వివిధ దేశాలకు ఆయిల్ అమ్ముతున్న రష్యాలో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు ఎందుకు? భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోందా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోని అనేక దేశాలకు చమురును విక్రయిస్తున్న రష్యా, ఇప్పుడు స్వయంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
రష్యాలోని ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా నెలల తరబడి యుక్రెయిన్ జరిపిన దాడులతో అక్కడ ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశమంతటా పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది.
పెట్రోల్‌పై రేషనింగ్ అమలు చేయడంతో పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి.
ఆన్‌లైన్‌లో పెట్రోల్ బంకుల దగ్గర పొడవాటి క్యూలు ఉన్న వీడియోలను చూసిన డ్రైవర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ పంపుల్లో స్టాక్ లేకపోవడంతో పాటు పెరుగుతున్న ధరలపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సైబీరియాలోని ఇర్కుట్స్క్‌లో క్యూలో ఉన్న ప్రజల సౌకర్యార్థం ఆ నగర మేయర్ పోర్టబుల్ టాయిలెట్లను తెప్పించాల్సి వచ్చింది.
ప్రపంచంలో అతిపెద్ద ఇంధన ఉత్పాదక దేశాల్లో ఒకటైన రష్యాకు ఈ పరిస్థితి ఊహించనిదిగా కనిపిస్తోంది.
"వాహనదారులు, వ్యాపార సంస్థలకు సమస్యలు కొనసాగుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద ఇప్పటికీ పెద్ద క్యూలు ఉన్నాయి" అని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు.
రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టీఏఎస్ఎస్ ప్రకారం, రష్యన్ చమురు కంపెనీలు తమ బంకుల్లో పెట్రోల్ ధరలను ద్రవ్యోల్బణ రేటుకి మించకుండా చూస్తున్నాయి, కానీ ప్రైవేట్ బంకుల వద్ద పరిస్థితిలో కొంత వ్యత్యాసం ఉంది. ఈ పరిస్థితిని త్వరలోనే అదుపులోకి తెస్తామని ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న ధరలు
"ఈ సమస్యలు ధరలపై ప్రభావం చూపుతున్నప్పటికీ, మా పెట్రోలియం సంస్థలు ధరలు అదుపులో ఉంచడాన్ని మేము గమనిస్తున్నాం" అని ఆయన రష్యా సెంట్రల్ బ్యాంక్ ఫైనాన్షియల్ కాంగ్రెస్‌లో చెప్పారు.
యుక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల తలెత్తిన చమురు సంక్షోభంతో రష్యాలో దైనందిన జీవితం అస్తవ్యస్తంగా మారడంతో, రష్యాలో ధాన్యం పండించే ప్రాంతాల రైతులు పంటను కోయగలమో లేదోనని ఆందోళన చెందుతున్నట్లు రాయిటర్స్ తెలిపింది.
చమురు వనరులపై దాడులు చేయడం ద్వారా రష్యాను శాంతి చర్చల దిశగా అడుగులు వేసేలా ఒత్తిడి తెచ్చేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది.
ఈ దాడుల వల్ల జరిగిన నష్టం, చమురు సంపన్న దేశమైన రష్యా ఇంధన సరఫరాలపై ఒత్తిడిని పెంచింది.
పెట్రోల్ కొరత తీవ్రం కావడంతో రష్యాలోని డ్రైవర్లు ఏ పెట్రోల్ బంకులో ఇంధనం అందుబాటులో ఉంది? క్యూలు ఎక్కడ తక్కువగా ఉన్నాయి? అనే సమాచారం పంచుకునేందుకు మ్యాప్‌లు రూపొందిస్తున్నారు.
ఇంధనం నింపుకోవడానికి వేచి ఉన్న డ్రైవర్ల మధ్య గొడవలు జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"ది అల్టిమేట్ లగ్జరీ 2026" అనే పేరుతో ఉన్న వీడియోలో ఒక వ్యక్తి జెర్రీ క్యాన్ నుంచి గడ్డిని కత్తిరించే లాన్‌మోవర్‌లోకి నెమ్మదిగా పెట్రోల్ పోస్తున్న దృశ్యాలున్నాయి.
