పదేళ్ల కిందటే రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ మళ్లీ ఎందుకు ఆడుతున్నాడు? అర్జెంటీనాను వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు ఎలా చేర్చాడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎమ్లిన్ బెగ్‌లే
- హోదా, బీబీసీ స్టోర్ట్స్ జర్నలిస్ట్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
లియోనల్ మెస్సీ కథ ముగిసిపోయిందని నాలుగేళ్ల కిందట చాలా మంది భావించారు.
35ఏళ్ల వయసులో ఎట్టకేలకు ప్రపంచ కప్ గెలిచాడు. టోర్నీలో అదే తన చివరి మ్యాచ్ అని మెస్సీ అప్పుడు చెప్పాడు. ఆ విజయంతో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడన్నది చాలామంది అభిప్రాయం.
దానికి నాలుగేళ్ల ముందు కూడా అంటే మెస్సీ 31ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అతను చివరి ప్రపంచకప్ ఆడాడని, వరల్డ్ కప్ విజయం లేకుండా అతని కెరీర్ ముగిగిసోయిందని ఆయన సన్నిహితులు సహా చాలామంది అనుకున్నారు.
ఇప్పుడు అతని వయసు 39ఏళ్లు. ఇంగ్లండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించి వరుసగా రెండో వరల్డ్ కప్‌లో అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చాడు.
రెండుసార్లు మెస్సీ అసిస్ట్ చేయడంతో అర్జెంటీనా 2-1తేడాతో విజయం సాధించింది.
దీంతో 2026 ప్రపంచకప్‌లో మెస్సీ ఖాతాలో ఉన్న ఎనిమిది గోల్స్‌కు తోడు నాలుగు అసిస్ట్‌లు కూడా చేరాయి.
ఫుట్‌బాల్‌లో అసిస్ట్ అంటే గోల్ చేయడానికి ముందు అందించే పాస్ లేదా క్రాస్.


ఫొటో సోర్స్, Getty Images
‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’
టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో ఒకరిగా మెస్సీ నిలిచాడు. అత్యధిక అసిస్ట్‌లు అందించిన రెండో ఆటగాడిగా ఉన్నాడు.
ఆదివారం(జులై 19)న్యూజెర్సీలో జరిగే ఫైనల్స్‌లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. మెస్సీ తన క్లబ్ ఫుట్‌బాల్‌లో ఎక్కువభాగం బార్సిలోనా తరఫున ఆడాడు.
''చరిత్రలో అతడు అత్యుత్తమ ఆటగాడు. దాన్ని నిరూపించడానికి అతనింకా ఏం చేయాలో తెలియదు. స్పెయిన్ ప్రజల్లో ఎక్కువమంది కూడా అతన్ని ప్రేమిస్తారు'' అని అర్జెంటీనా జాతీయ జట్టు బాస్ లియోనెల్ స్కలోనీ అన్నారు.
''వాళ్ల దగ్గర లియోనల్ మెస్సీ ఉన్నాడు. వాళ్లకు గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) ఉన్నాడు.
అన్ని కాలాల్లో అతనే అత్యుత్తమ ఆటగాడు.
కొన్నిసార్లు కొన్ని క్షణాలు మ్యాచ్ ఫలితాలను నిర్ణయిస్తాయి. జ్యూడ్ బెల్లింగ్ హామ్ లేదా హార్రీ కేన్ ఆ పనిచేస్తారనుకున్నాం. కానీ మెస్సీని కింగ్ అని ఎందుకంటారో నిరూపించాడు'' అని బీబీసీ విశ్లేషకులు మైకా రిచర్డ్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Elsa/Getty Images
ఇంగ్లిష్ ఆశలను మెస్సీ ఎలా చెదరగొట్టాడంటే..
బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మైన్ మాజీ ఆటగాడు అయిన మెస్సీ తన కెరీర్‌లో ఇంగ్లండ్‌తో ఇంతకుముందెప్పుడూ ఆడలేదు. ఇకపై కూడా అలాగే ఉంటే బాగుండేదని ఇంగ్లండ్ కోచ్ థామస్ టుఖెల్, ఇంగ్లండ్ అభిమానులు అనుకుని ఉండిఉంటారు.
మొదటి అర్ధభాగంలో మిడ్‌ఫీల్డ్‌లో ఆడుతూ మెస్సీ కొన్ని మంచి టచ్‌లు మాత్రమే చూపించాడు. 55వ నిమిషంలో ఆంథనీ గార్డన్ ఇంగ్లండ్‌కు ఆధిక్యం అందించిన తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత అర్జెంటీనా అసలు ఆటను చూపించింది.
టుఖెల్ మరింతమంది డిఫెండర్లను మైదానంలోకి పంపించాడు. ఇంగ్లండ్ మొత్తం రక్షణకే పరిమితమైంది. తర్వాతి 37నిమిషాల్లో అర్జెంటీనా 88 శాతం సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంది.
మెస్సీ కుడి వింగ్‌కు వెళ్లిన తర్వాత మ్యాచ్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు.
