హీరో విక్రమ్: విదేశీ గిబ్బన్‌తో ఆడుకుంటున్న వీడియో వైరల్, రంగంలోకి దిగిన అధికారులు...

ఫొటో సోర్స్, Vikram/Instagram
- రచయిత, జోయా మతీన్, విజయానంద్ ఆరుముగం
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
అంతరించిపోయే దశలో ఉన్న ఒక గిబ్బన్ (కోతి జాతికి చెందిన జంతువు) ను హత్తుకుని ముద్దాడుతున్న వీడియో ఒకటి తమిళ సినీ నటుడు విక్రమ్ ఇటీవల పోస్ట్ చేశారు. దీంతో ఆ జంతువుతో ఆయన దగ్గరకు ఎలా వచ్చింది అనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగుతోపాటు దక్షిణాది రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచితుడైన నటుడు విక్రమ్, సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేసిన వీడియోలో ఆయన లార్ గిబ్బన్‌ను హత్తుకుని, దానితో ఆడుకుంటూ కనిపించారు.
ఈ గిబ్బన్ ఓ ప్రైవేట్ వ్యక్తి ఇంటికి ఎలా చేరింది, దాని పెంపకం, తరలింపుకు సంబంధించిన నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలపై రాష్ట్ర అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.
అయితే ఆ జంతువును అక్రమంగా తరలించారనిగానీ, అది విక్రమ్ సొంతమనిగానీ, దాన్ని భారత్‌కు తీసుకురావడంలో ఆయనకు ప్రమేయం ఉందనిగానీ అధికారులు నిర్ధరించలేదు.
ఈ వివాదంపై విక్రమ్ ఇప్పటివరకు స్పందించలేదు. విక్రమ్ ఏదైనా ప్రకటన చేస్తే మీడియాకు సమాచారం అందిస్తామని ఆయన పీఆర్‌ఓ యువరాజ్ బీబీసీకి తెలిపారు.

లార్ గిబ్బన్లు ఆగ్నేయాసియాకు చెందిన చిన్న వానర జాతులు. వీటి అంతర్జాతీయ వాణిజ్యంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. చెన్నైలో విక్రమ్ బంధువు ఇంట్లో ఈ జంతువును ఉంచినట్లు అధికారులు తెలిపారు.
చట్ట ప్రకారం అవసరమైన అనుమతులు, పత్రాలు ఉంటే లార్ గిబ్బన్‌ను తమ దగ్గర పెట్టుకోవచ్చని తమిళనాడు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ రాకేశ్ కుమార్ డోగ్రా బీబీసీతో చెప్పారు.
"ఆ లార్ గిబ్బన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఆ తర్వాతే దాన్ని అక్రమంగా తీసుకొచ్చారా లేదా అనేది చెప్పగలం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విక్రమ్ అసలు పేరు కెన్నడీ జాన్ విక్టర్. తమిళ సినిమా రంగంలో ప్రముఖ నటుల్లో ఒకరు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ ఉంది. వైవిధ్యమైన, శారీరకంగా కఠినమైన పాత్రలు ధరించే నటుడిగా ఆయనకు దక్షిణాది రాష్ట్రాల్లో పేరుంది. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు విక్రమ్.
లార్ గిబ్బన్లు చిన్న వానరాలు. వీటి శరీరం లేత పసుపు లేదా ముదురు గోధుమ రంగు వెంట్రుకలతో ఉంటుంది. ముఖం చుట్టూ ప్రత్యేకంగా తెల్లటి వెంట్రుకలు ఉంటాయి.
ఇవి ఉష్ణమండల అడవుల్లో చిన్నచిన్న కుటుంబాలుగా జీవిస్తాయి. థాయ్‌లాండ్, మియాన్మార్, మలేసియాతో పాటు ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి.
ఈ జాతిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా గుర్తించారు. ఆవాసాల దెబ్బతినడం, వేట, అక్రమంగా పెంపుడు జంతువుల్లా అమ్మడం వంటి కారణాలతో వీటి అస్తిత్వానికి ముప్పు ఏర్పడింది.
అంతరించిపోతున్న జాతుల వాణిజ్యాన్ని కఠినంగా నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందమైన సీఐటీఈఎస్ పరిధిలో కూడా ఇవి ప్రొటెక్టెడ్ జాబితాలో ఉన్నాయి.
సీఐటీఈఎస్ పరిధిలో ఉన్న జాతులకు కల్పించే రక్షణలను తమ చట్టాల్లో పొందుపరిచిన దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇలాంటి జంతువులను తమతో ఉంచుకునే వ్యక్తులు వాటిని వైల్డ్‌లైఫ్ అధికారుల వద్ద నమోదు చేయడంతో పాటు వాటి స్వాధీనం, తరలింపుకు సంబంధించిన నిబంధనలను పాటించాలి.
"విదేశీ జంతువులను దిగుమతి చేసుకోవాలంటే డీజీఎఫ్‌టీ ( డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) అనుమతిని, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను, ఆ తర్వాత వైల్డ్‌లైఫ్ కన్సర్వేటర్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి" అని డోగ్రా తెలిపారు.
సోమవారం విక్రమ్ లార్ గిబ్బన్‌తో ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
ఈ వీడియో కొద్దిసేపటికే ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. కొన్ని మీడియా కథనాలు ఆ జంతువును నటుడి కొత్త పెంపుడు జంతువుగా పేర్కొన్నాయి. అయితే కొన్ని గంటల్లోనే ఆయన ఖాతా నుంచి వీడియోను తొలగించారు.