ఆ వీడియోలో అతను సరదాగా "ఎంతో విలువైనది! ఇప్పుడు దీన్ని ఎవరు కొనగలరు?" అని అడగడం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నుంచి రష్యాకు దిగుమతులు
పెట్రోల్ కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి రష్యా పెట్రోల్ దిగుమతి చేసుకుంటోందని రాయిటర్స్ మరో నివేదికలో పేర్కొంది.
"ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రష్యా సముద్ర మార్గం ద్వారా భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించిందని చమురు పరిశ్రమకు చెందిన ఇద్దరు అధికారులు చెప్పారు" అని రాయిటర్స్ కథనం పేర్కొంది.
సరసమైన ధరకు ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు రష్యా ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని క్రెమ్లిన్ మంగళవారం ప్రకటించింది.
భారత్ నుంచి రష్యాకు చమురు సరఫరా విషయమై స్పందన కోసం తాము భారత పెట్రోలియం శాఖ, రష్యా పెట్రోలియం శాఖను సంప్రదించామని, అయితే వారి నుంచి ఎలాంటి తక్షణ స్పందన రాలేదని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
భారత్ నుంచి రష్యాకు కనీసం 60 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ ఎగుమతి చేసినట్లు చమురు పరిశ్రమ వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. ఒక్కొక్కటి 30 వేల నుంచి 40వేల టన్నుల సామర్థ్యమున్న రెండు ట్యాంకర్లను పంపినట్లు మరొకరు తమతో చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
రష్యా ప్రతి నెలా వివిధ దేశాల నుంచి మొత్తం 4 లక్షల టన్నుల పెట్రోల్‌ను దిగుమతి చేసుకోవాలనుకుంటున్నట్లు మరొకరు చెప్పారు.
ఇందులో పొరుగు దేశమైన బెలారస్ కూడా ఉంది. ఇది ఇప్పటికే రష్యాకు ఇంధనం ఎగుమతి చేస్తోంది.
వేసవిలో రష్యాలో పెట్రోల్ రోజువారీ వినియోగం కనీసం 1.10 లక్షల టన్నులు ఉంటుంది. ఎండాకాలంలో రష్యాలో పెట్రోల్ వినియోగం పెరుగుతుంది.
మే తొలి పక్షం రోజులతో పోలిస్తే జూన్ మొదటి 15 రోజుల్లో బెలారస్ నుంచి రష్యాకు రైలు మార్గం ద్వారా చమురు సరఫరాను దాదాపు 3 రెట్లు పెంచింది.
"యుక్రెయిన్ చాలా కాలంగా రష్యా ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పుడు యుక్రెనియన్ క్షిపణులు, డ్రోన్ల పరిధి పెరిగింది. దీని వల్ల సుమారు 1200 మైళ్ల దూరంలో ఉన్న సైబీరియాలోని ట్యూమెన్ వంటి రిఫైనరీలను కూడా లక్ష్యంగా చేసుకోగలుగుతోంది. ఈ సామర్థ్యంతోనే జూన్ 18న మాస్కోలో భారీ దాడులు చేసింది. ఈ దాడిలో యుక్రెయిన్ రష్యా ఎయిర్ డిఫెన్స్‌లను ఛేదించుకుని వెళ్లి మాస్కోలో ప్రధాన రిఫైనరీని ధ్వంసం చేసింది" అని అమెరికన్ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంక్షోభం ఎలా తీవ్రమైంది?
"రష్యా చమురు సంక్షోభంలో ప్రస్తుత పరిస్థితిని ఓ మలుపుగా చూస్తున్నారు" అని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. రష్యన్ చమురు సంస్థ గాజ్‌ప్రోమ్ నెఫ్ట్ స్ట్రాటజీ మాజీ అధిపతి, బెర్లిన్‌కు చెందిన కార్నెగీ రష్యా యురేసియా సెంటర్‌లో సీనియర్ ఫెలో సెర్గీ వాకులేంకో ప్రకారం, జూన్ 20 నాటికి రష్యా మొత్తం చమురు శుద్ధి సామర్థ్యంలో సుమారు 28 శాతం అందుబాటులో లేదు.
