డాక్యుమెంటరీలాగే ఉంటుంది.
మహానటి (సావిత్రి బయోపిక్) లాంటి సినిమాల్లో సౌలభ్యం ఏమంటే అది సినిమా నటి కథ. ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది.
జీడీ. నాయుడి గురించి తమిళనాడులో బాగా తెలిసి ఉండొచ్చు కానీ, తెలుగు వాళ్లకి పెద్దగా తెలియదు.
సినిమా అంటే అందరికీ సులభంగా అర్థమవ్వాలి.
ఒక వ్యక్తి జీవితంలోని నాటకీయతని , ఎమోషన్స్‌ని తెర మీద ఆవిష్కరించాలి.
అయితే దర్శకుడు కృష్ణకుమార్ రాంకుమార్ తాను రాసింది, తీసుకుంటూ వెళ్లాడు తప్ప, భావోద్వేగాలు పండించలేకపోయాడు.
నాయుడు గురించి అనేక విషయాలు స్పర్శిస్తూ వెళ్లాడు తప్ప, గాఢత లేదు.
సత్యరాజ్ , ప్రియమణి, జయరామ్, దుశారా విజయన్ లాంటి మంచి నటులున్నా మంచి సన్నివేశాలు లేకుండా పోయాయి.
పైగా ఇన్‌కమ్‌ట్యాక్స్ లెక్కలు సామాన్యులకి అర్థంకావు. ఆ సుదీర్ఘ ఎత్తుగడలు విసుగు పుట్టిస్తాయి.
నాయుడు మొదటి భార్య చెల్లమ్మ (ప్రియమణి) ఎందుకు వదిలి వెళ్లిందో, రెండో పెళ్లికి కారణం ఏంటో ఎక్కడా వివరణ లేదు.
మొదట కొన్ని సన్నివేశాల్లో బలంగా కనిపించిన చెల్లమ్మ పాత్ర ప్రస్తావన మళ్లీ రాదు.
మాధవన్ గొప్పగా నటించాడు.
చివరి సన్నివేశాల్లో ఆయన నటన హైలైట్. సంగీతం, కెమెరా అన్నీ బాగున్నాయి.
మాధవన్ కూడా రచన చేసినప్పటికీ ఎక్కడా బలం కనిపించడం లేదు.
బలహీనమైన రైటింగ్, భారీ ప్రయత్నాన్ని దెబ్బతీసింది.
నూరేళ్ల క్రితం కథని తెరమీద చూపించాలంటే ఖర్చుతో కూడిన పని.
కాలాన్ని (పీరియడ్) కళ్ల ముందు ఉంచడంలో ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్
1.మాధవన్ , దుశారా విజయన్ , జయరామ్ నటన
2.ప్రొడక్షన్ డిజైనింగ్
మైనస్ పాయింట్స్
1.ఎమోషన్స్ మిస్ కావడం
2.డాక్యుమెంటరీ లక్షణాలు
ఫైనల్‌గా - ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన నాయుడిని తెరమీద ఆవిష్కరించలేకపోయారు.
(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)