''మెస్సీని కుడి వింగ్‌కు మార్చడమే మా విజయానికి కీలకం'' అని అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియాన్ మార్టినెజ్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Shaun Botterill/Getty Images
ఇంగ్లండ్‌పై మెస్సీ తొమ్మిది విజయవంతమైన డ్రిబుల్స్ చేశాడు. రెండు గోల్స్‌కు అసిస్ట్‌లు కూడా ఇచ్చాడు. 1966 నుంచి ఉన్న రికార్డుల ప్రకారం ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో ఇలా చేసిన తొలి ఆటగాడు మెస్సీనే.
ఇంగ్లండ్ జట్టు మొత్తం కలిపి చేసిన విజయవంతమైన డ్రిబుల్స్ కేవలం ఏడే.
మెస్సీ ఒక్కడే ప్రత్యర్థి పెనాల్టీ బాక్స్‌లో ఏడు సార్లు బంతిని తాకాడు. ఇంగ్లండ్ జట్టు మొత్తం కలిపి చేసిన టచ్‌లు కూడా ఏడే. నాలుగు గోల్ అవకాశాలు సృష్టించాడు. ఇంగ్లండ్ జట్టు మొత్తం సృష్టించింది కూడా నాలుగు గోల్ అవకాశాలే.
ఈ మ్యాచ్‌లో అత్యధికంగా తొమ్మిది క్రాస్‌లు ఇచ్చింది కూడా మెస్సీనే.
అందులో రెండు ముఖ్యమైనవి. ఇవే అర్జెంటీనా గోల్స్‌గా మారాయి.
మొదటి గోల్ కార్నర్ రొటీన్‌లో వచ్చింది. మెస్సీ ఇచ్చిన పాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ అందుకున్నాడు. 85వ నిమిషంలో బాక్స్ బయటనుంచి బలమైన షాట్‌తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మెస్సీ ఇచ్చిన క్రాస్‌ను లౌటారో మార్టినెజ్ హెడర్‌తో గోల్‌గా మలిచి ఇంజరీ టైమ్‌లో అర్జెంటీనాకు విజయం అందించాడు.

ఫొటో సోర్స్, Elsa/Getty Images
‘మ్యాజిక్ చేశాడు’
''మెస్సీ మైదానంలో చాలా సేపు నడుస్తున్నట్టు కనిపిస్తాడు. కానీ బంతి అతడి కాళ్ల దగ్గరకు రాగానే ఒక్కసారిగా మారిపోతాడు. అప్పుడు అతని అసాధారణ ప్రతిభ బయటపడుతుంది. కొన్నిసార్లు అదే మ్యాచ్‌లో తేడాను సృష్టిస్తుంది'' అని ఇంగ్లండ్ మాజీ డిఫెండర్ రిచర్డ్స్ చెప్పాడు.
''మెక్సికో, నార్వేపై ఆడినట్టే ఇంగ్లండ్ రక్షణపైనే దృష్టిపెట్టింది. దాంతో మెస్సీకి అవకాశాలు ఎక్కువగా దొరికాయి. చివరి 15 నిమిషాలు మ్యాచ్ మొత్తాన్ని మెస్సీనే నడిపించాడు'' అని ఇంగ్లండ్ మాజీ గోల్‌కీపర్ జో హార్ట్ అన్నాడు.
''మ్యాచ్‌లో చాలావరకు మేం అతణ్ని బాగా అడ్డుకున్నాం. కానీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఆటగాళ్లు వాళ్లకి బంతి దొరికితే ఏదైనా చేయగలరు. అతను అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు కావడానికి అదే కారణం'' అని ఇంగ్లండ్ కెప్టెన్ కేన్ అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
గోల్డెన్ బూట్ గెలుచుకుంటాడా?
ఈ ప్రపంచకప్‌తో మెస్సీ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో అతను 21 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరఫున అతడు చేసిన మొత్తం 125గోల్స్‌లో ఇవి భాగం.
21గోల్స్‌లో 15 గోల్స్ తన 35ఏళ్లు దాటితన తర్వాతే చేశాడు.
ఈ టోర్నీలో ఇప్పటికే ఎనిమిది గోల్స్ చేయడం ద్వారా 2022నాటి తన ఏడు గోల్స్‌ను అధిగమించాడు.
అప్పుడు గోల్డెన్ బూట్ రేస్‌లో ఒక్క గోల్ తేడాతో కిలియన్ ఎంబపే.. మెస్సీని అధిగమించాడు.
ఇప్పుడు మెస్సీ, ఎంబపే ఎనిమిది గోల్స్‌తో సమానంగా ఉన్నారు. మూడోస్థానంకోసం శనివారం(ఈ నెల 18) జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఇంగ్లండ్‌తో ఆడుతుంది.
ఇంగ్లండ్ ఆటగాళ్లు బెల్లింగ్‌హామ్, హ్యారీ కేన్ చెరో ఆరు గోల్స్‌తో ఇంకా పోటీలోనే ఉన్నారు.
