కృతి సనన్: రక్షాబంధన్ యాడ్‌పై సోషల్ మీడియాలో చర్చ, ప్రకటనను వెనక్కి తీసుకున్న కంపెనీ

ఫొటో సోర్స్, Getty Images
రక్షాబంధన్‌కు ముందు ఒక ఆభరణాల బ్రాండ్ ప్రకటన (యాడ్) సోషల్ మీడియాలో వివాదానికి కారణమైంది.
నటి కృతి సనన్ ఈ ప్రకటనలో కనిపించారు. కొంతమంది ఆమె దుస్తులుపై విమర్శలు చేశారు. అలాగే ఆమె తన కుక్కకు రాఖీ కట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దీనిపై స్పందించడంతో ఈ వివాదం ముదిరింది. ఆ ప్రకటన అసౌకర్యంగా అనిపించేలా ఉద్దేశపూర్వకంగా చేశారని కంగనా రనౌత్ అన్నారు.
"సంస్కృతి మనసులో ఉంటుంది, నెక్ లైన్‌లో కాదు" అని కృతి సనన్ బదులిచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతి సనన్‌కు మద్దతు తెలిపారు. తమ స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపాలని అన్నారు.
అయితే, ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరగడంతో దీన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.
ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆ కంపెనీ ఇలా రాసింది
"భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు,పండుగల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. ఒక బ్రాండ్‌గా, ఈ ఆనంద క్షణాలను కుటుంబమంతటితో కలిసి జరుపుకోవాలని మేము ఎప్పుడూ నమ్ముతాం. ఈసారి, ఈ ప్రేమను, వేడుకను మా పెంపుడు జంతువులకు కూడా అందించాలనుకున్నాము. మా ఇటీవలి ప్రకటన అనుకోకుండా సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసి ఉంటే, అది మా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. గౌరవ సూచకంగా, మేము ఆ ప్రకటనను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాం" అని పేర్కొంది.

ప్రకటనలో ఏముంది?
ఈ 35 సెకన్ల ప్రకటన ఓ ఆభరణాల బ్రాండ్‌కు చెందినది. ఇది 17 ఆగస్టు 2026న సోషల్ మీడియాలో వచ్చింది.
ఇందులో కృతి సనన్ రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటూ కనిపించారు. ఆమె తెల్లటి లెహంగా, డీప్-నెక్ ఉన్న బ్రాలెట్ తరహా బ్లౌజ్ ధరించారు.
ఆ ప్రకటనలో ఆమె తన సోదరుడికి, ఆ తర్వాత తన పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
అభ్యంతరం ఏంటి?
దుస్తుల పైనే అసలు వివాదం మొదలయింది. పండుగ సమయంలో ఇలాంటి దుస్తులు ధరించడం సరికాదని సోషల్ మీడియాలో యూజర్లు అభిప్రాయపడ్డారు.
"పవిత్రమైన పండుగను ఉద్దేశపూర్వకంగా అవమానించే ప్రయత్నం చేశారు. నటి కృతి సనన్ కూడా దీనికి అంతే బాధ్యురాలు" అని ఒక యూజర్ రాశారు.
"నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు పదే పదే వస్తూనే ఉన్నాయి" అని మరో యూజర్ రాశారు .
ప్రకటనలో తిలకం, హారతి వంటి సంప్రదాయాలు కనిపించలేదని కూడా కొంతమంది అన్నారు.
కుక్కకు రాఖీ కట్టే సన్నివేశంపై కూడా అనేక విమర్శలొచ్చాయి. కొందరు ఆ బ్రాండ్‌ను బహిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, rahulgandhi/Instagram
కృతిసనన్‌కు మద్దతిచ్చేవాళ్లు ఏమంటున్నారు?
అయితే చాలామంది కృతి సనన్‌కు మద్దతుగా నిలిచారు.
రాహుల్ గాంధీ కృతి సనన్‌కు మద్దతుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
"ఒక మహిళ ఏం వేసుకోవాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అనేది ఆమె ఇష్టం. తమ స్వేచ్ఛను వినియోగించుకుంటున్న మహిళలను ట్రోల్ చేయడం ఆపండి" అని రాహుల్ గాంధీ అన్నారు.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన 'స్మాష్ ది పేట్రియార్కీ' అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఉపయోగించారు.
‘‘మహిళలు ఏ దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడం మనం ఆపలేమా? ఇవి సంప్రదాయానికి సంబంధించిన విషయం అని అనుకోవడం మానలేమా?’’ అని ఓ యూజర్ రాశారు.
"కృతి వేసుకున్న దుస్తులు ఒక నైతిక సమస్యగా ఎలా మారాయో నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక అడ్వర్టయిజ్‌మెంట్. అందరూ కాస్త ఆలోచించాలి" అని మరో యూజర్ రాశారు.

