You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ - అమెరికా ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసే ఆ 3 కీలక అంశాలు ఏమిటి?
- రచయిత, లూయిస్ బారుచో
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
వారాల తరబడి సాగిన చర్చల తర్వాత అమెరికా, ఇరాన్ ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయి. కానీ ఇప్పుడు అందరి దృష్టి యుద్ధం ముగింపు ప్రక్రియలో ఎదురయ్యే భారీ సవాళ్లపై కేంద్రీకృతమవుతోంది.
అమెరికా ఉన్నతాధికారులు బుధవారం నాడు 14 పేరాల అవగాహనా ఒప్పందాన్ని బీబీసీ సహా పలువురు విలేఖరులకు చదివి వినిపించారు.
నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఒప్పందంపై వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు చేయాల్సి ఉంది. కానీ, అంతకంటే ముందే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ దీనిపై సంతకాలు చేయడం ద్వారా గరిష్ఠంగా 60 రోజుల్లోగా 'తుది ఒప్పందం' కుదుర్చుకోవడానికి మార్గం సుగమం చేశారు. అయితే పరస్పర అంగీకారంతో ఈ అవగాహనా ఒప్పందాన్ని పొడిగించుకోవచ్చు.
అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని తొలగించడం, హార్ముజ్ జలసంధి గుండా నౌకల రవాణాను పునరుద్ధరించడం, ఇరాన్‌పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేసేందుకు చర్చలు జరపడం వంటి నిబద్ధతలను అవగాహనా ఒప్పందంలో పేర్కొన్నారు.
ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా ఇందులో వివరించారు. దీనితో పాటు అణ్వాయుధాన్ని తయారు చేయబోమనే గత హామీని తెహ్రాన్ మరోసారి పునరుద్ఘాటించింది.
ఈ ప్రాథమిక ఒప్పందం ఇంకా ‘తుది ఒప్పందం’ కాదని ఇది విఫలమైతే అమెరికా "మళ్లీ బాంబుల దాడికి దిగుతుంది" అని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికాపై అపనమ్మకం అలానే ఉందని, తెహ్రాన్ వేలు ఎప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ముఖ్య ప్రతినిధి మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ ప్రభుత్వ మీడియాతో అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్చలను ప్రమాదంలో పడేసే మూడు అతిపెద్ద సవాళ్లు ఉన్నాయి.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్య
ఎంఓయూ ప్రకటన సందర్భంగా, ప్రధాన మధ్యవర్తులలో ఒకరిగా వ్యవహరించిన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, "లెబనాన్ సహా అన్ని రంగాలలో సైనిక చర్యలను తక్షణమే, శాశ్వతంగా ముగించాలని" ఇరుపక్షాలు ప్రకటించాయని చెప్పారు.
బుధవారం చదివి వినిపించిన ఈ ఒప్పందంలో లెబనాన్‌ను కూడా స్పష్టంగా చేర్చారు. ఇది ఆ దేశ ప్రాంతీయ సమగ్రతను, సార్వభౌమాధికారానికి భరోసానిస్తోంది.
లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ట్రంప్ చెప్పినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తోంది.
నబాతియా అల్-ఫౌకా ప్రాంతం, దాని పొరుగున ఉన్న క్ఫార్ టెబ్నిట్ శివార్లపై బుధవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేసినట్లు లెబనాన్ ప్రభుత్వ జాతీయ వార్తాసంస్థ (ఎన్ఎన్ఏ) తెలిపింది.
కాల్పుల విరమణ పరిధిలోకి లెబనాన్ వచ్చినప్పటికీ, లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకోవాలనే షరతు ఈ ఒప్పందంలో లేదని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంటుందని వారు పేర్కొన్నారు.
కానీ, లెబనాన్‌లో యుద్ధం ముగియడం అనేది 'యుద్ధాన్ని ముగించే ఒప్పందంలో విడదీయరాని భాగం' అని ఇరాన్ స్పష్టం చేసింది.
లెబనాన్‌లోని ఇరాన్ మద్దతుగల సాయుధ సమూహం హిజ్బుల్లా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
తదుపరి చర్చల దశలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణను డిమాండ్ చేస్తామని ఇరాన్ తమ మిత్రదేశానికి హామీ ఇచ్చినట్లు హిజ్బుల్లా మీడియా సంబంధాల కార్యాలయం రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపింది.
