You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలో ఫేక్ కాల్ సెంటర్లపై దాడులు, పట్టుబడిన వారిలో 21 మంది 'తెలుగు' మహిళలు
దిల్లీ కేంద్రంగా నడుస్తూ తెలంగాణ పౌరులను మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్ ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తెలంగాణకు చెందిన 21 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు.
మొత్తం 3 కాల్ సెంటర్లలో ప్రణాళిక ప్రకారం సోదాలు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే, ఈ మూడు కాల్ సెంటర్ల ప్రధాన నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దిల్లీలోని శివా మార్కెట్ ప్రాంతంలో ఈ మూడు కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయి.
ప్రస్తుతం పరారీలో ఉన్న లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు... వేర్వేరు బృందాలుగా వీటిని నడుపుతున్నారు. దాదాపు ఏడాది కాలంగా వీటిని నిర్వహిస్తున్నారు.
'ఎలా మోసం చేసేవారంటే..'
ఈ కాల్ సెంటర్ మోసాలు ఎలా జరుగుతుంటాయో ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ ప్రకటనలో వివరించారు.
"ముందుగా నిర్వాహకులు, దిల్లీలో నివసించే తెలుగు మాట్లాడే 25-30 ఏళ్ల వయసున్న మహిళలు, యువతులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. వీరితో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. తెలుగు బాగా మాట్లాడటమే వీరి అర్హత.
తెలంగాణలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని, వారికి కాల్ చేసి బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులమంటూ పరిచయం చేసుకుంటారు. మెజార్టీ కేసుల్లో బజాజ్ పేరు వాడగా, కొన్ని సందర్భాల్లో ఇతర ఎన్బీఎఫ్సీ(ఫైనాన్స్ సంస్థల) పేర్లు కూడా వాడారు. మీకు మంచి లోన్ ఆఫర్ ఉంది అంటూ మాటలు మొదలుపెడతారు. ఎదుటి వారికి నమ్మకం కలిగిన తరువాత త్వరగా లోన్ ఇప్పిస్తామని చెబుతారు. వీరంతా ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు.
మాటల్లో భాగంగా లోన్ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ చార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి పేర్లతో బాధితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. అవి కడితేనే లోన్ వస్తుందని, చిన్న మొత్తం చెల్లిస్తే పెద్ద మొత్తంలో లోన్ వస్తుందని చెబుతారు. పెద్ద మొత్తం వస్తుందనే నమ్మకంతో బాధితులు కొంచెం కొంచెం వారికి చెల్లించుకుంటూ పోతారు. ఒకసారి బాధితులు నమ్మి డబ్బు ఇచ్చాక అసలు కథ మొదలవుతుంది.
డబ్బు అందిన వెంటనే, ఇదిగో లోన్ వస్తోంది.. అదుగో లోన్ వస్తోంది అంటూ మభ్యపెడుతూ మరింత డబ్బు రాబట్టే ప్రయత్నం చేస్తారు. అలా చేయకపోతే ఇప్పటికే కట్టిన సొమ్ము వృథా అయిపోతుందని, లోన్ కూడా రాదని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. పెద్ద లోన్ వస్తోందని చెబుతూ ఆ చార్జీ ఈ చార్జీ అంటూ మరింత వసూలు చేస్తారు'' అని ఆ ప్రకటనలో శిఖా గోయెల్ వివరించారు.
తక్కువ వడ్డీ అంటూ ఎర
''లోన్ అవసరం ఉందని చెబితే మెల్లిగా వారిని బుట్టలో పడేస్తారు. లోన్ అవసరం, తక్కువగా రావాలి, తొందరగా రావాలి అన్న స్వార్థమే వారికి ఆదాయ మార్గం. తక్కువ వడ్డీకి ఇప్పిస్తాం, తొందరగా ఇప్పిస్తాం అంటూ ఎర వేస్తారు. మాకు డబ్బు కడితే తక్కువ వడ్డీకి ఇప్పిస్తామంటారు'' అని బీబీసీతో అన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ విభాగం ఎస్పీ సాయి శ్రీ.
''బాధితులు ఇక డబ్బు కట్టడం లేదని కానీ, లోన్ కోసం ఒత్తిడి చేస్తున్నారని కానీ, ఎక్కువ ప్రశ్నలు వేసి ఆరా తీస్తున్నారని కానీ తెలిసిన వెంటనే అసలు కథ మొదలవుతుంది.
కాల్ కట్ చేయడం, బ్లాక్ చేయడం వంటివి జరుగుతాయి. ఎలాగోలా వారిని సంప్రదించి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తెస్తే, భయపెట్టడానికి, బ్లాక్ మెయిల్ చేడానికి కూడా వెనుకాడరు.
అవతలి వారి పరిస్థితిని బట్టి పోలీసు కేసు పెడతాం, కోర్టుకు లాగుతాం, పరువు తీస్తాం, మీ డేటా మొత్తం మా దగ్గర ఉంది.. మీ వివరాలు బయట పెడతాం.. మీ ఐడీ ప్రూఫులు, మీ ఫోటోలు, బంధుమిత్రుల కాంటాక్ట్ నంబర్లు, అడ్రసులు మా దగ్గర ఉన్నాయి వాటిని వాడి ఇబ్బంది పెడతాం.. ఇలా రకరకాల బెదిరింపుల ద్వారా బాధితులు మౌనంగా ఉండిపోయేలా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేలా చేస్తారు. మీ వాట్సాప్ మెసేజీలు మా వద్ద ఉన్నాయని, వాటిని లీక్ చేస్తామని కూడా బెదిరిస్తుంటారు" అని పోలీసులు చెప్పారు.