ఆటగాళ్ల గోల్స్ సమానంగా ఉంటే అసిస్ట్‌ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. మెస్సీకి నాలుగు అసిస్ట్‌లున్నాయి. ఎంబపేకు మూడున్నాయి.
ఈ ప్రపంచకప్‌లో అత్యధిక అసిస్ట్‌లు చేసిన ఆటగాడిగా కూడా మెస్సీ నిలిచే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన మైఖేల్ ఒలిసే కంటే ఒక అసిస్ట్ తక్కువ ఉన్నాడు.
''మెస్సీ ఓ చిన్నస్థాయి మాంత్రికుడు. ఇది నిజం. టోర్నమెంట్ మొత్తం అతనిదే చేసి చూపించాడు. అతడు చేసిన గోల్స్, ఇంగ్లండ్ బాక్స్‌లో ఇచ్చిన పాస్‌లను చూస్తే అది అర్ధమవుతుంది'' అని ఇంగ్లండ్ మాజీ గోల్‌కీపర్ పాలర్ రాబిన్‌సన్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Buda Mendes/Getty Images
మెస్సీ ఇంకో వరల్డ్ కప్ ఆడతాడా?
2016లో 29ఏళ్ల వయసులో బార్సిలోనాకు ఆడుతున్న సమయంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు పలికాడనే విషయం చాలామంది మర్చిపోతారు.
2014 ప్రపంచ కప్ ఫైనల్‌లో జర్మనీ చేతిలో అర్జెంటీనా ఓడిపోయింది. అలాగే మూడు కోపా అమెరికా ఫైనల్స్‌లో ఓటమిపాలయింది.
తర్వాత మెస్సీ తన నిర్ణయాన్ని మార్చుకుని జట్టులో చేరాడు. అప్పటినుంచి రెండు కోపా అమెకరికా టైటిళ్లు గెలుచుకున్నాడు.
2022లో ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్ గెలిచినప్పుడు అతని కెరీర్‌లో మిగిలిన చివరి లోటు కూడా తీరిపోయిందని అందరూ భావించారు.
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే చర్చలో మిగిలిన సందేహాలు తొలగిపోయాయని భావించారు. అంతకుముందు ప్రపంచకప్ విజేతలు పీలే, డియాగో మారడానోను అన్ని కాలాల్లో గొప్ప ప్లేయర్లుగా భావించేవారు.
''ప్రపంచకప్ ప్రయాణాన్ని ఫైనల్‌తో ముగించడం నాకు చాలా సంతోషంగా ఉంది. చివరి మ్యాచ్‌ను ఫైనల్‌లో ఆడడం ఎంతో సంతృప్తినిస్తోంది. తర్వాతి ప్రపంచ కప్ రావడానికి చాలా సంవత్సరాలు ఆగాలి. అప్పటివరకు ఆడగలనని నేననుకోవడం లేదు. ఇలా ముగించడం అద్భుతంగా ఉంది''అని 2022 ఫైనల్స్‌కు ముందు మెస్సీ చెప్పాడు.
ఆ తర్వాత ఏడాది మెస్సీ యూరప్ వదిలి అమెరికాలోని ఇంటర్ మయామీ క్లబ్‌లో చేరాడు. కెరీర్‌ను నెమ్మదిగా ముగించే స్థితికి మెస్సీ వెళ్లాడని అంతా భావించారు.
గత ఫిఫా వరల్డ్ కప్ సమయంలో కూడా ఈ ప్రపంచకప్‌లో అతడు ఆడతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
కానీ ఇప్పుడు కూడా ఎవరూ ఆపలేరనట్టుగా అతను ఆడుతున్నాడు. మెస్సీ ఆట కూడా మారింది.
తన కెరీర్‌లో మెస్సీ కనీసం ఐదుసార్లు తన ఆటతీరు మార్చుకుని తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడని స్పానిష్ జర్నలిస్ట్ గిల్లెమ్ బలగ్యూ తెలిపారు. ఈ జర్నలిస్ట్ మెస్సీ బయోగ్రఫీ రాశాడు.
ఇంటర్ మయామీ, అర్జెంటీనా తరఫున 13వరుస మ్యాచ్‌ల్లో గోల్స్ చేయడం లేదా అసిస్ట్ చేయడం ద్వారా మెస్సీ రికార్డు సృష్టించాడు.
ఆదివారం స్పెయిన్‌తో జరిగే ఫైనల్‌లో గోల్ లేదా అసిస్ట్ చేస్తే 2011లో నెలకొల్పిన వరుసగా 14 మ్యాచ్‌ల రికార్డును సమం చేస్తాడు.
అలాగే ప్రపంచ కప్ చరిత్రలో మూడు ఫైనల్స్ ఆడిన రెండో ఆటగాడు మెస్సీ.
2030నాటికి 43ఏళ్ల వయసుకు చేరుకునే మెస్సీకి ఇదే వరల్డ్ కప్ చివరి మ్యాచా?
అయితే ఎనిమిదిసార్లు బాలన్ డి ఓర్ గెలుచుకున్న మెస్సీ గురించి ఏదీ కచ్చితంగా ఊహించలేమేమో.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