ఈ చిన్న వీడియో ఇప్పుడు వైల్డ్‌లైఫ్ అధికారులను 2,000 కిలోమీటర్లకు పైగా దూరంలోని ఈశాన్య రాష్ట్రం మణిపుర్ వరకు తీసుకెళ్లింది.
ఈ జంతువు మణిపుర్‌కు చెందిన ఓ వ్యక్తి 2020లో ప్రభుత్వ పరివేశ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఎనిమిది లార్ గిబ్బన్లలో ఒకటని పేరు వెల్లడించడానికి ఇష్టపడని తమిళనాడు అటవీ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి బీబీసీకి తెలిపారు.
ఆ ఎనిమిదిలో నాలుగు మగవి, నాలుగు ఆడవి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో విదేశీ జంతువులను నమోదు చేయడంతో పాటు పర్యావరణం, అటవీ, వన్యప్రాణులకు సంబంధించిన అనుమతులు పొందేందుకు పరివేశ్ పోర్టల్‌ను అధికారిక వేదికగా ఉపయోగిస్తారు. ఈ పోర్టల్‌లోని రికార్డుల ప్రకారం, ఆ జంతువుల మూల దేశంగా మలేసియాను పేర్కొన్నారు.
అధికారి పేర్కొన్న రికార్డుల ప్రకారం, ఈ ఏడాది జూన్ 5న ఒక మగ, రెండు ఆడ లార్ గిబ్బన్లను మణిపుర్ నుంచి తమిళనాడులోని ఈరోడ్ జిల్లా పెరుందురైకి చెందిన ఓ వ్యక్తి తరలించారు. వాటిని దత్తత తీసుకోవడమే ఉద్దేశంగా పేర్కొన్నారు.
అయితే ఆ జంతువులను రాష్ట్రంలోకి తీసుకురావడానికి తమిళనాడు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ అనుమతి తీసుకున్నట్లు చూపించే పత్రాలు ఇప్పటివరకు తమకు లభించలేదని అధికారి తెలిపారు.
రెండు నెలల తర్వాత, ఆగస్టు 5న ఒక మగ, ఒక ఆడ గిబ్బన్‌ను పెరుందురై నుంచి చెన్నైలోని విక్రమ్ బంధువు దగ్గరకు తరలించినట్లు అటవీ శాఖ దర్యాప్తులో తేలింది.
ఈ గిబ్బన్లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి ప్రయాణంలోని ప్రతి దశలో అవసరమైన పత్రాలు ఉన్నాయో లేదో అధికారులు ఇప్పుడు నిర్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ జంతువులు మొదట భారత్‌లోకి ఎలా ప్రవేశించాయనే అంశంపైనా వైల్డ్ లైఫ్ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. మణిపుర్‌కు మియాన్మార్‌తో సరిహద్దు ఉంది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాలు విదేశీ జంతువుల అక్రమ రవాణాకు మార్గంగా ఉపయోగపడుతున్నట్లు గతంలో గుర్తించారు. అయితే ఈ కేసులో గిబ్బన్లను అక్రమంగా తరలించారనే నిర్ధరణకు అధికారులు ఇంకా రాలేదు.
సీఐటీఈఎస్ పరిధిలోని జంతువుల అంతర్జాతీయ రవాణా, వాటి స్వాధీనానికి సంబంధించిన నిబంధనలు పాటించారా లేదా అనే అంశంతో పాటు వాటికి సంబంధించిన పత్రాలను తమిళనాడు అటవీ శాఖ పరిశీలిస్తోంది.
వన్యప్రాణుల సంబంధిత నేరాలను దర్యాప్తు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) కూడా ఈ కేసులో జోక్యం చేసుకుంది.
పత్రాలను ధ్రువీకరించి తగిన చర్యలు తీసుకోవాలని చెన్నైలోని వన్యప్రాణి అధికారులను కోరుతూ లేఖ రాసినట్లు బీబీసీతో ఆ బ్యూరో సదరన్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ తేన్మొళి తెలిపారు.
"ఈ ఒప్పందం కింద లార్ గిబ్బన్‌ను ప్రొటెక్టెడ్ జాతిగా వర్గీకరించారు. వాటిని ప్రొటెక్టెడ్ జంతువులుగానే పరిగణించి నిర్వహించాలి" అని సీఐటీఈఎస్‌ను ప్రస్తావిస్తూ తేన్మొళి అన్నారు.
అధికారుల దర్యాప్తులో వెలువడే అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని డబ్ల్యూసీసీబీ తెలిపింది.
భారత్‌లోకి విదేశీ జంతువుల అక్రమ రవాణాపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇటీవలి సంవత్సరాల్లో ఆగ్నేయాసియా నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణికుల లగేజీల్లో దాచిన సరీసృపాలు, పక్షులు, వానరాలను కస్టమ్స్ అధికారులు పలుమార్లు గుర్తించారు.
2025 జూలైలో రెండు నెలల వ్యవధిలో బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చిన 350కి పైగా విదేశీ జంతువులను ముంబయి, పుణె విమానాశ్రయాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న జంతువుల్లో గిబ్బన్లు కూడా ఉన్నాయి. నవంబర్‌లో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులు తీసుకొచ్చిన జంతువుల్లో ఒక గిబ్బన్‌ను బెంగళూరు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
చెన్నైలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి తాబేళ్లు, ఇగువానాలు, పాములు సహా 31 విదేశీ జంతువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























