You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నెతన్యాహుకు స్వదేశంలో తలవంపులు తెస్తున్న అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం, ఎలాగంటే..
- రచయిత, లూసీ విలియమ్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇరాన్‌తో అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి రాజకీయంగా పీడకల అయ్యింది.
ఈ ఒప్పందం బెంజమిన్ నెతన్యాహు రాజకీయ జీవితానికి కీలకమైన మూడు మూల స్తంభాలను బద్దలు కొట్టింది. ఆయనను కొత్త సంక్షోభంలోకి నెట్టింది.
అమెరికాకు సన్నిహిత మిత్రుడినని, అమెరికన్ రాజకీయ నాయకుల మీద తన ప్రభావం ఉంటుందని చెప్పుకునే నెతన్యాహును అమెరికా పక్కన పెట్టి బహిరంగంగా అవమానించింది.
ఇజ్రాయెల్ భద్రతకు ఇరాన్ ముప్పుగా మారిందని చెబుతూ వస్తున్న నెతన్యాహు, తెహ్రాన్ నాయకత్వం మరింత బలమైన స్థితిలో ఉన్నప్పుడు యుద్ధాన్ని ముగిస్తూ ఒప్పందం చేసుకోవడాన్ని ఎలా సహించగలరు?
ఇజ్రాయెల్ 'మిస్టర్ సెక్యూరిటీ'గా నెతన్యాహు ప్రతిష్ఠ మసకబారుతున్న సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులను ఆపాలని అమెరికా, ఇరాన్ చేస్తున్న డిమాండ్‌ను ఆయన ఎలా నెరవేర్చగలరు? అది కూడా ఇజ్రాయెల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో ఇలాంటివి సాధ్యమేనా?
నెతన్యాహుపై పెరుగుతున్న ఒత్తిడి
నెతన్యాహు ముందుకొస్తున్న ప్రత్యామ్నాయాలు ఆయనకు ఏ మాత్రం మంచివి కాదు.
"మన గొప్ప మిత్ర దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుని నేరుగా గొడవకు దిగడం లేదా ఇజ్రాయెల్ ప్రయెజనాలను తాకట్టు పెట్టి పూర్తిగా లొంగిపోవడం" అంటూ ప్రతిపక్ష నాయకుడు యాయిర్ లాపిడ్ పార్లమెంట్‌లో నెతన్యాహు ముందున్న ప్రత్యామ్నాయాల గురించి ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో చెప్పారు.
ఇటీవల బేరూత్‌పై దాడి చేయాలని ఆదేశించినప్పుడు, నెతన్యాహు వివేకంతో వ్యవహరించలేదని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది నెతన్యాహు రాజకీయ ప్రత్యర్థులను, మీడియా దృష్టిని ఆకర్షించింది. వాళ్లు ఇప్పటికే అక్టోబర్ ఎన్నికలపై దృష్టి సారించారు.
నెతన్యాహు సొంత లికుడ్ పార్టీ సభ్యులు ఆయన సంకీర్ణ ప్రభుత్వంలోని అతివాద క్యాబినెట్ మంత్రుల ప్రకటనలు కూడా ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడిని వెల్లడిస్తున్నాయి.
ఈ ఒత్తిడికి ప్రధాన కారణం కాల్పుల విరమణ ఒప్పందంలో "లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను" నిలిపివేయాలనే ఇరాన్ డిమాండ్.
"ట్రంప్ ఒప్పందం మమ్మల్ని కట్టడి చేయలేదు. మా భద్రతకు హామీ ఇవ్వని ఒప్పందంలో మేము భాగస్వాములం కాదు" అని అతివాది అయిన ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ సోమవారంనాడు సోషల్ మీడియాలో రాశారు.
'ఇరాన్‌కు అణ్వస్త్రాలు అందనివ్వను'
"మేము అవసరమైనది చేస్తాం. మా మిత్రదేశాలు మమ్మల్ని అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాం. కొన్నిసార్లు మిత్రదేశాల మధ్య విభేదాలు ఉంటాయి. ఒక మిత్రుడు ప్రమాదంలో ఉన్నప్పుడు మిగతా మిత్రులు అర్థం చేసుకోవాలి" అని ఆయన అన్నారు.
"అమెరికన్లు దీన్ని ఎందుకు అంగీకరించారో అర్థం చేసుకోవడం కష్టం" అని మొస్సాద్ మాజీ అధికారి, ఇరాన్ వ్యవహారాల నిపుణురాలు సిమా షైన్ అన్నారు.
"లెబనాన్‌లో ఏం జరగాలో నిర్ణయించే అధికారాన్ని ఇరాన్‌కు ఇవ్వడం ద్వారా లెబనాన్ రాజకీయాల్లో హిజ్బొల్లా ముఖ్యమైన శక్తిగా ఎదిగేందుకు అమెరికా అవకాశం కల్పిస్తోంది" అని ఆమె చెప్పారు.
"దీనితో ఇజ్రాయెల్ సంతోషంగా లేదు. భద్రత విభాగాలు లేదా రాజకీయ వర్గం ఎవరూ సంతోషంగా లేరు" అని సిమా షైన్ చెప్పారు.
రాజకీయ వర్గాల నుంచి విమర్శలు, జర్నలిస్టుల నుంచి వస్తున్న సూచనల పట్ల నెతన్యాహు అసహనం వ్యక్తం చేశారు.
జెరూసలేంలో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ "నా జీవితం అంతా ఒక లక్ష్య సాధన కోసం అంకితం చేశాను. అది ఇరాన్‌కు అణ్వాయుధాలు అందకుండా చేయడం" అని చెప్పారు.