ఒప్పందంపై ఇరాన్ ఇస్తున్న వివరణకు తాను కట్టుబడి లేనట్లు ఇజ్రాయెల్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
లెబనాన్‌లోని భద్రతా వలయాల్లో ఇజ్రాయెల్ సైన్యం ఎంతకాలం ఉంటుందనే దానికి ఎలాంటి కాలపరిమితి లేదని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చెప్పారు. లెబనాన్ కోసం ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే, తాము 'పూర్తి బలంతో తిప్పికొడతామని' ఆయన హెచ్చరించారు.
శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ "ప్రధాన అడ్డంకిగా" మారిందని బ్రిటన్‌కు చెందిన థింక్-ట్యాంక్ 'రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్' పొలిటికల్ సైంటిస్ట్ డాక్టర్ హెచ్.ఎ. హెలియర్ అభిప్రాయపడ్డారు.
"ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్నా, లెబనాన్‌లో కొనసాగుతున్న విధ్వంసం రూపంలోనైనా ఇజ్రాయెల్ సైనిక దూకుడు దౌత్యపరమైన పురోగతికి అతిపెద్ద ముప్పు" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకవేళ తెహ్రాన్ ప్రత్యక్ష ఘర్షణలోకి దిగితే, "అణు అంశంపై అసలైన చర్చలు ప్రారంభం అయ్యేలోపే" ఈ ప్రక్రియ మొత్తం విఫలమయ్యే ప్రమాదం ఉందని హెలియర్ పేర్కొన్నారు.
మరోవైపు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఈ ప్రాథమిక ఒప్పందాన్ని స్వాగతించారు. ఇది "హింసకు శాశ్వత ముగింపు పలికే ఆచరణాత్మక చర్యగా" మారుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ యుద్ధం లెబనాన్‌కు తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది. అక్కడ 3,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు పది లక్షల మంది నిర్వాసితులయ్యారు. అలాగే దక్షిణ ప్రాంతం చాలా వరకు విధ్వంసానికి గురైంది.
ఇరాన్ అణు కార్యక్రమం
ఇరాన్ దగ్గర నిల్వ ఉన్న శుద్ధి చేసిన యురేనియం మరో వివాదాస్పద అంశంగా మారింది. అయితే, దానిని స్వాధీనం చేసుకోవడానికి ఎటువంటి తొందర లేదని ట్రంప్ చెప్పారు.
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ రిపోర్ట్ ప్రకారం, గత ఏడాది నాటికి ఇరాన్ 60 శాతం స్వచ్ఛతతో శుద్ధి చేసిన సుమారు 400 కిలోల యురేనియంను సేకరించింది. అణ్వాయుధ తయారీకి యురేనియం శుద్ధి స్థాయి దాదాపు 90 శాతం ఉండాలి.
తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుత అవసరాల కోసమేనని తెహ్రాన్ మొదటి నుంచి చెబుతోంది. తాము అణ్వాయుధాలను తయారు చేయబోమని ఈ ఒప్పందంలోనూ స్పష్టం చేసింది.
అయినప్పటికీ, ప్రస్తుతం ఉన్న అణు ఇంధనాన్ని ఏం చేయాలనే దానితో సహా కీలకమైన ప్రశ్నలకు రాబోయే తుది ఒప్పంద చర్చలలోనే పరిష్కారం కనుగొనాల్సి ఉంది.
శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎలా హ్యాండిల్ చేయాల విషయాన్ని ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. కనీస చర్యగా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో ఆ యురేనియంను అక్కడికక్కడే 'డౌన్‌బ్లెండ్' (తీవ్రతను తగ్గించడం) చేస్తారు.
2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో జరిగిన అణు ఒప్పందం ప్రకారం, ఇరాన్ తన యురేనియం శుద్ధిని 3.67 శాతానికే పరిమితం చేసింది. కానీ, 2018లో ట్రంప్ మొదటి పదవీకాలంలో అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలిగిన తర్వాత, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని భారీగా విస్తరించింది.
ఒకవేళ ఇరాన్ మళ్లీ అణ్వాయుధ స్థాయికి సరిపోయేలా యురేనియం శుద్ధి చేస్తోందని అనిపిస్తే, అమెరికా అధ్యక్షుడు "మళ్లీ సైనిక చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది" అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌కు డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన డారిన్ సెల్నిక్ బీబీసీ రేడియో 4 'టుడే' కార్యక్రమంలో పేర్కొన్నారు.
ప్రస్తుతానికైతే, ఈ 60 రోజుల చర్చల కాలంలో ఇరుపక్షాలు యథాతథ స్థితిని కొనసాగించవచ్చని భావిస్తున్నారు.