ఈ నకిలీ డొంక ఎలా కదిలిందంటే..
ఇటీవల రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఈ నేరాలపై దృష్టి పెట్టగా డొంకంతా కదిలింది. సదరు వ్యక్తి 1930 నంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ముఠాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 22 కేసులు నమోదయ్యాయని, ఇంకా ఏవైనా కేసులకు ఈ ముఠాతో సంబంధం ఉందా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
''ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా వీరు మోసాలు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నాం. ఇదే తరహాలో ఇతర భాషల యూనిట్లు కూడా నడిపే అవకాశం లేకపోలేదు'' అని బీబీసీతో అన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ విభాగం ఎస్పీ సాయి శ్రీ.
ఈ ఆపరేషన్‌లో భాగంగా 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్‌బుక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముందుగా, ఒక కాల్ సెంటర్ మీదనే సోదాలు చేయడానికి తెలంగాణ పోలీసులు దిల్లీ వెళ్లగా, అక్కడ మరో రెండు ఉన్నాయని తెలియడంతో హైదరాబాద్ నుంచి అదనపు బృందాలు వెళ్లి వీరందర్నీ పట్టుకున్నారు.
ఈ టెలీకాలర్లలో చాలా మంది జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుతం దిల్లీలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
దాదాపు డిగ్రీ వరకూ చదువుకున్న వారేననీ, జగిత్యాల జిల్లాకు చెందిన వారిలో కొందరికి ఒకరితో మరొకరికి పరిచయాలు ఉన్నాయనీ ఎస్పీ సాయిశ్రీ బీబీసీతో చెప్పారు.
అయితే వారి నేపథ్యాలు, ఉద్యోగంలో ఎలా చేరారు అన్న విషయాలూ, కుటుంబ పరిస్థితులూ ఇవన్నీ ఇంకా విచారణలో ఉన్నట్టు తెలిపారు పోలీసులు.
"దిల్లీలో కాల్ సెంటర్ బయట కొందరిని కాపలా పెట్టిన నిర్వాహకులు తాము మాత్రం ఆ చుట్టపక్కల లేకుండా జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతానికి నిర్వాహకులు ఎవరనేది స్పష్టంగా తెలియదు. దొరికినా వారు చెప్పిన పేర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వారి గురించి మరింత విచారణ జరగాల్సి ఉంది."
అటు దిల్లీలో దొరికిన వారిని అక్కడ కోర్టులో హాజరు పరచి చట్టపరమైన ప్రక్రియ ద్వారా తెలంగాణకు తీసుకువస్తారు. బీబీసీ వారి కుటుంబ సభ్యుల వివరాల కోసం ప్రయత్నం చేసింది కానీ, కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున ఇంకా ఆ వివరాలు అందుబాటులోకి రాలేదు.
''వీరంతా తాము చేస్తున్నది మోసం అని తెలిసే చేశారు. అయితే, మొదటిసారిగా వీరు ఈ ఉద్యోగంలోకి ఎలా వచ్చారు? వీరిని ఎవరు రిక్రూట్ చేశారన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది'' అన్నారు ఎస్పీ సాయి శ్రీ.
వారికి జీతాలు సాధారణంగానే ఉన్నాయనీ, వచ్చిన సొమ్ములో కమిషన్ ఇస్తున్నారన్న అనుమానం కూడా ఉందనీ, విచారణ తరువాతే పూర్తి వివరాలు చెప్పగలమన్నారు ఎస్పీ.
''లోన్ ఇస్తామని చెబుతూ వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీ లేదా ఇతర చెల్లింపులు చేసే ముందు కాల్ చేసిన వ్యక్తి, సంబంధిత కంపెనీ నిజమైనవేనా అని సరి చూసుకోవాలి. మరీముఖ్యంగా ఫోన్ చేసిన వ్యక్తి మహిళ అని, తెలుగులో లేదా మన సొంత భాషలో మాట్లాడుతున్నారని వారిని నమ్మొద్దు. బాధితులకు నమ్మకం కలిగించడం కోసం సైబర్ నేరగాళ్లు ప్రాంతీయ భాషలు మాట్లాడే వారినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
సైబర్ మోసం అయితే వెంటనే 1930కు కాల్ చేయాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అయిన www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలి'' అని పౌరులకు సూచిస్తున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్
''ఇతర రాష్ట్రాల్లో కాల్ సెంటర్లలో పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యులు ఎక్కడ పని చేస్తున్నారు, చేస్తున్న పని స్వభావం ఏమిటి అనే విషయాలపై కుటుంబ సభ్యులు అవగాహన కలిగి ఉండాలి. వారు తెలిసి కానీ, తెలియక కానీ మోసపూరిత సైబర్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు'' అని హెచ్చరించారు శిఖా గోయల్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)