"యుక్రెయిన్ ప్రయోగించగల డ్రోన్ల సంఖ్య పెరగడం వల్లే ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు సమస్య సరఫరా వ్యవస్థ లేదా మార్కెట్‌లో పరిస్థితులు కాదు. అసలైన సమస్య ఇంధన కొరతే" అని ఆయన అన్నారు.
దశాబ్దాల తర్వాత తొలిసారి రష్యా మళ్లీ ఇంధన దిగుమతుల కోసం సిద్ధమవుతోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇంధన దిగుమతుల కోసం మాస్కో పలు దేశాలతో చర్చలు జరుపుతోందని ఆయన చెప్పినప్పటికీ, ఆ దేశాల పేర్లను వెల్లడించలేదు.
భారీ చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్న భారత్ లాంటి దేశాలే రష్యాలో ఇంధన కొరతను తీర్చగలవని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్ నుంచి రష్యాకు భారీ స్థాయిలో సముద్ర మార్గం ద్వారా చమురు ఎగుమతి చేయడానికి వారాల సమయం పడుతుంది.
యుద్ధ ఖర్చుల కారణంగా ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న రష్యా బడ్జెట్‌పై ఇది మరింత భారం మోపుతుంది.
ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే దేశాల్లో ఒకటైన రష్యా, యుక్రెయిన్ దాడులు తీవ్రమైన తర్వాత కొన్ని నెలల పాటు పెట్రోల్, విమాన ఇంధన ఎగుమతులపై నిషేధం విధించింది.
డీజిల్ ఎగుమతులపైనా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధ్యక్షుడు పుతిన్ ఆదివారం తెలిపారు.
చమురు సరఫరాను స్థిరంగా కొనసాగించేందుకు సాయం అందించాలని కిర్గిజిస్తాన్ బుధవారం రాత్రి కజకిస్తాన్, బెలారస్, అజర్ బైజాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌లను కోరింది.
సుమారు 70 లక్షల మంది జనాభా ఉన్న కిర్గిజ్‌స్తాన్ తనకు అవసరమైన చమురులో 90 శాతానికి పైగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే, ప్రస్తుతం రష్యాలో చమురు సంక్షోభం ఏర్పడటంతో కిర్గిజిస్తాన్ ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.
ఈ సంక్షోభం ఎంతకాలం ఉండవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రష్యా పెట్రోల్ నిల్వలు కేవలం నాలుగు శాతం మాత్రమే తక్కువగా ఉన్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
"దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా తగినంతగా ఉందని చెబుతున్నారు. సమస్య ఏమిటంటే, ఆ ఇంధనం సరైన ప్రదేశంలో అందుబాటులో లేదు" అని విశ్లేషకుడు క్రిస్ వీఫర్ చెప్పారు.
దీనర్ధం ఏంటంటే, ఇంధన కొరత ఉన్న ప్రాంతాలకు చమురును తిరిగి తరలించాల్సి ఉంటుంది.
రష్యా వంటి విశాలమైన దేశంలో రాత్రికి రాత్రే ఏ సమస్యా పరిష్కారం కాదని వీఫర్ అన్నారు. "తగినంత ఇంధనం ఉండొచ్చు, కానీ దానిని అవసరమైన చోటుకు తరలించడానికి వారాలు పట్టవచ్చు. ఇదొక భారీ రవాణా, సరఫరా నిర్వహణ ప్రక్రియ" అని ఆయన చెప్పారు.
రష్యా రాజధానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఇంధన అవసరాల్లో 40 శాతాన్ని తీర్చే మాస్కో రిఫైనరీ ఇటీవల యుక్రెయిన్ డ్రోన్ దాడుల్లో దెబ్బ తింది. ఇది మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మూడు నెలలు పట్టొచ్చని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