ఫొటో సోర్స్, kanganaranaut/Instagram
కంగనా రనౌత్ ఏం చెప్పారు?
కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పెట్టారు. ఆమె కృతి సనన్ పేరు గానీ, ఆ బ్రాండ్ పేరు గానీ ప్రస్తావించలేదు. కానీ దానిలో అంతరార్థం స్పష్టంగా ఉంది.
"మహిళగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన సమయం. మన వార్డ్‌రోబ్‌ల్లో ఎన్నో రకాల దుస్తులున్నాయి. ఇప్పటి మహిళ ఒక గ్లోబల్ మహిళ. కాక్‌టెయిల్ డ్రెస్‌ల నుంచి లెహంగా-చోలీల వరకు, జీన్స్ నుంచి చీరల వరకు, బికినీల నుంచి సల్వార్-కమీజ్‌ల వరకు ఎన్నో రకాల దుస్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు మీరు మీ సోదరుడికి బికినీలో లేదా లోదుస్తులలో రాఖీ ఎందుకు కడతారు? మీ దగ్గరున్న ఇతర దుస్తులు ఏమయ్యాయి?
ఆ యాడ్ ‘‘ఉద్దేశపూర్వకంగా అసౌకర్యంగా అనిపించేలా చేసిన ప్రకటన’’ అని కంగనా అన్నారు.

ఫొటో సోర్స్, kritisanon/Instagram
కృతి సనన్ ఏమని వివరణ ఇచ్చారు?
ఈ వివాదంపై కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ఒక మహిళ సంస్కృతిపై నిబద్ధతను ఆమె దుస్తులను బట్టి నిర్ణయించకూడదని అన్నారు.
"పండుగ నిజమైన అనుభూతి మీ దుస్తుల్లో కాదు. మనస్ఫూర్తిగా పాటించే సంప్రదాయాల్లో ఉంటుంది. రక్షాబంధన్ అనేది రక్షణ, ప్రేమకు సంబంధించిన బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒకరినొకరం రక్షించుకుంటామని, ఒకరి మంచి ఆరోగ్యం, సంతోషం,దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తామని వాగ్దానం చేసుకుంటాం" అని ఆ పోస్ట్‌లో రాశారు.
"ఈ ప్రేమ, ప్రార్థనలు మా కుక్కకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే అది కూడా మా కుటుంబంలో ఒక భాగమే"
"మహిళలు ఏం ధరించాలో చెప్పడం మనం ఎప్పుడు ఆపుతాం? సంప్రదాయ ఫ్యాషన్ కాలక్రమేణా మారింది. కానీ ఒక మహిళ సంస్కృతిని గౌరవిస్తారా లేదా అన్న విషయాన్ని ఇప్పటికీ ఆమె దుస్తులతోనే ఎందుకు కొలుస్తున్నారు? సంస్కృతి, సంప్రదాయం మనసులో ఉంటాయి, మహిళ దుస్తుల నెక్‌లైన్‌లో కాదు’’ అని కృతిసనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























