ఉత్తరదిశగా తలలు, దక్షిణదిశగా కాళ్లు... పశ్చిమంవైపు ముఖాలు: కచ్ సమీపంలో బయటపడ్డ 100 అస్థిపంజరాల కథేంటి?

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న ధోలావీరా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకున్న ఒక చారిత్రక ప్రదేశం.

అయిదు వేల ఏళ్ల నాటి ఈ పురాతన ధోలావీరా నగరం స్మార్ట్ సిటీకి ఏమాత్రం తీసిపోదు.

ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ భారత పురావస్తు సర్వే విభాగం (ఏఎస్‌ఐ) 2018లో యునెస్కోకు ప్రతిపాదనలు పంపింది.

అదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.

కచ్ ప్రాంతానికి చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉందని, ఇక్కడ అనేక చారిత్రక సత్యాలు దాగి ఉన్నాయని ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇటీవల కచ్ సమీపంలోని భారత్-పాక్ సరిహద్దు వద్ద ఓ పురావస్తు ప్రాంతం బయటపడింది. అక్కడ 100కు పైగా మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి.

ఈ అస్థిపంజరాలన్నీ ఉత్తరం వైపు తల, దక్షిణం వైపు కాళ్లు ఉంచిన రీతిలో క్రమపద్ధతిలో ఖననం చేసి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ మృతదేహాల ముఖాలు పశ్చిమ దిశ వైపు తిరిగి ఉన్నాయి.

ఈ అస్థిపంజరాల పరిసరాలలో జరిపిన పరిశోధనల్లో మరో అయిదు పురావస్తు స్థలాలు లభ్యమయ్యాయి. అక్కడ మట్టి పాత్రలు, టెర్రకోట బొమ్మలు, ప్రాచీన ఆవాసాల అవశేషాలు దొరికాయి. ప్రాథమిక అధ్యయనం ప్రకారం ఈ అవశేషాలు మధ్యయుగానికి చెందినవిగా భావిస్తున్నారు.

విస్తృతమైన అధ్యయనంలో ఈ ప్రాథమిక ఆధారాలు నిర్థరణ అయితే.. కచ్ లేదా గుజరాత్ మాత్రమే కాకుండా యావత్ దేశ చరిత్రకు సంబంధించిన ఎన్నో రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మొదటిసారి ఈ ప్రదేశాన్ని గుర్తించారు.

ఉత్తరం వైపు తల, దక్షిణం వైపు కాళ్లు

గ్రేట్ రాణ్ ఆఫ్ కచ్‌లోని సరిహద్దు ప్రాంతంలో లభించిన అస్థిపంజరాలన్నీ ఉత్తరం వైపు తల, దక్షిణం వైపు కాళ్లు ఉంచిన రీతిలో ఉన్నాయి. వీటి ముఖాలు పశ్చిమ దిశకు తిరిగి ఉన్నాయి.

ఈ ఆవిష్కరణ గురించి బీబీసీతో కచ్ యూనివర్సిటీ జియాలజీ, ఆర్కియాలజీ విభాగాధిపతి డాక్టర్ గౌరవ్ చౌహాన్ మాట్లాడారు.

"బీఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రదేశాన్ని తొలిసారి చూశారు. వారు ఈ ప్రాంతాన్ని శిథిలమైన గ్రామంగా భావించేవారు.

బీఎస్ఎఫ్, స్థానిక కలెక్టర్ కార్యాలయం సహకారంతో 2024లో మేం దీనిపై పరిశోధన ప్రారంభించి, ఆ ప్రదేశాన్ని గుర్తించగలిగాం. నేను అక్కడికి వెళ్లినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను.

స్త్రీ, పురుషుల అస్థిపంజరాలను ఒక పద్ధతి ప్రకారం ఖననం చేసినట్లుగా అక్కడ కనిపించింది. అన్ని అస్థిపంజరాల తలలు ఉత్తరం వైపు, కాళ్లు దక్షిణం వైపు, ముఖాలు పశ్చిమం వైపు ఉన్నాయి. ఇది నాటి మతపరమైన ఆచారాల్లో భాగమై ఉండవచ్చు.

ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను ఒకేచోట ఖననం చేశారంటే ఆ కాలంలో ఏదైనా భారీ ప్రకృతి విపత్తు లేదా మహమ్మారి సంభవించి ఉండొచ్చు'' అని ప్రొఫెసర్ గౌరవ్ చౌహాన్ వివరించారు.

ఈ ప్రదేశం చుట్టూ మరో 4-5 ఉప ప్రాంతాలు కూడా బయటపడ్డాయని ఆయన తెలిపారు.

అక్కడ మట్టి పాత్రలు, ఇళ్ల నిర్మాణాలు, టెర్రకోట బొమ్మలు లభించాయి.

ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, పుణేలోని డెక్కన్ కాలేజీ నిపుణులతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఇవి 1000 నుంచి 1500 ఏళ్ల నాటి మధ్యయుగపు అవశేషాలు కావొచ్చని వెల్లడైంది.

"ఒక్క రోజు కూడా గడపడం కష్టమైన ఈ ఎడారి ప్రాంతంలో ఒకప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు జీవించారనే విషయం దీని ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది" అని ఆయన పేర్కొన్నారు.

సూమ్రా రాజవంశంతో సంబంధం ఉందా?

పురాతన కాలంలో ప్రజలు స్థిరనివాసానికి ధోలావీరాను ఎంచుకున్నారని డాక్టర్ గౌరవ్ చౌహాన్ తెలిపారు.

"ధోలావీరా నాగరికత వర్ధిల్లిన కాలంలో సింధు నదీ జలాలు ఇక్కడికి చేరేవి. ప్రజలు ఇక్కడి నుంచి వలస వెళ్లారని భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలో మాకు రాగి నాణేలు కూడా లభించాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లోని కంజర్ కోట్ వంటి ప్రాంతాల పరిశోధన ఆధారంగా చూస్తే, ఈ నాణేలు సూమ్రా రాజవంశానికి చెందినవిగా తెలుస్తోంది. ఈ అస్థిపంజరాలకు ఆ రాజవంశంతో సంబంధం ఉండే అవకాశం ఉంది'' అని గౌరవ్ చౌహాన్ అన్నారు.

భూఉపరితలంపై అకస్మాత్తుగా ఈ అస్థిపంజరాలు కనిపించడంపై ప్రొఫెసర్ చౌహాన్ వివరణ ఇచ్చారు.

"ఏదైనా భారీ విపత్తు సంభవించినప్పుడు లేదా తీవ్రమైన గాలుల వల్ల ఖననం చేసిన ప్రదేశంలోని పై మట్టి కొట్టుకుపోయి ఉండవచ్చు. దాంతో అస్థిపంజరాలు బయటపడి ఉంటాయి. ఈ స్థలం ధోలావీరా నాగరికతకు, ఆధునిక యుగానికి మధ్య వారధిగా నిలుస్తుందని భావిస్తున్నాం. కలెక్టర్ ఇలాంటి ప్రాంతాల జాబితాను కోరారు. భవిష్యత్తులో మరిన్ని సైట్లలో మేం పరిశోధనలు చేస్తాం.

ఈ అస్థిపంజరాలకు సంబంధించి డీఎన్‌ఏ పరీక్షలు, కార్బన్ డేటింగ్ చేపట్టాలని నిర్ణయించాం" అని డాక్టర్ గౌరవ్ చౌహాన్ స్పష్టం చేశారు.

సూమ్రా రాజవంశం నేపథ్యం

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరాల ప్రకారం 11వ శతాబ్దం సమయంలో ఈ ప్రాంతాన్ని సూమ్రా రాజవంశం పాలించింది. వీరి పాలన కింద ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం కూడా ఉండేది.

కొంతమంది చరిత్రకారులు వీరిని అరబ్ మూలాలకు చెందినవారిగా పేర్కొనగా, మరికొందరు రాజపుత్ర మూలాల నుంచి వచ్చినవారిగా భావిస్తారు.

సూమ్రాలు సుమారు 300 ఏళ్ల పాటు పాలించిన తర్వాత ఈ ప్రాంతం సమ్మాల వశమైంది. అనంతరం మొఘల్ చక్రవర్తి అక్బర్ దీన్ని జయించాడు.

అంతర్జాతీయ రేవు పట్టణం: ధోలావీరా

భుజ్ నగరానికి ఉత్తరంగా దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో 'ఖదిర్ బెట్' ద్వీపం ఉంది. ఈ ద్వీపంలోనే ధోలావీరా గ్రామం విస్తరించి ఉంది. కచ్‌లోని ఇతర సాధారణ గ్రామాల మాదిరిగానే కనిపించినా, ఇది అపారమైన ప్రాచీన చరిత్రను తనలో దాచుకుంది.

గ్రామానికి ఉత్తరంగా ఒక కిలోమీటర్ వెళ్తే 'కోటడా టింబా' ప్రాంతం కనిపిస్తుంది. ఈ ప్రదేశమే ఆ ఊరికి చారిత్రక ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది.

అయిదు వేల ఏళ్ల క్రితం నాటి అత్యంత ఆధునిక నాగరికతతో ధోలావీరా నగరం ఇక్కడే వర్ధిల్లింది.

ఐఐటీ గాంధీనగర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సంయుక్త పరిశోధనల ప్రకారం.. అయిదు వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాచీన నగరంలో అద్భుతమైన నీటి నిర్వహణ, నిల్వ వ్యవస్థలు ఉండేవని స్పష్టమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)