"ఏది అవసరమో అది తప్పకుండా చేస్తాం. ఈ లక్ష్య సాధనలో వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు" అని నెతన్యాహు అన్నారు.
విజయాలను ప్రకటించడంలో త్వరపడే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇప్పుడు తన తదుపరి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
దశాబ్దాలుగా నెతన్యాహు ఓటర్లకు ప్రధానంగా భద్రత అనే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు.
కానీ ఇప్పుడు ఆ సందేశాన్ని వారికి చేరవేయడం ఆయనకు మరింత కష్టంగా మారుతోంది.
గాజాలో కొనసాగుతున్న అనిశ్చితి
2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతిస్పందనగా ఆయన ముప్పును నివారించడంతో పాటు వాటిని ముందుగా నివారించేలా ఇజ్రాయెల్ భద్రతా విధానాన్ని మరింత దూకుడు వైఖరి వైపు మళ్లించారు.
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న ముప్పులను తొలగించడమే ఆయన ఎంచుకున్న పరిష్కారం.
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని చాలా ప్రాంతాలను ధ్వంసం చేసింది. అక్కడ 73,000 మందికి పైగా ప్రజలను చంపినప్పటికీ, హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ ప్రకారం హమాస్ ఇప్పటికీ ఆ భూభాగంలో సగభాగాన్ని నియంత్రిస్తూ అక్కడ తన బలాన్ని నిరూపించుకుంటోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 8నెలలు గడిచినా అమెరికా మధ్యవర్తిత్వం వహించిన శాంతి ప్రణాళిక గాజా కోసం అమెరికా నియమించిన పరిపాలన యంత్రాంగం వంటి వాటిపై అనిశ్చితి కొనసాగుతోంది.
భద్రత విషయంలో నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలతో ఇజ్రాయెల్ దళాలు గాజా, లెబనాన్, సిరియాలోని విస్తారమైన ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి.
చాలా మంది ఇజ్రాయెలీలు దీనిని ఇష్టపడుతున్నారు. ఈ ఆక్రమణల పరంపర ఎన్నికలకు ముందు ముగిసే అవకాశం కనిపించడం లేదు. అయితే ఇది ఇజ్రాయెల్ సైనిక వనరులు, రిజర్వ్ దళాలకు భారంగా మారింది.
దీని నుండి బయటపడటానికి స్పష్టమైన దౌత్య మార్గం ఏదీ కనిపించడం లేదు.
ఇరాన్‌లో కొత్త నాయకత్వంతో కొత్త తలనొప్పులు
హిజ్బొల్లా, ఇరాన్‌తో జరిగిన ఘర్షణలు ఇజ్రాయెల్ ప్రధాన శత్రువులను నిర్మూలించకపోయింది. తెహ్రాన్‌లో ఇజ్రాయెల్, అమెరికాను వ్యతిరేకించే బలమైన నాయకులకు అధికారం దక్కింది.
ఈ ఇరాన్ నాయకులు అమెరికా, ఇజ్రాయెల్ శక్తికి అంతగా భయపడరు. పైగా హార్ముజ్ జలసంధి వల్ల వారి పట్టు మరింత పెరిగింది.
ఇజ్రాయెల్ బద్ద శత్రువు ఇప్పుడు ఇజ్రాయెల్ అత్యంత మిత్రదేశానికి ప్రభావిత భాగస్వామిగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
"ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది మరింత ఆచరణాత్మకమైన, మితమైన ప్రాధాన్యతలను నిర్దేశించుకోవాలి" అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా అధ్యయన సంస్థలో సీనియర్ పరిశోధకుడు డానీ సిట్రినోవిచ్ అన్నారు.
"ఇజ్రాయెల్ చేపట్టే ఏ సైనిక చర్యనైనా ఒప్పందాన్ని బలహీనపరిచే ప్రయత్నంగా అమెరికా భావిస్తే, దానికి అమెరికా నుంచి బలమైన ప్రతిస్పందన ఉంటుందని భావిస్తున్నాం" అని ఆయన ఇజ్రాయెల్ హయోమ్ దినపత్రికకు రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
"ఒబామా హయాంలో బెంజమిన్ నెతన్యాహు కాంగ్రెస్, అమెరికన్ ప్రజల మద్దతును కూడగట్టడం ద్వారా వైట్‌హౌస్‌ను దాటవేయడానికి ప్రయత్నించేవారు. కానీ దానికి విరుద్ధంగా, ఈ రోజు అలాంటి అవకాశాలు దాదాపుగా లేవు" అని డానీ సిట్రినోవిచ్ రాశారు.
ప్రాంతీయంగా ఎదురయ్యే భద్రత సవాళ్ల నుంచి తన విధానానాలు, రాజకీయ నైపుణ్యాలు అత్యుత్తమ రక్షణ అందిస్తాయని నెతన్యాహు ఇజ్రాయెల్ ఓటర్లకు చాలాకాలంగా చెబుతూ వచ్చారు.
అయితే తాజా పరిణామాల వల్ల ఆ హామీ తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.
ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగి ఉంటే నెతన్యాహు రాజకీయ ప్రతిష్ఠ పెరగడంతో పాటు ఆయన ఎన్నికల్లో గెలిచే అవకాశం మెరుగయ్యేది.
అయితే భద్రత విషయంలో ఆయన ఎంచుకున్న కొత్త మార్గం ఆయనకు పోరాడటం లేదా లొంగిపోవడం అనే ఆప్షన్‌ను మిగిల్చింది. అది కూడా శత్రువుతో కాకుండా దీర్ఘకాలంగా స్నేహం ఉన్న ఆప్తమిత్రుడితో.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)