‘ఆ నటి బొగ్గు బస్తాల్లో 320 కిలోల డ్రగ్స్ దాచి తెచ్చారు’

- రచయిత, లానా లామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
పశ్చిమ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు 320 కిలోల మెథాంఫెటమిన్ అనే డ్రగ్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారంటూ బ్రిటిష్ నటి ఎమా హుసేన్‌పై కేసు నమోదైంది.
ఎమా హుసేన్‌ను గురువారం సిడ్నీ కోర్టులో హాజరుపరిచారు.
ఆస్ట్రేలియాలోకి భారీ మొత్తంలో మెథాంఫెటమిన్‌ను దిగుమతి చేసేందుకు ప్రయత్నించారనేది ఆమెపై అభియోగం.
ఈ నేరం రుజువైతే ఆమెకు గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.
ఈస్టెండర్స్ స్పిన్‌ఆఫ్ సిరీస్‌లో, జేసన్ స్టాథమ్ సినిమా హమ్మింగ్ బర్డ్ లో నటించారు ఎమా హుసేన్.

దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన దంపతులతో కలిసి ఎమా హుస్సేన్... ఘనా దేశం నుంచి వస్తున్న షిప్పింగ్ కంటైనర్లలో బొగ్గు సంచుల మధ్య మెథాంఫెటమిన్‌ను దాచిపెట్టి ఆస్ట్రేలియాకు తరలించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ 296 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇది సుమారు 208 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ.1925 కోట్ల విలువ ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Australian Federal Police/Australian Border Force
ఈ కేసులో బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను సిడ్నీ కోర్టు తిరస్కరించింది. ఆమె ఆగస్టులో మరోసారి కోర్టు ముందుకు రావాల్సి ఉంది.
ఈస్ట్‌ఎండర్స్ స్పిన్-ఆఫ్ సిరీస్ 'ఈ20'లో నాజ్ అనే పాత్రను పోషించారు ఎమా హుసేన్. అలాగే జేసన్ స్టాథమ్ ప్రధాన పాత్రలో నటించిన 2013 యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హమ్మింగ్‌బర్డ్‌లో కూడా నటించారు. ఈ చిత్రం అమెరికాలో రిడెంప్షన్ పేరుతో విడుదలైంది.
ఏప్రిల్ నెలలో ఘనా నుంచి సిడ్నీలోని పోర్ట్ బోటనీకి చేరుకున్న రెండు షిప్పింగ్ కంటైనర్లలో సరిహద్దు భద్రతా అధికారులు అనుమానాస్పద వస్తువులను గుర్తించడంతో ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆ కంటైనర్లలో బొగ్గు సంచులు ఉన్నట్లు రికార్డు కాగా, స్కానింగ్ సమయంలో అధికారులు వాటిలో తెల్లటి పదార్థాన్ని గుర్తించారు. అనంతరం పరీక్షల్లో అది మెథాంఫెటమిన్ అని నిర్ధరణ అయ్యింది.
అధికారులు కంటైనర్లలోని డ్రగ్స్‌ను సిడ్నీ నగర శివారులోని గిర్రావీన్ ప్రాంతంలో ఉన్న ఒక నిల్వ కేంద్రానికి తరలించారు.
హుస్సేన్ ఆ నిల్వ కేంద్రానికి వెళ్లి పలువురు వ్యక్తులు కంటైనర్‌లోని సరుకును బయటకు తీసే ప్రక్రియను పర్యవేక్షించారని, తర్వాత వాళ్ళు కొన్ని సంచులను ఒక కారులో ఎక్కించి బ్లాక్‌టౌన్ ప్రాంతంలోని ఒక ఇంటికి తరలించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
అక్కడే పోలీసులు హుస్సేన్‌ను అరెస్టు చేశారు. కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఒక నోట్‌బుక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా సిడ్నీలో మాదకద్రవ్యాలు చేరిన నిల్వ కేంద్రాలను అద్దెకు తీసుకునేందుకు నకిలీ ఐడీలను ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 ఏళ్ల మహిళ, 32 ఏళ్ల వ్యక్తిని కూడా సౌత్ ఆస్ట్రేలియా రాజధాని అడిలైడ్‌లో పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టారు.
"సుమారు 296 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్‌కు చెందిన డిటెక్టివ్ యాక్టింగ్ సూపరింటెండెంట్ ట్రెవర్ రాబిన్సన్ చెప్పారు.
"అక్రమంగా మాదకద్రవ్యాలను దాచిపెట్టేందుకు నేర ముఠాలు ఎంత దూరమైనా వెళ్తాయి. బొగ్గు వంటి సాధారణ వస్తువులలో కూడా వాటిని దాచేందుకు ప్రయత్నిస్తాయి. అయితే అలాంటి ప్రయత్నాలను గుర్తించేందుకు నైపుణ్యమున్న మా అధికారులు ప్రత్యేక శిక్షణ పొందారు" అని ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ సూపరింటెండెంట్ జేర్డ్ లీటన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