ఇరాన్ తన అణు కార్యకలాపాలను విస్తరించదు, అలాగే అమెరికా కొత్త ఆంక్షలు విధించడం లేదా ఆ ప్రాంతంలో తన సైనిక ఉనికిని పెంచడం వంటివి చేయదు.
హార్ముజ్ జలసంధి
గత ఫిబ్రవరి నుంచి పూర్తిగా నిలిచిపోయిన హార్ముజ్ జలసంధిని తిరిగి ప్రారంభించడం కూడా ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. యుద్ధానికి ముందు, ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు 20 శాతం ఈ కీలక రవాణా మార్గం గుండానే సాగేది.
శుక్రవారం ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత ఈ జలమార్గం తిరిగి తెరుచుకుంటుందని, ఇరాన్ చేపట్టే మందుపాతరల తొలగింపు వంటి సాంకేతిక, భద్రతాపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత 30 రోజుల్లోగా పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఇందులో పేర్కొన్నారు.
ఈ జలసంధి గుండా "పర్షియన్ గల్ఫ్ నుంచి ఒమన్ సముద్రం మధ్య" ప్రయాణానికి మొదటి 60 రోజుల వరకు ఎటువంటి రుసుము ఉండదని ఒప్పందంలో స్పష్టం చేశారు.
అంతర్జాతీయ చట్టాలకు లోబడి, ఈ జలమార్గం భవిష్యత్తు నిర్వహణ, నౌకాయాన సేవలపై ఒమన్, ఇతర గల్ఫ్ దేశాలతో ఇరాన్ చర్చలు జరుపుతుందని కూడా ఇందులో చేర్చారు.
దీనివల్ల భవిష్యత్తులో కొన్నిరకాల రుసుములు విధించే అవకాశం కనిపిస్తోంది.
ఈ జలసంధి నిర్వహణలో తమకు మరింత పెద్ద పాత్ర కావాలని తెహ్రాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. జలసంధిని దాటే నౌకల నుంచి సర్వీస్ ఫీజు వసూలు చేస్తామని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ చెప్పారు. అయితే, ఆ ఫీజులు వేటి పరిధిలోకి వస్తాయనేది ఇంకా స్పష్టత లేదు.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ మార్గంలో ప్రయాణించినందుకు రుసుము వసూలు చేయడానికి అనుమతి లేదు, కానీ నిర్దిష్ట సేవల కోసం ఛార్జీలు వసూలు చేయడానికి అనుమతి ఉంటుంది.
అయినప్పటికీ, చర్చల తర్వాత కూడా ఈ జలసంధిలో ప్రయాణాలు రుసుములు లేకుండానే కొనసాగుతాయని అమెరికా అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్ తన పట్టును నిరూపించుకోవడానికి ప్రయత్నించవచ్చని, కానీ ఈ జలసంధి గుండా ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేసే ఏ ఒప్పందాన్ని గల్ఫ్ దేశాలు అంగీకరించవని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
ఫీజులు విధిస్తే సైనిక ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున.. ఇరాన్ 'వివేకంతో' వ్యవహరిస్తుందని, ఎలాంటి రుసుములు విధించబోదని ట్రంప్ చెప్పారు. టోల్ రుసుములతో కూడిన విధానాలను గల్ఫ్ దేశాలు అంగీకరించవని అమెరికా భావిస్తోంది.
అయితే, కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.
సముద్రంలో అమర్చిన మైన్లను తొలగించడానికి "వారాల నుంచి నెలల సమయం" పట్టవచ్చని అమెరికా నేవీ రిటైర్డ్ రియర్ అడ్మిరల్ మార్క్ మోంట్‌గోమరీ బీబీసీకి తెలిపారు.
యుద్ధ విరామం నిలకడగా కొనసాగుతుందని నమ్మకం కలిగే వరకు నౌకాయాన సంస్థలు జాగ్రత్తగా ముందడుగు వేసే అవకాశం ఉంది.
"ప్రస్తుత పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధి గుండా నౌకను నడపాలంటే కెప్టెన్‌కు ఎంతో ధైర్యం ఉండాలి" అని క్రైసిస్ మేనేజ్‌మెంట్ కంపెనీ 'ఈఓఎస్ రిస్క్ గ్రూప్' కి చెందిన మార్టిన్ కెల్లీ బీబీసీ వెరిఫైతో అన్నారు.
యుద్ధాన్ని ముగించడానికి జరిగిన ఈ ఒప్పందం కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమేనని, ఇది చర్చలకు ఒక ముసాయిదా మాత్రమే కానీ శాశ్వత పరిష్కారం కాదని హెలియర్ సూచించారు.
"అసలైన సవాలు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)